Previous Page Next Page 
అర్ధరాత్రి సూర్యోదయం పేజి 39


    ఎలాగైనా ఆ సెల్ లోకి వెళ్లి ఆమెని ఓదార్చాలనిపించింది. మరో మూల నుంచి పసిబిడ్డ ఏడుపు. ఇక్కడ కొండలు పిల్లలు కూడా ఉన్నారు తల్లులతోపాటు.
    ఏ దశలోంచి ఏ దశలోకి వచ్చింది?
    పసితనంలో దుర్గ ప్రత్యక్షమయి వరాలిచ్చినట్లు విష్ణుమూర్తి తన పాతివ్రత్యాన్ని మెచ్చుకొన్నట్లు కన్న కలలు! అనుభవించిన దారిద్ర్యం, దేవతగా పూజలు! చివరికి ఈ జైలు.
    అచ్యుతమ్మకానీ, యోగానాథశాస్త్రి కానీ ఇళని చూడటానికి రానేలేదు. ఇళ పెద్దగా ఆర్చర్యపోలేదు. నామాలయ్య అడ్డుపడి ఉంటాడు. ఆ ఊళ్ళో ఉంటూ నామాలయ్యని ఎదిరించే శక్తి ఎవరికీ లేదు. ఒక్క చిచ్చూకి తప్ప. చిచ్చు ఏం చేస్తున్నాడో? తను జైలు నుంచి విడుదల అయి బయటికొచ్చేసరికి ఎలా ఉంటాడో! గుండెలో పదునైన కోత! బాధ భరించలేకపోతోంది! తనకి చావు ఎందుకు రాదు? జగజ్జనని దుర్గామాత సంకల్పం ఎలా ఉందో?
    కిర్రుకిర్రు చప్పుళ్ళు. తాళాలు తెరుస్తున్నారు. జంతువులు తమ గుహల్లోంచి ఆహారం కోసం బయటికి వచ్చినట్లు ఒక్కొక్కళ్ళూ తమ సెల్లులోంచి బయటికి వచ్చారు. లైన్ లో నిలబడ్డారు. కౌంటింగ్ వార్డెన్స్ డ్యూటీలో మారినప్పుడల్లా కౌంటింగ్ జరుగుతుంది. ఒక వార్డెన్ మరో వార్డెన్ కి ఖైదీలని లెక్క పొరపాటు లేకుండా అప్పజెప్పడం! ఆ తర్వాత కాలకృత్యాలు! జంతువులు వేట కోసం ఒకదానితో ఒకటి పోటీలు పడ్డట్లు లిమిటెడ్ గా వున్న బకెట్ల కోసం, మగ్స్ కోసం పోటీలు. ఎవరిమటుకు వాళ్ళకే మొదట దక్కించుకోవాలనే ఆరాటం. ఇళతో పాటు సెల్ లో ఉన్న ఖైదీలలో ఒకమ్మాయికి ఇరవైలోపుగానే వయసుంటుంది. చాలా హుషారుగా వుంటుంది. గయ్యాళిది. గడుసుది కూడా! తోటివాళ్ళతో పోట్లాడటంలో గయ్యాళి. వార్డెన్ కి అవీ ఇవీ బహుమతులిచ్చి మంచి చేసుకోవటంలో గడుసుది. మిగిలినవాళ్ళని తోసుకుంటూ, నెట్టుకుంటూ బకెట్ తీసుకొచ్చి "వెళ్ళి తొందరగా నీ పనులు చేసుకో!" అని ఉసికొల్పింది ఇళని. ఆ బకెట్ చేత్తో పట్టుకుని రెండడుగులు వెయ్యలేకపోయింది ఇళ. "ఓయబ్బో!" ఎంత నాజూకు అంది ఆ అమ్మాయి వ్యంగ్యంగా.
    "నాజూకు కాదు. నాకు కీళ్ళు నొప్పులుగా ఉన్నాయి." నెమ్మదిగా చెప్పింది ఇళ.
    "అయ్యో! అలా అయితే, బకెట్ నేను మోసుకొస్తానులే! పది గంటలకి నర్సమ్మకి చూపించుకో! ఏదైనా మందిస్తుంది."
    ఎంతో అనునయంగా అంది.
    గబగబా బకెట్ బాత్ రూంలో పెట్టింది. సెల్స్ నుంచి కొంత దూరంలో ఉంది బాత్ రూం.
    ఆ అమ్మాయి మంచితనానికి ఇళ ఆశ్చర్యపోసాగింది. మాటా ప్రవర్తనా కూడా మర్యాద తెలిసిన మనిషి అనిపించేలా ఉన్నాయి.
    "నువ్వేం నేరం మీద వచ్చావు ఇక్కడికి?" అడిగింది ఇళ.
    "హత్యానేరం మీద! ఆ అమ్మాయి కళ్ళల్లో చివ్వున నీళ్ళు తిరిగాయి. గిరుక్కున ముఖం తిప్పుకుంది.
    "అవన్నీ నెమ్మదిగా తర్వాత మాట్లాడుకుందాం! టీ పోస్తారు. రా! వరసలో కూర్చో"
    ఎవరిదో పసిబిడ్డ ఏడుపు వినిపిస్తే అటు పరుగెత్తింది ఆ అమ్మాయి.


                                *    *    *    *


    చంచల్ గూడా జైలు హైదరాబాద్ లో చాలా పెద్ద జైలు. మొగవాళ్ళ జైలుకి ఎదురుగా ఆడవాళ్ళ జైలు ఉంది. మెయిన్ ఆఫీస్ మొగవాళ్ళ జైలులోనే ఉంది. ఆడ ఖైదీలైనా, మొగ ఖైదీలైనా అక్కడి ఆఫీస్ లోకే మొదట వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ వగైరాలన్నీ అక్కడే జరుగుతాయి. తర్వాత ఆడవాళ్ళని ఆడవాళ్ళ జైలులోకి తీసుకొస్తారు. ఆడవాళ్ళ జైలులోకి మెయిన్ గేట్ లోంచి రాగానే ఎదురుగా ఇంటర్వూయర్స్ వెయిటింగ్ రూమ్, గార్డ్స్ రూమ్ పక్కపక్కల కనిపిస్తాయి. కాస్త దూరంగా జవానుల క్వార్టర్స్ ఉంటాయి. వాళ్ళనే వార్డెన్స్ అని కూడా అంటారు. జవానుల క్వార్టర్స్ వరుసగా బొమ్మరిళ్ళలాగా ఉంటాయి.
    మెయిన్ గేట్ నుంచి ఎడమపక్కగా మెయిన్ క్వార్టర్ ఉంది. గార్డ్స్ రూంకి కుడివైపుగా కాస్త దూరంలో అసిస్టెంట్ మెయిన్ క్వార్టర్ ఉంది. దాని ముందువైపు టిన్ షెడ్, మెయిన్ క్వార్టర్ దాటి లోపలికి రాగానే విశాలమైన గ్రౌండ్ కనిపిస్తుంది. అక్కడ సాయంత్రాలు మేల్ గార్డ్స్ డ్యూటీలో లేనివాళ్ళు వాలీ బాల్ మొదలైన గేమ్స్ ఆడుకుంటారు. ఆ గ్రౌండ్ లో బరువైన ఇనుప గేటు వెనకాల ఆడ ఖైదీల సెల్స్ ఉన్నాయి. మొదట చిన్న ఆఫీస్ రూమ్. అది దాటి లోపలికి వెళ్ళాక, అటు ఇటు వరుసగా ఆడ ఖైదీల సెల్స్ లోనే ఒకటి రెండు ఆఫీసు గదులుగా మార్చుకున్నారు. ఆఫీస్ రూమ్స్, ఖైదీల సెల్స్ ఒకే వరసలో వుండటం చూడటానికి కాస్త పొంచికల్ గా కనిపిస్తుంది.
    కావల్సిన ప్రొఫార్మా పూర్తిచేసి పిలుపు కోసం ఎదురుచూస్తూ ఇంటర్వ్యూయర్స్ వెయిటింగ్ రూంలో కూర్చున్నాడు చిచ్చు. ఆ వాతావరంలో ప్రతిక్షణమూ, అతడి గుండెలు పిండినట్లుగా అవుతోంది. ఇళ అక్కడ ఉండాలి! అయిదేళ్ళు! అయిదు క్షణాలు గడపటం కష్టంగా ఉంది.
    అయిదేళ్ళు ఎలా గడపగలదో ఇక్కడ?
    ఈలోగా ఇళ ఏమీ అయిపోకుండా ఉండాలి.
    అందుకే అతడు ఇళ కోసం ఆపిల్స్, అరటిపళ్ళు, బత్తాయి పళ్ళు ఒక సీసాలో పాలు తీసుకొచ్చాడు.
    వార్డెన్ వచ్చింది కొంతసేపటికి.
    "సారీ! మీకిప్పుడు ఇంటర్వ్యూ దొరకదు. పైవారం వచ్చి అప్లికేషన్ ఇవ్వండి. మీరు ఖైదీకేమైనా ఇయ్యదల్చుకుంటే మాకివ్వండి. ఆమెకి అందజేస్తాం."
    వార్డెన్ నోట ఖైదీ అనే మాటవింటుంటే చిచ్చుకు మనసులో మండింది. ఏనాటికీ పోనీ ఎవరూ తుడవలేని నల్లని మచ్చలాగ ఇళ జీవితం మీద పరుచుకున్న మురికి మచ్చలాగ అనిపించింది. వార్డెన్ కి పళ్ళు హేండోవర్ చేస్తే అవి ఇళకి అందుతాయా? అందినా అందకపోయినా అంతకంటే చెయ్యగలిగిందేమీ లేదు.


                               *    *    *    *


    లైన్ లో కూర్చుని ఖైదీలందరూ టీలు అందుకున్నారు. ఆ టీ తాగలేకపోయింది ఇళ. స్నానం చేసి ధ్యానంలో కూర్చోవాలనుకుంది. ఎన్నో జతల కళ్ళు కుతూహలంగా చూస్తున్నాయి ఇళని.
    "నువ్వేం నేరం మీద వచ్చావు?"
    "నీదే ఊరు?"
    "పెళ్ళయిందా? పిల్లలున్నారా?"
    "నీకోసం వచ్చేవాళ్ళున్నారా? వాళ్ళు నీకోసం ఏమైనా తెస్తారా?"
    ఖైదీలలో ఎక్కువమంది చదువుకోనివాళ్ళే. వాళ్ళు న్యూస్ పేపర్స్ చదవడు. అందుకే ఇళ గురించి తెలీదు. అదీగాక, ఇళ పూలదండలతో కుంకుమబొట్లతో "అమ్మ వేషం" మీద లేదు. అతి మామూలుగా వుంది. అందరికంటే నిరాడంబరంగా ఉంది. ఖైదీలందరూ తెల్లని బట్టలే కట్టుకోవాలి. పైటకొంగు దగ్గర తప్ప మరెక్కడా అంచులేని తెల్లచీరలు. జైలు అధికారిణులు మేట్రన్, అసిస్టెంట్ మేట్రన్, మొదలైన వాళ్ళకి కూడా తెల్లచీరలే యూనిఫాం! అయితే, వాళ్ళ జాకెట్ చేతులమీద వాళ్ళ అధికారాన్ని సూచించే బేడ్జెస్ ఉంటాయి. పోలీస్ డిపార్ట్ మెంట్ లోని మహిళా అధికారిణులు మాత్రమే కాకీ యూనిఫారాలలో ఉంటారు.

 Previous Page Next Page