ఏమిటి లతా!"
లత సంకోచంగా రామచంద్ర ముఖంలోకి చూసింది.
"పరవాలేదు చెప్పు. మన మధ్య ఇకమీదుట ఏ అరమరికలూ ఉండకూడదు "
లత తలవంచుకొని దీన స్వరంతో అంది.
"నేను వారిజక్కయ్యంత అందంగా ఉండను. వరిజక్కయ్యకున్నంత తెలివి లేదు.....మరి ...మరి ....వారిజక్కయ్యను ప్రేమించినట్లు నన్ను ప్రేమించగలరా? ఇక మీరు ....మరి"
ఒక్క క్షణం రామచంద్ర ముఖం నల్లబదిపోయింది. అంతలో పేలవంగా నవ్వాడు. లేచి వెళ్ళి పెట్టె తెరిచి బట్టల అడుగున చిన్న దంతం పెట్టెలో దాచిన ఉత్తరం తీసి లత కిచ్చాడు.
తెల్లబోతూ వుత్తరం విప్పింది లత.
నా సామి!
మనసారా పిలుచుకుంటున్నాను మిమ్మల్ని. ఇన్నాళ్లకీ జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్న ఈ క్షణాన ధైర్యంగా ఇలా పిలవగలుగుతున్నాను. ఇలా రాస్తోంటే , ఇలా భావిస్తోంటే నా మనసుకెంత తృప్తిగా ఉందొ , అది ఎలా పురులు విప్పి ఆడుతుందో మీరు ఊహించగలరా? అః ఊహించలేరు. అది నాకొక్క దానికే లభ్యమైన అపురూప వరం.
మీరు మొదటిసారిగా నా జీవితంలోకి వచ్చిన ఆ ప్రభాత సమయం ఆ దివ్యక్షేత్రం ....ఎన్ని వేల జన్మలు తపస్సు చేశానో అలాంటి క్షణం నా జీవితంలోకి రావటానికి! మొత్తం నా జీవితాన్నే వెలిగించే దివ్య ప్రేమ నన్నవరించుకొంది అంతగా ప్రేమించగలిగే హృదయం నాకు ప్రసాదించిన ఆ భగవంతుడెంత దయామయుడు! ఆనాటి నుండి కమ్మని పూల పరిమళాలలో చల్లని వెన్నెల జల్లులలో మెల్లని మలయమారుతాలలో మీ స్మృతే నన్ను సోకి నా హృదయానికి పారవశ్యం కలిగించేది. ఆ సౌఖ్యాన్ని మాటలలో పెట్టగలిగే శక్తి నాకు లేదు. ఈ అనుభూతి నిండించుకున్న నా మనసుకు కారు చీకట్లలోనూ కాంతి రేఖలు కనిపించేవి. చీకాకుల్లోనూ సౌఖ్యం దోబుచులాడేది. ఎంతటి దుఖంలోనూ హృదయంతరాలలో ఏదో ఆనంద వీచిక నిరంతరమూ నన్ను ఊగిస్తూనే వుండేది. ఈఅనుభవం ముందు ఈ అనందం ముందు మిగిలినవన్నీ ఇదివరకు నేను సౌఖ్యాలుగా భావించినవన్నీ తుచ్చాలుగా కనిపించాయి. అన్నిటినీ వదులుకుని, నా నుండే నన్ను వేరు చేసుకొని నాకే సమంగా అర్ధం కాని ఆ అపూర్వ భావనలో నా మనసు లయం చేసుకుని, నా బ్రతుకును అద్భుత గానానికి పల్లవిలా మార్చేసుకున్నాను. ఈ లోకంతో, ఈ బంధాలతో నాకు నిమిత్తం లేదు. మాములు పరిధిలోకి లౌకిక సుఖాలు పొందే అర్హత నాకు లేదు. వాటిని గురించిన ఆలోచనలూ లేవు. కానీ మీ విషయం అలా కాదు. నాలా జీవితం నుండి విసిరివేయబడ్డ వారు కాదు. నిండుగా జీవిస్తూ ఆ జీవితం మీద ఎన్నో ఆశలు , మమతలు పెంచుకున్నారు. అందుకే మీరు సుఖంగా బ్రతకాలని నా మనసు పరితపిస్తోంది. లతను ఆదరిస్తే కాని సుఖం లేదు. నన్ను నమ్మండి. లత కోసం చెప్పలేదు. మీకోసమే చెప్తున్నాను. నాకు తెలిసీన మీ స్వభావాన్ని బట్టి లతతో కలిసి కాక మరే స్త్రీ తోనూ మీరు సుఖంగా జీవించలేరు. లత కాక మరే స్త్రీ మీ పక్కన నిలచినా మీ సున్నిత హృదయానికి ఏదో అపస్వరం ఛాయా మాత్రంగా తోచక మానదు. ఆ అపస్వరం మీ మనసులో వినిపిస్తున్నంత వరకూ మీకు సుఖమనేది ఉండదు.
మిమ్మల్ని వెళ్ళి లతను ప్రాదేయపాడమని అనటం లేదు. ఆ పని మాత్రం చేయకండి. కానీ తప్పకుండా త్వరలోనే అది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆనాడు దాన్ని హృదయ పూర్వకంగా ఆదరించండి. మానవ హృదయాల్లోని నైచ్యపు సారాన్ని చూసి చూసి విసిగిపోయిన నేను మీలో ఔన్నత్యాన్ని వెంటనే గుర్తించగలిగాను. ఆత్మ అనేదాన్ని పొంది కూడా బుద్దిపూర్వకంగా దాన్ని దారుణంగా క్షోభిల్ల చేసుకున్న నేను మిమ్మల్ని ప్రేమించగలగిన క్షణంలోనే ఆత్మార్పణం చేసుకోగలిగాను.
"లత అలా కాదు, అసలు లోకమంటే తెలియనిది. జీవితమంటే అర్ధం కానిది. నానగారి నిర్లక్ష్యము, అమ్మ అనారోగ్యమూ, అన్నయ్య రౌదీతనం వల్ల దానికి మంచీ, చెడ్డా చెప్పేవాళ్ళు కూడా లేకపోయారు. అందుకే అదలా తయారయింది. నాకు తెలుసు అడంబరాలంటే మోజు, డబ్బంటే వ్యామోహం అసలు ప్రేమంటేనే తెలియకపోవటం ఇవన్నీ లతలో ఉన్నాయి. అయినా దాని మనసు పసిపాప మనసులా స్వచ్చమైంది. ఏనాటికైనా దాని మనసుకు చైతన్యం కలిగి మిమ్మల్ని ప్రేమించాగాలిగితే తప్పకుండా మీ జీవితాన్ని సౌఖ్యవంతం చెయ్యగలదు.
"నాకు ఆత్మహత్య ఇష్టం లేదు. ఆత్మహత్యకు సిద్దపదగలిగితే ఏనాడో ఆత్మహత్య చేసుకునేదానిని కానీ, ఇవాళ నా ఇష్టానికి వ్యతిరేకంగా లత కోసం, లత సౌఖ్యం =కోసం ఆత్మహత్య చేసుకుంటున్నాను. మీమీద నాకు గల ప్రేమను నా అనుభవంలో ఉన్నట్టుగా మీరు కాని, లత కాని అర్ధం చేసుకోలేరు. నేను బ్రతికి ఉంటె నా దగ్గరికు రావాలనే ప్రలోభం ఏనాడో ఒకనాడు మిమ్మల్ని వశపరుచుకోవచ్చు. తనకంటే తన భర్త అత్యధికంగా ప్రేమించే మరో స్త్రీ మూర్తి ఉందన్న విషయం లత మనసును కోస్తూనే ఉంటుంది. అందుకే చివరిసారిగా మీకీ ఉత్తరం రాస్తూ --- జీవితంలోంచి నన్ను చుట్టుకున్న విష వలయంలోంచి శాశ్వతంగా సెలవు తీసుకుంటున్నాను. మీకీ ఉత్తరం అందేసరికి నేను బ్రతికి ఉండను. నా అంత్యక్రియలు మీరే జరిపించండి. నాకున్న ఆస్తి ఒక్క మేడ . అది మీకూ లతకూ పుట్టబోయే సంతానానికిచెందాలని విల్లు రాసి రిజిస్టర్ చేయించాను. కాదనకండి.
"ఈ లోకంలో వున్నా, ఏ లోకాలలో వున్నా, ఏ ఆకారంతో నిలిచినా,
సర్వదా మీ
వారిజ......
మొట్టమొదటి సరిగా వారిజను తల్చుకుని, వారిజ కోసం హృదయ పూర్వకంగా కుమిలింది లత.
------సమాప్తం.......