Previous Page Next Page 
అశ్వభారతం పేజి 5


    అంతలో ఓ వ్యక్తి వచ్చాడు వారి ముందుకు.

    "అనురాగ్.... మీకోసం బొంబాయి నుంచి ఎవరో వచ్చారు. కాటేజ్ నెంబర్ లెవెన్లో వున్నారు. మా మేనేజర్ చెప్పమన్నారు...." చెప్పేసి వెళ్ళిపోయాడా వ్యక్తి.

    "ఎవరయి వుంటారు." అని పైకే అనేసి ఆ జంటవేపు చూశాడు. వెళ్ళనా అన్నట్లు.

    వారు చిరునవ్వుతో వెళ్ళమన్నట్లు అభినయించారు.

    తను ఈ సీజనులో ఇక్కడుంటానని ఇద్దరికే తెలుసు. ఒకరు తన రీల్స్ ని డెవలప్ చేసే స్టూడియో ఓనర్- మరొకరు తన ప్రయాణాలకు తగ్గట్టుగా టికెట్స్ రిజర్వ్ చేయించే ఓ ట్రావెల్ ఏజెంట్.

    వీరిద్దరికీ తప్ప మరెవరికీ తెలియదు. ఎవరై వుండవచ్చు.... ఆలోచించుకుంటూ హి స్టేషన్ కాటేజెస్ వైపు నడిచాడు అనురాగ్.

    కాటేజ్ నెంబర్ లెవెన్ లోకి అడుగుపెట్టాడు అనురాగ్. విశాలమైన వరండా, ఆ వరండాలో నాలుగు పేము కుర్చీలున్నాయి. మధ్యలో టీపాయ్. ఆ కుర్చీల్లోనే ఒక కుర్చీలో పిలిపించిన వ్యక్తి కూర్చుని వున్నాడు.

    అతని వాలకం చూస్తుంటే చాలా సేపట్నుంచి తన కొరకే ఎదురు చూస్తున్నట్లుగా వుంది.

    "ది గ్రేట్ ఫోటోగ్రాఫర్....అనురాగ్....యామైరైట్ .... భుజాలు ఎగరేస్తూ అన్నాడు. "నేనే అనురాగ్" అతనివేపు ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు.

    "సుదర్శన్ ఫ్రం బాంబే_మీతో పనుండి వచ్చాను...." సూటిగా వున్నాయి సుదర్శన్ మాటలు.

    ఇంతట్లో బేరర్ వచ్చి టీపాయ్ మీద నాలుగు బీరుబాటిల్స్ పెట్టి వెళ్ళిపోయాడు.

    "తీస్కోండి...." సుదర్శన్ అనురాగ్ కి ఆఫర్ చేశాడు.

    అసలతనెవరో? ఎందుకొచ్చాడో? తెలియకుండా ఆ ఆఫర్స్ ఎంజాయ్ చేయాలో లేదోనని ఓ క్షణం మాత్రమే ఆలోచించి వెంటనే సుదర్శన్ తో పాటు బీర్ బాటిల్ పై కెత్తాడు అనురాగ్.

    ఇద్దరు తాగుతున్నారు.

    వాతావరణం ప్రశాంతంగా వుంది. సముద్రం మీంచి వీచే చల్లటి గాలి, తాగే కూల్ బీరు, తింటున్న హాట్ చిప్స్.

    (ఇద్దరి మధ్యా ఇంగ్లీషులో సంభాషణ మొదలయింది.)

    "నా పేరు సుదర్శన్ ఎంతో శ్రమపడి మీ అడ్రస్ కనుక్కొని వచ్చాను. అవసరం నాది. నా ప్రతి అవసరాన్ని నేను బిజినెస్ లోకి మార్చుతాను. మీ కభ్యంతరం లేదనుకుంటాను. ఎందుకంటే అవసరం నాది కనుక. ఇది బిజినెస్ కనుక డబ్బు నీకొస్తుంది" అన్నాడు సుదర్శన్.

    "చెప్పండి అన్నాడు అనురాగ్ ఉత్సాహంగా ముందుకు వంగుతూ. సుదర్శన్ జేబులోంచి గుర్రం ఫోటోతీసి అనురాగ్ కి అందించాడు.

    ఆ ఫోటో చూసి అనురాగ్ ఆశ్చర్యపోయాడు.

    అది అతని చేతిలోకి ఎలా వచ్చిందో అర్ధంకాలేదు అనురాగ్ కి.

    "ఇది మీరు తీసిన ఫోటో కదూ?"

    "అవును...." అన్నాడు అనురాగ్.

    "మీరు నాకు కొన్ని వివరాలు చెప్పాలి. అవి ఖచ్చితమైనవి అయితే ప్రతిఫలం బాగుంటుంది. లేదనుకోండి__ మీకు చాలా ఇబ్బంది కల్గించైనా అని నేను తెలుసుకోగలను. టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. గనుక నా ట్రీట్ మెంట్ థర్డ్ డిగ్రీతోనే ప్రారంభమవుతుంది."
   
    అలా అంటున్నప్పుడు సుదర్శన్ కంఠంలో వినిపించిన హెచ్చరికకి ఒకింత ఆశ్చర్యపోయాడు అనురాగ్.

    "ఎలాంటి వివరాలు" అడిగాడు అనురాగ్. 

    తన దగ్గర దాచుకోదగ్గ వివరాలు ఏంలేవు కనుక వాటిని అతనికి అమ్ముకోవడానికి అనురాగ్ కి ఏం ఇబ్బంది అనిపించలేదు.

    "ఆ గుర్రం ఫోటోని మీతో ఎవరు తీయించారు? ప్రస్తుతం ఆ గుర్రం ఎక్కడుంది? మొదట ఆ రెంటికి సమాధానాలు చెప్పండి" అడిగాడు అనురాగ్ వేపు నిశితంగా చూస్తూ.

    అనురాగ్ బీర్ సిప్ చేసి ప్లేట్లో వున్న చిప్స్ ని తీసుకుని నముల్తూ కాసేపు ఆలోచించాడు! ఆ ఆలోచనలు దాదాపు 4 నెలల వెనక్కు వెళ్ళాయి.

    ఆలోచిస్తూ ఉండిపోయాడే తప్ప వెంటనే సమాధానం చెప్పలేదు. వాటికి సమాధానాలు తన దగ్గర లేవు. అలా చెపితే డబ్బులివ్వడేమో?

    సుదర్శన్ అనురాగ్ వేపు సీరియస్ గా చూశాడు. సందేహించాడు.

    వెంటనే జేబులోంచి ఒక పాకెట్ తీసి టీపాయ్ మీద పెట్టాడు.

    అనురాగ్ ఆ పాకెట్ వేపు చూసాడు.

    "పాకెట్ విప్పి చూడండి...." అన్నాడు సుదర్శన్ ఇంకా ఎందుకు టైం వేస్ట్ అన్నట్లు.

    అనురాగ్ ఆ పాకెట్ విప్పి చూసాడు.

    అన్నీ వందరూపాయల నోట్లు. మొత్తం ఐదు కట్టలు. అంటే యాభైవేలు.

    అనురాగ్ ఆ కట్టలవేపు, సుదర్శన్ వేపు మార్చి మార్చి చూశాడు.

    "మీరు ఇవన్ని తీసుకోవచ్చు__అయితే నిజాలు చెప్పాల్సి ఉంటుంది."

    "నా దగ్గరున్న నిజాలు అంత ఖరీదైనవా....?" నవ్వుతూ అడిగాడు అనురాగ్.

    "అవును....ఖరీదైనవే....నాకు....నా ద్వారా మరొకరికి...."

    "దేనికోసం...." అనురాగ్ అడిగాడు__సుదర్శన్ తన నుంచి ఆశిస్తున్న సమాధానాల్లో ఉన్న మిస్టరీ గురించి అనురాగ్ కి ఆసక్తిగావుంది.

    "మిస్టర్ అనురాగ్. బిజినెస్ అని ముందే చెప్పాను మీకు. బిజినెస్ లో ట్రేడ్ సీక్రెట్ అనేది కూడా వుంటుంది. బిజినెస్ మాన్ ఎప్పుడూ వృధాగా ఏపనీ చేయడు. మీకు తెల్సనుకుంటాను."

    అనురాగ్ కి విషయం తెల్సి దాస్తున్నాడని సుదర్శన్ అనుమానం. కాని అనురాగ్ కి సుదర్శన్ అడిగిన వివరాలేమీ తెలియవు. ఆ విషయమే ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు అనురాగ్.

    పూర్తిగా చీకటి పడింది. ఇసక దిబ్బల మీద ఉన్న కాటేజ్ స్ మెర్క్యురీ దీపాల వెలుగులో ముడుచుకొని కూర్చున్న తాబేల్లా ఉన్నాయి.

    దూరంగా, కళాయిలేని గాజు పలకని విశాలమైన మైదానంలో అమర్చినట్లుగా సముద్రం కనిపిస్తోంది.

    "మిస్టర్ సుదర్శన్ మీరడిగిన సమాధానాలు నాదగ్గరలేవు...."

    "వాట్....!!!" సుదర్శన్ ఉలిక్కిపడ్డట్టుగా అన్నాడు.

    "ఎస్ ...." సిగరెట వెలిగించుకుంటూ అన్నాడు అనురాగ్.

    అవి తనకు తెలిస్తే వచ్చే ప్రమాదం తెలియని అనురాగ్_అవి తెలియనందువల్ల ఐదుకట్టలు కరెన్సీ పోతుందే అన్న బాధతో చూస్తున్నాడు వాటివైపు.

    "ది డోంట్ బిలీవ్__మిస్టర్ అనురాగ్ యూ ఆర్ హైడింగ్" సుదర్శన్ గొణిగాడు. అందులో కోపం స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఆ కోపంలోనే దాన్ని దాచుకొనే ప్రయత్నం కూడా వుంది.

    "నిజం మిస్టర్ సుదర్శన్. ఆ గుర్రం ఫోటోని ఎవరో చెప్పగా నేను తీయలేదు. నాకై నేను ఆ గుర్రం అందానికి ముగ్దుడినై తీసిందే. కేవలం దాన్ని అందాన్ని ఫోటోలో బంధించాలన్నదే ఆ సమయంలో నాకున్న ఆలోచన. అది ఎవరిది? అక్కడ ఎందుకుంది....అనేవి నాకనవసరం కనుక అది ఇపుడు ఎక్కడ ఉందన్నది కూడా నాకు తెలిసే అవకాశం లేదు.

    అనురాగ్ మాటల్ని సుదర్శన్ నమ్మీనమ్మనట్టుగా ఉన్నాడు. "ఓ.కే. మీకు తెలియదనే అనుకుంటాను కాని దాన్ని ఎక్కడ చూశారు? ఎప్పుడు చూశారు....? అప్పుడు దానివద్ద ఎవరున్నారు? ఈ వివరాలు చెప్పండి. దాన్నిబట్టన్నా ముందుకెళ్ళవచ్చు...." మరో బీర్ బాటిల్ వంచి అనురాగ్ మగ్ నిండా పోసాడు సుదర్శన్.

    దాన్ని తాగుతూ అనురాగ్ చెప్పడం మొదలెట్టాడు. నాలుగు నెలల క్రితం జరిగిన ఆ సంఘటనను గుర్తుకు తెచ్చుకుంటూ.

    "ప్రతి సంవత్సరం రెండు, మూడు నెలల ఇండియా అంతా నేను టూర్ చేస్తుంటాను. అలాగే క్రితం వేసవిలో, నా ఫోటో గ్రాఫిక్ టూర్ లో భాగంగానే పూనే వెళ్ళాను. ఆరోజు నాకింకా బాగా జ్ఞాపకం. ఒక ఫ్రెండ్ కి ఫేర్ వెల్ ఇద్దామని ఎయిర్ పోర్టుకి వెళ్ళాను. అదే సమయంలో ప్రత్యేకంగా ఒక స్పెషల్ ప్లయిట్ వచ్చి ఎయిర్ పోర్టులో లాండ్ అయ్యింది.

    అందులోంచి మనుషులెవరూ దిగలేదు. ఒక గుర్రం దిగింది. ఆ గుర్రంతోపాటు ఒకే ఒక వ్యక్తి వున్నాడు. 

    సుదర్శన్ సడన్ గా అనురాగ్ కి అడ్డు వచ్చాడు. "ఎవరతను? ఎలా వున్నాడు? అతని వయసెంత....? సుదర్శన్ ఆతృతకి అనురాగ్ ఒకింత ఆశ్చర్యపోయి మరలా చెప్పడం ప్రారంభించాడు.

    "అంతగా అతన్ని దృష్టిలో పెట్టుకోలేదు. అందుకు కారణం ఆ గుర్రం అందం, బలం, షార్ప్ మూమెంట్ నన్నంతగా ఆకర్షించాయి. కొన్ని వివరాలు మాత్రం చెప్పగలను. అతను సఫారీ డ్రస్ లో వున్నాడు. వయసు దాదాపు 50 సంవత్సరాలుండవచ్చు. బలంగా, దృఢంగా, ఠీవీగా డబ్బున్న దర్పంతో కనిపించాడు...."

    "సరే....ముందు విషయాని కొచ్చేయండి" సుదర్శన్ కి ఉత్సాహంగా వుంది. అతను చెప్పేవి నిజమేననిపిస్తోంది. ఎక్కడో ఒక చోట క్లూ దొరక్క పోదు అనే ఆశాభావం.

    "ప్లయిట్ లో ప్యాసెంజర్స్ రావడం, ఉన్నతాధికారులు రావడం చూశానుగాని ఒక గుర్రం ప్రత్యేకంగా విమానంలో రప్పించడం నేనూహించని విషయం. ఆ క్యూరియాసిటీ తోటే ఎయిర్ పోర్ట్ అధికారుల్ని అడిగాను. దాని వివరాల గురించి.

    ఆ ప్లయిట్ కెనడా నుంచి పచ్చిందట. అది కెనడా గవర్నమెంట్ చార్టెర్డ్ ప్లయిట్ ఆట ఒక ధనవంతుడు దాన్ని నాలుగు రోజుల క్రితం కెనడాలో జరిగిన రేస్ హార్సెస్ ఆక్షన్ లో కొని తీసుకొస్తున్నాడట అంతే. అంతకంటే అతనేం వివరాలు చెప్పలేదు. నేను అడగలేదు. నాకా అవసరం లేదు కనుక.

    కాని ఆ గుర్రం చాలా బావుండి. వెంటనే దాన్ని పోడో తీద్దామనుకున్నాను. నేనా ప్రయత్నంలో వుండగా ఎయిర్ పోర్టు అధికారులో ఆ గుర్రం యజమాని తాలూకు మనుషులో తెలియదుగాని నా ప్రయత్నానికి అడ్డుపడ్డారు. ఆ కోపంలో వారు నా కెమేరా లాక్కొని దాన్ని ఓపెన్ చేసి దానిలో లోడ్ చేసుకున్న ఫీల్మ్ ని ప్రాగ్ చేశారు. అప్పుడు నాకొకటి అనిపించింది. ఆ గుర్రం వెనక పెద్ద కథగాని గూడుపుఠాని గాని వుండి వుండాలని ఆ వెంటనే వచ్చేశాను నేను.

    "అనుకోకుండా అది జరిగిన మరో మూడు రోజులకు ఆ గుర్రం నా కళ్ళబడింది." చెప్పడం ఆపాడు అనురాగ్. 

 Previous Page Next Page