అతి బలహీనంగా వున్న తల్లి శరీరాన్ని , తల్లి ఉద్రేకాన్ని చూసి విస్తుపోయి నిల్చుంది వారిజ. "సమాధానం చెప్పవేం? లత మొగుడి దగ్గర నుంచేనా?"
"అవును" అప్రయత్నంగానే అంది.
"సిగ్గులేనిదానా? ఇంకా ఎందుకు బ్రతికున్నావే . దొరక్క దొరక్క నీకు చెల్లెలి మొగుడే దొరికాడా? నీ ప్రాణానికి పడి అది ఊసురుమని ఏడుస్తోంది. అసలీ ఊరికి ఎందుకు దాపురించావే! నువు బ్రష్టవయినా , అదయినా చల్లగా సంసారం చేసుకుంటుందని తృప్తిగా వున్నాను. దాని బ్రతుకు కూడా బండలు చేశావు కాదే! నీకే పోయేకాలం వచ్చిందే! నీకు చావెందుకు రాదే! ఇవన్ని చూడటానికి నేనెందుకు బ్రతికున్నానే! వారిజా! నీ కాళ్ళ మీద పడతాను లత మొగుడ్ని వదిలెయ్యి. కన్నతల్లిని చేతులు మోడ్చి ప్రాదేయపడుతున్నాను. లత పచ్చని సంసారంలో నిప్పులు పోయ్యకు. నీజెం! ఒకరు పొతే పదిమంది - అభం శుభం తెలియని వెర్రి బాగులది లత - దాన్ని కనికరించు - ఒట్టు పెట్టు వారిజా! ఇంకెప్పుడూ లత మొగుడ్ని చూడనని ఒట్టు పెట్టు" చెయ్యి జాపింది పార్వతి.
కన్నీళ్ళు కరిపోతుండగా ఉద్రేకంతో మాట తడబడుతుండగా , వల్లమాలిన బాధతో గొంతు వణుకుతుండగా కోపంగా, చీదరగా తనను చూస్తోన్న తల్లిని చూస్తూ చిత్తరువులా నిలబడిపోయింది వారిజ.
"మాట్లాడవు కదూ? ఆయనను వదలవు కదూ! అయ్యో! నీ చెల్లెలే! పెద్దదాని వాయినందుకు దాని బాగు చూడవలసింది పోయి నువే దాని బ్రతుకు బుగ్గి చేస్తావా? అ రవిగాడు అలా తయారయ్యాడు నువిలా అయ్యావు. అదోకర్తి చల్లగా సంసారం చేసుకొంటుందని మురిసిపోతున్నానే! కనీసం ఆ తృప్తి కూడా నాకు దక్కనియ్య దలచుకోలేదుటే! వద్దు వారిజా! వద్దు ..జీవచ్చంలా ఉన్న నన్ను ఇంక చిత్రవధ చెయ్యకు ......' అతి నీరసంగా వున్న పార్వతి అంత ఉద్రేకానికి తట్టుకోలేక ఫిట్ వచ్చి పడిపోయింది.
వారిజ తల్లిని రెండు చేతుల్తోనూ లేవనెత్తి యింట్లో మంచం మీద పడుకోబెట్టి వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చింది. పార్వతికి అంత క్రితమే సలపరంగా ఉన్నట్లుంది - అది విష జ్వరంలోకి దింపింది. ఒంటి మీద స్పృహ లేదు. ఒకటే కలవరింతలు...
"లతా! లతా!" అని కొంత సేపు "వారిజ' "లత మొగుడ్ని వాదిలేయ్యి ' అని కొంత సేపు. "వారిజా నువెందుకు చావవే" అని కొంత సేపు.
జ్వరం తీవ్రత హెచ్చిపోతుంది. మల ,మూత్రాదుల దగ్గర్నుంచీ తనే శుభ్రం చేస్తుంది వారిజ. కంటి మీద రెప్ప లేకుండా తల్లిని కాపాడుకుంటుంది. పరిస్థితి రోజురోజుకి విషమించడం చూసి రవికీ, లతకూ రమ్మని రాసింది. ఆ రవి ఒక్కడే వచ్చాడు.
"లత మీ మొహం చూడనంది."
"ఏ కొంచెం వీలుగా వున్నా అమ్మనే తీసుకొచ్చేయ్య మంది ఒక్కటే ఏడుస్తుంది" అని చెప్పాడు. వారిజ విని ఊరుకుంది.
"కొంచెం స్మృతి వచ్చిన పార్వతి రవిని చూసి వికసించిన ముఖంతో "లతేది ? దాన్ని పిలు" అంది.
"అది రాలేదు వారిజ ముఖం చూడనంది. నీకోసం ఏడుస్తుంది" అన్నాడు రవి.
పార్వతి కళ్ళలోంచి నీళ్ళు కాలువలు కట్టాయి. "లతా! లతా!" అనుకుంది బాధగా . క్రమంగా మళ్ళీ కలవరింతల్లోకి దిగింది.
వారిజ మందు గ్లాసులో పోసి నోటి కందిస్తుంటే మళ్ళీ కాస్త తెలివి వచ్చింది పార్వతికి.
"లత - లత రాలేదా? నన్ను పంపించు . లత దగ్గరకు పంపించు" అంది నీరసంగా రొప్పుతూ.
"మందు తాగు" నిదానంగా అంది వారిజ.
"అది రాదు . ఇక్కడికెలా వస్తుంది ? అవును అంత క్షోభ ఎవరు భరించగలరు? ఆ గుండెల్లో కుంపటి అది గనుక సహిస్తోంది . లతా! ఒక్కసారి కనబడమ్మా!"
"మందు తాగమ్మా" మళ్ళీ నిదానంగా అంది వారిజ.
ఆ గ్లాసును విసురుగా పక్కకు నెట్టింది బలహీనపు చేతులతో పార్వతి. గ్లాసు గోడకు కొట్టుకుని మందంతా వొలికిపోయింది . ఒక పాత గుడ్డతో మందంతా తుడిచి , నెమ్మదిగా బయటికి నడవబోయింది వారిజ.
"ఎక్కడికి? ఆ రామచంద్ర దగ్గరకేనా?" ఒపికంతా కూడదీసుకుని అరిచింది పార్వతి. అరిచి సొమ్మసిల్లి వెనక్కు పడిపోయింది.
వారిజ ఆగింది. వెనక్కు వచ్చి పడిపోయిన తల్లిని సమంగా సర్ది పడుకోబెడ్తూ "డాక్టర్ దగ్గరకు" అంది.
"దొంగ అబద్దాలు , దొంగవేషాలు , నాకు తెలుసు. అయన దగ్గరికే! డాక్టర్ అక్కర్లేదు. నాకు మంద క్కర్లేదు. వారిజా! నీకు పుణ్యముంటుంది ఆ రామచంద్రను......."
మళ్ళీ తెలివి తప్పింది పార్వతికి.... వారిజ త్వరగా వెళ్ళి డాక్టరును తీసుకొచ్చింది.
జ్వరం మరింత తీవ్రమౌతోందే కాని తగ్గడం లేదు. డాక్టర్ కూడా పెదవి విరిచాడు.
"వారిజా! లత మొగుణ్ణి .....రామచంద్ర ని ......నువ్వు .....నాకు .....వద్దు.....వదులు" అస్పష్టంగా కలవరిస్తూ , భరింపరాని ద్వేషంతో జుగుప్సతో వారిజను చూస్తూ అశాంతితోనే శాశ్వత నిద్రలోకి జారిపోయింది పార్వతి.
రవి వెక్కి వెక్కి ఏడ్చాడు. వారిజ ఒక మూల స్తంభాన్నానుకుని కూర్చుంది. చాలాసేపు ఏడ్చాక రవి వారిజ దగ్గరకొచ్చాడు.
"వారిజా!"
గాజుకళ్ళలా అయిపోయిన కళ్ళతో శున్యంగా చూసింది వారిజ.
"అమ్మ దహనక్రియలకు డబ్బు కావాలి"
ఏమి అర్ధం కానట్లు చూసింది మళ్ళీ.
"అమ్మ పోయింది. దహనం చేయాలి. డబ్బు కావాలి." విసుగ్గా మళ్ళీ అన్నాడు రవి.
తన రెండు చేతులకి ఉన్న ఒక్కొక్క బంగారు గాజు తీసి రవి చేతుల్లో పడేసి మళ్ళీ అలా కూర్చుండి పోయింది వారిజ. ఆ గాజులు జేబులో వేసుకుని బయటకు నడిచాడు రవి.
---------
"ఏమిటీ తిండి? చింతపండు పచ్చడి, చారు నీళ్ళునా?" కోపంగా అరిచాడు రవి.
"సంతోషించు. ఇవాళ్టికి ఇదయినా వుంది. రేపటి నుంచి అదీ ఉండదు." విసురుగా అంది లత.
హడలిపోయాడు రవి. "నిజంగానా? రేపటికి ఏం లేదా?"
"కాసిని బియ్యం ఉన్నాయి. చెరో పిడికిడు మెతుకులూ వస్తాయి. ఎక్కణ్ణుంచైనా నువ్వు తేకపోతే రేపు పస్తే"
"ఎక్కణ్ణుంఛి తేను? నాకు అప్పెవరిస్తారు?"
"ఏమో! నువ్వే ఆలోచించుకో?" నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది ;లత.
ఆలోచించటం ప్రారంభించాడు రవి. అతని ఆలోచనలకి వారిజ డబ్బుతో కొన్న లత నగలు వచ్చాయి.
"లతా౧ నీ గొలుసిలా ఇయ్యి"
లత రెండు చేతులతోనూ గొలుసు గట్టిగా పట్టుకుంది.
"ఇయ్యను. గొలుసులతో ఆగుతుందా? గొలుసయ్యాక గాజులియ్యమంటావు. అవయ్యాక రింగులు. అన్నీ అయిపోతాయి. ఆ తరువాత....."
లత తార్కిక జ్ఞానం రవి కంతగా రుచించలేదు. "ఆ తరువాత చూసుకోవచ్చు లెద్దు! ముందా గొలుసియ్యి" విసుగ్గా అన్నాడు.
"ఆ చుసేదేదో ఇప్పుడే చూడు. నా ఒంటి మీద నగలు తియ్యను."