ఇద్దరూ పది అడుగులు వేశాక సిద్ధార్థ ఆగాడు.
అంతలోనే ప్రమాదం జరిగిపోయింది.
ముందు రాకేష్ కాలు జారింది. నిలదొక్కుకోలేకపోయాడు. అసలే ఫ్రాస్ట్ బైట్ (మంచు కొరుకుడు) వల్ల స్పర్శ కోల్పోయిన కాలు- దానికి తోడు వ్రేళ్లు సహకరించలేదు. చూస్తూ వుండగానే కొండ అంచువరకూ జారి అక్కణ్ణుంచి లోయలోకి ముద్దలా కూలిపోయాడు.
సిద్ధార్థకి ఏం జరిగిందీ అర్ధమయ్యే లోపులోనే ఇద్దరిమధ్యా కట్టిన తాడు అతడిని కూడా లోయలోకి లాగేసింది.
గాలిలోంచి క్రిందికి పడిపోతున్న రాకేష్ శరీరపు బరువు అకస్మాత్తుగా తాడువల్ల తననీ లాగేయటంతో సిద్ధార్థ నడుము కలుక్కుమంది. వెనక్కి వంగేడు అప్రయత్నంగా. అదే అతడు చేసిన తప్పు. దాంతో కాళ్ళు జారి, తాడుతో సహా శిఖరం అంచువైపు రివ్వున వెళ్ళిపోసాగాడు. తాడుకి అవతలివైపున వున్న రాకేష్ తాలూకు నూటఅరవై పౌండ్ల బరువుగల శరీరం సిద్ధార్థని ఊహించని వేగంతో క్రిందికి లాగెయ్యసాగింది.
దాదాపు వెయ్యి అడుగుల క్రింద నేల అతడిని ఆహ్వానిస్తూన్నట్టు వుంది.
* * * *
తనని ఎక్కడికి తీసుకు వెళుతున్నారో రంజితకి తెలియలేదు.
అంతలో వాళ్ళు హాలు దాటారు. చిన్న గదిలో ప్రవేశించారు.
అక్కడున్నాడు మహాదష్ట.
ఆమెని చూసి నవ్వేడు! ఎటూ తప్పించుకోలేక బెదురుగా చూస్తున్న కుందేల్ని చంపబోయే ముందు పులి చూసినట్టుంది ఆ చూపు.
"నిన్ను నిన్నటిరోజే చంపాలి. కానీ అవతార్ బాబా కోర్కెవల్ల ఈ రోజువరకూ ఆపు చేయవలసి వచ్చింది. నిజం చెప్పు. నీ ప్రియుడు షాడో మా సంస్థలో దొంగతనంగా చేరటానికి వేసిన ప్లాన్ సంగతి మీ ఇద్దరికే కాక మరెవరికి తెలుసు?"
ఆమె మాట్లాడలేదు.
"రంజితా! అసలు నిన్నటిరోజే నిన్ను చంపివేయవలసింది. కానీ కేవలం అవతార్ బాబా కోరటంవల్ల ఆపుచేశాం. అతడికి నీ మీద కోరిక వున్నట్టుంది. అది తీర్చి, ఉస్సోక్ లో చేరిపోవటం ఒక్కటే నువ్వు బ్రతకాలంటే మార్గం. అలా అని అబద్ధం చెప్పటానికి ప్రయత్నించకు. అలా చెపితే మాకు తెలుస్తుంది".
"అవతలివాళ్ళ మనసుల్లో ఏముందో తెలుసుకోగలవు కదా. ఇదీ తెలుసుకో" అంది హేళనగా.
మహాదష్ట మొహం మళ్ళీ కఠినంగా మారింది. "సరే అయితే, ఆ విషయం నువ్వూ అవతార్ బాబా తేల్చుకోండి. ఉస్సోక్ ప్రమధగణ ప్రధమ సభ్యుడనయిన నేను మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోను" అంటూ అనుచరులవైపు తిరిగి, "ఈమెని బాబా దగ్గరికి తీసుకు వెళ్ళండి. బ్రతికి వుంచాలా చంపాలా అన్నది తేల్చి అరగంటలో చెప్పమనండి. ఇలాటి చిన్న విషయాల గురించీ సమయం వృధా పరచటం నా కిష్టంలేదు" అన్నాడు.
ఆమెని ఇద్దరు అనుచరులు తిరిగి మళ్ళీ ఒక విశాలమైన వరండాగుండా మరో గదిలోకి తీసుకువెళ్ళారు. అక్కడ అలంకరణంతా ఆధునికంగా వుంది. డ్రెస్సింగ్ టేబిల్, మంచం, ఖరీదైన వస్తువులు.
అంతలో తలుపు తెరుచుకుని అవతార్ బాబా ప్రవేశించాడు. "హలో రంజితా! చాలా కాలానికి కలుసుకున్నట్టున్నాం కదూ" అన్నాడు నవ్వుతూ.
ఆమె మాట్లాడలేదు.
"మహాదష్ట అంతా చెప్పాడు అనుకుంటాను. నీ నిర్ణయం ఏమిటి?"
"నిన్ను నేనుకాదు- ఏ ఆడదైనా కోరుకుంటుందని నేను అనుకోను" కసిగా అంది ఆమె. అతడి మొహంలో నవ్వు చెరగలేదు. అడ్డంముందు కూర్చుని తన గెడ్డాన్ని రుద్దటం ప్రారంభించాడు. తరువాత మీసాల్ని తీసేస్తూ మాటలు కొనసాగించాడు.
"ఉస్సోక్ లో ప్రతి ఒక్కరికీ తెలుసు- నేను బాబాని కాదని. బాబాని సైతాను చంపేసింది!! అంతకుముందు రాత్రే నాకు బాబా స్థానంలో చేరమని అశరీరవాణి చెప్పింది. ఆ రోజునుంచే నేను బాబా అయ్యాను".
"మరి నువ్వెవరివి?"
"నిజంగా తెలుసుకోవాలని వుందా రంజితా?"
అతడి కంఠంలో సడెన్ గా మార్పు వచ్చింది. అప్పటివరకూ మాట్లాడిన కంఠానికీ దీనికీ సంబంధం లేదు. అది బాబా మాట్లాడినట్టు వుంది.
చటుక్కున ఆమెవైపు తిరిగి "ఇప్పుడు చెప్పు- నన్ను గుర్తుపట్టావా?" అని అడిగాడు.
ఆమె వూపిరి పీల్చటం కూడా మర్చిపోయింది. గొంతులోంచి మాట కూడా బయటకు రాలేదు. "నువ్వా" అని మాత్రం అనగలిగింది.
అతడు నవ్వేడు. "నేనే రంజితా! ఇప్పుడు చెప్పు, అష్టావక్రుడు పుట్టటంలో ఏదైనా సంశయం వుందా?"
ఆమె ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఆమెకి భయం వేసింది. అక్కణ్ణుంచి పరుగెత్తాలన్న భావన ఆమె మనసంతా ఆక్రమించింది.
మొత్తం విషయమంతా అర్ధమైనట్టు అనిపించింది.
"నువ్వే బాబావన్న సంగతి రాకేష్ కి గానీ, రంగప్రసాద్ కి గానీ తెలుసా?" అని అడిగింది.
"తెలిసే అవకాశం లేదు రంజితా! అంతేకాదు, ఒకటి రెండు రోజుల్లో షాడో కూడా గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఉస్సోక్ నిన్ను చంపెయ్యకుండా రక్షించగలిగేవాణ్ణి నేనొక్కణ్ణే. మూర్ఖంగా ఆలోచించకు. ఉస్సోక్ లో చేరిపో. నీలాంటి తెలివైన అమ్మాయి అవసరం ఉస్సోక్ కి చాలా వుంది".
"ఇప్పుడు నేను ఉస్సోక్ లో చేరితే షాడోని వదిలేస్తారా?" ఆశగా అడిగింది. అతడు నవ్వేడు. "షాడో ఉస్సోక్ లో ఎప్పుడో చేరిపోయాడు. ఒకటి రెండు ఇంజక్షన్లు అంతే...!"
"మరి నన్నుకూడా చేర్చుకోవచ్చుగా ఇంతగా బ్రతిమలాడటం దేనికి?"
"బ్రెయిన్ వాష్ చేసిన మనిషి ఒక మరబొమ్మలా మేము చెప్పిన మాట వింటాడే తప్ప స్వతహాగా ఆలోచించడు.. నాకు నువ్వు కావాలి, నీలాంటి మరబొమ్మ కాదు. ఉస్సోక్ వద్దంటున్నా నేను నిన్ను బ్రతికిస్తున్నది అందుకే-"
ఆమె అతడివైపు అసహ్యంగా చూసింది. షాడో, తను కలిసి అవతార్ బాబా రూపంలో వున్న ఇతడి దగ్గిరకి వెళ్ళినప్పుడే ఇతడి అసలు రూపం తెలిసి వుంటే అక్కడే బయటపెట్టి వుండేవారు. ఇప్పుడనుకొని ఏం లాభం?
అతడు అసహనంగా వాచీ చూసుకుని, "చెప్పు రంజితా! నాకు టైమయిపోతున్నది" అన్నాడు.
"నాకిష్టమే" అందామె. అతడు ఆశ్చర్యంగా ఆమెవైపు చూశాడు. "అవును ప్రాణంపోయే పరిస్థితుల్లో ఏం చెయ్యను" అంది తలవంచుకుని.
"గుడ్" అన్నాడతడు.
31
కుడిచేత్తో మంచుని తడుముతూ ఎడమచేత్తో యాక్స్ ని బలంగా భూమిలోకి దింపటానికి ప్రయత్నిస్తూ సిద్ధార్థ అంచువైపు జారిపోతూ వుండగా, చివరి క్షణంలో యాక్స్ ఒకచోట ఇరుక్కున్నట్టు ఆగిపోయింది. గునపంతో భూమిని తవ్వుతూ వుంటే ఎప్పటిదో పురాతన కాలంనాటి వృక్షపు బోదె మట్టిలోంచి పైకి లేచినట్టు యాక్స్ కి మంచు అడుగున ఏదో తగిలింది. ఆ మాత్రం ఆధారం దొరికేసరికి సిద్ధార్థ ఆలస్యం చేయకుండా అడుగు నిలదొక్కుకుని పాదాలకి మంచు గుంటల్లో ఆధారం కల్పించాడు. అయినా క్రిందినుంచి రాకేష్ బరువు అతడిని లాగేస్తుంది.
క్రిందినుంచి సన్నటి మూలుగు వినపడింది.
"రాకేష్! ఆర్యూ ఆల్ రైట్?"
"ఆ" అన్నాడు సన్నటి కంఠంతో.
"క్రిందికి చూడకు. వెర్జిగొ (కళ్ళకు సంబంధించిన భయంకరమైన మానసిక వ్యాధి) వస్తుంది" హెచ్చరించాడు పైనుంచి. శిఖరం అంచులో రాపిడికి తాడు పెకిలిపోకుండా మరో కొసతో ముడివేసి, దాన్ని పట్టుకుని జాగ్రత్తగా వంగి క్రిందికి చూశాడు.
క్రింద గాలిలో వూగుతున్నాడు రాకేష్.
బలంగా తాడుని పైకి లాగటం ప్రారంభించాడు. చలికి కొంకర్లు పోయిన వేళ్ళు ఆ పనికి నిరాకరిస్తూంటే, సత్తువంకా చేతుల్లోకి తీసుకుని పని కొనసాగించాడు. అరచేతులు గీరుకుపోయి రక్తం స్రవించసాగింది.
రాకేష్ పైకి రావటానికి దాదాపు పదిహేను నిముషాలు పట్టింది. దాదాపు అచేతనావస్థలో అతడు ఉపరితలం మీదకు రాగానే అపస్మారకస్థితిలోకి వెళ్ళిపోయాడు.
నుదుటిమీద నుంచి కారే చెమట చుక్క చెంపమీదకు జారేలోపులో ఘనీభవించి మంచుగా మారుతూంది. అంతలా వుంది శీతల గాలి. అంత చలిలోనూ చెమట పడుతూంది.
రెండు నిముషాల తరువాత రాకేష్ కళ్ళు విప్పాడు.
"ఎలా వుంది?"
రాకేష్ బలహీనంగా తల వూపాడు. ఇంకా అతడు షాక్ నుంచి తేరుకోలేదు.
"మనం వెంటనే ప్రయాణం సాగించాలి. ఇంకో మంచు తుఫాను వచ్చే సూచన్లు కనపడుతున్నాయి" అన్నాడు సిద్ధార్థ దక్షిణ దిక్కుగా చూస్తూ. (మంచు పర్వతాల్లో తుఫానువచ్చే సూచన్లు వున్నప్పుడు కొండ శిఖరాన్నే 'గొడుగు' గా అవతలివైపుకు చేరుకోవటం మంచిది. లేకపోతే శిఖరంతో సహా అయిదు పది నిముషాల్లో మంచులో కప్పబడిపోయే ప్రమాదం వుంది.)
"నేనింక లేవలేను" అన్నాడు రాకేష్. "...ఇక్కడే మరణిస్తాను".
"రాకేష్!" కంఠం స్థిరంగా వినపడింది. "ఇలాంటి ఒంటరి పరిస్థితుల్లో మానసికంగా ఎప్పుడూ బలహీనమవకూడదు. కొద్దిగా 'వీక్' అయితే పిచ్చెక్కిపోతాం. చుట్టూ చూడు ఈ తెలుపు.... ఇంత తెలుపు రంగు... ఇంత నిశ్శబ్దం - కొద్దిగా భయపడితే చాలు- హిస్టీరియా వచ్చేస్తుంది. మనసు దిటవు పర్చుకో".
రాకేష్ ఆశ్చర్యంతో సిద్ధార్థవైపు చూసేడు. మామూలుగా వున్నాడు సిద్ధార్థ. అప్పుడు ఆనందంలోనూ, ఇప్పుడు ప్రాణంపోయే పరిస్థితుల్లోనూ ఒకేలా వున్నాడు. అంతలో రాకేష్ దృష్టి అతడి అరచేతుల మీద పడింది. ఎర్రటి రంగులో ముంచినట్లున్నాయి ఆ చేతులు. తాడు అతడి అరచేతులపై చర్మాన్ని లోతుగా కోసేసింది.
దాన్ని చూడలేక రాకేష్ మొహం తిప్పేసుకున్నాడు.
"పద టైమ్ లేదు" లేచాడు సిద్ధార్థ.
"ఇదే మనకు బహుశా ఆఖరి రాత్రి" అన్నాడు సిద్దార్థ. "రేపు సాయంత్రం లోపులో మనం ఇక్కడినుంచి బయట పడకపోతే రేపు రాత్రి మరణించబోతున్నాం".
రాకేష్ కి ఈ మాటల్లో సగం వినబడ్డాయి. సగం వినపడలేదు. అతని కళ్ళు మూతలు పడిపోతున్నాయి. "అదృష్టవశాత్తు అప్పటికే శిఖరం పక్కకి రావటం వల్ల తుఫాను ఉధృతం అంత రాలేదు. చలి మాత్రం ఎముకలు కొరికేస్తుంది. ఏదైనా గుహలాంటిది కనపడుతుందేమో అని చూసేడు సిద్ధార్థ. కానీ అటువంటిదేమీ లేదు. యాక్స్ తో దాదాపు అరగంట కష్టపడితే చిన్న గుహలాటిది తయారయింది.
"అరగంట కన్నా ఎక్కువసేపు నిద్రపోకూడదు. వంతుల ప్రకారం మేలుకోవాలి. కాలి వేళ్ళు, చెవుల చివర్లు రుద్దుకుంటూ కొంచెంసేపు గడిపి తిరిగి పడుకోవాలి. రాత్రంతా....లేకపోతే ప్రొద్దున్న లేచేసరికి మాంసం కుళ్ళిపోవటం మొదలు పెడుతుంది" నవ్వుతూ అన్నాడు.
అంతలో యాక్స్ కి ఏదో తగిలినట్టయి ఆగాడు. ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. రాకేష్ వంగి, మంచులోంచి ఆ వస్తువుని బయటకు తీయటానికి ప్రయత్నించాడు. అంత తొందరగా రాలేదు. మరింత లోపలికి చేతులు పోనిచ్చి బయటకు లాగాడు. ఒక్కసారిగా లోపల్నుంచి వచ్చిన వస్తువును చూసి రాకేష్ గుండెలు అదిరేలా కెవ్వున అరిచాడు.
అది ఒక చెయ్యి!
సిద్ధార్థ కూడా నిశ్చేష్టుడయ్యాడు. అంత నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆ పర్వతశిఖరాల మధ్య తెల్లటి మంచు మధ్యనుంచి బయటకు వచ్చిన చెయ్యి- ఎంత ధైర్యవంతులనయినా భయంకంపితుల్ని చేస్తుంది.