Previous Page Next Page 
మబ్బు విడిపోయింది పేజి 36


    సుమతి పీటవాల్చి "అలా కూచో! నువ్వు చెయ్యవలసిపనులేం లేవులే! నీతో మాట్లాడాలని పిలిచాను" అని అప్పడాలపీట తనే ముందుకు లాక్కుంది.
    కుమార్ పీటమీద కూచుని కుతూహలంగా చూడసాగాడు.
    కుమార్! నేను నీకేదైనా చెపితే, నా మాట మన్నిస్తావా?"
    "అదేమిటమ్మా! నీ మాట ఎప్పుడు కాదన్నాను నేను?"
    "కాదనవని నాకు తెలుసు. కానీ, ఈ అమ్మ నీ మనసుకు కష్టం కలిగిస్తోందని మథనపడతావు. అయినా నాకు చెప్పకతప్పదు."
    "అమ్మా! నీ మాటలు నా మనసు కెప్పుడూ కష్టం కలిగించవు. నువ్వేంచెప్పినా నా మేలుకోరే చెపుతావని నాకు బాగా తెలుసు. చెప్పు-తప్పకుండా వింటాను."
    సుమతి తలవంచుకుని కజ్జికాయల పూర్ణం పెట్టడానికి పూరీ వత్తుతూ తలఎత్తి కుమార్ వంక చూడకుండానే "నువ్వు సరోజతో మాట్లాడటం మానెయ్యాలి!" అంది.
    కొన్ని క్షణాలవరకూ సుమతి తల ఎత్తలేదు. కుమార్ మాట్లాడలేదు. ఆ తరువాత సుమతి తల పై కెత్తి కుమార్ వడిలిన ముఖం చూసి చాలా జాలిపడింది....
    "కుమార్! ఇది చదువుకోవలసిన వయసు. ఈ వయసులో చదువుగురించి తప్ప మరి దేనినిగురించి ఆలోచించకూడదు. అందుకే చెప్తున్నాను."
    తన అన్న తన దగ్గిరకు వచ్చి మాట్లాడిన మాటలు కుమార్ కి చెప్పటానికి మనస్కరించలేదు సుమతికి.
    "అలాగేనమ్మా! ఇంకమీదట సరోజతో మాట్లాడను" అనేసి ఒక్కక్షణం అక్కడ కూచోలేక వెళ్ళిపోయాడు కుమార్.


                                        16


    మురళి ఇంటర్ లో సైన్స్ తీసుకున్నా, డిగ్రీలో కామర్స్ లోకి మారిపోయాడు. రవి మొదటి సంవత్సరం ఫెయిలవటంతో అతని పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. చదువులేదు__ వ్యాపకం లేదు-జల్సాగా తిరగటానికి చేతిలో డబ్బులేదు- దానికితోడు అప్పటివరకూ తనకు స్నేహితుడుగా, తనకు తందానపాడుతూ తన కూడా కూడా తిరిగిన మురళి దర్జాగా సెకండ్ ఇయర్ చదువుతున్నాడు-అంతకుముందు తనంతంటే అంతంటూ తనతోపాటు అల్లర్లు లేవతీసిన వాళ్ళంతా తనను చూడగానే ముఖం తిప్పుకుని పోతున్నారు.  
    మురళి మొదటినుంచీ సాత్వికుడే! తల్లికీ, తండ్రికీ భయపడేవాడే! కానీ కాపీలుకొట్టి వ్రాయటానికి అవకాశమున్నన్ని రోజులూ, అతనికి చదవాలని పించేదికాదు- చదువనేది వొట్టిదండగ వ్యాపారమని పించేది-రవిలాంటివాళ్ళు దేవతల్లాగ కనిపించేవారు__ "అబ్బ, వీళ్ళు ఎంత చక్కగా లెక్చరర్ ని ఎదిరించగలరు? ఎంత బ్రహ్మాండంగా ఎవరినైనా దబాయించగలరు? ఎంత సమర్ధంగా అల్లర్లు లేవదీసి సమ్మెలు నడిపించగలరు" అని ముగ్ధుడయి పోయేవాడు.
    కొత్త వి.సి. వచ్చి పరిస్థితులు చక్కబడ్డాక సహజంగా భయస్థుడయిన మురళి పరీక్షలకు భయపడి శ్రద్ధగా చదువుకోవటం మొదలుపెట్టాడు-అతనికంటి కిప్పుడు రవి దేవతలాగ కనిపించటం లేదు__ రవి కనిపించే సరికల్లా భయంతో హడలిపోతున్నాడు-రవి మురళిని వదిలి పెట్టటంలేదు. ఎలాగో అతను మళ్ళీ మొదటి సంవత్సరంలోనే చేరాడు-ఏదో ఒక సమయంలో మురళిని కలుసుకోకుండా ఉండడు__ఒకరోజు రవి స్వతంత్రంగా మురళి జేబులోంచి పెన్ తీసుకుని "ఇవాళ నా పెన్ తెచ్చుకోలేదు-రాసుకుని ఇస్తాను." అని తన జేబులో పెట్టేసుకున్నాడు-మురళి ఏమీ అనలేక చచ్చినట్లు ఊరుకున్నాడు. సాయంత్రమయి కాలేజి వదిలినా, రవి పెన్ తిరిగి ఇయ్యకపోవటంతో, మురళి "రవీ! నా పెన్ ఇయ్యవా?" అని ప్రాధేయపడుతున్నట్లుగా అడిగాడు.
    రవి మండిపడుతూ "ఏమిటదీ! బోడి పెన్ కింత ఆర్భాటం చేస్తావ్? ఈ పెన్ ఖరీదు పదిరూపాయలు ఉంటుందో, ఉండదో? ఇలాంటి పదులు నీ కోసం ఇదివరకు ఎన్ని ఖర్చు పెట్టలేదు? ఈ పెన్ నాకు కావాలి-నేను ఇయ్యను-" అన్నాడు.
    మురళి ఏం మాట్లాడలేక పోయాడు. రెండు మూడు రోజులు తనకు పెన్ లేనిసంగతి తల్లి దగ్గిర దాచగలిగాడు-కానీ, ఏది వ్రాయవలసివచ్చినా పెన్సిల్ తో వ్రాస్తున్న మురళిని చూసి సత్యవతి కోపంగా "అన్నీ పెన్సిల్ తో ఎందుకు వ్రాస్తావ్? పెన్ తో వ్రాయి అంది.
    "ఇది రఫ్! తరువాత ఫేయిర్ లో పెన్ తో ఎక్కించు కుంటాను" అన్నాడు మురళి.
    సత్యవతి కేదో అనుమానంతోచి "అసలు నీ పెన్ ఎక్కడుందో ఇలా తీసుకురా?" అంది.
    మురళి కొంచెంసేపు వెతికినట్లు నటించి "కనపడటంలేదు__ రేపు వెతుకుతాను-" అన్నాడు.

 Previous Page Next Page