ఈవిధంగా వాతావరణం రెండు మూడు రోజులు కొనసాగింది. రాద్ధాంత సిద్ధాంతాలన్నీ అయినాక చివరకు వాళ్ళమ్మ "పోనీపద, నీతో పాటే నేనూ వస్తాను. నీకు వండిపెడుతూ పడివుంటాను" అని పేచీ పెట్టింది. ఆమెకు నచ్చచెప్పి ఒప్పించేసరికి తండ్రీ కొడుకుల ప్రాణానికి శోషవచ్చింది.
చక్రపాణికి రాజారావును వదిలిపెట్టి పోవాలంటే బెదురుగా వుంది. జీవితంలో విచిత్రాల్ని అన్వేషించాలంటే ఈ మార్గమే శరణ్యం. తప్పదు. కాని తాను వట్టి పిరికివాడు. ఒక్కక్షణం వంటరిగావుంటే చాలు వల్లమాలిన ఆలోచనలు వచ్చి చుట్టుముట్టుతాయి. రాజారావు తనమీద ఒక కంట్రోల్ లాంటివాడు. అనుక్షణం అపనమ్మికతో, ఊగే ఊహల్లో తెలియనితనంతో సతమతమయే తన మనసుకు ఒక దృఢత్వం, స్థిరత్వం, స్వరూపం కలిగించగల చతురుడు. ఎట్టి దుఃఖంలోనైనా చిరునవ్వు నవ్వగల ధైర్యశాలి. తాను మారిపోతాడా అక్కడ?
"రాజారావ్! నువ్వూ వచ్చెయ్యి" అన్నాడు.
"నేను ఇప్పుడు రాలేను. ఎప్పుడో నిన్ను చూడటానికి వస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పలేను. కాని నువ్వు శీలం పాడుచేసుకోకూడదు సుమా!"
"మా అమ్మకూడా ఇదేమాట చెప్పింది. శీలం పాడుచేసుకోకుండా వుండాలంటే ఏమి చేయాలి?"
"అది ఒకరకమైన మార్పు. మనిషి మారకుండా వుండటం కష్టం. ఏమి చేయాలనికదూ నీ ప్రశ్న? చెడిపోకూడదన్నమాట" అన్నాడు రాజారావు నవ్వుతూ.
"నువ్వు చెడిపోయావా?"
"అంతే లెక్క, నేను సిగరెట్లు కాలుస్తాను. నా ప్రవర్తన లోకానికి సంకటంగా ఉంటుంది. కొంచెమో గొప్పో రౌడీననికూడా పేరుంది."
"కాని చెడిపోవటానికి అర్థం అదిగాదు. వాళ్ళు వేరే వుంటారు. నీలా వుండరు."
"ఎవరైతే బయటకు ఉదాత్తంగా, ఆదర్శప్రాయంగా కనబడుతూ లోలోపల దుర్నడతను కలిగివుంటారో, వాళ్ళని గురించే లోపల భయపడాల్సిన అవసరం వుంది."
"ఆ విషయం పోనియ్యి. చెడిపోకుండా వుండాలంటే ఏం చెయ్యాలో చెప్పు."
"నేను చెప్పినట్లు చెయ్యగలవా?"
"ప్రయత్నిస్తాను."
"వద్దు. ఈ సత్యం నీ అంతట నువ్వే కనుక్కోగలవు. అయినా నువ్వు చెడిపోవు. నాకు నమ్మకమే. కాని మాలతినిమాత్రం మరిచిపో."
"ఆమెను మరిచిపోవడం వల్ల నేను సాధించగలిగింది ఏదయినా వున్నదని తోచిననాడు తప్పకుండా మరిచిపోతాను."
"గుడ్. ఆ మాత్రం ధీమా వుంటే నువ్వు దిట్టవనే లెక్క."
క్రమంగా రోజులు గడిచాయి. చక్రపాణికి హైదరాబాదులో సీటు వచ్చింది. కన్నీళ్ళమధ్య, ఆవేదనల మధ్య, ప్రేమల మధ్య ఒకరోజు ఊరిని విడిచిపెట్టాడు. అతను బయల్దేరేముందు అతని తల్లి ఒక విషయం చెబుదామనుకుంది. ఆరాటపడింది, సంకోచించి ఊరుకుంది.
రాజారావు కొంతకాలం మనశ్శాంతి లేక బాధపడ్డాడు. చికాకు హెచ్చింది. శాంతి దొరుకుతుందనే ఊహతో సొంతవూరు వెళ్ళాడు. పల్లెటూరి రాజకీయాలు, అందులో తమ కుటుంబం వహించే పాత్ర, అన్నల గొడవ, స్పర్థలు అన్నీ చికాకులు. తన మేనరికం బెడద, తల్లి బాధ, ఇవన్నీ చూచి విసుక్కుని మళ్ళీ విజయవాడ వచ్చి పాతగది మార్చి కొత్తగది తీసుకుని ఒకరోజున కాలేజీకి వెళ్ళి బి.ఏ. ఎకనమిక్స్ లో చేరాడు.
2
ఇంటినుంచి బింకంగా బయల్దేరాడేగాని హైదరాబాద్ చేరాక తాను వంటరిగాడే అన్న చింత పట్టుకుంది చక్రపాణికి. ఈ ఊరిలో తన దూరపుచుట్టాలు కొంతమంది వున్నారు. వాళ్ళెవరికైనా తండ్రి ఉత్తరం వ్రాస్తానంటే తనే నామోషీకిపోయి వద్దన్నాడు. ముందు ఒక హోటల్లో దిగి కాలేజీలో జీతం కట్టాడు. కాని హోటలులో ఎంతకాలం వుండగలడు? రూమ్ కోసం అన్వేషణ సాగించాడు. తాను చిన్నప్పటినుంచి నలుగురితో కలిసి మెలిసి తిరిగినవాడు కాదు. చొరవ తక్కువ. ఇక్కడ పరిచితులు లేరు.
ఒకనాడు ఒక లొకాలిటీకి వెళ్ళి "ఈ ఇంట్లో గదేమైనా ఖాళీగా వుందా? అని అందరి ఇళ్ళలో వరుసగా అడగడం సాగించాడు. ఒక ఇంటి వాకిట్లో నిలబడి అటూ ఇటూ చూస్తోన్న అమ్మాయి భర్త ఒట్టి అనుమానస్తుడని అతని కేంతెలుసు? ఆమెనుకూడా ఈ ప్రశ్న అడిగాడు. ఆమె ఎదో జవాబు చెప్పీ చెప్పకముందే లోపలనుంచి ఆ అమ్మాయి భర్త బయటకు గఁ య్ మంటూ వచ్చి వాడిష్టం వచ్చినట్లు తిట్టసాగాడు. చక్రపాణికి వెంటనే భయంవేసినా కోపంకూడా వచ్చి ఏదో అన్నాడు. అవతలతను రెచ్చిపోయి మీదకు కలబడ్డాడు. చుట్టూ మూగిన జనం ఎలాగో విడదీసి సర్దేసి పంపించేశారు.
ఆరోజంతా అతను గదిలోనే దుఃఖితుడై కూర్చున్నాడు.
రాజారావుకు పెద్ద ఉత్తరం రాసి, అందులో తన ఇవాల్టి దురవస్థ వర్ణించాడు. ఈ ప్రపంచంలో ఇలా ఇల్లు వదిలివచ్చి ఒడుదుడుకు జీవితాలు గడిపేవారు వేలకు వేలు వుంటారనీ, తను ఒక్కడేకాదనీ అతనికి అప్పట్లో తెలిసిరాలేదు. అతనిమీద తాను జాలిపడసాగాడు.
వంటరిగా కాలేజీకి వెళ్ళి రాసాగేడు. హోటల్ గదిలో జీవితం దుర్భరంగా వుండేది. తెలియని అశాంతి, చిన్నప్పటి పిరికితనానికి ఓ స్పష్టమయిన రూపం ఏర్పడుతున్నట్లు వుండేది. కారణం లేకుండానే బాధలు పడుతున్నట్లు అనుభూతి. కన్నీళ్ళలో సొగసు, ఆనందం, ఆరాటంలో మనోజ్ఞత, ఒంటరితనం మీద ఇచ్ఛా, భయం, విచిత్రంమీద భ్రాంతి, భీతి.
బయటికిపోయి ఎటో తిరుగుతూ వుండేవాడు. అలా తిరిగితే సుఖం దొరుకుతుందనే ఆశ దొర్లేది. కాని ఫలితం కాళ్ళనొప్పులు. పుస్తకాలు చదివి గొప్పతనం జీర్ణించుకోవాలనే తపన, కాని ఫలితం తలనొప్పి. ఏదో అస్వస్థత అవ్యక్తంగా వెన్నాడుతూ వుండేది. అనుభవాలు తనను చుట్టుముట్టితే బాగుపడతా ననుకునేవాడు. తను క్రూరంగా ఉంటే అందంగా వుంటుందని తోచేది. కాలేజీలో పాఠాలు వినకుండా వెర్రి మొర్రి ఆలోచన్లు చేసేవాడు. గదికి వచ్చి పాఠాలు ఎందుకు వినలేదా అని చింతించేవాడు. ఒకటి చేస్తుంటే ఇంకొకటి చేయాలని వుండేది. ఏపనీ మనస్ఫూర్తిగా చేయలేకపోయాడు.