Previous Page Next Page 
అగ్నిప్రవేశం పేజి 41

  

        "దయచేసి మా అమ్మనేమీ అనకండి. ఆమె చేసింది తప్పే నాకూ విపరీతంగా కోపం వస్తూ వుంటుంది. అలా అని తెగ తెంపులు చేసుకోలేను."
   
    "తెగతెంపులు చేసుకొమ్మని నేనూ అనటంలేదు. ఆ మాట కొస్తే మీ అమ్మగారి ప్రరవ్తనలో నాకేమీ అస్వభావికత కనపడటం లేదు. మీ అమ్మలాంటి వాళ్ళు కోకొల్లలు. రవ్వంత ఆప్యాయత కోసం జీవితాన్ని ఫణంగా పెడతారు. తమ ప్రవర్తనకి అనుగుణంగా తమ సిద్దాంతాన్ని నిర్మించుకుంటారు. ఆ మత్తు తమకి ఆనందం ఇస్తున్నంతకాలం అందులోంచి బయటపడరు. ఆ మత్తు చీరెలు, కావచ్చు, డబ్బు కావచ్చు. దురద్రుష్టవశాత్తు మీ అమ్మగారి విషయంలో అది "మగవాడు" అయ్యాడు. ఆమె జీవితంలో కోల్పోయినదంతా అతన్నుంచి రాబట్టుకోవాలనుకుంది. ఆమె ఆ మత్తులో ఎంత మునిగి వున్నదంటే, తన జీవన విధానాన్నీ, సిద్దాంతాల్నీ నీ చేత వప్పించడం కూడా తప్పుకాదు అని మనసావాచా నమ్మింది. ఈ వ్యవహార మంతా రహస్యంగా జరగాలని ఆమె కూడా అనుకుంటూ వుండొచ్చుగా!" సాహితి అతడివైపు అప్రతిభురాలై చూసింది. తనెప్పుడూ ఈ కోణంలోంచి ఆలోచించలేదు.
   
    అంతలో అతనన్నాడు - "అసలు నీ సమస్యకీ, నీ ఇంటికీ ఏం సంబంధమో నాకు అర్ధంకాలేదు. నీ చదువు నువ్వు చదువుకుంటావు. నీ పెళ్ళి నువ్వు చేసుకోవటమో, లేక ఉద్యోగం చేయటమో నువ్వు నిర్ణయించుకుంటావు. జీవితమంటే కేవలం నీ తల్లీ, ఆమె భర్త కాదుకదా! తిండి, గుడ్డా, ఇల్లు, చదువు, అన్నీ వున్న నువ్వే ఇలా బేలవైపోతే ఎలా సాహితీ? ఆలోచించుకో."
   
    "కారు వెనక్కి తిప్పండి" క్లుప్తంగా అంది.
   
    అతడు తన ఆశ్చర్యాన్ని తనలోనే దాచుకుని వాహనాన్ని వెనక్కి తిప్పాడు. దాదాపు ఇల్లు చేరబోతూ వుండగా సాహితి అంది- "ఒకరికి ఎంతో పెద్ద సమస్య మరొకరికి చాలా చిన్నదిగా తోడవచ్చు. అంతమాత్రంచేత హేళన చేయడం అనవసరం మీరేదో నా సమస్యకు పరిష్కారం చెపుతారని అనుకుని, ఎవరికీ చెప్పని మా కుటుంబగాధ అంతా మీకు చెప్పాను. చెప్పి చులకన అయ్యాను. ఒకరికి ఆకలిబాధ వుండవచ్చు. మరొకరికి అపురూపంగా పెంచుకున్న కుక్క చనిపోవటంవల్ల బాధ కలగవచ్చు. 'మొదటిదానితో పోల్చుకుంటే రెండోది ఎంత' అనటం అవతలివారిని హేళన చేయటమే. ప్రేమా ఆప్యాయతలనేవి వుంటాయండీ! వాటిని తెగతెంపులు చేసుకోవటం అంత సులభం కాదు. నేనిలా మాట్లాడుతున్నందుకు మీరేమీ తప్పుగా అనుకోవటం లేదుకదా!"
   
    "లేదుకానీ ఒక విషయానికి సమాధానం చెప్పు. నేను చెప్పిన పరిష్కారం చాలా మెటీరియలిస్టిక్ గానే వుంది నిజమే! కానీ సెంట్ మెంటుని ఆశ్రయించి నువ్వు సాధించింది బాధ తప్ప మరేదయినా వుందా? కట్నంలేక పెళ్ళికాక బాధపడతారు కొందరు. కాలేజీలో రాగింగ్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటారు కొందరు. అన్నిటికీ ఒకటే పరిష్కారం! వ్యక్తిత్వాన్ని పెంచుకోవటం! మనిషి తనకి ఏది కావాలో ఏదో అక్కరలేదో తెలుసుకోవాలి. నీ తల్లి నీకు అవసరం లేదనుకుంటే అసలు సమస్యేలేదు. కావాలి అనుకుంటే తల్లితోపాటూ నువ్వు అతన్ని వప్పుకోవటం మరో పరిష్కారం."
   
    "ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీరు?"
   
    "మనం సుఖంగా వుండాలి. మన సుఖం ఎవరికీ ఈ ప్రపంచంలో దుఃఖం కలిగించకూడదు. మన ప్రస్తుత సుఖం మనకి భవిష్యత్తులో గిల్ట్ ఫీలింగ్ ఇవ్వకూడదు. ఈ మూడు సిద్దాంతాల్నీ నమ్మిన మనిషి జీవితమంతా ఆనందప్రధమే అయితే ఈ 'సుఖం' కోసం తను ఎవరిమీదా ఆధారపడక, స్వశక్తితో దాన్ని సాధించుకోవాలి. అలా ప్రయత్నించి చూడు, కొన్నాళ్ళకి నీ తల్లే నిన్ను మెచ్చుకుంటుంది. నీ పెంపుడు తండ్రి నిన్ను 'మామూలుగా' ముట్టుకోవటానికి కూడా సందేహిస్తాడు. ఒక్కచూపుతో మనుషుల్ని శాసించే అధికారం నీకు వస్తుంది. 'బాధో.....బాధో' అని బాధపడటం తగ్గిపోతుంది."
   
    "అదే మా ఇల్లు మీరు కారు ఆపుచేస్తారా?"
   
    "ఇంతసేపూ నేను చెప్పింది....."
   
    "మంచి నవలగా వ్రాయండి. మామూలు మనుష్యులు ఎవరూ ఆచరించలేని గొప్ప గొప్ప నీతి సూత్రాలున్నాయి అందులో." అతను హర్ట్ అయ్యాడు. అయినా ఆమె ప్రస్తుత మానసిక పరిస్థితి అర్ధం చేసుకున్నవాడు కానుక నవ్వి "అలాగే వ్రాస్తాను. కానీ నువ్వు మాత్రం ఏ దారుణమూ తలపెట్టనని మాటివ్వు" అన్నాడు.
   
    ఆమె కూడా తను నోరు జారి అన్న మాటలకు బాధపడుతూ, "సారీ! తప్పకుండా" అని కారు దిగి వెళ్ళిపోయింది.
   
    కారు బారువైపు పోనిస్తూ భరద్వాజ అనుకున్నాడు. "లాభం లేదు. ఈ రోజు ఇంకో రెండు పెగ్గులు ఎక్కువ తాగాలి. అక్కడ సభలో శ్రోతలూ అర్ధం చేసుకోలేదు. ఇక్కడ సమస్య వున్న పాఠకులూ అర్ధం చేసుకోవటం లేదు. విమర్శకులు దెప్పిపొడిచినట్టు నిజంగానే నాకు సామాజిక స్పృహతో పరిష్కారాలు చెప్పటం సాధ్యం కావటంలేదేమో! నా యీ సమస్యకి పరిష్కారం ఏమిటబ్బా?"
   
    .....సరిగ్గా నాలుగ్గంటల తరువాత అతడి సమస్యకి పరిష్కారం దొరికింది.
   
                                   5
   
    ఆ రాత్రి పావనికి ఎందుకో చాలా టెన్షన్ గా వుంది. అది ఏదో కారణంవల్ల వచ్చిందికాదు. ఈ మధ్య ఎప్పుడూ అలాగే వుంటూంది గత రెండు నెలలుగా భాస్కరరామ్మూర్తి మరింత శాడిస్ట్ గా తయారయ్యాడు. ఇంట్లోనే బారు పెట్టేశాడు.
   
    ఒకప్పుడు తండ్రి అండ వుందికదా అనుకునేది పావని. అతడేం చేసినా చాలా ఆలోచించి, విశ్లేషించి చేస్తాడని ఆమె గట్టి నమ్మకం. ఎప్పుడైతే విశ్వపతి కూడా తన భర్తనే సమర్ధించాడో ఆమె ధైర్యం అంతా పిరికితనంగా మారిపోయింది. దుఃఖం కలిగింది. గొంతులో దుఃఖం కాదు. గుండెల్లో దుఃఖం.
   
    భాస్కరరామ్మూర్తి పనిమాత్రం చాలా బావుంది. చేతినిండా మామగారిచ్చిన డబ్బుంది. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాడు. అతడు తాగి అరవడం చుట్టుప్రక్కల అందరికీ అలవాటై పోయింది.
   
    ఆ అందరిలో రామనాథం ఒకడు. ముందు మరదలి వరస కలిపాడు. తరువాత పాలప్యాకెట్లు తెచ్చి ఇచ్చేవాడు. నెమ్మదిగా గంటా రెండు గంటలు కూర్చునేవాడు. జ్యోతిష్యం చూసేవాడు. ప్రేమంటే ఏమిటో చెప్పేవాడు. తన భార్య గురించి చెప్పేవాడు. మనిషి ఆనందించటంలో తప్పులేదని సోదాహరణగా వివరించాడు. వాసంతిని తిట్టేవాడు.
   
    ఈ ప్రపంచంలో చిత్రమేమిటంటే పరాయి మగవాడితో ఎంతోకాలం మాటలు గడిచాకగానీ, ఆ మగవాడు తనతో "ఆ దృష్టి" తో మాట్లాడుతున్నాడని స్త్రీ తెలుసుకోలేదు. పావనికి మొదట అర్ధంకాలేదు.
   
    ఒకరోజు మధ్యాహ్నం రామనాథం వచ్చి తలుపుతట్టి, ఆమె తలుపు తీయగానే ఓ ప్యాకెట్టు చేతిలో పెట్టి హడావుడిగా వెళ్ళిపోయాడు. ఆమెకి అర్ధంగాక దాన్ని విప్పింది. అందులో మరొక ప్యాకెట్టు, అలా విప్పుకుంటూ పోతే చివరగా ఓ చాక్లెట్టు.....సగం కొరికింది వుంది......పావని కంపరంగా దాన్ని తీసుకెళ్ళి చెత్తబుట్టలో వేసింది.
   
    దిండులో తల పెట్టుకుని చాలాసేపు ఏడ్చింది.
   
    ఆ మరుసటిరోజు మధ్యాహ్నం అతనొస్తే తలుపు తీయలేదు. ఆ తరువాత రోజూ అలాగే జరిగింది. అప్పుడు అతను ఏం చెప్పాడో తెలీదు కానీ భాస్కరరామ్మూర్తి ఎగిరిపడ్డాడు. "ఆ మాత్రం ఇంగితజ్ఞానం వుండక్కర్లా? పాపం తాళం చెవి లేక అతడు కాసేపు ఇంట్లో కూర్చుంటానంటే వెళ్ళగొడతావా?" అని అరిచాడు.
   
    "అతడి వాలకం నాకు నచ్చలేదు" అంది పావని.
   
    "పచ్చకామెర్ల వాడికి లోకం అంతా పచ్చగానే కన్పిస్తుంది. నీ బుద్ది అలాంటిది కాబట్టి అతడూ అంతే అనుకుంటున్నావు" అని వెళ్ళిపోయాడు.
   
    ఆ నాల్గుగోడల మధ్య జరిగింది రామనాథం ఊహించి వుంటాడు. మరింత విజ్రుంభించాడు.
   
    పావని వాళ్ళది రెండిళ్ళ పోర్షను. బాత్ రూమ్ వెనుకవైపు వుంటుంది. అక్కడ కాపువేసి చీకట్లోకి ఆమె రాగానే గట్టిగా పట్టుకుని నోట్లో నోరు పెట్టి ముద్దు పెట్టుకున్నాడు. ఊహించని ఆ పరిణామానికి ఆమె బిత్తరపోయింది. దీన్ని సమాధానంగా తీసుకుని అతడు మరింత ముందుకి సాగాడు. పావని అతన్ని విదిలించుకుని లోపలికి పరుగెత్తింది.
   
    చాలాసేపటికిగానీ ఆమెకు గుండెదడ తగ్గలేదు. ఆమెకేం చేయాలో కూడా తోచలేదు. అసలు ఎవరికయినా ఇలాంటి సమస్య వస్తుందా అనుకుంది. తను భర్తకి చెప్పలేదు. తనే అతడికి బుద్దిచెప్పటానికి ధైర్యంలేదు. రేపొద్దున తన జీవితం ఏమవుతుందోనన్న భయం కాస్త కాలేజీలో చదివినా లాగిపెట్టి కొట్టే ధైర్యం వుండేది కదా అనుకుంది. (కాలేజీలో చదివిన చాలామంది అమ్మాయిలకి కూడా రోడ్ సైడ్ రోమియోల్ని, వంటిని తాకే రౌడీల్ని కనీసం ఎదిరించి మాట్లాడేశక్తి వుండదనీ, తమలోతామే కుమిలిపోతారనీ పావనికి తెలీదు.) ఆ తరువాత రామనాథం కొన్నాళ్ళు కనిపించలేదు. కనిపించినా పట్టనట్టు తిరిగేవాడు. ఆమె సంతోషించింది. అయితే అదో టెక్నిక్ అని ఆమెకు తెలియదు. ముందు కొంత ఇంట్రస్టు చూపించి తరువాత అకస్మాత్తుగా మానేస్తే ఆడదానిలో ఉత్సుకత పెరుగుతుంది.
   
    అయితే పావనిలో అసలు అలాంటి ఉత్సాహమే లేకపోవటంతో అతడి టెక్నిక్కు ఫలించలేదు. పదిరోజులు గడిచాయి. ఒకరోజు తలుపు చప్పుడుకి వంటింట్లో పని చేసుకుంటున్న పావని వచ్చి తలుపు తీసింది. రామనాథం!
   
    "రామ్మూర్తి లేడా?"
   
    "లేరు. బయటకు వెళ్ళారు" అని ఆమె తలుపు వెయ్యబోతుంటే వెనక్కి తోసి.....

 Previous Page Next Page