Previous Page Next Page 
దావాగ్ని పేజి 44


    "మీరు ఎంలాకా?" అన్నాడు రుద్రప్రసాద్.

 

    ఉలిక్కిపడి, ఆలోచనలోంచి బయటపడింది అప్సర.

 

    "ప్రత్యేకమైన పనేమీ లేదు. ఊరికే ఊరు చూడాలని బయలుదేరాను." అంది.

 

    "ఈ ఊళ్ళోని సందు గొందులన్నీ నాకు తెలుసు. నాతో రండి. నేను చూపిస్తాను" అన్నాడు రుద్రప్రసాద్.

 

    ఒకసారి అతనివైపు చూసి నెమ్మదిగా తల పంకించింది అప్సర.

 

    "అయితే ఇక్కడ దిగుదాం" అన్నాడతను.

 

    ఇద్దరూ కిందికి దిగారు.

 

    "మీ దగ్గర ఏమన్నా డబ్బుందా?" అన్నాడు రుద్రప్రసాద్.

 

    "కొద్దిగా" అంది అప్సర. ఆ మాట నిజమే. కావాలనే తను ఎక్కువ డబ్బు తీసుకురాలేదు.

 

    "నో ప్రాబ్లం: అయితే ముందు రేసెస్ కి వెళదాం."

 

    "ఎందుకు?"

 

    "కాసిని డబ్బులు సంపాదించడానికి"

 

    డబ్బు మీది వ్యామోహంతో కాకపోయినా, అతనెలా డబ్బు సంపాదిస్తాడో చూద్దామనే కుతూహలంతో సరేనంది అప్సర.

 

    హాపీ వాలీకి వెళ్ళారు ఇద్దరూ. అక్కడ మొత్తం స్టాండ్ అంతా ఎయిర్ కండిషన్డ్. ఒక్కసారి నలభైవేలమంది ప్రవేశం వుంటుంది.

 

    "ఇక్కడ డబ్బు ఓడిపోయినా నష్టం లేదు. ఎందుకంటే ఈ రేసులని నిర్వహించే జాకీ క్లబ్. ప్రతి సంవత్సరం తను గడించిన లాభాల్లో చాలా శాతం హాస్పిటల్సూ, పార్కులూ లాంటివి కట్టించడానికే ఖర్చు పెడుతూ వుంటుంది" అని తన దగ్గర వున్న కొద్ది డబ్బూ పందెంకాశాడు రుద్రప్రసాద్.  

 

    అతను బెట్ చేసిన గుర్రాలే గెలిచాయి.

 

    వచ్చిన డబ్బంతా మళ్ళీ కాశాడు.

 

    మళ్ళీ వచ్చింది డబ్బు.

 

    రెండు గంటల్లో యాభైవేల హాంగ్ కాంగ్ డాలర్లు సంపాదించాడు అతను. నోట్లు జేబునిండా కుక్కుకుంటూ, "ఇప్పుడు ఫర్వాలేదు. జేబుల నిండా డబ్బు వుంది. రండి: ఇంక మీకు ఊరు చూపిస్తాను" అన్నాడు.

 

    తర్వాత ఇద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్ళారు. హాంగ్ కాంగ్ స్పెషాలిటీ తినాలి మీరు. డిమ్ సమ్ సరేనా?" అన్నాడు.

 

    డిమ్ సమ్ అంటే ఏమిటో తెలుసు అప్సరకి. లెక్ఖలేనన్ని రకాల వంటకాలని ట్రాలీల మీద టేబుల్ దగ్గరకి తెస్తూ వుంటారు. వాటిలో ఏది రుచికరంగా కనబడతే అది తినొచ్చు. అంతా పూర్తి అయ్యాక, టేబుల్ మీద మిగిలిన ఖాళీ పళ్ళాలనీ, వెదురు బుట్టలనీ లెక్ఖపెట్టి బిల్లు వేస్తారు. అక్కడనుంచి హార్బర్ కి వెళ్ళారు. తర్వాత ఫెర్రీ టెర్మినల్ కి వెళ్ళి నీళ్ళలో కాకుండా, నీటికి కాస్త ఎత్తున విమానంలో వెళ్ళి జెట్ ఫాయిల్ మీద మకాప్ కి వెళ్ళారు.

 

    తిరిగి వస్తూ వాంగ్ టాయ్ సిన్ అనే చైనీస్ దేవుడి గుడికి వెళ్ళారు.

 

    "జూదరులకు ఆరాధ్యదైవం ఈయన:" అన్నాడు రుద్రప్రసాద్ నవ్వుతూ. గెలిచినప్పుడల్లా వచ్చి కానుకలు సమర్పించుకుంటాను."

 

    ఇవన్నీ చూసేసరికి చీకటి పడిపోయింది.

 

    "పద: డిన్నర్ పూర్తిచేద్దాం:" అన్నాడు రుద్రప్రసాద్. అప్పటికే అతను ఏకవచనంలోకి వచ్చేశాడు.

 

    ఆ డిన్నర్ పెద్ద అడ్వెంచర్ లా అవుతుందని అనుకోలేదు అప్సర. అతను ఆమెను తీసుకెళ్ళింది ఒక ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్ కి, అలాంటి రెస్టారెంట్ కి తను ఎప్పుడూ వెళ్ళి వుండలేదు. టేబుల్స్ మీద కవర్ గా న్యూస్ పేపర్లు పరుస్తున్నారు సర్వర్లు. అవి ఎగిరిపోకుండా వాటి మీద పాత్రలు పెట్టారు. ముందుగా మరుగుతున్న టీ ఆర్డర్ చేశాడు రుద్రప్రసాద్. సలసల మరుగుతున్న ఆ టీ రాగానే దాన్ని తాగలేదు అతను. ఆ టీతో స్పూన్లూ, ప్లేట్లూ కడిగాడు.

 

    "ఎందుకు?" అంది అప్సర ఆశ్చర్యంగా.

 

    "ఎందుకంటే, ఇది చౌక రకం హోటలు, ఇక్కడ శుభ్రత అనేది మృగ్యం. కానీ పదార్థాలు మాత్రం మహా రుచికరంగావుంటాయి... అందుకని, తినేముందు ప్లేట్లనీ, స్పూన్లనీ వేడి టీతో స్టెరిలైజ్ చెయ్యడం మంచిది" అన్నాడతను.

 

    ఆపుకోలేనంత నవ్వు వచ్చింది అప్సరకి.

 

    డిన్నర్ పూర్తి అయ్యాక "ఇక్కడికి మా ఫ్లాట్ దగ్గరే: మా ఇంటిని ఒక్కసారి పావనం చెయ్యరా?" అన్నాడు రుద్రప్రసాద్.

 

    ఒక్కక్షణం ఆలోచించి, సరేనన్నట్లు తల పంకించింది అప్సర. తను అతని రూంకి వెళితే అది చివరకి ఎక్కడికి దారి తీస్తుందో చూచాయిగా అర్థమయిపోతూనే వుంది.   

 

    బట్-

 

    టూడే ఈజ్ ఏ వెరీ స్పెషల్ డే:

 

    పది నిమిషాల్లో అతని ఫ్లాట్ కి చేరుకున్నారు.... ఫ్లాట్ లో ఒక మూలగా చిన్న బార్ వుంది. రకరకాల మద్యాలు వున్నాయి అందులో.

 

    "మీరు డ్రింక్ ఏదన్నా తీసుకుంటారా...?" అడిగాడు రుద్రప్రసాద్.

 

    "లిక్కర్స్ తాగను. వైన్ అయితే ఓ.కే:" 

 Previous Page Next Page