Previous Page Next Page 
ఆఖరి పోరాటం పేజి 32


    అదంతా అబద్ధమే. ఆ ప్రదేశం పైకి మామూలు ఇల్లులా కనపడే ఒక సి.బి.ఐ. ప్లేసు. ఇలాంటి అబద్ధం చెప్పడం కోసమే ఆమె ప్రధానమంత్రి నుంచి పర్మిషన్ తీసుకున్నది.

    ఆమె ఆ వార్త వెల్లడి చేసిన అరగంటలోగా ఉగ్రవాదులు ఆ ఇంటిమీద బాంబులతో దాడి జరిపారు. ఆ ఇల్లు నిర్మానుష్యంగా వుంది. అది వేరే సంగతి. ఆవిధంగా చాలా చిన్న ట్రిక్ ద్వారా ఆమె ఎవరివల్ల రహస్యాలు బయటకు పొక్కుతున్నాయో తెలుసుకోగలిగింది.

    కానీ ఆ అరగంటసేపూ చీఫ్ బయటకు ఎవరిద్వారానూ వార్త పంపలేదనీ, ఫోన్ చెయ్యలేదనీ ప్రధానమంత్రి అప్పాయింట్ చేసిన ఆఫీసర్లు ధృవీకరించారు.

    మరి ఈ వార్త అనంతానంతస్వామికి ఎలా తెలిసింది?

    ఏ రుజువులూ లేకుండా చీఫ్ మీద చర్య తీసుకోలేదు. కాబట్టి అతడిని సస్పెండ్ చేయలేదు. క్షణాలమీద అతడి ట్రాన్స్ ఫర్ కి ఉత్తర్వులు ఇవ్వబడ్డాయి.

    అప్పుడే స్వామి ప్రవల్లికని తుడిచిపెట్టమని రామ్ లాల్ కి ఆజ్ఞ ఇచ్చాడు.

    ఆమెతోపాటు విహారిని కూడా.


                      *    *    *


    "రెపోకసారి కిద్వాయ్ గార్డెన్ కి వెళ్దామా?" అని అడిగింది ప్రవల్లిక.

    "ఎందుకు?" అడిగాడు విహారి నవ్వుతూ. "ఏదైనా సి.బి.ఐ. పనా?"

    "కాదు స్వంతపనే- రేపు ద్వాదశి. మర్చిపోయారా?"

    "మర్చిపోలేదు. అందుకే ఈ రాత్రి లోపులో పూర్తి చేయవలసిన పని ఒకటున్నది"- సునాదమాలని తల్చుకుంటూ తనలో తనే అనుకుంటున్నట్టు అన్నాడు.

    "సరే! ఆ పనేదో రాత్రికి పూర్తిచేసుకోండి. రేపు మాత్రం నాతో రావడానికి రెడీగా వుండండి. మీకో మంచివార్త చెపుతాను." నవ్వుతూ అన్నది. చీఫ్ బదిలీతో ఆమె సంతోషంగా వుంది. పేపర్లో స్వామి గురించి వచ్చిన వార్తపట్ల విహారి కూడా సంతోషంగా వున్నాడు.

    "అన్నట్టు ద్వాదశినాడు మీ నాన్నగారు మా ఇంటికి వస్తానన్నట్టున్నారు. అప్పుడు నేను వుండనవసరం లేదా?"

    "అవసరంలేదు మహాశయా! మీరు నాతో రండి. వాళ్ళేం మాట్లాడుకున్నారో తర్వాత విందురు గాన్లెండి."

    "అలాగే."

    "బై- రేపు కలుద్దాం."

    "బై"

    ఈ సంభాషణ జరిగిన పది నిమిషాలకి రామ్ లాల్ టేబిల్ మీద మొత్తం నగరం తాలూకు ట్రాఫిక్ ప్లాన్ వుంది.

    మరుసటిరోజు విహారి, ప్రవల్లిక ఏ దారిగుండా ప్రయాణం చేస్తారన్నది బాణం గుర్తులద్వారా సూచించబడి వుంది. మిషన్ గన్ తో ఏ జంక్షన్ లో కాల్పులు జరపాలి. ఎటుగుండా పారిపోవాలి, అక్కడ ఆగి నెంబరు ప్లేటు మార్చుకోవాలి. అన్న గుర్తులు క్లియర్ గా వేసివున్నాయి, మొదటి కారులో నుంచి జరిగే కాల్పులవల్ల ఒకవేళ ఇద్దరూ మరణించకపోతే, అవతలివైపునుంచి కాల్పులు కొనసాగించడానికి ఎంతమంది కారులో వుండాలి అన్నది వివరంగా అనుచరులకి సూచించాడు రామ్ లాల్.

    ఇటువంటి ప్లాన్ చేయడంలో రామ్ లాల్ కి మించినవాడు లేదు. అందులోనూ పాతకక్షలు కూడా వున్నాయి. ఇన్నాళ్ళూ కేవలం స్వామి అనుజ్ఞ కోసం ఆగాడు. ఇప్పుడిక అతడిని ఆపేవారు లేరు.

    సెకన్లతో సహా జాగ్రత్తగా ప్లాన్ చేసి, మరుసటిరోజు కోసం ఎదురు చూడసాగాడు.


                             14


    "ఇప్పుడు సినిమాకా?" అంది సునాదమాల కళ్ళు పెద్దవిచేసి-" "నీకు నిజంగా మతిపోయింది బామ్మా."

    "టైమెంతయిందనే -తొమ్మిదిన్నరేగా!"

    "అయితే మాత్రం? మరీ సెకెండ్ షో కేమిటి?"

    "నాకు మాత్రం ఏం తెలుసు? 'కిరాయి మొగుడు' ఈ రోజే ఆఖరి రోజట. అదీ ఫాస్ట్ షో టైమ్ దాటాక చెప్పింది పక్కింటి సుబ్బమ్మ. ఇంకో రెండు వారాలైనా ఆడుతుందేమో అనుకున్నాను. మరీ స్లాబ్ సిస్టమ్ వచ్చాక కాస్త కలెక్షన్స్ తగ్గిపోతే తీసేస్తున్నారు."

    "ఇప్పుడు పురాణం విప్పకు. ఆ హాలు కాకపోతే, రేపట్నుంచీ మరో హాలులో ఆడుతుంది."

    "ఆడకపోతే?" ఎదురు ప్రశ్నించింది బామ్మ.

    "ఆడకపోతే పోతుంది" విసుగ్గా అంది మాల- "అది చూడకపోతే కొంపలేం మునిగిపోవు."

    "ఎందుకు మునిగిపోవు? అసలా టైటిల్ లోనే ఏదో గమ్మత్తుంది. చూడకపోతే నాకు వారం రోజులదాకా నిద్దర పట్టదు."

    "అయితే వెళ్ళి చూడు."

    "నువ్వూ రా."

    "నేను సెకండ్ షోలకి రాను. అందులోనూ అటువంటి పిక్చర్లు అసలు చూడను."

    బామ్మ విష్ణువైపు తిరిగి "నువ్వొస్తావా?" అని అడిగింది. వస్తానన్నాడు వాడు. కానీ సందిగ్ధంగా పిన్నివైపు చూసి "ఒక్కదానివీ ఉండగలవా?" అన్నాడు.

    "నాకేం భయం" అంది మాల.

    "తాయెత్తు కట్టాక ధైర్యం వచ్చిందా?"

    "మీరు వెళితే వెళ్ళండి. నా టైమ్ వేస్ట్ చేయకండి,"

    ఇద్దరూ హడావుడిగా తయారై వెళ్ళిపోయారు. మరో గంటసేపు చదువుకుని, నిద్రపోవడానికి ఉపక్రమించింది సునాదమాల.

    అప్పుడైంది వంటింట్లో చప్పుడు.

    ముందు ఆమెకు అనుమానం రాలేదు. లోపల అడుగుల చప్పుడుకి లేచి కూర్చుంది.

    వెనుక గదిలో అప్పుడో దొంగ ఆమె ఉన్న గదిలోకి వచ్చాడు. పెద్ద పెద్ద మీసాలున్నాయి. బుగ్గకి సన్నటి జీర వుంది. మొలలోంచి కత్తి తీసి ఆమె మెడకు ఆన్చి "బీరువా తాళాలు ఎక్కడున్నాయ్?" అని అడిగాడు బొంగురు గొంతుతో! ఒకప్పుడైతే స్పృహతప్పి పడిపోయేది. కానీ ఇప్పుడు ఆమె పెదవుల మీద సన్నగా నవ్వు వెలిసింది. తాయెత్తు పైట చాటున వుంది. దాన్ని కాస్త బయటకొచ్చేలా చేస్తే చాలు. 'అప్పుడీ దొంగ ఎంత వేగంగా ఇక్కడినుంచి పరుగెడ్తాడు?' అనుకుంది.

    ఈ లోపులో వాడు "తొందరగా తాళాల సంగతి చెప్పు" అని దగ్గరకొస్తూ మళ్ళీ బెదిరించాడు. ఆమె అతడిని క్షమిస్తున్నట్టు తేలిగ్గా చూసి భుజం కాస్త విదిలించి, మెడ క్రిందుగా చెయ్యి పోనిచ్చింది. ఆమె జాకెట్ లోపల తాళాలు దాచుకుందేమో అని దొంగ అనుకున్నాడు. కానీ ఆమె హఠాత్తుగా పైట క్రిందనుంచి తాయెత్తు తీసి అతడి కళ్ళముందు ఆడించింది.

    ఆ దొంగ ఒక్కసారిగా సర్వశక్తులూ నశించి, భయం ఆవహించి కృంగిపోయి పిల్లిలా అక్కడనుంచి పరుగెత్తాడేమో అనుకుంది.

    కానీ అటువంటిదేమీ జరగలేదు.

    "తాళాలు, తాళాలు తియ్" అన్నాడు కత్తి మెడమీద ఆనుస్తూ. ఆ విదిలింపుకి ఆమె చెయ్యి గీరుకుంది. మరొక్కసారి తాయెత్తువేపు అతడి మొహంవైపు చూసింది. వాడిలో మార్పేమీలేదు. కాళ్ళవైపు మొహంవైపు చూస్తే పార్టీ మార్చెయ్యడానికి వాడేమీ రాజకీయ నాయకుడు కాదు కదా అంతకన్నా కాస్త మంచి ప్రొఫెషన్ అయిన 'దొంగతనం' అనే వృత్తిలో వున్నవాడు. డబ్బుకోసం మాత్రమే వృత్తి చేపట్టినవాడు.

    తన తాయెత్తు అందర్నీ భయపెట్టినట్టు ఆ దొంగని భయపెట్టడం లేదని అర్ధం అవగానే ఆమె మామూలు సునాదమాల అయిపోయింది. ఒక్క ఉదుటున భయంతో లోపలికి పరిగెత్తింది. దొంగ ఆమె వెంటపడ్డాడు. ఆమె వంటింట్లోకి దూరి తలుపు వేసెయ్యబోయింది. కానీ, వాడి బలం ముందు అవి ఆగలేదు. వాడు కూడా లోపలకు ప్రవేశించాడు. చేటలో బియ్యం వుంటే వాడి మొహంమీద కొట్టింది, టమోటా పళ్ళు పక్కనుంటే విసిరేసింది. కానీ వాడు మీద మీదకు రాసాగాడు. ఆమె జాకెట్ లోనే తాళాలు దాచుకుందన్న అనుమానం నిశ్చయమై పోయింది. కేవలం వృత్తిమీద వుండే గౌరవంవల్ల 'తాళాలు-తాళాలు' అని ఆక్రోశిస్తున్నాడే తప్ప, మరొకడైతే తాళాలకన్నా, ఆ తాళాలుండే స్థానంపట్లే ఈ పాటికి ఎక్కువ మక్కువ చూసి వుండేవాడు.
       
    ఆమె ఎలాగో అతడినుంచి తప్పించుకుని, వంటింట్లోంచి బయటకు పారిపోయి వచ్చి అదే వూపులో ముందు గది తలుపు తీసింది.

    బైట రోడ్డుమీదకు పరుగెత్తబోయేదేగానీ, గుమ్మం దగ్గిర మరో ఆకారం నిలబడి వుంది. ఆమె కెవ్వున అరవబోయి, అది తెలిసిన పోలికలు గలదై వుండడంతో బలవంతాన కేకని ఆపుకుంది.

    ఆ ఆకారం నికుంజ్ విహారిది!

    'రేపు ద్వాదశి. రేపట్లోగా మీరు 'ఐ లవ్యూ' అనకపోతే మీ ఇంటి ఎదురుగా ఉరేసుకుని చచ్చిపోతాను' అంటూ సాయంత్రం నుంచీ ఇంటి ముందు కిళ్లీషాపు దగ్గర నిలబడి వున్న విహారి, ఆ సమయంలో కనబడటం ఆమెకు కొండంత ధైర్యాన్నిచ్చింది. "దొ...దొ...దొంగ" అంది.

    "దొంగని కాదు. విహారిని" అన్నాడు. "మీ ఇంట్లో అకస్మాత్తుగా ఏదో చప్పుళ్ళు అవుతూంటే-" అంటూ వివరించబోయాడు.

    "మీరు దొంగకాదు. లోపల దొంగున్నాడు" అంది అతడిమాటలు తుంచేస్తూ కంగారుగా.

    "దొంగా" అంటూ విహారి వంటింటి లోపలికి దూసుకువెళ్ళాడు. ఆ వెళ్ళడంలో వాడు లోపల ఎక్కడున్నదీ చూసుకోలేదు. వెనుకనుంచి వాడు వచ్చి విసురుగా పొడవబోయాడు. ఆమె కెవ్వున అరిచింది. ఆ అరుపుకి వెనుదిగిరిన విహారి బలంగా వాడి మొహంమీద చరిచాడు. వాడు వెల్లకిలా పడబోయి తమాయించుకుని ముందుకి దూకాడు. రెండు నిమిషాల పాటు భీకర సమరం జరిగింది. చిత్తరువులా నిలబడి చూస్తూండిపోయింది మాల. ఆమెకేం చేయాలో తోచలేదు. ఎంతైనా దొంగ ఇటువంటి విద్యలో ఆరితేరినవాడు. విహారిని ఓవర్ పవర్ చేసి క్రింద పడేసాడు. కత్తి ఎత్తి గుండెల్లో పొడవబోయాడు. అప్పుడే స్పృహలోకి వచ్చినట్టు సునాదమాల ఈ దృశ్యం చూసి కెవ్వున అరుస్తూ ముందుకు పరుగెత్తుకు వచ్చి విహారికి అడ్డుగా నిలబడబోయి, మీదపడబోయింది.

    దొంగ ఈ లోపులో కత్తి దించడం, అది సునాదమాల నడుములోకి దిగిపోవడం ఒకేసారి జరిగాయి.

    తన శరీరంలోకి కత్తి దిగిపోవడాన్ని ప్రత్యక్షంగా చూసింది. క్రిందనున్న విహారి 'నో-నో' అని అరుస్తూ ఆమె నడుము పట్టుకున్నాడు. అప్పటికే జరగవలసిన ఘోరం జరిగిపోయింది. అతడి చెయ్యి ఎర్రగా తడిసిపోయింది. ఆమెను పక్కకు తోసి లేచి కూర్చున్నాడు. ఆమె మూలిగింది.

    తను చేసిన పని హత్యలోకి దిగుతుందని దొంగకూడా వూహించక పోవడంతో భయంతో వణికిపోయాడు. అక్కడినుంచి పరుగెత్తడం సునాదమాల చూసింది.

    ఆమె పరిస్థితి ఆందోళనకరంగా, అగమ్యగోచరంగా తయారైంది. బాధ తెలియడం లేదు. అంతా తిమ్మిరెక్కినట్టుంది. శరీరం స్వాధీనంలో లేదు. కళ్ళనిండా నీళ్లు కమ్ముకోవడంతో విహారి మసక మసగ్గా కనబడుతున్నాడు. ఈ హడావుడిలో దొంగ పారిపోయినట్టున్నాడు. అలికిడి వినిపించడం లేదు. ఆమె కళ్ళు మూసుకుంది. ప్రాణం పోవడం ఇంత తేలిగ్గా వుంటుందా? ఆ బాధలూ, తన కాంప్లెక్సులూ- ఇవేమీ ఇక వుండవా?

    ఊపిరి భారంగా తీసింది.

    కళ్ళు విప్పింది.

    ఆత్రంగా తనవైపే చూస్తున్న విహారి కనబడ్డాడు.

 Previous Page Next Page