Previous Page Next Page 
అర్ధరాత్రి సూర్యోదయం పేజి 40


    పాత జైలుకి పక్కనే మరికొన్ని సదుపాయాలతో కొత్త జైలు కట్టాడు. ఇంకా అక్కడికి ఖైదీలని ప్రవేశపెట్టలేదు.
    జైలు లోని వెల్ ఫేర్ ఆఫీసర్ చదువూ సంస్కారం ఉన్న వ్యక్తి. ఆవిడ కుతూహలంగా "నువ్వు ప్రమధపురిలో వెలసిన దేవతవి కదూ! నిజంగా దుర్గ నిన్ను ఆవహిస్తుందా?" అంది. అంతే! ఆ మాటతో ఖైదీలలో చాలామంది, ముఖ్యంగా హిందువులు ఇళ చుట్టూ మూగారు.
    "నాకు బెయిల్ దొరుకుతుందా. మా అమ్మని చూడాలి!"
    "నా పిల్లల్ని నాకు అప్పగిస్తారా?"
    "మా నాన్న జబ్బు నయమవుతుందా?"
    "మా ఆయన నన్ను చూడటానికి వస్తాడా? ఖైదు నుంచి వెళ్ళాక నాతో మామూలుగా ఉంటాడా? ఆ పాడుపని ఆయనే చేయించాడు నాతో! తీరా నేను పట్టుబడ్డాక తను పెద్దమనిషిలాగా తప్పుకున్నాడు.
    ప్రశ్నలు! ప్రశ్నలు! ఉక్కిరిబిక్కిరి అవుతోంది ఇళకి! ప్రమధపురిలో ఇళకి ఎక్కువ శ్రమలేకుండా రాణి, అచ్యుతమ్మ పక్కన ఉండేవారు. ఇళకి కటువుగా మాట్లాడటం రాదు. అలవాటు తియ్యగా, ప్రసన్నంగా నవ్వింది. ఆ నవ్వులోనే వాళ్ళకి ఎంతో ఓదార్పు దొరికినట్లయింది. కేవలం బీదరికం వల్ల రఫ్ గా తయారయిన ముఖాలతో ఎడంగా నిలబడ్డారు. అడగటానికి వాళ్ళకి ప్రశ్నలు లేవు. వాళ్ళకి బాగా అలవాటైన ఈ చిన్న ప్రపంచంలో కొత్త వింతని విచిత్రంగా చూస్తున్నారు.
    "నన్ను కొంచెంసేపు ధ్యానం చేసుకోనివ్వండి. తర్వాత మీ ప్రశ్నలకి సమాధానం చెప్తాను."
    ప్రాధేయపడుతున్నట్లుగా అంది. వెంటనే అందరూ ఇళ ఉన్న సెల్ ఖాళీచేసి దూరంగా వెళ్ళిపోయారు. ఆడవాళ్ళ జైలులో ఏదైనా ప్రమాదకరమైన హిస్టరీ ఉన్నవాళ్ళని తప్ప మిగిలిన సెల్స్ లో ఉంచి తాళాలు వెయ్యరు పగటి పూట! ఖైదీలందరూ జైలు ఆవరణలో యధేచ్చగా తిరగొచ్చు. అయితే ఆ స్వేచ్చ అంతా మూసివున్న ఇనుప గేటు లోపల మాత్రమే! అది దాటి బయటికి వెళ్ళటానికి ఏవిధంగానూ ఆస్కారం లేదు.
    సాటి ఖైదీల సహకారానికి కృతజ్ఞతతో నిండిపోయింది ఇళ మనసు. వీళ్ళ కోసం తనేం చెయ్యగలదు? ఏదైనా చెయ్యగలిగితే బాగుండును. హిందూ దేశంలో ఖైదులో అయినా సరే భక్తినీ, ధ్యానాన్నీ గౌరవిస్తారు. కొన్ని క్షణాలలో తన ధ్యానంలో లీనమయిపోయింది ఇళ. ఆమెకి సంబంధించినంతవరకూ కాలం ఆగిపోయింది.
    ఇళ కళ్ళు తెరిచేసరికి అదే సెల్ లోని మిగిలిన ఖైదీలు ఆమెని భక్తికో, ఆరాధనతో చూస్తున్నారు. ఇదివరకు బకెట్ విషయంలో సాయంచేసిన ఖైదీ, అల్యూమినియం పళ్ళెంలో ఇళ కోసం అన్నం పెట్టించుకుని దాచి ఉంచింది. అన్నం, పల్చగా ఉన్న పప్పు, చారు, చిన్న ఎల్యూమినియం గిన్నెలో పెరుగు, అల్యూమినియం గ్లాసులోనే మంచినీళ్ళు. ఖైదీలకి గాజు సామాన్లు అందనివ్వరు.
    "మేమంతా తినేశాం! నువ్వు తిను!" అంది అభిమానంగా.
    ఆ ఆహారం వంక చూస్తూ కూర్చుంది ఇళ. అవి తినాలనిపించటంలేదు. ఏదీ తినకపోతేనేం? ప్రాణాలు పోతాయి. అంతేగా! అనుకుంది.
    "తిను తినకపోతే ఊరుకోరు!" అంది ఖైదీ మళ్ళీ.
    "అలా ఉంచు. ఆకలయినప్పుడు తింటాను" నమ్రతగా అంది.
    "ఏమిటీ? ఇంకా ఆకలి లేదా? పొద్దున్న కూడా ఏమీ తినలేదు."
    అదేదో "మహత్తు" అన్నట్టు అంది ఖైదీ. మిగిలినవాళ్ళలో ఒకరు అప్పుడే ఈ విషయం ప్రచారం చెయ్యటానికి బయలుదేరారు.
    ఆ సమయంలో వార్డెన్ వచ్చి ఇళకి పళ్ళూ పాలూ అందించింది.
    "చైతన్యదేవ్ నీకోసం తెచ్చాడు" అంది.
    చిచ్చు వచ్చాడా? తను జైలుకి వచ్చిన మొదటిరోజునే వచ్చాడా?
    "నిన్ను చూడాలన్నాడు. ఇవాళ నీకు ఇంటర్వ్యూ ఇవ్వటానికి కుదరదు. అతడెవరో వెరిఫై చేసుకోవాలట. పైవారం అనుమతి ఇస్తారనుకుంటా!" వెళ్ళిపోయింది వార్డెన్.
    "అమ్మకి పళ్ళు వచ్చేశాయి. అన్నం తినలేదని దేవుడే పంపించాడు" ఒక ఖైదీ అంది.
    మళ్ళీ ఈ వార్త కూడా ప్రచారమయిపోయింది.
    ఇళ పళ్ళు "ఆరగించటం" కోసం మిగిలిన ఖైదీలు మళ్ళీ సెల్ ఖాళీ చేసి బయటికొచ్చారు. వెళ్ళబోయేముందు ఒక ఖైదీ ఆపిల్స్ మేట్రన్ ఆఫీసులో ముక్కలుగా కట్ చేయించి తీసుకొచ్చి ఇళ ముందుపెట్టి మరీ వెళ్ళింది.
    ఇళ ఆ ప్లేట్ చేతిలోకి తీసుకొని ఆ పళ్ళ వైపు చూస్తూ కూర్చుంది. అవి దుర్గకి నైవేద్యం పెట్టినవి కావు, చిచ్చు పంపినవి. ఒక నేరస్థురాలు ముక్కలుగా తరిగి చ్చినవి. ఆపిల్ ముక్క తీసుకుని భక్తితో కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంది. దేవి ప్రసాదం కంటే అవి ఏవిధంగానూ తక్కువగా అనిపించలేదు. అంతేకాదు. అంత మాధుర్యం అప్పటివరకూ ఏ దేవి ప్రసాదంలోనూ అనుభవంలోకి రాలేదు. పళ్ళలో కొంత భాగం పక్కకి తీసి మిగిలినవి తిండి. తన సెల్ బయటవున్న ఖైదీలకి పక్కకు తీసిన పళ్ళు ఇచ్చి "మీరంతా సమంగా పంచుకోండి!" అంది. వాళ్ళు తెల్లబోయి చూశారు. ఖైదీలు దాదాపు వందమంది వరకూ ఉంటారు. పళ్ళు చిన్నచిన్న ముక్కలు చేసుకుని అందరూ పంచుకున్నారు. హిందువులు కానివాళ్ళు కూడా తిన్నారు. మధ్యాహ్నం వార్డెన్లు డ్యూటీలు మారాలి. ఖైదీలందరూ మళ్ళీ లైన్ లో నిలబడ్డారు కౌంటింగ్ కి!


                                     18


    "అమ్మాజీ! మాతాజీ! నన్ను కాపాడండి!"
    ఉత్తరాది యాసలో తెలుగు మాట్లాడుతూ ఇళ పాదాల మీద పడింది కోమల. ఇళ కంగారుగా కాళ్ళు వెనక్కి తీసుకుంది. కోమలి ఏడుస్తూ_ "మాతాజీ! ఈ పాపిష్టిది తాకితే, తమరి కాళ్ళు కూడా మైలబడతాయా?" అంది. ఏడుస్తున్న వాళ్ళని వెంటనే ఓదార్చటానికి ప్రయత్నించకుండా ఉండలేదు ఇళ_
    "బాధపడకు_ అందరినీ దుర్గ కాపాడుతుంది."
    "నా పాపాలు క్షమిస్తదా దుర్గా మాత? నన్నేం జేసినా ఫర్వాలేదు. నా పాపం నా బిడ్డల్ని కొట్టకుండా ఉంటాదా?"
    "పశ్చాత్తాపంతో ప్రార్థిస్తే, ఇకముందైనా అలాంటి పాపా...తప్పులు చెయ్యకుండా ఉంటే, తప్పకుండా క్షమిస్తుంది."
    "పశ్చాత్తాపమా? హయ్యో! మాతాజీ! నేను జేసిన తప్పులకి కుమిలిపోని క్షణం ఉండదా? కంటినిండా నిద్ర పోయానా ఏనాడైనా? కానీ మాతాజీ నేను చెడ్డదాన్ని కాదు. చంపాలని నేనెవర్నీ చంపలేదు. అప్పుడు...అప్పుడు...ఏమో? నాకే దయ్యం పట్టిందో నాకు తెల్వదు...నా బిడ్డలు నల్లగుండారా? నన్ను తలుస్తరా? చెప్పు మాతాజీ?"

 Previous Page Next Page