Previous Page Next Page 
అర్ధరాత్రి సూర్యోదయం పేజి 41


    కౌంటింగ్ కాగానే, ఇళ తన సెల్ లోకి వచ్చింది. పగటిపూట సెల్స్ కి తాళాలుండవు కాబట్టి కోమల వచ్చి ఇళ కాళ్ళమీద పడింది.ఇళ వచ్చి ఒకరోజే అయినా, ఇళ దేవతామూర్తి అని తెలియగానే, ఖైదీలంతా ఆమె చుట్టూ చేరుతున్నారు. కానీ, కోమల ఇళ దగ్గరికి రాగానే అందరూ ఎవరిమటుకు వాళ్ళు దూరంగా పోయారు. చంటిపిల్లల తల్లులు తమపిల్లల్ని గట్టిగా పట్టుకున్నారు. కిందికి వదలకుండా మొదటినుంచీ ఇళకి సహాయం చేస్తున్న ఖైదీ "దానిని దగ్గిరకి రానీయకు. మెత్తగా మాట్లాడుతూనే గొంతులు కోసెయ్యగలదు" అని అరిచింది దూరం నుంచే! ఆ మాటలు విన్న కోమల తన ఏడుపు మరిచిపోయి మహంకాళిలా లేచి "దొంగలు...! నేను గొంతులు కోస్తానా? మరి నువ్వెందుకొచ్చావే ఇక్కడికి? గొంతులు నులమబట్టేగా! ఏంటే నీ యెక్కువ?" అంటూ ఆ ఖైదీ మీదికి ఉరికి క్షణాలలో ఆమె గొంతు తన చేతులతో ఇరికించుకుంది. ఆ ఖైదీ తనను విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ కోమల జట్టు అందుకుని, కాలితో కోమల పొట్టలో తన్నింది. కాస్త ఎడంగా ఉన్న వార్డెన్ బెత్తంతో రంగంలోకి వచ్చింది.
    "ఏంటీ గోల! వదలండి!" అని ఇద్దర్నీ బెత్తంతో వాయించింది. అయినా ఇద్దరూ ఒకరినొకరు వదలలేదు సరికదా, బెత్తంతో సహా వార్డెన్ కి కూడా కిందపడేశారు. అక్కడితో అసిస్టెంట్ మేట్రన్, మరో ఇద్దరు వార్డెన్లు వచ్చి వాళ్ళిద్దరినీ బలవంతాన విడదీశారు. వాళ్ళు రొప్పుతూ ఒకరినొకరు పగబట్టిన మృగాల్లా చూసుకుంటున్నారు.
    ఇద్దరినీ వాళ్ళ వాళ్ళ సెల్స్ కి ఈడ్చుకుపోయి, లోపలికి తోసేసి బయట తాళాలు వేసేశారు. అసిస్టెంట్ మేట్రన్ కోపంగా 'మీ ఇద్దరి మీదా రిపోర్ట్ వ్రాస్తాను. ఇద్దరికీ కమీషన్ తగ్గిపోతుంది. అదే మీకు పనిష్మెంట్" అంది.
    ఆ మాటలకి ఇద్దరికిద్దరూ నిర్లక్ష్యంగా నవ్వారు. ఖైదీలకి నెలరోజులు జైలు శిక్ష అనుభవించిన తర్వాత, వారి ప్రవర్తన బాగుంటే, అయిదురోజుల కమీషన్ వస్తుంది. ఆ రకంగా వినయ విధేయతలతో వున్న ఖైదీలకి శిక్షాకాలం తగ్గుతుంది. అలా కాకుండా జైలులో గొడవలు చేసే ఖైదీలకి కమీషన్ కట్ చేస్తారు. కొన్ని సందర్భాలలో శిక్షా కాలం పొడిగించటం కూడా జరుగుతుంది.
    అసిస్టెంట్ మేట్రన్బెదిరింపుకి ఖైదీలు నవ్వటం చూస్తే "మాకు ఖైదు లోపల అయితేనేం? బయట అయితేనేం?" అన్నట్టుగా ఉంది. అసిస్టెంట్ మేట్రన్ కోపం ఇళ మీదకి తిరిగింది. "శిక్ష పడినా బుద్ధిలేదూ? ఇక్కడ మళ్ళీ భక్తులూ, మేళాలు ప్రారంభించారా?" అని విసుక్కుంది. అంతలోనే ఇళని తిడితే తనకేమీ ఆపద రాదు కదా, అని భయంవేసి "సరే! సరే! గొడవ చెయ్యకుండా కూర్చో! ఖైదీలందర్నీ నీ చుట్టూ పోగుచేసుకోకు. నీకేమన్నా కావాలంటే నన్నడుగు" అంది. తర్వాత తన ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. అది కూడా సెల్ లాంటి గదే! ఎటొచ్చీ ఆ గది తలుపులకి తాళాలుండవు. అంతే తేడా! అసిస్టెంట్ మేట్రన్ పక్కన ఖైదీలలోంచే వార్డెన్ గా నియమింపబడ్డ యువతి నిలబడి, ఆవిడకి ఆఫీస్ వర్క్ లో సాయం చేస్తోంది. ఖైదీలలో కాస్త చదువు వచ్చిన వాళ్ళని, ప్రమాదకరమైన ప్రవర్తనలేని వాళ్ళని ఆఫీస్ పనులకి ఉపయోగించుకుంటారు.      
    కోమల కటకటాలకి తల ఆనించి ఏడుస్తోంది. అంతకు కొన్ని క్షణాల ముందు కాళికలా విజృంభించింది ఆ వ్యక్తేనా అని అనుమానం కలిగేటంత ధీనంగా ఏడుస్తోంది. ఇళ లేచి కోమల సెల్ దగ్గరకి వెళ్ళింది. ముందుకు వంగి, కటకటాల్లోంచి చెయ్యి పోనిచ్చి కారుతున్న కన్నీళ్లు తుడిచింది. కోమల చటుక్కున ఆ చెయ్యి అందుకుని గట్టిగా పట్టుకుంది. తర్వాత నెమ్మదిగా ఆ చెయ్యి తన కళ్ళకద్దుకుంది. మోకాళ్ళ మీద నిలబడి కటకటాలు పట్టుకుని, "నేనెవర్నీ చంపలేదు. నాకు చంపాలని ఉండదు. కానీ..." ఆగిపోయింది. ఆ 'కానీ' ఏమిటో వివరించలేకపోయింది.
    ఇళ కటకటాల అవతల నేలమీద కూర్చుంది.
    "ఏం జరిగిందో చెప్పు, బాధపడకు...."
    "నిజంగా... నిజంగా... జరిగింది చెబుతాను. నమ్ముతావా?"
    "నమ్ముతాను. చెప్పు."
    మాటల సందడికి వార్డెన్ ఇటు తిరిగింది.
    ఇళని అదిలించబోయింది. వార్డెన్ తో కబుర్లు చెబుతున్న ఖైదీ "ఆమెనేమీ అనబోకు. ఆమె తన మహత్తు ఉన్నదంట?" అంది వార్డెన్ ఊరుకుంది. ఇళ మీద గౌరవంతో కాదు. స్నేహితురాలైన ఖైదీ మాట కాదనలేక.
    కోమల చెప్పటం మొదలుపెట్టింది.
    కోమల పుట్టిల్లు బొంబాయి. బి.ఏ. పాసయింది. బొంబాయిలో ఆడపిల్లలందరూ ఉన్నట్లే చురుగ్గా బయటికి వెళ్ళటం, ఇంటికి కావలసిన వస్తువులు తనే తీసుకుపోవటం, స్నేహితులతో సరదాగా కబుర్లు చెపుతూ బీచ్ లో సాయంత్రాలు గడపటం, అలా చాలా ఏక్టివ్ గా గడిపేది కాలం. కొంతకాలం ఒక ప్రైవేట్ ఆఫీస్ లో స్టెనోగా ఉద్యోగం కూడా చేసింది. తను స్వయంగా ఎలక్ట్రానిక్స్ నేర్చుకుని సర్టిఫికెట్ కోర్స్ పాసయింది. అలాంటి కోమలకి హైద్రాబాద్ లో ఒక ఇంజనీరింగ్ ఫర్మ్ లో పనిచేస్తున్న వినోద్ వర్మతో పెళ్ళి నిశ్చయమయింది. వినోద్ వర్మ కోమలకి చాలా దూరపు బంధువు. ఒకసారి పనిమీద బొంబాయి వెళ్ళి, హోటల్ లో ఉన్తెఖర్చు ఎక్కువ అవుతుందని చుట్టరికాలు తిరగేసుకుంటూ కోమల వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు వున్నంతలో బాగానే మర్యాద చేశారు. అతడు కోమల అందం చూసి ముగ్ధుడై కట్నం అడక్కుండా పెళ్ళి చేసుకుంటానన్నాడు. తల్లిదండ్రులు వెంటనే ఆనందంగా ఒప్పుకున్నారు.కోమల అభిప్రాయం ఎవరూ అడగలేదు.
    ఒకవేళ అడిగినా కట్నం అడక్కుండా తనను పెళ్ళిచేసుకుంటానంటోన్న పెళ్ళికొడుకును కాదనగలిగి ఉండేది కాదు. వర్మ అందగాడు కాదు. కానీ, కోమల ఆ విషయం అంతగా ఆలోచించలేదు. పెళ్ళి జరిగింది. కట్నముగా ఏమీ ఇవ్వకపోయినా, లాంఛనాల పేరిట దాదాపు పదివేలు ఖర్చుపెట్టి వైభవంగా పెళ్ళి చేశారు కోమల తల్లిదండ్రులు. ముచ్చటగా మూడు నెలలు అన్యోన్యంగా గడిపారు భార్యాభర్తలు. ఆ తర్వాత అంతకుముందు నుంచీ, లోలోపల అణచుకున్న అనుమానాలు బయటపెట్టటం ప్రారంభించాడు వర్మ.
    కోమల ఒక్కర్తే బయటికెళ్తే అనుమానం ఇంట్లో సరుకుల కోసమైనా పక్క దుకాణానికైనా వెళ్ళటానికి వీల్లేదు. పనిమనిషి తేవాలి. లేకపోతే వర్మ స్వయంగా తెస్తాడు. ఇంటికి మొగవాళ్ళెవరైనా వస్తే, వాళ్ళు చుట్టాలైనా సరే కోమల వాళ్ళ కంటికి కనపడకూడదు. వాళ్ళతో మాట్లాడకూడదు.
    ఎప్పుడైనా పొరపాటున మర్యాదకి "రండి! కూర్చోండి!" అని మాత్రమే అన్నా, ఆరోజు ఇంట్లో నరకమే! నాలుగు గోడల మధ్య జైలు లాంటి ఆ జీవితాన్ని చదువుకున్న కోమల భరించలేకపోయేది. లోలోపల ఫ్రస్టేషన్ తో హిస్టిరికల్ గా తయారయింది. ఈ అనుమానాల మధ్యే ఆరేళ్ళలో ముగ్గులు పిల్లలు పుట్టారు.
    తనదంటూ ఒక జీవితంలేని కోమల పిల్లలే తన జీవితంగా బతికింది. ఆరేళ్ళు గడిచాక, ముగ్గురు పిల్లలు పుట్టాక వర్మకి ఎందుకంత అనుమానమో తెలిసింది కోమలకి. అతడు ఏ ఆడదాన్నైనా కామ దృష్టితో తప్ప చూడలేడు. అందరూ తనలాగే అనుకుంటాడు. దానికితోడు కోమల తనకంటే అందగత్తె కావటం, అందరి కళ్ళలోనూ ఆమె అందం పట్ల మెప్పుదల కనపడటం ఆమె మీద అసూయని ఎక్కువ చేశాయి.
    మూడు కాన్పులకి, మనసులో అలుముకుంటున్న నిస్పృహతోడై కోమల శరీరంలో కన్నె బిగువు సహజంగానే సడలింది. వన్నె కూడా తరిగింది. అప్పుడు వర్మ తన ఆడ స్నేహితులని ఏకంగా ఇంటికే ఆహ్వానించాడు.
    నిర్ఘాంతపోయిన కోమల శివంగిలా విజృంభించి ఇంటికి వచ్చిన ఆడదాన్ని చీపురుకట్టతో బాదింది. ఫలితంగా ఆ ఆడదాని కళ్ళెదుటే, మొగుడి చేతుల్లో చావుదెబ్బలు తింది. అంతేకాదు కోమలని గదిలోకి ఈడ్చి తలుపులు బయట తాళం పెట్టాడు.

 Previous Page Next Page