"వీల్లేదు-ఇప్పుడే వెతుకు-మనవి రాజభవనాలు కావు, కనపడకపోవటానికి" అని కసిరింది.
మరి కొంచెంసేపు వెతికినట్లు నటించి "లేదు_పోయింది." అన్నాడు.
ఆ పెన్ ఎప్పుడో పోయిందనీ, మురళి నాటక మాడుతున్నాడనీ అర్ధం చేసుకోవటానికి సత్యవతికి ఎంతోసేపు పట్టలేదు.
"నిజం చెప్పు! ఎన్నాళ్ళయింది పెన్ పారేసుకుని?"
తల్లి కోపానికి భయపడిపోతూ "మూడు రోజులయింది__" అన్నాడు మురళి.
"మూడు రోజులు! మూడు రోజుల్నించీ పెన్ లేకుండా గడుపుతున్నావన్నమాట! పైగా అబద్ధాలు! అబద్ధాలు చెప్పవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఎలా పోయింది పెన్?" తల్లి అబద్దా లాడకూడదని చెప్తుంది- అబద్దాలేతప్ప నిజాలు చెప్పటానికి వీల్లేని ప్రశ్నలు వేస్తుంది.
"నా పెన్....అది రాసుకుని బల్లమీద పెట్టాను. ఎలాగో పోయింది-"
"పెన్ బల్లమీద పెద్డటం ఏమిటీ? వ్రాసుకోగానే, చొక్కా జేబులో, లాగు జేబులో తగిలించుకోరూ? ఈ సారికి మళ్ళీ కొత్త పెన్ కొంటున్నాను-కానీ, ఇప్పుడే చెప్తున్నాను__నువ్విలా రోజుకొక పెన్ పారేస్తే కొత్తది కొనటానికి మనం లక్షాధి కార్లంకాము_ ఈ సారి మళ్ళీ పారేశావంటే నిన్ను చదువు మాన్పించి కూలిపనిలో ప్రవేశ పెట్టేస్తాను- అర్ధమయిందా?"
భయంతో బుద్ధిగా తలఊపాడు మురళి-మురళి మీద ఎంత కోపం వచ్చినా మురళి చదువు పాడుకావటం ఇష్టంలేక కొత్త పెన్ కొంది సత్యవతి-ఆ పెన్ చేతికిస్తూ పుస్తకాలూ, పెన్నులూ పారేసుకోవటానికి వీల్లేదని మరోసారి హెచ్చరించింది-
రవికి ఫ్రెండ్ కాని ఫ్రెండ్ శివ__శివకి చదువేమీలేదు__ అయిదోక్లాసో, ఆరో క్లాసో పాసయ్యాడు__ తెలుగు, ఇంగ్లీషూ, వుర్దూ, కలిపి మాట్లాడతాడు. రవి కుటుంబం గేంబ్లింగ్ నడిపించేటప్పుడు గూండాగా ఆ కుటుంబానికి బాసటగా నిలిచాడు__తరువాత రవినికూడా గూండాగానే అనేకసార్లు ఆదుకున్నాడు__మురళి రవి అండతో టైం అయిపోయినా పేపర్ తీసుకుని పరీక్ష వ్రాస్తున్నప్పుడు ఎందుకైనా మంచిదని శివ అక్కడే ఉన్నాడు-కాలేజిలో ఏవో గ్రూఫ్ ఫైటింగ్స్ జరిగినప్పుడు మురళిని కొట్టినవాళ్ళని రవి ఆజ్ఞతో శివ చావబాదాడు-ఆనాడు దెబ్బలు తగిలిన తన 'శత్రువు'లను చూసి మురళి చాలా ఆనందించాడు.
రవి కుటుంబ పరిస్థితి తలక్రిందు లవటంతో, శివ పరిస్థితి కూడా ఇరుకున పడింది. అతని 'వృత్తి' మూలపడింది-అతణ్ణి ఆదుకునే వాళ్ళెవరూ లేరు_అతనికి వ్యాపకమూలేదు. రెండు రోజులకొకసారి రవికోసం కాలేజికి వచ్చినప్పుడల్లా "హలో! మురళీ సాబ్! హౌ ఆర్ యు?" అని మురళిని కూడా పలకరిస్తూంటాడు శివ. శివను చూడగానే భయంతో వణికిపోతాడు మురళి-అతడు తలుచుకుంటే ఎలా చావ బాదగలడో మురళికి బాగా తెలుసు.
ఒక రోజు శివ లంచ్ అవర్ లో మురళి దగ్గిరకొచ్చి "మురళీ సాబ్! సినిమా చూసి చాలా రోజులయింది__ సినిమాకి పోదామా?" అన్నాడు.
మురళి గుండె ఝల్లుమంది.
"నా దగ్గిర డబ్బులులేవు-" అన్నాడు భయంగా.
"డబ్బు దేముందిసాబ్! ఈ శివ ఉన్నంతవరకు నువ్వు ఫైసకి ఫీకరు పడకు-"
"మా అమ్మ కోప్పడుతుంది!"
గట్టిగా నవ్వాడు శివ.
"అరె అమ్మకుగాని నువ్వు పాపాయివా, బే? అమ్మ! అమ్మేటి అంటాది? సినిమాకు పోయినానని సెప్పలేవుబే! అచ్చా! మేట్నీకి పోదాం! మీ ఆమకు తెలవనే తెలవదు__కాలేజీలో కూసొని ఊ....సదివేస్తన్నావని మురుస్తది."
"అటెండెన్స్ పోతుంది!"
"ఇయ్యన్నీ నాకు సెప్పకు మురళీ! నువ్వు అటెండెన్స్ కి ఫికర్ పడినవ, ఎప్పుడైనా! ఎవడో సెపుతాడులే! నేనే మీ సార్ కి చెప్పి వేయిస్తానులే! నడు! నడు!"
మురళికి మరోమాటకి అవకాశ మియ్యకుండా చెయ్యి పట్టుకుని లాక్కుపోయాడు శివ-రవి నవ్వుకుంటూ కూడా వచ్చాడు.
దారిలో ఒక సెకండ్ హేండ్ పుస్తకాల షాపుదగ్గిర ఆగాడు. శివ-మురళి ఆశ్చర్యపోతూ "నువ్వు పుస్తకాలు కొంటావా?" అన్నాడు.
"కొనను-అమ్ముతాను-మనకి సినిమాకి పైస లెట్లొస్తయి?"