ఆమె మనసంతా అదో రకమైన అనిర్వచనీయమైన అనుభూతికి లోనైంది. చనిపోయేటప్పుడు గుక్కెడు తీర్ధం నోటిలో పోసేవాడు కావాలని ఎందుకంటారో అర్ధమైంది. మనిషికి 'తోడు' అవసరం తెలిసింది. విహారి మీద చెప్పలేనంత అభిమానం కలిగింది. తనమీద తనకే జాలి... అతడి ప్రేమమీద ముప్పిరిగొన్న ఆవేశంతో "ఏమండీ" అంది.
"చెప్పండి" అన్నాడు అతడు- ఆమె తన వాళ్ళకోసం ఏమైనా చెబుతుందేమో అని.
"నేను ఇంతకాలం మీ పట్ల ప్రవర్తించిన విధానానికి క్షమించండి. నా మనసులో మీ పట్ల ప్రేమే వుంది. కానీ దాన్ని చెప్పడానికి అర్ధంలేని భయం ఏదో-" ఆమె ఆగి, ఏం చెప్పాలో తెలియనట్లు వుండిపోయింది.
"....భయం ఏదో?" తలవైపునుంచి ఎవరో ప్రశ్నించారు తరువాత చెప్పమన్నట్టు.
"నాకు మగవాళ్ళంటే భయం, అసహ్యం. కాని మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడే."
"మొదటిసారి అంటే ఎప్పుడు? మీద పడుకున్నప్పుడా?" విహారి అడిగాడు.
ఆమె సమాధానం చెప్పలేదు.
"మరణించే ముందు సిగ్గు అనవసరం. అబద్ధాలు చెప్పకూడదు" తలవైపు నుంచి అన్నారు.
"అవును. మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడే మీరంటే ఇష్టం కలిగింది. కానీ మీరు నా వెనుక పడేసరికి మరింత బిగుసుకుపోయాను. టెలిఫోన్ మిషమీద మీరు నన్ను పలకరిస్తున్నారని తెలుసు. నవ్వేయాలని ప్రయత్నించినప్పుడల్లా ఏడుపొచ్చేది. అది నా..దు...దు...దు..."
"దురదృష్టం" అందించాడు.
"అవును దురదృష్టం, మరణించే ముందు సిగ్గు అనవసరం. అందుకే చెప్తున్నాను 'ఐ లవ్యూ విహారీ! ఐ లవ్యూ!"
"ముచ్చటగా మూడోసారి చెప్పండి-" తలవైపు నుంచి వినబడింది.
"ఐ ల..." అంటూంటే అనుమాన మొచ్చింది ఆమెకు. పక్కన విహారి కొంత మాట్లాడుతుంటే, మరికొన్ని మాటలు తల దగ్గరనుంచి వినబడుతున్నాయేమిటి అనుకుని తలెత్తి చూసింది.
తాపీగా, భోజనానికి కూర్చున్నట్టు కూర్చుని వున్నాడు దొంగ. మొహానికి మీసాలు ప్రస్తుతం లేవు.
డొక్కల్లో గాయం సంగతికూడా మర్చిపోయి ఒక్క ఉదుటున లేచి కూర్చుంది. దొంగ పలకరింపుగా నవ్వేడు.
"నువ్వు...నువ్వు..." అంది.
"కాస్త వేషం మార్చేటప్పటికే గుర్తుపట్టలేకపోయారు మేడమ్. నన్ను 'పద్మాకర్' అంటారు. విహారి స్నేహితుడిని."
ఆమె ఇంకా అయోమయం నుంచి తేరుకోలేదు. కడుపు దగ్గర నొప్పి రాకపోవడంతో తడిమి చూసుకుంది.
"అది టమోటా పండు తాలూకు రసం మాలా!" అన్నాడు విహారి. ఈ లోపులో పద్మాకర్ జేబులోంచి కత్తి తీసి, పొడవగానే అది లోపలికి ఎలా వెళ్ళిపోతుందో డిమాన్ స్ట్రేట్ చేసి చూపించాడు. అప్పటికర్దమైంది తనెంత ఫూలిష్ గా ప్రవర్తించిందో.
"మీరూ?" అంటూ లేవబోయింది. విహారి వారిస్తూ "చూడు మాలా! రేపే ద్వాదశి. నీ మనసులో మాట చెప్పేశావు, మళ్ళీ ఇప్పుడు నువ్వు కాదంటే, మరో ఛాలెంజ్ చేయడానికి టైం కూడా లేదు" అన్నాడు.
"ఇంకా ఎందుకే ఈ బిడియం?" అంది బామ్మ లోపలికి వస్తూ. "-మా రోజుల్లో మాకిలాంటి సిగ్గులూ, భయాలూ లేవు బాబూ! మనసులో ఏముంటే అదే ఏదోరకంగా చెప్పేసేవాళ్ళం. డైరక్టుగా కుదరకపోతే ఇన్ డైరెక్ట్ గా-"
"నిజంగా అంకుల్ ని ప్రేమిస్తున్నట్టయితే ఇప్పుడు నువ్వు చేతుల్లో మొహం దాచుకుని ఇక్కణ్నుంచి పరుగెత్తాలి ఆంటీ-" అని సలహా ఇచ్చాడు విష్ణు.
సునాదమాల అలాగే పరుగెత్తింది.
* * *
"ఈ రోజు ఏమిటి హుషారుగా వున్నారు?" అంది ప్రవల్లిక.
విహారి జవాబు చెప్పలేదు. నవ్వి వూరుకున్నాడు. కారు వెళుతోంది.
"చెప్పకూడదా ఏమిటి?"
"చాలా రోజుల్నుంచీ ఫోన్ లో ఏడిపిస్తున్న అమ్మాయి నిన్న బయటపడింది."
ఆమె నవ్వాపుకుని "కరెక్ట్ గా కనుక్కున్నారే?" అంది. "అయితే మనమింక కిద్వాయ్ గార్డెన్స్ వెళ్ళే అవస..." ఆమె మాటలు పూర్తికాకుండానే అతడు "అరె?" అన్నాడు.
"ఏమైంది?"
"పెట్రోలు... అసల్లేదు" అంటూ పక్కన బంకులోకి స్టీరింగ్ తిప్పేడు.
"ఈ రోజు ద్వాదశి కదూ!" అందామె రోడ్డువైపు చూస్తూ.
"అవును. ఏం?"
"మరి ఈ రోజే ఈ పులి వేషాలు వేశారేమిటి?" అంది.
"విజయదశమి వస్తూంది కదా. రిహార్సల్స్ వేస్తున్నారేమో?" దూరంగా క్యూవైపు చూస్తూ అన్నాడు. రోడ్డుకి ఒక పక్కగా చిన్న పిల్లలు 'అయ్యవారికి చాలు అయిదు వరహాలు' అని పాడుకుంటూ వస్తున్నారు.
"పల్లెల్లో తప్ప చూడమే ఇలాంటి దృశ్యం."
"జీతాలు రాని టీచర్లు ఎవరో ఏర్పాటుచేసి వుంటారు" నవ్వేడు. "...అందుకే దశమినాడు చెయ్యవలసింది ద్వాదశినాడే ప్రారంభించారు" జేబులోంచి వందనోటు తీసి బంకు కుర్రవాడికి ఇస్తూ "ఇరవై లీటర్లు" అన్నాడు.
"హాయ్!" అని పక్కనుంచి వినిపించింది. మోటారుసైకిల్ మీద పద్మాకర్ "ఎక్కడికీ ప్రొద్దున్నే బయలుదేరారు?"
విహారి సమాధానం చెబుతుండగా దూరంగా ఒక కారు ఆగింది. నల్ల అద్దం కాస్త క్రిందికి దిగింది. అందులో A-5 వున్నాడు. వాకీ-టాకీలో పెట్రోలు బంకు దగ్గర విహారి వాళ్ళ కారు ఆగినట్టు రామ్ లాల్ కి చెప్పాడు. "అంతకన్నా మంచి అవకాశం రాదు. గో ఎ హెడ్" అవతల్నించి సూచన వచ్చింది.
పక్క జంక్షన్ లో మరో కారుని రెడీచేసి వుంచాడు రామ్ లాల్.
ఈ లోపులో A-5 మెషిన్ గన్ సరిచూసుకుని కారుని పెట్రోల్ బంక్ దగ్గరగా తీసుకువెళ్ళమన్నాడు.
"అయ్యవారికి చాలు అయిదు వరహాలు..." పిల్లలు పాడుకుంటూ రోడ్ క్రాస్ చేస్తున్నారు.
విహారి కారు దిగి, చక్రాల్లో గాలి చూసుకున్నాడు. పద్మాకర్ దూరంగా మోటార్ సైకిల్ కి గాలి కొట్టిస్తున్నాడు.
విహారి కారు దిగడంతో A-5 డ్రైవర్ కి సైగ చేశాడు. ఇటువంటి హత్యలు చేయడంలో అతడు ప్రొఫెషనల్. అందువల్లనే రామ్ లాల్ అతన్ని నియమించాడు. ఎప్పుడు ఎలా అటాక్ చేయాలో అతడికి బాగా తెలుసు. ప్రత్యర్ధులు ఇద్దరున్నప్పుడు ఇద్దరూ దగ్గరగా వున్నప్పుడు కాల్చడం మంచిది. ఒకే రేంజిలో సరిపోతుంది.
డ్రైవర్ బంక్ పక్కగా తీసుకొచ్చి కారు ఆపాడు.
ఒక హిప్పీ కుర్రాడు జేబులోంచి సిగరెట పాకెట్ తీసి, దూరంనుంచి బంక్ వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. "పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు" అంటూ పిల్లలు ఇటువైపు వస్తున్నారు.
"సాయంత్రం కలుస్తావా?" పద్మాకర్ అడిగాడు.
"సాయంత్రం ఏమో....తనే పనిమీద తీసుకెళ్తూందో తెలీదు. వచ్చేసరికి ఎంతవుతుందో ఏమో?"
"సరదాగా నాటకాలేసుకుంటూ- ఈ పిల్లల్లాగా పాడుకుంటూ తిరిగేవాళ్ళం. ఉన్నట్టుండి నీకింత దేశభక్తి, సి.బి.ఐ. భక్తీ పుట్టుకొచ్చినదేమిట్రా?"
'ముందే చెప్పాను కదా. ప్రతివాడు మానసికంగా ఎప్పుడో ఒకప్పుడు మెచ్యూర్ అవుతాడనీ, ఆ అమ్మాయిని చూడు ఇంత చిన్న వయసులో ఎంత బలవంతమయిన శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతోందో? దసరా అంటే అదేగా. ఒక స్త్రీ శక్తిగా మారి రాక్షసుడ్ని చంపడం-" విహారి ఇంకా ఏదో చెప్పబోతుంటే, "అయిపోయింది సార్" అన్నాడు మోటార్ సైకిల్ కి గాలి కొట్టడం పూర్తిచేసిన కుర్రాడు.
"వెళ్ళొస్తా గురూ" పద్మాకర్ మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు.
విహారి కారు దగ్గరికి వచ్చి డ్రైవింగ్ డోర్ తెరిచాడు.
పక్క సీట్ లో ప్రవల్లిక వుంది.
ఇద్దరూ ఒకే రేంజిలోకి రాగానే A-5 డ్రైవర్ కి సైగ చేశాడు. కారు నెమ్మదిగా బయల్దేరింది. విహారి వంగి లోపల కూర్చోబోతున్నాడు.
మిషన్ గన్ పేలడం ప్రారంభించింది. ముందు బంక్ తాలూకు అద్దాలు ఫెళ ఫెళ విరిగిపోయాయి. ఒక సరళరేఖ గీచినట్లు గుళ్ళ గుర్తులు పడుతున్నాయి, అయితే, అదే సమయానికి బంక్ కుర్రవాడు చిల్లర ఇవ్వడానికి డోర్ దగ్గరగా వచ్చాడు. అతడి శరీరం క్షణాల్లో జల్లెడలా మారి, రక్తం జివ్వున చిమ్మింది. మరో రెండు గుళ్ళు పెట్రోలు ట్యూబ్ కి తగిలాయి. మెయిన్ కంట్రోల్ ఆఫ్ చెయ్యకపోవడంతో పెట్రోలు ఫౌంటెన్ లా బయటకు రాసాగింది. చుట్టూ వున్న జనానికి ఏం జరిగిందో తెలిసే లోపులో ఈ దారుణం జరిగిపోయింది.
మొదట చప్పుడు వినబడగానే ప్రవల్లిక ఆ విషయం గ్రహించి, కారు స్టార్టు చేసింది. ఇటువంటి ఆకస్మిక చర్యలకు వెంటనే రియాక్ట్ అవడం సి.బి.ఐ. ట్రైనింగ్ లో చెపుతారు.
విహారి కారు తలుపు బలంగా వేశాడు.
ఈ లోపులో A-5 కారు వేగం పుంజుకుంది. జీవితంలో మొట్టమొదటిసారి యిలా జరగడంతో ఆ టెర్రరిస్టు- రామ్ లాల్ కి ఏం సమాధానం చెప్పాలా అన్న భయంతో వున్నాడు.
ఇక్కడ పెట్రోలు బంక్ దగ్గర పద్మాకర్ కూడా అకస్మాత్తుగా పేలిన మిషన్ గన్ చప్పుళ్ళకి స్థాణువయ్యాడు. ఒక గుండు చెవి పక్కగా దూసుకుపోయింది. మరొకటి ఎయిర్ ఫిల్లర్ కి తగిలింది. అతడు మోటార్ సైకిల్ ని వదిలేశాడు.
ఇంత గొడవ జరుగుతున్నా ట్రాఫిక్ వేగంగా వెళ్తూనే వుంది. బంక్ యజమాని, బంక్ దగ్గరున్న మోటారిస్టులు మాత్రం భయంతో అరుస్తున్నారు. సిగరెట వెలిగిస్తున్న హిప్పీ మీద పడింది పద్మాకర్ దృష్టి.
ట్యూబ్ నుంచి ధారగా కారి, రోడ్డు వైపు మడుగు కట్తూంది పెట్రోలు. అటువేపే వస్తున్నారు పిల్లలు దసరా పండుగ ఉత్సాహంతో పాటలు పాడుకుంటూ.
పద్మాకర్ పరుగెత్తడం ప్రారంభించాడు. పడిపోయిన మోటార్ సైకిల్ ని మధ్యలో వున్న బంక్ కుర్రాడి శవాన్ని చూసుకోలేదు. ఒక స్లో మోషన్ పిక్చర్ లోలా అతడు హిప్పీని చేరుకోవడం. అతడి చేతిలోంచి నేలమీదకు జారుతున్న అగ్గిపుల్లను మధ్యలో పట్టుకోవడం, ఒకేసారి జరిగిపోయాయి.
ఈ లోపులో జనానికి జరిగింది అంతా తెలిసింది. అందరూ దూరంగా పరుగెత్తారు. అంతా హడావుడిగా తయారయింది. పద్మాకర్ అదే వూపులో వెళ్ళి ఫిల్లర్ ఆపుచేశాడు. పెట్రోలు ప్రవాహం ఆగిపోయింది. ఎవరో ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేసారు.
ట్రాఫిక్ జామ్ అయింది. బంక్ చుట్టూ జనం వలయంలా వున్నారు. పెట్రోల్ నెమ్మదిగా గాలిలోకి ఆవిరి అవుతోంది. దూరంనుంచి ఏ మాత్రం చిన్న అగ్ని తగిలినా మొత్తం పేలిపోతుంది. అయినా జనం దూరంనుంచి చూస్తూనే వున్నారు. యజమానికి పిచ్చెక్కినట్టుంది. ఇదేమీ పట్టనట్టు యుద్ధభూమిలో సైనికుడిలా పరుగెత్తుకుంటూ పద్మాకర్ ఫిల్లర్ నుంచి వాటర్ టాంకర్ దగ్గరకు వెళ్ళాడు. లారీలకు, కార్లకు నింపుకునే నీళ్ళున్నాయి. దాని అడుగు గొట్టం విప్పాడు. అప్పటికి స్పృహలోకి వచ్చినట్టు ఇద్దరు ముగ్గురు సాయం చేసారు. ఎలాగైతేనేం నీళ్ళు ప్రవహించడం మొదలుపెట్టి, పెట్రోలులో కలిసి దూరంగా వెళ్ళసాగాయి. పెట్రోలు నీళ్ళలో కలిసినా మండే స్వభావాన్ని కోల్పోదు. కానీ బంక్ నుంచి దూరంగా వెళ్తోంది. జనం కూడా ఆటోమాటిక్ గా దూరంగా వెళ్లారు. అదీ కావల్సింది.
అయిదు నిమిషాల్లో అక్కడ స్థితి యధావిధి అయింది.