"వెరీగుడ్: తెలివయిన పని చేశారు మీరు" అన్నాడు అభినందిస్తూ.
సంతోషం లేకుండా నవ్వాడు రామనాధం.
"మీకు ప్రామిస్ చేసిన పాతిక లక్షలూ రేపు అందేటట్లు చూస్తాను" అన్నాడు బాబూజీ.
"త్వరలో మీ అమ్మాయికి మంచి కుర్రాడిని చూసి పెళ్ళి చేసేయ్యండి. ఓకే?"
అంగీకార సూచనగా తల తిప్పాడు రామనాధం. తర్వాత తలొంచుకుని అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళిపోయాడు.
రామనాధం వెళ్ళేదాకా వేచి వుండి తర్వాత కార్డ్ లెస్ ఫోన్ చేతిలోకి తీసుకుని "పోతరాజుని పంపండి" అన్నాడు బాబూజీ.
రెండు నిమిషాల తర్వాత వచ్చాడు పోతరాజు.
పోతపోసిన ఇనుప విగ్రహంలా ఉన్నాడతను.
"ఇప్పుడు స్కూటర్ మీద వెళ్ళాడే ప్రొఫెసర్, అతన్ని తెల్లవారే సరికల్లా పైకి పంపెయ్యాలి" అన్నాడు బాబూజి.
నవ్వి, తలపంకించి, వెళ్ళిపోయాడు పోతరాజు.
* * * *
పరధ్యానంగా స్కూటర్ మీద వెళుతున్నాడు రామనాధం. అతనికి మనసంతా దిగులుగా ఉంది. దుఃఖంగా వుంది. పిశాచాలతో నేస్తం కట్టిన వాడిలా ఉంది అతని మనసు.
ఎక్కడయినా ఏకాంత ప్రదేశంలో కూర్చుని బావురుమని ఏడవాలని వుంది.
లేకపోతే తనను తాను మర్చిపోయేంత వరకూ పీకలదాకా తాగెయ్యాలనినుంది.
ఎదురుగా కనబడింది, 'రెడ్ డ్రాగన్' రెస్టారెంట్ అండ్ బార్.
అప్రయత్నంగానే అక్కడ స్కూటర్ ఆపేశాడు రామనాధం.
బార్ లోంచి ఓ మూలగా ఉన్న టేబుల్ వెదుక్కుని కూర్చున్నాడతను.
చేతిలో మెనూ కార్డ్ పట్టుకొని హొయలు వలికిస్తూ వచ్చింది సూజీ వాంగ్. తోకాస్ గర్ల్ ఫ్రెండు. ఆమె ఆ బార్ కి ఓనరు, వెయిట్రిస్ కూడా తనే.
ఆమె పెదవులమీద చిరునవ్వు.
"యస్ ప్లీజ్" అంది.
"ఒక బాటిల్ రమ్ము" అన్నాడు రామనాధం.
రమ్ము తెచ్చింది సూజీవాంగ్.
సున్నితం అంటే ఏమిటో తెలియదు రామనాధానికి. రమ్ము గొంతును కాల్చేస్తున్నా లెక్కచేయకుండా గటగట తాగాడు. ఆ కిక్కు అతని నషాళానికి అంటినట్లయింది.
ఇంకో నాలుగు గుక్కలు తాగేసరికి నాలుక నోట్లోంచి ఊడిపోయి గాల్లో ఎగురుతూ తన ఇష్టారాజ్యంగా ఏదేదో మాట్లాడుతున్నట్లు భ్రాంతి కలిగిందతనికి. తనేం మాట్లాడుతున్నాడో తెలియకుండానే వటవట మాట్లాడటం మొదలెట్టాడు.
"యురేనియం ఎక్కడన్నా ఒక అవున్సు దొరకడమే కష్టం. అలాంటిది ఈ దెయ్యాల దిబ్బలాంటి దేశంలో టన్నులకొద్దీ దొరకబోతుందా? వారెవా? ఏమి ఈ బాబూజీ అదృష్టం" అన్నాడు.
రమ్ములోకి నంజుకోవడానికి జీడిపప్పూ, చిప్సూ తెస్తున్న సూజీవాంగ్ 'యురేనియం' అన్నమాట వినగానే అలర్టుగా అయిపోయి అటూ ఇటూ చూసింది. కష్టమర్సందరూ ఎవరి గొడవల్లో వాళ్ళున్నారు. బాగా తాగేసి ఉండడంవల్ల ఎవరూ రామనాధం గొడవ పట్టించుకోవటంలేదు.
రమ్ము అంత త్వరత్వరగా తాగేయడంవల్ల రామనాధానికి కడుపులో తిప్పడం ప్రారంభించింది.
తూలుతూ లేచి వాష్ బేసిన్ వైపు నడవడం మొదలెట్టాడు.
వెంటనే అతని చెయ్యి పుచ్చుకుంది సూజీవాంగ్ లోపల వైపున వున్న బాత్రూంలోకి తీసికెళ్ళింది. అక్కడ వామిట్ చేసేసుకున్నాడు రామనాధం.
తర్వాత లోపలున్న చిన్న రూంలో అతన్ని కూర్చోబెట్టింది సూజీవాంగ్.
"ఇప్పుడు చెప్పండి ఏమయింది?" అన్నది అనునయంగా.
చెప్పడం ప్రారంభించాడు ప్రొఫెసర్ రామనాధం.
రోడ్డు వెయ్యడం, అక్కడ కంకరరాయి బాబూజీ బానపొట్టను తగలడం, అందులో యురేనియం ఉందని కనిపెట్టడం, యురేనియంతో ఆటంబాంబు ఎలా తయారు చేయవచ్చునో ఆ వివరాలూ, ఇంటర్నేషనల్ బ్లాక్ మార్కెట్ లో యురేనియం ధర - బాబూజీ ఈ విషయం జనరల్ భోజాకి తెలియకూడదనడం - తను రిపోర్టు మార్చి రాయడం.....
అన్నీ:
తెరిచిన నోరు మూయడంమర్చిపోయినట్లు వింటోంది సూజీవాంగ్.
అతను మాట్లాడటం మానేశాక -" ఇక చెప్పవలసిందేమీ లేదా?" అంది సానుభూతిగా.
మత్తుగా తలూపాడు రామనాధం.
"ఓపిగ్గా విన్నందుకు థాంక్స్: నాకిప్పుడు బరువు దించుకున్నట్లు వుంది" అన్నాడు బల్లమీదికి ఒరుగుతూ.