Previous Page Next Page 
చీకటి కడుపున కాంతి పేజి 39

 

    రవికి వల్లమాలిన అగ్రహామొచ్చింది.
    "నీ నగలు నీ యిష్టం. అంతేకదూ? నిన్నెవడు పోషిస్తాడనుకున్నావ్ ఇక్కడ? నేనేం రాసులు పోసుకు కూర్చున్నానా? 'నాకేదన్నా వుద్యోగామా? నా బ్రతుకే నేను బ్రతకలేక చస్తోంటే నా మెడకో గుదిబండలా నువ్వెందుకు? " లత వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది.'
    రవి ఆ ఏడుపు చూసి ఏమాత్రమూ జాలి తలచలేదు సరికదా చీదరించుకుని వెళ్ళిపోయాడు.
    లత గుండెల్లో రాయి పడింది. తన గతి ఏం కావాలి? తను మళ్ళీ రామచంద్ర దగ్గరకు వెడితే అతను రానిస్తాడా? రానిచ్చినా తను ఎంత లోకువైపోతుంది?
    తిరిగి తిరిగి రాత్రి తొమ్మిదింటికి వచ్చాడు రవి.
    "లతా!" అని ఆప్యాయంగా పిలిచాడు.
    రవి అప్యాయతకి భయం వేసింది లతకి.
    సమాధానం  చెప్పకుండా పులుకుపులుకున చూసింది.
    "మనోవర్తికి బావగారి మీద దావా వేస్తె?" సంతోషాన్ని ముఖం నిండా పులుముకుంటూ అడిగాడు రవి.
    తెల్లబోయింది లత. "దావా వేస్తావా?"
    "అవును. బావగారికి పొలం ఉందిగా! అందులో కొంతైనా నీకు చచ్చినట్లు ఇవ్వాలి. పొలం ఇస్తారా, సరేసరి మనకు నిశ్చింత! పోనీ పొలం ఇవ్వరా చచ్చినట్లు నిన్ను తీసికెళ్ళాలి. అదైనా నయమే!"
    "వద్దన్నయ్య! దావాలోడ్డు. నాకు భయంగా ఉంది." గాభరాగా అంది లత.
    ఇంతెత్తున లేచాడు రవి.
    "నీ మొగుడి మీద దావా వేసి మనోవర్తి అడగటానికి వీల్లెదూ- నీ నగలియ్యవూ! తిండేలా అనుకున్నావు?"
    లత వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది.
    విసురుగా మీదకు వచ్చాడు రవి.
    లతకు మరింత దుఖం వచ్చింది. రవికి కోపం హెచ్చింది. లత చెంపలు టపటప వాయిస్తూ "మొగుడితో నోరు పారేసుకుని దెబ్బలాట పెట్టుకుని వచ్చి ఇప్పుడు రాగాలు పెడతావా? నోర్ముయ్" అన్నాడు. లత రెండు చెంపలూ వాచిపోయాయి. లతను కొట్టి బాధపడక పోగా , లత తన భర్త మీదా దావా వెయ్యటానికి ఒప్పుకోనందుకు మరోసారి విసుక్కుని బయటకు వెళ్ళిపోయాడు.
    అంతవరకూ రవి ఎక్కడెక్కడ తిరిగినా రాత్రి తొమ్మిదింటికీ పదింటి కైనా ఇంటి కొచ్చేవాడు. ఆనాడు రాత్రి సమయంలో కూడా బయటి కెళ్ళే సరికి భయంతో లతకు ప్రాణం గడ్డకట్టినట్లయింది. దెబ్బల బాధ కంటే ఒంటరితనపు భయం అధికమయింది. అకస్మాత్తుగా వారిజ గుర్తుకొచ్చింది. పాపం వారిజ! బ్రతుకు మొత్తం ఒంటరిగా ఎలా గడుపుతోందో? వెంటనే తన ఈ స్థితికి వారిజే కారణమని కూడా గుర్తుకొచ్చింది.
    "దానికి ఒంటరితనమేమిటి?" అనుకుంది.
    తెల్లవార్లూ భయంతో కునికిపాట్లు పడుతూ కూర్చుంది. కాని పడుకోలేకపోయింది.
    మరునాడు పది దాటాక వచ్చాడు రవి. "వంటయిందా?" అంటూ.
    కోపంగా చూసింది లత.
    "ఇంతవరకూ అసలు కుంపటి రాజెయ్యలేదు . నువ్వు వస్తావో రావో తెలీదు. ఏం వండను?"
    "ఏం పొగరే! కాస్త వొంచి పని కూడా చెయ్యలేని నిన్ను నేనెందుకు మేపాలి? పో? వెంటనే ఇక్కడ నుంచి పో!"
    "ఎక్కడికి పోను?"
    "ఇంకెక్కడికి? నీ మొగుడి దగ్గరికి. నాతోనే ఇలా దెబ్బలాడుతోన్న దానివి నీ మొగుడితో ఎంత దెబ్బలాడే దానివో? వదిలేశాడంటే వదిలేయ్యడూ మరి?"
    "అయన నిష్కారణంగా నన్నెప్పుడూ కొట్టలేదు" బాధగా చెంపలు రాసుకుంటూ అంది లత.
    "ఆయనకు బుద్ది లేదు' వెటకారంగా అన్నాడు రవి.
    లతకు హృదయం కలుక్కుమంది.
    అసలు రామచంద్రకు దూరమైన తర్వాత ఆమెకు రామచంద్ర విలువ తెలియసాగింది. అతని లాలన, ఆప్యాయతా, అప్పుడు ప్రత్యేకం అనిపించలేదు. కాని, అతనికి దూరంగా ఆర్ద్రత లేని వాతావరణంలోకి ప్రవేశించాకా వాటి విలువ, అర్ధం తెలిసొచ్చింది. లతకు తెలియకుండానే వాటికోసం తపన కూడా ప్రారంభమయింది. దానికి తోడూ రవి నిర్దాక్షిణ్యపు మొరటు ప్రవర్తన రామచంద్ర సౌజన్యాన్ని ఆమెకు మరింతగా ఎత్తి చూపింది.
    'అవును, ఆయనకు బుద్దిలేదు. అందుకే నా పెంకి తనాలన్నిటినీ ఇంత శాంతంగా సహించారు. మరొకరైతే రవి అన్నయ్యకంటే ఎక్కువగా లెంపలు వాయించేవారు" అనుకుంది తనలో తనే.
    'లతా! నిక్కచ్చిగా చెపుతున్నాను. నేను నిన్ను పోషించలేను. నిన్ను ఇవాళో, రేపో రైలెక్కించేస్తాను. మీ అయన దగ్గరకు వెళ్ళిపో!" కఠినంగా అన్నాడు రవి.
    లత ఏ సమాధానమూ చెప్పలేదు. తనంత తానై రామచంద్ర దగ్గరకు వెళ్ళాలంటే చిన్నతనంగానే ఉంది, కానీ వెళ్ళకపోతే నయమనిపిస్తోంది. అతడు రానిస్తాడా? అంతరాంతరాలలో తప్పక ఆదరిస్తాడని ఆశ.
    ఆ మధ్యాహ్నం పోస్ట్ మెన్ వచ్చి "లత గారికి ఏం.ఓ ఉందని చెప్తే ఆశ్చర్యపోయింది.
    సంతకం చేసి రెండు వందలు తీసుకుంది. రామచంద్ర పంపించాడు. క్రింద రెండే రెండు వాక్యాలు.
    "నీ ఖర్చులకి పంపుతున్నాను. చాలకపోతే రాయి."
    చాలాసేపు ఆ రెండు వాక్యాలే చదువుతూ కూర్చుంది.
    "బావగారూ పంపారా?" నవ్వుతూ వచ్చాడు రవి.
    బొమ్మలా కూర్చున్న లత చేతుల్లోంచి రెండు వందలూ తీసుకున్నాడు. జేబులో పెట్టుకుని నవ్వుతూ "నేను బజారు కెళ్ళి కావలసిన సామానులు కొనుకొస్తాను" అన్నాడు.
    లత అన్న గారి ముఖంలోకి సూటిగా చూసింది.
    "ముందర నాకు మా ఊరికి టికెట్ కొనిచ్చి మిగిలిన డబ్బుతో ఏదైనా చేసుకో!"
    "అదేమిటి?" ఆశ్చర్యంగా అన్నాడు రవి.
    "ఇవాళో రేపో వెళ్ళిపొమ్మని నువ్వే చెప్పావుగా"
    "ఏదో చికాకులో అన్నాను. నిజంగా వెళ్ళగొడ్తననే అనుకున్నావా?"
    "నువ్వు వెళ్ళ గొట్టకపోయినా నేనే వెళ్తాను, టికెట్ కొను...."
    "ఏమిటి వెర్రి? ఇప్పుడు వెళ్తే చులకనయిపోతావు"
    'అయన ఎవ్వరినీ చులకన చెయ్యరు"
    "చూడు ! డబ్బు పంపాడా లేదా? ఆయనే కాళ్ళ మీద పడతాడు. దర్జాగా వెళుదువు గాని...."
    "డబ్బు పంపింది నా మీద వ్యామోహంతో కాదు. ఆనాడు నన్ను కఠినంగా రైలేక్కించిన అయన ముఖం నేను మర్చిపోలేను. అలాంటి మనిషి ఇలా డబ్బు పంపించాడంటే అది వ్యామోహం కాదు. అయన ఔన్నత్యం, ఏమైనా నేను వెళ్ళి తీరతాను."
    "ఏమిటా మొండితనం? వెళ్ళటానికి వీల్లేదంటుంటే?" అజ్ఞాపిస్తున్నట్లుగా అని బయటికి కదలబోయాడు రవి.
    'అన్నయ్యా! టికెట్ కొను" దృడ స్వరంతో అంది లత.
    "కొనను" మొండిగా అని బయటికి వెళ్ళిపోయాడు రవి.
    కొంచెం సేపు మతిపోయిన దానిలా నిల్చున్న లత మరుక్షణం తన బట్టలన్నీ గబగబ సర్దుకుంది. తనే వెళ్ళి రిక్షా పిలుచుకుచ్చి అందులో కూర్చుని ఏ గొలుసు రవికి ఇయ్యను గాక ఇయ్యనని పట్టుబట్టిందో , ఆ గొలుసు అమ్మేసి టికెట్ కొనుక్కుని రైల్లో కూర్చుంది.

                                                          ---------

    సుడిగాలిలా వచ్చి తన కాళ్ళను అల్లెసుకున్న లతను ఆప్యాయంగా లేవనెత్తి అక్కున జేర్చుకున్నాడు రామచంద్ర.
    తనను ఒక్క మాటయినా అనకుండా ఆదరిస్తున్న భర్తను విస్తుపోయి చూస్తూ అతని గుండెల్లో తలదాచుకుని వెక్కివెక్కి ఏడ్చింది లత.
    "నన్నెందుకు తిట్టరూ? నన్నేమీ అసహ్యించుకోవటం లేదా?" నామీద కోపం పోయిందా!"
    రేగిపోయిన లత ముంగురులను సవరిస్తూ నీళ్ళు నిండిన కనురెప్పల మీద ముద్దు పెట్టుకుంటూ నవ్వాడు రామచంద్ర.
    "వొట్టి పిచ్చిపిల్లని నువ్వు, నీమీద కోపమేమిటి? జాలిపడతాను"
    "అబ్బా!"
    పెళ్ళయ్యాక మొట్టమొదటిసారిగా తనంత తాను అతని భుజాల చుట్టూ చేతులేసి ఆప్యాయంగా, బలంగా అడుముకుంది లత.
    "ఎంత సుఖంగా ఉందీ! ఎంత మూడురాల్ని! ఇలాంటి శాంతిని సంతోషాన్ని కాలదన్నుకుని నన్ను నేనే నిప్పుల కుంపటిలోకి తోసుకున్నాను!"
    లత గడ్డెం పట్టి ముఖ మెత్తి చూశాడు రామచంద్ర. నిర్భరానందం ప్రతిఫలిస్తోన్న అ ముఖం అతని హృదయంలో మోహనరాగాలు పాడింది. తన్మయత్వంతో తన ముఖంలోకి చూస్తోన్న రామచంద్ర పెదవులు చటుక్కున ముద్దు పెట్టుకొని అంతలో అతని గుండెల్లో తల దాచుకుంది లత.
    "కొద్ది రోజుల్లో ఎంత ఎదిగిపోయావు లతా!" ఆప్యాయంగా అన్నాడు రామచంద్ర.
    'అవును....అంతకుముందు ఏం తెలీదు. తెలిశాక ఏ ప్రత్యేకతా తోచలేదు. అ అనుభూతులకు దూర మయ్యాక వాటి నింక జన్మలో పొందలేనేమో నని బెంగ పెట్టుకున్నాక వాటి విలువ అర్ధమయింది. అన్నయ్య నన్ను వెళ్ళనివ్వనన్నాడు. నేనే గోలుసమ్మి వచ్చేశాను."
    "నా లతా!' మరింతగా దగ్గిరికి తీసుకున్నాడు.
    "కానీ.....కానీ....." లత ఆగిపోయింది.   

 Previous Page Next Page