"అదేమిటి తొమ్మిదింటికి నన్ను రమ్మన్నారు. వస్తాడనుకుంటాను. కాస్సేపు కూర్చుంటాను" అంటూనే లోపలి వచ్చేసి కూర్చున్నాడు. పావని వంటింట్లోని తన పని చూసుకోసాగింది.
"చాక్లెట్ బావుందో లేదో చెప్పలేదు?" వంటింటి గుమ్మం దగ్గరకొచ్చి నిలబడ్డాడు. పావని సమాధానం చెప్పలేదు.
"ఎన్నాళ్ళు బాధపడతావ్? వాడి సంగతి నాకు తెలుసు. పెళ్ళయి రెండేళ్ళవుతున్నా నీకు సుఖం లేదు. నిన్ను చూస్తే జాలేస్తుంది."
"అవతలకు పోతావా? ఈ వేడి కూర తీసి మొహాన కొట్టమన్నావా?" పావని కోపంగా అరిచింది.
"అందరూ టీవీ చూడటంలో మునిగిపోయారు. మీ ఆయన వాళ్ళు ఇంకో గంటదాకా రారు" అంటూ దగ్గరగా వచ్చాడు.
"దగ్గరగా రాకు, గట్టిగా అరుస్తాను."
"మరీ అంతగా నటించకు. నువ్వు అరిచినా మీ ఆయన కొడుతున్నా రనుకొంటారంతా రోజూ వుండేదేగా! గంట టైం వుంది. ఎవరికీ తెలియదులే" అంటూ వచ్చి నడుము వెనుక చెయ్యి వేసి గుండెలకి అదుముకున్నాడు.
గట్టిగా అరవబోయిన ఆమె నోటిని అతడి నాలుక ఆపేసింది. పావని గింజుకుంటోంది. అతడి బలంముందు అసలే నీరసంగా వున్న ఆమె ఎందుకూ పనికిరావడం లేదు. ఈ గింజులాటలో తలుపు తెరుచుకోవటము ఆమె చూడలేదు.
"ఎప్పటినుంచి ఈ భాగోతం?" అన్న భాస్కరరామ్మూర్తి స్వరం వినగానే రామనాథం పావనిని వదిలేశాడు. ఒక్కక్షణం ఆ గదిలో సూదిపడితే వినపడేటంత నిశ్శబ్దం ఆవరించింది.
ఆ నిశ్శబ్దాన్ని చెదురుస్తూ- "పావనీ! ఎలా ఇప్పుడు?" అన్నాడు రామనాథం.
కేవలం మూడు మాటలు. అవి అర్ధం కావటానికి ఆమెకు మూడు సెకన్లు పట్టింది. మనుషుల్లో అంత స్పాంటేనియటీ వుంటుందని ఆమెకు అప్పటివరకూ తెలీదు. అంత వెంటనే అలా ప్లేటు మార్చెయ్యగలడని కూడా అనుకోలేదు.
భాస్కరరామ్మూర్తి ఇంకా అలా అచేతనంగానే వున్నాడు. అయితే అతడి మొహం క్రమంగా ఆవేశంతో ఎర్రబడుతూంది.
"ఇప్పుడు వద్దు.....వచ్చేస్తాడని చెపుతూనే వున్నాను అనవసరంగా కక్కుర్తి పడ్డాం" అంటూ రామనాథం వెనుక తలుపు తీసుకుని చీకట్లో కలిసిపోయాడు.
అప్పటికే తేరుకున్నాడు రామ్మూర్తి. విసురుగా లోపలికి వచ్చి ఆమె గూబమీద ఫెడీల్మని కొట్టాడు. "రోజంతా ఇంట్లో వుండి చేసే పని ఇదన్నమాట" అంటూ జుట్టు పట్టుకుని వంచి వీపు మీదా, మెడ పైన పిచ్చివాడిలా బాదసాగాడు. ఆమెకి చేతులు అడ్డం పెట్టుకోవటానికి కూడా వీలులేకపోయింది. ఆమెని వంచి మోకాలితో కొట్టిన దెబ్బలకి పెదవి చిట్లి రక్తం కారసాగింది. జుట్టు ముడివూడిపోయింది.
"ఏవండీ! నాకే పాపమూ తెలీదండీ! అతనే లోపలికి వచ్చాడండీ" రెండు చేతులూ జోడించి ప్రార్ధిస్తున్నట్టు అంటూంది ఆమె తరతరాల భారత స్త్రీకి ప్రతీకాగా మోకాళ్ళమీద కూర్చుని భర్తని ప్రార్ధిస్తూంది. అతడేమో ఆమెఇ ఎడాపెడా బాదుతూ మెడ పట్టుకుని పైకి లేపాడు. "ఎన్నాళ్ళనుంచి సాగుతోందే ఈ వ్యవహారం? ఇంకా ఎంతమందితో వుంది ఈ సంబంధం?"
ఆమె సమాధానం చెప్పబోయేలోపులో నోటిమీద మరో దెబ్బ తగిలింది. విసురుగా అతను తోసిన తోపుకి ఆమె వీధిలోకి వచ్చి పడింది. అప్పటికే వీధిలో జనం మూగారు. రామనాథం తన భార్యతో ఏం చెప్పాడో ఏమోగానీ ఆవిడ చేతులు తిప్పుకుంటూ అరుస్తోంది- "మా ఆయన ఎప్పటినుంచో నాతో దాని వేషాలు చెబుతూనే వున్నారు, నేనే అంతగా పట్టించుకోలేదు. ఈ రోజు బయటపడేసరికి కథ మార్చేస్తుంది చూడండమ్మా!"
ఆ వీధిలో దాదాపు ప్రతి స్త్రీ పావని అందాన్ని చూసి ఈర్ష్యపడిన వాళ్ళే ఆ వీధిలో దాదాపు ప్రతి పురుషుడు పావనిని ఓరకంట చూస్తూ ఉవ్విళ్ళూరినవారే. ఆమెకిలా జరిగినందుకు స్త్రీల ఈగో సంతృప్తి చెందినది. 'అంత సౌందర్యవతికి ఇంత తక్కువ గుణం వుండకేం చేస్తుంది' అన్న సంతృప్తి అది. తమ సౌందర్యలేమిని తృప్తి పరిచేది.
భార్యల్ని చూసి భర్తలు భయపడ్డారు. పక్కనే భార్యలేకపోయివుంటే అందులో సగంమంది ఆమెను ఆదరించేవారే. అయితే ఆ ఆదరణ సాటి మనిషిగా కాదు. చిన్న ఇంటి స్త్రీగా....తాత్కాలికంగా!
ఇప్పుడు భార్యల్ని సంతృప్తి పరచటానికి తలో మాటా అంటున్నారు. "భర్త పక్కింటికి వెళ్ళగానే విటుడిని పిలిపించిందా? మైగాడ్!" (నన్ను పిలవలేదే) అన్నాడొక మగాడు.
"ఎప్పుడూ కిటికీ దగ్గరే నిలబడి వుండేది" (నే నెన్నిసార్లు అటూ ఇటూ తిరిగానో) అన్నాడు ఇంకొకడు.
"మరీ బరితెగిస్తున్నారు. ఇలాంటి ఆడవాళ్ళని పుట్టింటికీ పంపినా కష్టమే." (ఈవిడ పుట్టిల్లు ఎక్కడో తెలిస్తే బావుణ్ణు)
ఇప్పుడు రామనాథం బలం పుంజుకున్నాడు. ముందే చెప్పినట్లు ఆ వీధిలో కొందరాడవాళ్ళతో అతడిని సంబంధాలున్నాయి. ఇప్పుడు తన తప్పేం లేదని నిరూపించుకోలేకపోతే రేపు వాళ్ళని 'ప్రైవేటు'గా కలిసినప్పుడు కష్టం. అందరికీ "నువ్వే నా దేవతవు. నా భార్యని, నిన్నూ తప్ప మరో స్త్రీని ఎరుగను" అని ప్రతివాళ్ళకి విడివిడిగా చెప్పాడు. నా భార్యకన్నా నువ్వే ఎక్కువ అన్నాడు. అది సమర్ధించుకోవడం కోసం ఇప్పుడు ఆఖరి బ్రహ్మాస్త్రం వేశాడు.
"ఎందుకో పిలిచిందని వెళ్ళానండీ! 'మా ఆయనకి మగతనం లేదు. నాకు పిల్లలంటే చచ్చేటంత ప్రేమ. మూడో కంటికి తెలీదులే' అని చెయ్యి పట్టుకుంది?" అన్నాడు.
అక్కడ ఒక్కసారిగా సూదిపడితే వినపడేటంత నిశ్శబ్దం!
భాస్కరరామ్మూర్తికి మగతనం లేదన్న వార్త అక్కడ బాంబులా పేలింది. మగవాళ్ళు 'అయ్యో! మాకీ వార్త మొదటే తెలిసుంటే ఎంత బావుండేది. మరింత గట్టిగా ట్రై చేసి వుండేవాళ్ళమే' అనుకున్నారు. రామనాథం వైపు "అతడి" స్త్రీలు ప్రేమగా చూశారు. తన ప్రియుడు పావని లాంటి స్త్రీని కాదన్నాడు అన్న భావం వాళ్ళని అలౌకికానందంలో ముంచెత్తింది. రామనాథానికి కావల్సింది అదే. అతడి బాణం సూటిగా తగిలింది.
'పావనే అతడ్ని పిలిచింది' అని ఇప్పుడు అక్కడ నిర్ద్వంద్వంగా నిశ్చయంగా, నిస్సంశయంగా నిరూపించబడింది. భర్త నపుంసత్వం గురించి ప్రియుడితో చెప్పిన ఆ స్త్రీ వంక అందరూ అసహ్యంగా చూశారు.
భాస్కరరామ్మూర్తి మొహం ఎర్రగా కాలుతున్న కొలిమి అయింది. ఇంత అవమానాన్ని ఏ మగవాడు భరించగలడు? ఆ ఆవేశంలో తనే రామనాథానికి అయిదేళ్ళ క్రితం ఈ విషయం చెప్పి, సెక్స్ స్పెషలిస్ట్ అడ్రసు తీసుకున్నానన్న విషయం మర్చిపోయాడు. ఇప్పుడు ఇంతమంది ముందు ఈ ఆడది తన పరువు తీసింది. అతడు రెచ్చిన కోపంతో ఆమెని కొట్టడానికి మళ్ళీ వంగాడు. అంతలో ఒక చెయ్యి అతడిని ఆపింది.
ఆ చెయ్యి వాసంతిది!
"అన్నయ్యా! నీకు మతిపోయిందా ఆగు" అంది.
"నీకు తెలీదు వాసంతీ! ఈ లం...."
"అన్నయ్యా...." గద్దించింది వాసంతి. "నీ సంస్కారం ఏమైంది? కాణీ కట్నం లేకుండా పావనిని చేసుకున్నది ఇందుకేనా?"
"కానీ ఇది....."
"తప్పుచేసి వుండవచ్చు. తనెంత తప్పు చేసిందో తెలుసుకుంటే తహనే దహించుకుపోతుంది. ఈ లోకానికి మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. అంతేకానీ నువ్వు మృగంలా ప్రవర్తించకు."
పావని ఆశ్చర్యంగా వాసంతి వైపు చూసింది. అంత బాధలోకూడా ఆమెకు ఆశ్చర్యం వేసింది. వాసంతే ఇలా మాట్లాడుతున్నది? నమ్మశక్యం కావటంలేదు.
"నీకు తెలీదు వాసంతీ...." అన్నాడు రామ్మూర్తి. "ఎన్నాళ్ళనుంచి సాగుతుందో ఈ రంకు. నేను లేకపోవటం చూసి, ఆ రామనాథం గారిని పిలిచింది. పైగా నా గురించి అబద్దం కూడా చెప్పింది. పాపం ఆయన మంచివాడు కాబట్టి...." అంటూ మళ్ళీ అంతా గుర్తొచ్చేసరికి, తిరిగి ఆవేశపడ్డాడు.
"పావని మీద ఇంకో దెబ్బపడితే నేను చచ్చిపోయినంత ఒట్టు" అంది వాసంతి. అతడి చెయ్యి ఆగిపోయింది.
"లేమ్మా పావనీ!" అని ఆమెని ఇంటిలోకి తీసుకెళ్ళింది వాసంతి. ఇంకా డ్రామా కొనసాగుతుంది అనుకున్నవాళ్ళు నిరాశతో వెనుతిరిగారు. 'నిజంగా దేవుడే' అని రామ్మూర్తి గురించి ఎవరో అనుకోవటం పావనికి వినిపించింది. ఆమె ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఆమెను నిస్త్రాణ ఆవరించింది. లోపలకు ఎలా వచ్చిందో ఆమెకే తెలియదు. ముందుగదిలోనే కూలబడిపోయింది.
వాసంతి తలుపు వేసింది.
రాత్రి పదకొండయింది.
ఇన్ని రకాల వత్తిడులకు తట్టుకోలేకపోయింది పావని. మగత నిద్రలోకి జారుకుంది. చింతలకి పరాకాష్ట నిస్త్రాణ.
లోపల రామ్మూర్తి వాసంతిని "ఎందుకిలా చేశావ్? దాన్ని అలాగే గెంటేసి వుంటే బావుండేది కదా" అని అడుగుతున్నాడు.
"ఎక్కడికి గెంటుతావు? రేపది కోర్టుకెళితే మనోవర్తి యిచ్చుకోవద్దూ."
"కోర్టుకెళుతుందా? మొహం మీద ఉమ్మేస్తారు. మొగుడు యింట్లో లేనప్పుడు ఎదురింటివాడిని పిలిచింది...." అతడి మాటలు పూర్తికాకుండానే వాసంతి విసుగ్గా అంది-"అవన్నీ కోర్టులో నిరూపణ కావు. వీళ్ళెవరూ కోర్టువరకూ రారు. వచ్చినా నీ సంగతి అందరికీ తెలుస్తుంది."