Previous Page Next Page 
దావాగ్ని పేజి 38


    నవ్వి, "డోన్ట్ మెన్షన్" అంది సూజీవాంగ్. తర్వాత గోడకి అలంకారంగా తగిలించి వున్న ఒక చైనీస్ ఖడ్గం తీసి ఖస్సున అతని వీపులో దిగేసింది.

 

    గందరగోళంగా ఉన్న ఆ బార్ లో అతని మూలుగు ఎవరికీ వినబడలేదు.

 

    మరోనిమిషంలో కిచెన్ లోంచి వంటవాడు బయటకు వచ్చాడు. అతడి చేతిలో మాంసం కోసే కత్తి వుంది. అతను నైపుణ్యంగా రామనాధం శరీరాన్ని ముక్కలుగా కోయడం మొదలెట్టాడు.   

 

                                                             *    *    *    *

 

    తెలతెలవారుతుండగా, తన బాస్ అయిన బాబూజీ దగ్గరికొచ్చాడు పోతరాజు.

 

    "ఏమిటి?" అన్నాడు బాబూజీ. పోతరాజు వాలకం చూస్తే అతనికి అనుమానం వచ్చింది.

 

    "ప్రొఫెసర్ మాయమైపోయాడు సర్: ఎక్కడ వెదికినా కనబడలేదు."

 

    లేచి, ఛెళ్ళుమని పోతరాజు చెంపమీద కొట్టాడు బాబూజీ.

 

    "బద్ధకం బలిసిపోయిందా రాస్కెల్: నీ కళ్ళముందే బయటికి వెళ్ళిన మనిషి ఎలా మాయమైపోతాడు?"

 

    "అతను రెడ్ డ్రాగన్ బార్ లోకి వెళ్ళాడు సర్: మళ్ళీ బయటకు రాలేదు. లోపల కూడా లేడు."

 

    "నువ్వెళ్ళు" అన్నాడు బాబూజీ.

 

    తర్వాత ఆలోచిస్తూ అటూ ఇటూ పచార్లు చెయ్యడం మొదలుపెట్టాడు.

 

    పదిరోజులు గడిచాయి.

 

    ఆ రోజునుంచి మూడు రోజులపాటు ఇండియా, చిత్రద్వీప్ ల మధ్య దైవపాక్షిక సంబంధాల గురించి చర్చలు మొదలయ్యాయి.

 

    ఆ చర్చలకు స్వయంగా తనే వచ్చాడు జనరల్ భోజా. ఒక స్వతంత్ర దేశాధినేతకు చేసే మర్యాదలన్నీ అతనికి చేసింది భారత ప్రభుత్వం.

 

    కానీ అతిధులు పాటించవలసిన అత్యవసరమయిన మర్యాదలు కూడా పాటించలేదు జనరల్ భోజా.

 

    సాధారణంగా ఇండియాకు వచ్చిన నేతలు రాజ్ ఘాట్ కి వెళ్ళి గాంధీ మహాత్ముడి సమాధి దగ్గర శ్రద్ధాంజలి ఘటించడం పరిపాటి.... అలాగే భారతదేశం నుంచి వి ఐ పి. ఎవరయినా పరాయి దేశాలకువెళ్ళినా అక్కడి మహా పురుషుల స్మృతి చిహ్నాలకు దర్శించి వస్తుంటారు.

 

    రాజ్ ఘాట్ వెళ్ళకుండా ఏదో సాకు చెప్పి తప్పించుకున్నాడు జనరల్ భోజా.

 

    రెండు దేశాల మధ్య చర్చలు మొదలయ్యాయి.

 

    తనకు అలవాటైన పాతపాట మొదలెట్టాడు భోజా. ఇండియా తన సైనిక బలాన్ని చూసుకొని మిడిసి పడుతోంది. పొరుగున వున్న చిన్న దేశాలమీద దాష్టీకం చేస్తోంది. సముద్రంలో అంతర్జాతీయ పరిధులను దాటివచ్చి తమ దేశపు టెరిటోరియల్ వాటర్స్ లో ఇండియన్ నౌకాదళం ప్రవేశిస్తోంది.

 

    ఇంకా ఏమిటీ?

 

    ఇండియాలో వున్న చిత్రద్వీప్ పౌరులకి ఇబ్బందుల్ని కలిగిస్తోంది. భారతప్రభుత్వం.

 

    అలాగే ఇండియా చిత్రద్వీప్ లో స్థిరపడిపోయిన భారతీయ సంతతి వారిని ఇండియాకి పిలిపించేసుకోవాలి.

 

    అలాగే -

 

    దేశద్రోహం నేరంమీద విచారణకుగురి కావలసివుండగా ఇండియాకి పారిపోయి వచ్చి ఇక్కడ శరణార్థిగా ఉంటున్న తన ప్రత్యర్థి జుగ్ నాద్ ని తిరిగి తమకి అప్పగించాలి.

 

    భోజా చర్చలు జరపడానికి రాలేదు చర్చల పేరుతొ ఇండియా మీద అభాండాలు వేయడానికి వచ్చాడు.

 

    సహజంగానే చర్చలు విఫలమయ్యాయి.

 

    దానికి బాధ్యత ఇండియాదే అని తక్షణం ఒక ప్రకటన జారీ చేశాడు భోజా.

 

    ఆ రోజు మధ్యాహ్నం-

 

    చిత్రద్వీప్ రాయబార కార్యాలయం విందు జరిగింది. రాజధానిలో వున్న విదేశీ రాయబారులందరూ దానికి హాజరయ్యారు.

 

    లాన్స్ లో విందు జరుగుతుండగా జరిగింది అది.

 

    చాలా ఎత్తుమీద నుంచి వెళుతున్న విమానం ఒకటి కనబడింది విందు అరగిస్తున్న వాళ్ళకి.

 

    ఉన్నట్లుండి విమానంలోంచి చిన్న నలకలాగా ఏదో కిందపడింది.

 

    కొద్ది క్షణాల తర్వాత ఆ నలక కుక్క గొడుగులాగా కనబడింది.

 

    మరికొద్ది క్షణాల తర్వాత గొడుగులా వున్న దానికింద చిన్న మానవాకారం కనబడింది.

 

    అది పారా ఘాట్ అని అక్కడున్న వాళ్ళు గ్రహించడానికి ఎంతో సేపు పట్టలేదు.

 

    ఆ పారాచూట్ గాల్లో తేలుతూ క్రిందకి వచ్చేస్తోంది.

 Previous Page Next Page