Previous Page Next Page 
మబ్బు విడిపోయింది పేజి 35


    సుమతి ముఖం పాలిపోయింది. అన్న చెప్పదలచుకున్న విషయం అర్ధమయిపోయింది.
    "చూడమ్మా! మా పరిస్థితి నీకు తెలియనిది కాదు. నేనూ, మీ వదినా సరోజమీద ఎన్నో ఆసలు పెట్టుకున్నాం. దానికి ఎంతో మంచి సంబంధం తేవాలని కలలు కంటున్నాం. అఫ్ కోర్స్, జీవితంలో ఎవరి అదృష్టం వాళ్ళదనుకో! అయినా, మన ప్రయత్నం మనం చెయ్యాలిగా! మంజు విషయం నువ్వు ఆరాటపడటం లేదూ? సరోజా కుమార్ కలిసి తిరుగుతున్నట్లు తెలిసింది. చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు. వయసు పొంగులు 'ప్రేమ' అనీ, అదనీ, ఇదనీ ఏదో గొడవచేస్తారు. నువ్వు కాస్త అదుపులో పెట్టాలి!"
    "నువ్వూ వదినా సరోజకి చెప్పకూడదా అన్నయ్యా!"
    "అదీ అయిందమ్మా! చిన్నప్పటినుంచీ దాన్ని ఎంత గారాబంగా పెంచామో నీకూ తెలుసుగా! అది మొండిగా తల్లికి ఎదురు తిరిగిందట! నేను చెపితే అలా ఎదురుతిరగక పోవచ్చును కాని, పూర్తిగా నా మాట వింటుందనీ నమ్మకంలేదు. నిన్ను నచ్చజెప్పమంటున్నది కుమార్ కి, సరోజకి కాదు, సుమతీ! సరోజ భవిష్యత్తు నీ చేతుల్లో ఉందమ్మా!"
    సుమతి రెండుచేతులూ పట్టుకున్నాడు జగన్నాధ్. తన కొడుక్కి కూతుర్నిచ్చి పెళ్ళిచెయ్యటానికి అన్న అంతగా సంకోచిస్తున్నందుకు అభిమానం గాయపడినా, అన్న తన నలా [ప్రాధేయపడుతోంటే కాదనలేకపోయింది సుమతి.
    "అలాగే లే అన్నయ్యా! కుమార్ కి చెపుతానులే! రేపు వాడు బాగా చదువుకుని పెద్ద ఆఫీసరయిన తరువాత నువ్వే వచ్చి "నా కూతుర్ని చేసుకొనమని వాణ్ణి ప్రాధేయపడక పోతావా?" కష్టంగా అంది.
    చెల్లెలికి కుమార్ మీద ఉన్న అభిమానానికి మనసులో మెచ్చుకున్నాడు జగన్నాధ్. నవ్వుతూ "మంచిమాట అన్నావ్! నేను కోరేదీ అదే! ఇప్పుడు చదువులు పూర్తికాకుండానే ప్రేమలూ అవీ ఏమిటి చెప్పు? చదువులు పూర్తయి ఉద్యోగాలలో స్థిరపడ్డాక చూచుకోవచ్చును" అన్నాడు నచ్చజెబుతున్నట్లు.
    సుమతి కాదనలేక పోయింది.
    కుమార్ భోజనం చేసి చదువుకుంటున్నాడు. మామూలు మధ్య తరగతి కుటుంబాల్లో అందరికీ అన్ని గదులుండవు. ఒక పడగ్గదీ, ఒక హాలు ఉంటేనే గొప్ప, హాల్లోనే ఒకవైపు పడక కుర్చీలో కూచుని చంద్రశేఖర్ ఎవరిదో విమర్శన గ్రంథం చదువుకుంటున్నాడు. మంజు మాత్రం హాల్లో తనకి చదువు పొసగదని తలిదండ్రుల పడకగదిలోనే కూచుని చదువుకుంటుంది. కుమార్ తో ఎప్పుడు మాట్లాడాలన్నా సుమతికి అవకాశమే చిక్కటంలేదు. పొద్దున్న వంటపని, తెల్లవారింది మొదలు వంట పూర్తిచేసి అందరికీ భోజనాలు పెట్టి టిఫిన్లు కట్టి పంపేసరికీ టైం అయిపోతుంది. సాయంత్రం చంద్రశేఖర్, పిల్లలు వచ్చిన దగ్గిరనుంచీ, టీలూ, టిఫిన్లూ మొదలు-మళ్ళీ రాత్రి వంట-అదంతా అయ్యేసరికి శ్రద్ధగా చదువుకుంటోన్న కుమార్ ని డిస్టర్బ్ చెయ్యాలనిపించేది కాదు. పుస్తకాల ముందు కూచుని ఏకగ్రీవంగా చదువుకుంటోన్న కుమార్ ని చూస్తూ "వీడికేం? రాజాలాటి బిడ్డ! కేవలం పుట్టుకని ఆధారం చేసుకుని కొందరు వీడిని చిన్నచూపు చూడాలని చూస్తారెందుకూ?" అని మనసులోనే కటకటపడింది.
    కుమార్ దగ్గిరగా వచ్చి "ఏం చదువుతున్నావురా కుమార్? రేపటికి ముఖ్యంగా చదువుకోవలసిన పాఠాలా?" అంది సుమతి.
    కుమార్ చేత ఏదైనా పని చేయించుకోవలసి వచ్చినప్పుడు మాత్రమే సుమతి అలా అడుగుతుంది. ఎప్పుడూ చెప్పే సమాధానమే చెప్పాడు కుమార్.
    "అంతగా రేపటికి చదువుకోవలసినవేం లేవులే! ఏం చెయ్యమంటావో చెప్పు!"
    "మీ కందరికీ కజ్జికాయలు చేద్దామనుకుంటున్నాను. కాస్త మైదాపిండి వత్తి పెడతావా!"
    తెల్లబోయాడు కుమార్. సుమతి అలాంటిపను లెప్పుడూ చెప్పదు. తనకేకాదు. మంజుకీ చెప్పదు. ఎంతపనైనా తనే చేసుకుంటుంది.
    "ఏం కుమార్! అలా చూస్తున్నావ్? మొగపిల్లాడికి ఇలాంటి పనులు చెప్తున్నాను అనా? స్త్రీ పురుషులకు సమాన హక్కులు!" నవ్వింది సుమతి....
    "అబ్బెబ్బే! అదేంకాదు....పద!" అంటూ లేచాడు కుమార్.
    చదువుకొంటున్న కుమార్ ని సుమతి అలా పనికి పిలవటం లెక్చరర్ అయిన చంద్రశేఖర్ కు నచ్చలేదు.
    "పోనీ, నేనురానా నీకు సాయం?" అన్నాడు తను లేస్తూ.
    "మీసాయం నాకు అక్కర్లేదు. మీరు కూచుని చదువుకోండి. నాకు కుమార్ సాయమే కావాలి!" నవ్వుతూ అని లేచి నిలబడిన చంద్రశేఖర్ ని రెండు భుజాలమీద చేతులువేసి కూచోబెట్టింది సుమతి.
    వంటగదిలోకి వచ్చి మరింత ఆశ్చర్యపోయాడు కుమార్. చాలా కొద్దిగా మైదాపిండి తడిపి పెట్టింది సుమతి. అంత కొంచెం పిండికి తనసాయం అడుగుతోందా?

 Previous Page Next Page