Previous Page Next Page 
మహిమ పేజి 32


    వినోద్ నిట్టూర్చాడు. "నిజమేనేమో! ఎంతసేపూ నేనే నష్టపోయాననుకుని సెల్ఫ్ పిటీలో మునిగిపోయాను. ప్రేమరాహిత్యంతో బతుకుతూ, ప్రేమకోసం అలమటిస్తూ, ఆమె వైపు నుంచి ఆలోచించలేదు. అసలు ఇలా ఆలోచించాలన్నదే నాకు తట్టలేదు. మహిమా! నువ్వు ఇంకాస్త ముందు, నీతో ఇంకొంచెం ముందు పరిచయం అయివుంటే... నాకిలా కన్విన్సింగ్ గా చెప్పగలిగే ఓ స్నేహితుడో, స్నేహితురాలో ఉండి ఉంటే... ఇలా ధైర్యం చెప్పి ఉంటే..." విచలితుడై అన్నాడు.
    "సార్, ఒక్క వారం పదిరోజులు మీలో కాస్త మార్పువచ్చి ఆమెను భార్యగా ప్రేమిస్తున్నట్టు ఆమెకు నమ్మకం కలిగించే ప్రయత్నం చెయ్యండి".
    వినోద్ తల ఊపాడు. "థాంక్స్ మహిమా..." అన్నాడు మనస్ఫూర్తిగా.

                                                               *  *  *  *

    ఆరోజు వినోద్ ఇంటికి వెళ్ళేసరికి, గదిలో నైట్ గౌనులో మంచం మీద పడుకుని కనిపించింది సుస్మిత. ఆ టైములో ఆమె అలా పడుకోవడం చూసి, అప్రయత్నంగానే, మూలుగుతున్న ఆమె మీద చెయ్యివేసి "ఏంటి పడుకున్నావు? ఒంట్లో బాగోలేదా?" అని అడిగాడు. ఒళ్ళు కాస్త వెచ్చగా తగిలి, "ఏమిటి జ్వరం వచ్చిందా?" అని అడుగుతున్న భర్తని సుస్మిత నమ్మలేనట్టు చూసింది. "జ్వరం ఉన్నట్టుంది. టాబ్లెట్ వేసుకున్నావా?" మళ్లీ అడిగాడు. విస్తుపోతూ లేదన్నట్టు తల అడ్డంగా తిప్పింది. అతను మెడికల్ కిట్ తీసి "తలనొప్పి, ఒళ్ళునొప్పులు కూడా ఉన్నాయా?" అంటూ అడిగేసరికి తల ఆడించింది. అతను టాబ్లెట్ తీసి, మంచినీళ్ళ గ్లాసు అందించాడు. ఏదో కలలో చూస్తూ మాత్రలు వేసుకుని నీళ్లు తాగింది. "వేడిగా టీ తెమ్మంటానుండు" అన్నాడు. ఆ మాత్రానికే ఆమె కళ్ళలో తడి. చటుక్కున కళ్ళు మూసుకుంది. గదిలోంచి బయటికి వచ్చి, డ్రాయింగ్ రూములో టీ.వి. చూస్తున్న తల్లితో "అమ్మా, సుస్మితకి ఒంట్లో సరిగ్గా లేనట్టుంది. జ్వరం కూడా ఉన్నట్టుంది" అన్నాడు.
    "మధ్యాహ్నం భోజనానికి రమ్మంటే తిననంది. ఏమడిగినా జవాబు చెప్పలేదు. పాలు పంపించాను గదిలోకి. చెప్పకపోతే ఎలా?" అందావిడ.
    "సరితా..." అంటూ పనమ్మాయిని పిలిచి "వేడిగా టీ చేసి అమ్మగారికి ఇచ్చిరా" అన్నాడు. సరిత కాస్త వింతగా చూస్తూ, తల ఊపి వంటింట్లోకి వెళ్లింది. అనసూయ కొడుకువంక ఒకసారి చూసి ఊరుకుంది. ప్రీతి ఘటన తర్వాత వినోద్ ని పలకరించడానికి కూడా అందరూ భయపడేవారు. ఇవాళ కొడుకు భార్య గురించి పట్టించుకోవడం చూసి ఆమెకి ఆశ్చర్యం కలిగింది.
    ఆ రాత్రి టెంపరేచర్ నూరు లోపలే ఉండడం చూసి మరో మాత్ర ఇచ్చి "ఇవ్వాల్టికి బ్రెడ్, పాలు తీసుకో. తగ్గకపోతే రేపు డాక్టర్ ని పిలుస్తా" అన్నాడు. అయోమయంగా చూస్తుండిపోయింది సుస్మిత. కొడుకు రాగానే హోమ్ వర్క్ చేశాడో లేదో కనుక్కుని, డైనింగ్ టేబుల్ దగ్గర కొడుకు సరిగ్గా తింటున్నదీ లేనిదీ గమనించాడు. ఉదయం ఆఫీసుకు వెళుతూ సుస్మితకి ఎలా ఉందో ఆరా తీశాడు.

                                     *  *  *  *

    పది రోజులు గడిచాక... 'మహిమా, ఒక్కసారి రూముకి రా' అని పిలిచాడు వినోద్. అతని మొహం చాలా కళగా, సంతోషంగా, ఎంతో రిలీఫ్ గా కనిపించింది. మహిమ లోపలికి రాగానే లేచి నిల్చుని టేబుల్ మీది స్వీట్ ప్యాకెట్ లోని స్వీట్ తీసి మహిమ నోట్లో పెట్టాడు. "థాంక్స్ మహిమా! నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. రియల్లీ ఐయామ్ గ్రేట్ ఫుల్ యువర్ అడ్వైజ్. మహిమ నీ మాటల్లో మహిమ ఉంది. అక్షరాలా ఆచరణలో పెట్టాను. సుస్మితలో పదిరోజుల్లోనే చాలా మార్పు కనిపించింది. మాటల్లో, చేతల్లో సౌమ్యత, అభిమానం కన్పిస్తోంది. "ఏమిటి పెళ్ళాం మీద అంత ప్రేమ హఠాత్తుగా" అంటూ ముందు ఒకటి రెండుసార్లు వ్యంగ్యంగా ఎత్తిపొడిచింది. 'జరిగింది మర్చిపోదాం నా తప్పు ఒప్పుకుంటున్నాను. ఇంకా ఇలా ఒకరిని ఒకరం ద్వేషించుకుంటూ బతకలేం. కొత్త జీవితం ఆరంభిద్దాం. పాత విషయాలు ఎత్తొద్దు. నీవు సహకరిస్తే మనం ప్రశాంతంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కాపురం చేద్దాం' అని దగ్గర కూర్చుని ప్రశాంతంగా వివరించాను. పదిరోజుల్లో నేను నిజంగానే మారానని నమ్మకం కలిగింది గాబోలు, తనూ భార్యలా నా మీద శ్రద్ధ, ఆసక్తి, అభిమానం కనపరుస్తోంది. ఇద్దరం మామూలుగా మాట్లాడుకుంటున్నాం. మొన్న ఆదివారం బాబుని తీసుకుని సినిమాకి, డిన్నర్ కి వెళ్లాం. ఇంట్లోవాళ్లు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. మహిమా... ఇది నీ చలవ. మా కాపురం చక్కబడింది. మనసు చల్లబడి ప్రశాంతంగా ఉంది" నిజాయితీగా అంతా చెప్పాడు.    
    మహిమ స్వీట్ తీసి చిన్నముక్క అతని నోట్లో పెట్టింది. "కంగ్రాట్స్ సర్... సారీ, భయ్యా! ఈ నమ్మకం ఆమెలో సడలిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఒక్కమాట చెప్పనా? మగవాడు ఇంట్లో దొరకని సుఖం ఎక్కడో దొరుకుతుందన్న భ్రమలో ఇంకో ఆడదాని వెంట పరిగెడతాడు. ఆ పొందులో సుఖం నాలుగు రోజుల ముచ్చట. ఓ పక్క భార్యకి ద్రోహం చేస్తున్న గిల్టీ ఫీలింగు, ఇంట్లో అశాంతి, బయట పరువు పోతుందన్న భయం, పిల్లలుంటే భార్యాభర్తల మధ్య స్పర్ధలతో నలిగిపోయే పిల్లలు... దొరికే ఆనందం కంటే సమస్యలే ఎక్కువ. మన పెళ్ళిలో ఉన్న పవిత్రత, బంధం ఏదో కాని బయట ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా కట్టుకున్న భార్యని, అందులో పిల్లలుంటే ఆ భార్యని వదలడు ఏ మగాడు. బయటి మోజు తీరగానే భార్య దగ్గరికే చేరతాడు. ఎటొచ్చి చెడిపోయేది ఆ రెండో ఆడదే. అటు సమాజం ఆమోదముద్ర దొరకదు. ఈ బంధం శాశ్వతంగా నిలుస్తుందో లేదోనని అనుక్షణం ఆరాటపడుతూ, అందరిచేత ఛీ కొట్టించుకునేది రెండో స్త్రీ. పెళ్ళయిన మగాడితో ప్రేమలో ఇరుక్కున్న స్త్రీ అనుక్షణం అభద్రతా భావంతోనే బతకాలి. ఇద్దరికీ న్యాయం చేయగల మగాడు నూటికి, కోటికి ఉంటాడు. రెండు నావల మీద కాలుపెట్టి ఎన్నాళ్లు నడవగలడు? ఈ సత్యాలన్నీ తెలిసి కూడా అమ్మాయిలు ఉద్యోగాల కోసమో, అవకాశాల కోసమో, డబ్బు కోసమో, గతిలేకో, తెలిసీ తెలియక ప్రేమ అనుకుని... ఇలా కాలు జారుతుంటారు. ఒక మెట్టు జారాం ఎన్ని మెట్లు జారితేనేం అనుకుని కొందరు నిర్లక్ష్యం చేస్తారు. చేసిన తప్పుని సరిదిద్దుకోగలుగుతారు కొందరు. ఈ దేశంలో వివాహముద్ర లేని బంధాలు నిలిచేవి చాలా తక్కువ".

 Previous Page Next Page