Previous Page Next Page 
ఆఖరి పోరాటం పేజి 31


    ఆ సంతోషంలో భక్తిగా స్వామి కాళ్ళకి నమస్కారం పెట్టింది. స్వామి 'నువ్వో' అన్నట్టు తన కాళ్ళవైపు, విహారి మొహంవైపు చూశాడు. వర్ధని కొడుక్కి సైగ చేసింది. విహారి కాస్త తటపటాయించి స్వామికి ప్రణామం చేశాడు. స్వామి చిరునవ్వుతో పరమేశ్వరంవైపు చూశాడు. పరమేశ్వరం గర్వంగా నవ్వేడు.

    స్వామి తాయెత్తు తీశాడు... "మండూక మహత్తువున్న తాయెత్తు ఇది. సాధారణంగా ఎవరికీ ఇవ్వను. నా భక్తురాలి కొడుకువి కాబట్టి నీకు కడతాను" అంటూ కట్టాడు. వర్ధనమ్మ పొంగిపోయింది.

    విహారి జేబులోంచి చిన్న పెట్టె తీశాడు. "మార్జాల పూజ్జచేసి భక్తిగా మీకు సమర్పించుకుందామని తెచ్చాను. భక్తుడి కానుకగా తీసుకోండి" అని అన్నాడు. వేలాది భక్తులు ఇచ్చిన కానుకలు గుట్టలు గుట్టలుగా పడివున్నాయి. స్వామి ఆ కానుక కూడా ఆ గుట్టలోకి జారవిడిచాడు.

    మరోసారి నమస్కరించి తల్లీ కొడుకులు అక్కడనుంచి బయటకు వచ్చారు. వెనుకే ఆగిన పరమేశ్వరం "ఎందుకంత ఖరీదైన మైక్రోఫోన్ అతడికి కట్టారు?" అని అడిగాడు. 'విహారినుంచి తెలుసుకోవలసిన రహస్యాలు మనకి ఏమీలేవుకదా' అని అతడి ఉద్దేశ్యం. స్వామి నవ్వేడు. ".... నువ్వేమో సునాదమాల.... ప్రేమలేఖలు- అంటున్నావు. అక్కడ ప్రవల్లిక ఇతగాడిని ప్రేమిస్తున్నట్టు తోస్తూంది. అసలు విషయం ఏమిటో తెలుసుకుందామని..." అన్నాడు.

    పరమేశ్వరం తలూపి, అక్కడనుండి వెళ్ళిపోయాడు.

    అసలు విషయం నిజానికి అదికాదు.

    స్వామికి అనుమానం వచ్చింది! ఇన్నేళ్ళకాలంలో పరమేశ్వరం వేసిన ఎత్తు ఫెయిల్ అవటమన్నది ఇదే మొదటిసారి. కావాలంటే ప్రధానమంత్రి హత్యలో కూడా నేరస్థుడు తప్పించుకునేలా ప్లాన్ చేయగల సమర్ధుడు పరమేశ్వరం. అటువంటిది ఇంత చిన్న విషయం అమలు జరపటానికి ఇన్ని రోజులు తీసుకోవటం, అందులోనూ విఫలమవటం స్వామికి అనుమానం రావటానికి కారణమైంది. కొడుకుతో కుమ్మక్కు అయి ఉండకపోవచ్చు. కానీ "బంధాలు" పరమేశ్వరాన్ని తటపటాయించేలా చేస్తున్నాయేమో అని అనుమానం కలిగింది.

    అది చాలు.

    తన అనుచరుల్లో ఆ మాత్రపు క్రమశిక్షణా రాహిత్యాన్ని కూడా స్వామి సహించలేడు. తన అనుమానం ఎంతవరకూ నిజమో తెలుసుకోవటానికే విహారికి తాయెత్తు కట్టాడు.

    అయితే, ముద్రణాశాల నుంచి బయటకొచ్చిన రూపాయి నోటు రకరకాలుగా లేబులు మారినట్టు, ఈ తాయెత్తు రకరకాల మెడలు మారుతోందని అతడికి తెలీదు.

    స్వామి అంతఃపురం నుంచి బయటకొచ్చిన విహారి మొదట చేసిన పని ఆ తాయెత్తుని సునాదమాల బామ్మకిచ్చి, ఏం చెయ్యాలో చెప్పటం.

    ఆ తరువాత బామ్మ తాయెత్తుని తీసుకెళ్ళి, కాలేజీనుంచి అప్పుడే ఇంటి కొచ్చిన సునాదమాల మెళ్ళో బలవంతంగా వేయటం జరిగింది. "ఏమిటి బామ్మా ఇదంతా?" అంది చిరాగ్గా సునాదమాల.

    "పురుష భయం నీలో పోవటానికి అద్భుతమైన తాయెత్తే. ఎంతో భక్తితో సేవచేసి నీ కోసం తీసుకొచ్చాను. ఇది మెళ్ళో వేసుకుంటే ఏ పురుషుడికీ నీ వైపు చూసే ధైర్యం ఉండదు."

    సునాదమాల నమ్మలేనట్టు చూసింది. "అవును. నిజం" అంటూ బామ్మ అయిదు నిమిషాలు కన్విన్స్ చేసింది. చివరకు మాల ఒప్పుకుంది.

    నిజంగానే తాయెత్తు అద్భుతంగా పని చేసింది!

    ఆమె తలుపు తీయగానే పోస్టుమేన్ అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు. రోడ్డు చివర్లో కిళ్ళీకొట్టు దగ్గిర ఎప్పుడూ నిలబడి ఆమెని చూసే నారోపాంటు కుర్రవాడు ఆమె కాలేజీకి వెళుతుంటే, అటుచూసి, ఏదో షాక్ తగిలినట్టు మొహం చప్పున తిప్పుకున్నాడు. ఇద్దరు రౌడీల్లా వున్నవాళ్ళు ఆమె నడుస్తూంటే రోడ్డు ప్రక్కన వొద్దిగ్గా నిలబడి, ఆమె దాటివెళ్ళేవరకూ అలాగే వుండిపోయారు. క్లాసులో ఎప్పుడూ ఆమెనే చూస్తూ పాఠం చెప్పే కుర్ర లెక్చరరు అసలామెవైపు చూడలేదు. అంతవరకూ ఎందుకు? ఏమీ తెలియని విష్ణూయే- "ఆంటీ! నిన్ను చూస్తూంటే ఏదో భయంగా వుంది" అన్నాడు. పక్కింటి విశ్వనాధం కూడా ఆమె పాలకోసం వెళితే చప్పున మొహానికి పేపరు అడ్డు పెట్టేసుకున్నాడు. ఆమె చీకట్లో నడిచి వస్తూంటే వెనుకనుంచి సైకిల్ మీద వస్తూ ఆమె మెడలో గొలుసు లాగేసుకుందామనుకున్న దొంగకూడా ఆ తాయెత్తు తగిలేసరికి ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టు అల్లంత దూరంలో పడి, అదే వేగంతో సైకిల్ తీసుకుని కూతవేటు కందనంత దూరం పారిపోయాడు.  

    వరుసగా ఆ రోజు జరిగిన సంఘటనలతో మాలకి తను ధరించిన తాయెత్తుపై నమ్మకం కుదిరింది. 'జేబులో బొమ్మ...జేజేల బొమ్మ' లాటి సైకాలజికల్ ధైర్యం కలిగింది. మనసులోనే బామ్మకి కృతజ్ఞత చెప్పుకుంది.

    జరిగిన సంఘటనల్లో సగం విహారి, బామ్మ కలిసి ఏర్పాటు చేసిన అద్దె (కిరాయి) మనుష్యుల పని ఆమెకు తెలీదు.

    ద్వాదశి రావటానికి ఇంకా నాలుగురోజులు టైముంది.


                       *    *    *


    విహారి తల్లితో కలిసి ఇంటికొచ్చిన ఓ రెండుగంటల తరువాత వివిధ పత్రికలకి ఫోన్ చేశాడు. స్వామి భవంతిలో బాంబు వున్నట్టు తెలిసిందని అధికార స్వరంతో చెప్పి ఫోన్ పెట్టేశాడు. చాలా మండి అది నమ్మలేదు. నమ్మిన ఇద్దరు ముగ్గురు విలేఖరులు హడావుడిగా స్వామి ప్యాలెస్ కు బయల్దేరారు. విహారి కూడా ఇంటినుంచి బయట కొచ్చి, స్వామి మహల్ కి దగ్గిరగా వున్న బూత్ లోంచి ఆయనకు ఫోన్ చేశాడు.

    "స్వామి ప్రస్తుతం కోటి పుష్పార్చనలో వున్నారు. ఎవరితోనూ మాట్లాడరు" అంది సెక్రటరీ అట్నుంచి.

    "విహారి అని చెప్పు. తాయెత్తు గురించి అని చెప్తే పరుగెత్తుకు వస్తాడు" అన్నాడు. అతడు చెప్పినట్టే నిమిషం తరువాత స్వామి లైన్ లోకి వచ్చాడు.

    "ఏమిటి తాయెత్తు అన్నావుట-" అన్నాడు స్వామి. అతడి గొంతులో అనుమానం ధ్వనించింది.

    "మండూక మహత్తుగల 'తాయెత్తు'కి ప్రతిగా మార్జాల మహత్తు గల 'బహుమతి' ఇచ్చాను. ఏం చేశారు స్వామీ?" అని అడిగాడు. ఆ ప్రశ్నకి స్వామి రిలీఫ్ గా ఫీలయ్యాడు. తాయెత్తు సంగతి విహారికి తెలియలేదు అన్న సంతోషంతో, "నాకు రోజుకి వేల సంఖ్యలో బహుమతులు వస్తూ వుంటాయి, విప్పటానికి నా నౌకర్లకి కూడా నాల్రోజులు పడుతుంది" అన్నాడు.

    "నాల్రోజులా? అయ్యో! ఎలా స్వామీ? మరో నాలుగు నిమిషాల్లో అందులో బాంబు పేలుతుంది?"

    "వ్హాట్?"

    "గుట్టలు గుట్టలుగా మీ పక్కన పడివున్న ఆ బహుమతుల్లోంచి నాలుగు నిమిషాల్లో నేనిచ్చిన ప్యాకెట్ బయటకు తీయించండి. లేదా మీరే నాలుగు నిమిషాల్లోగా ఆ ఇంట్లోంచి బయటపడండి. శత్రువుల్ని చంపుకోవటం మన అగ్రిమెంటులో లేదుగా. అందుకే ఫోన్ చేసి చెపుతున్నాను. క్విక్..." అని ఫోన్ పెట్టేసి బయటకొచ్చాడు.

    దూరంగా మహల్ కనపడుతోంది. స్వామి అనుచరులతో సహా బయటకు పరుగెత్తుకొస్తున్నారు. అదే సమయానికి ఇద్దరు ముగ్గురు విలేఖరులు అక్కడికి చేరుకొంటున్నారు. విహారి వరుసగా... రకరకాల కోణాల్లో.... తన చేతిలో కెమేరాని క్లిక్ క్లిక్ మనిపించాడు.

    సరీగ్గా ఇక్కడే విహారి స్కోర్ చేశాడు. ఎవరో అనామకుడి నుంచి ఫోన్ వస్తే పత్రికాఫీసుల్నించి విలేఖరులు వెళ్ళరు. అలాగే వెళ్ళలేదు కూడా! కాని ఇప్పుడు ఆ వార్త నిజమైంది. కేవలం ఇద్దరు ముగ్గురు విలేఖరులు ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడగలిగారు. మిగతా పత్రికలకి ఈ 'బాంబ్ స్క్వేర్' కేవలం వార్త మాత్రమే అయింది. అటువంటి వారికి విహారి ఆ ఫోటోలు అందజేశాడు. సెన్సేషనలిజం కన్నా కావల్సింది ఏముంది? స్పాట్ కి వెళ్ళిన విలేఖరులతో పాటూ వెళ్ళని పత్రికలకు కూడా ఫోటోలు దొరికాయి. అనంతానంతస్వామి పైబట్ట లేకుండా బయటకు వస్తున్న ఫోటో, అనుచరులు పరుగెత్తుకు వస్తూన్న ఫోటో వగైరా, రకరకాల పత్రికల్లో పడ్డాయి. అయితే ఎవరూ చెడుగా వ్రాయలేదు.

    "అనంతానంతస్వామి మహల్లో బాంబు భయం" లాంటి హెడ్డింగులే పెట్టాయి. కానీ జనవాక్య కల్పిత రూమర్ కు పరిధులేముంటాయి? ఏ అమాయకత్వం మీద ఆడుకున్నాడో, ఆ అమాయక ప్రజలే- 'చిన్న బాంబు భయంతో భగవత్స్వ రూపుడయిన స్వామి బయటకు పరుగెత్తుకు రావటమా?' అన్న సంశయం వెలిబుచ్చారు. ఆ వార్త స్వామిని కూడా చేరింది. అప్పుడప్పుడు ఎదురుదెబ్బలు తగిలిన వాడికి పెద్ద విషయం కాదు కానీ, అసలు ఓటమే ఎరుగనివాడు చిన్న ఎదురు తాకిడి తగిలినా సహించలేడు. స్వామి విషయంలో అదే జరిగింది. చాలా చిన్నవాడు అనుకున్న విహారి కంట్లో నలుసులాగా బాధ పెడుతున్నాడు.

    మామూలు సమయాల్లో అయితే ఏం చేసేవాడో కానీ సరిగ్గా అదే సమయంలో రామ్ లాల్ వచ్చి ఒక వార్త చెప్పాడు. "సి.బి.ఐ. చీఫ్ ని ట్రాన్స్ ఫర్ చేయటానికి ప్రయత్నం జరుగుతున్నట్టు వార్త రహస్యంగా తెలిసిం"దని. ఇది వూహించని రెండో దెబ్బ.

    "ఏమైంది?" అన్నాడు స్వామి ఇరిటేటెడ్ గా.

    "నిన్న ప్రవల్లిక ప్రధానమంత్రిని కలుసుకుంది."

    అనంతానంతస్వామి భృకుటి ముడిపడింది. "దాని పర్యవసానమే ఇదంటావా?" అన్నాడు. రామ్ లాల్ మాట్లాడలేదు.

    అనంతానంతస్వామి కొద్దిసేపు ఆలోచించి, తల అడ్డంగా విదిలిస్తూ "లాభంలేదు రామ్ లాల్. వాళ్ళిద్దర్నీ చాలాకాలం ఉపేక్షించాం. ఇక వద్దు" అన్నాడు ఒక నిర్ణయానికి వచ్చినట్టు.

    రామ్ లాల్ తలూపి "రేపట్లోగా పూర్తి చేస్తాను."

    "ఇద్దర్నీ వీలైతే ఒకేసారి చంపు, విడివిడిగా వద్దు."

    రామ్ లాల్ తలూపి అక్కడనుంచి వెళ్ళిపోయాడు. ఎంత పెద్ద నిర్ణయాలైనా ఇంతకన్నా పెద్ద మాటలు జరగవు వారిమధ్య.


                          *    *    *


    ప్రభుత్వం సి.బి.ఐ. చీఫ్ ని ట్రాన్స్ ఫర్ చేసే చర్య ఎందుకు తీసుకోవలసి వచ్చిందో తెలియాలంటే రెండురోజులు వెనక్కి వెళ్ళాలి.

    అప్పటికే పరమేశ్వరం వ్యూహం ప్రకారం దేశంలో పరిస్థితులు నెమ్మదిగా అల్లకల్లోలం అవటం ప్రారంభించాయి. మాజీ కేంద్రమంత్రి ఒకరు, ప్రధానితో విభేదాలు వచ్చిన మంత్రి ఒకరు. ఒకరోజు తేడాతో హత్య చేయబడ్డారు. ప్రధానికి చాలా ఇబ్బందికరమైన స్థితి ఇది. లొసుగులు బయట పెట్టకుండా వారిని అధికార పార్టీయే హత్య చేయించిందని జనం అనుకోవటం తప్పేముంది? ఆ విధంగా స్వామి మొదటి ఎత్తు పూర్తయింది. (విజయదశమికి ఇంకా కొద్దిరోజులే టైముంది.)

    ప్రధానమంత్రి ఈ హత్యల విషయమై సి.బి.ఐ. ఆఫీసర్లతో సమావేశం ఏర్పాటు చేశాడు. మీటింగ్ అయిపోయింతర్వాత ప్రవల్లిక మరికొంచెంసేపు ఆగిపోయింది. డిపార్ట్ మెంట్ రహస్యాలు బైటికి పొక్కడంతో సహా, దేశం త్వరలో ఎదుర్కోబోతున్న పరిస్థితులపట్ల తయారు చేసిన రహస్య నివేదికని కూడా అందజేసింది. ఆయన ఆందోళన చెందాడు. "ఏం చేద్దాం" అని అడిగింది.

    "ముందీ రహస్యాలు బయటకు ఎలా అందుతున్నాయో, వాళ్ళని పట్టుకోవాలి. దీనికి డిపార్ట్ మెంట్ కాకుండా వేరే ఆఫీసర్లని ముగ్గురిని నాకిస్తే..." అంటూ తన ప్లాన్ వివరించింది. అంతా విని ఆయన "గుడ్" అన్నాడు.

    రా (RAW) నుంచి నమ్మకస్తులైన ముగ్గురు ఆఫీసర్లు ఈ పని మీద నియమింపబడ్డారు. తను అనుకున్న పనిని ముందు చీఫ్ తో ప్రారంభించదల్చుకుంది ఆమె.

    హడావుడిగా చీఫ్ దగ్గరకు వెళ్ళి "మన ఆఫీసర్లు ఒక హార్డ్ కోర్ టెర్రరిస్టుని పట్టుకున్నారు సార్. చిన్నపిల్లల కిడ్నాప్ తో సంబంధం వున్న వ్యక్తి అనుకుంటాను" అంటూ, అతడిని ఎక్కడ వుంచి ఇంటరాగేట్ చేస్తున్నారో ఆ ప్రదేశం చెప్పింది.

 Previous Page Next Page