Home » Yandamuri veerendranath » సంపూర్ణ ప్రేమాయణం


    ఆ క్షణం ఆమె భయాన్ని చూసి ఈ డబ్బున్న అమ్మాయి ఎంత పిరికిది_ అనుకున్నాడు. ఆ తరువాత ప్రసాదరావుతో నాటకం ప్రారంభమయ్యాక మొదటిసారి ట్రయిన్ లో ఆమెని కలుసుకున్నాడు. ఎంత గొడవ జరుగుతున్నా, ఆమె పట్టించుకోకపోవటంతో ఈ అమ్మాయికి పొగరు_ అన్న నిర్ధారణ కొచ్చాడు. కానీ ఆమెతో పరిచయమయ్యాక అతడికి- మనిషి బాహ్యస్వరూపానికి అంతరంగానికీ సంబంధం ఉందని అర్ధమైంది. పిరికి- బిడియం- పొగరు- గాంభీర్యం.... వీటిమధ్య తేడా లోతుగా వెళితే తప్ప కనుక్కోవటం సాధ్యం కాదని నిరూపణ అయింది. 

    భోజనం పూర్తయ్యాక అతడు లేచి, "నేనిక వెళతాను" అన్నాడు. అతడా క్రితంరోజే తన అవుట్ హౌస్ లోకి వెళ్ళిపోయాడు. ఆమె ఇంకా కొంతకాలం వుండమంది కానీ, అతడు వినలేదు. అసలిలా భోజనం చెయ్యటమే అతడికి నామోషీగా వుంది.

    అతడు గుమ్మం దగ్గరికి వెళుతూంటే "వేణు!" అని పిలిచింది. అతడు ఆగేడు.

    "అదోలా వున్నావేం?"

    "ఎలా వున్నాను?"

    "ఉన్నట్టుండి మూడ్ పోయిన వాడిలా."

    వేణు బలవంతంగా నవ్వు తెచ్చుకొని, "ఏం లేదే!" అన్నాడు. ఆమె ఏదో అనబోయి వూరుకుంది. అతడు తన గదికి వెళ్ళిపోయాడు.

    బయట గాలి మరింత ఉధృతమైంది.

    చెట్లకొమ్మలు వికృతంగా నాట్యం చేస్తున్నట్టు వూగుతున్నాయి. చిన్న పిల్లవాడు ఏడుస్తున్నట్టు వస్తూంది ధ్వని. తలుపులన్నీ వేసినా కూడా గాలి లోపలికి తోసుకు వస్తూంది.

    రగ్గు కప్పుకుని పడుకున్నా చలి ఆగటంలేదు. అలాగే ముడుచుకుని చాలాసేపు పడుకున్నాడు.

    అకస్మాత్తుగా అతడికి మెలకువ వచ్చింది.

    దిగ్గున లేచి కూర్చున్నాడు.

    బయట వాతావరణం ప్రశాంతంగా వుంది.

    లైటువేసి వాచీ చూసుకున్నాడు. పన్నెండున్నర అయింది. తలుపు తెరుచుకుని బయటకు వచ్చాడు.

    వర్షం వెలిసి చాలాసేపు అయినట్టు గచ్చుమీద తడి ఆరుతూంది. గాలి కూడా లేదు. ఉత్తర దిక్కున మాత్రం నల్లటి మేఘం పొడుచుకు వస్తూంది.

    ఎదురుగా పెద్ద భవంతి మసక చీకటిలో మత్తుగా నిద్ర పోతున్నట్టు వుంది. చీకటి, దానిమీద దుప్పటిలా కప్పేసింది. ఎక్కడా అలికిడి లేదు.

    అయినా ఏదో జరగబోతూందని అతడి మనసు చెపుతూంది.

    తను ఆ ఇంట్లోకి వెళ్ళాలి.

    మళ్ళీ ఈ తరుణం రాదు.

    ఇన్నాళ్ళుగా, ఇన్నాళ్ళుగా చేస్తున్న ప్రయత్నం ఒక కొలిక్కి రాబోతూంది. ప్రసాదరావుకి తను చేసిన వాగ్దానం నెరవేర్చుకోబోతున్నాడు.

    అతడి మనసులో ఏ భావమూ స్పష్టంగా లేదు. అర్దరాత్రి నిశ్శబ్దంగా శతృశిబిరంలో ప్రవేసించి ఊచకోత కోయడానికి సిద్ద్హాడ్పడుతూన్న వీర సైనికుడి మనసులో వుండే ఉద్వేగం తప్ప మరేదీలేదు.

    ప్రేమ కాదంటుందన్న అపనమ్మకం అతడికి ఎన్నడూ లేదు. కాలు విరిగిన క్షణంలోనే చేరువకొచ్చిన ఆమె, ఈ మూడునెలల్లో మరింత దగ్గిరకొచ్చింది. బహుశా తను ఏ విధమయిన చొరవా తీసుకోకపోవటంవల్లనే ఆమె అంత ధైర్యంగా తనతో ప్రవర్తించగలుగుతుందేమో!

    ఎదురుగా వున్న భవంతికేసి అతడు మళ్ళీ ఒక్కసారి చూసేడు. కాలింగ్ బెల్ నొక్కి లోపలికి వెళ్ళగలిగే చొరవ అతడికి ఆ ఇంటిలో ఎప్పుడయినా వుంది. కానీ ఇంత రాత్రి ఏ కారణం చెప్పి ఆ ఇంటిలో ప్రవేశిస్తాడు?

    అతడు నిరాశ చెందటంలేదు. ఈ అర్దరాత్రి ఏదో ఒక చిన్న విషయం. ఊహించనిది జరిగి, ఆ ఇంట్లో లైటు వెలుగుతుందని అతడికీ బలంగా అనిపిస్తూంది. దీనికి లాజిక్ ఏదీలేదు. తను చేయబోయే పనికి దీనికీ లంకె వేసుకున్నాడు. ఒక పెద్ద కార్యం నెరవేర్చబోయే ముందు చాలామంది ఆ కార్యానికీ మరో సంఘటనకీ జతకూర్చి ఆ మరో సంఘటన అనుకున్నట్టు జరగటంతో అది శుభ సూచకం అని సంతృప్తి పడతారు. మరీ సెంటిమెంటున్న వాళ్ళయితే, టాస్ వేసుకుని ఒక నిర్ణయానికి వస్తారు. ఈ విధంగా అతడు, తాను చేయబోతూన్న ఈ ముఖ్యమైన పనికి ముహూర్తం ఇదా- కాదా అని నిర్ణయించుకోవటానికి- తాను లోపలికి ప్రవేశించటానికి వీలు కలిగించే సంఘటన ఏదయినా జరగటాన్ని శకునంగా పెట్టుకున్నాడు.

    నెమ్మదిగా ఒక గాలితెమ్మర అలలాగా వచ్చి వెళ్ళిపోయింది. అప్పటివరకూ నిశ్శబ్దంగా వున్న కీచురాయి, అప్పుడే నిద్ర మేల్కొన్నట్టు అరవటం ప్రారంభించింది. చంద్రుడు మబ్బుచాటు నుంచి బయటకు రావటంతో వెన్నెల ఆ పరిసరాల మీద వలలాగా పడింది. ఆ స్తబ్దతని చెదురుస్తూ టెలిఫోన్ మ్రోగింది. చుట్టూ పరిసరాలన్నీ నిశ్శబ్దంగా వుండటంతో భవంతిలోంచి వస్తున్న టెలిఫోన్ శబ్దం స్పుటంగా వినబడుతుంది. ఇంత రాత్రిపూట ఫోన్ చేసేదెవరా- అనుకున్నాడు. బహుశ జగపతిరావు కూతురి క్షేమం (ఈ వర్షం రాత్రి) కనుక్కోవటానికి చేస్తున్నాడేమో- అన్న ఆలోచన వచ్చి నవ్వుకున్నాడు.

    అతడి అంచనా తప్పు అన్నట్లు ఆ భవంతి వెనుకవైపు తలుపు తెరుచుకుని నౌఖరు బ్యాటరీలైటుతో ఇటే రాసాగాడు. గుమ్మం దగ్గర నిలబడ్డ ప్రేమ ఆకారం అస్పష్టంగా కనిపించసాగింది.

    అతడు ఎదురెళ్ళాడు.

    "మీకు ఫోన్ బాబూ."

    ఇంత అర్దరాత్రిపూట తనకి ఫోన్ చేసేదెవరా- అని ఆశ్చర్యపడుతూ అతడు వెళ్ళి ఫోన్ అందుకోబోతుండగా వెనుకనుంచి ప్రేమ "ఫ్యాక్టరీ నుంచి వచ్చింది. వర్షానికి లేబర్ కాలనీలో కొన్ని ఇళ్ళు కూలిపోయినవట" అంది.

    వేణు_ "హల్లో" అంటూ అట్నుంచి వినపడిన కంఠాన్ని గుర్తించి ఉలిక్కిపడ్డాడు.

    అది ప్రసాదరావుది.

    "కంగారుపడకు. నేనే.... నువ్వేమీ చెప్పకు. ఫ్యాక్టరీనుంచి ఫోన్ అని అబద్ధం చెప్పాను. నువ్వూ అలానే చెప్పు. పోతే ఇంతకీ ఈ ఫోన్ ఎందుకు చేసానా- అనుకుంటున్నావ్ కదూ? ఈ రోజు మన ప్లాన్ కి క్లయిమాక్స్ అని చెప్పావ్. అందుకే ఏం జరుగుతుందా అని బైనాక్యులర్స్ వేసుకుని ఇలా కిటికీలో కూర్చుని వున్నాను. నువ్వు భోజనం చేసి నీ అవుట్ హవుస్ కి వెళ్ళిపోవటంతో నీ ప్లాన్ ఏమిటా- అని ఆలోచించసాగాను. అర్దరాత్రి తలుపు తీసుకుని నువ్వు గుమ్మం దగ్గిర ఏమీ తోచనట్టు నిలబడి వుండడం చూసి, ఆ ఇంటిలోకి ఎలా ప్రవేశించాలా- అని తటపటాయిస్తున్నావని గ్రహించాను. నిన్ను ఆ ఇంటిలోకి రప్పించటం కోసం ఇళ్ళు కూలిపోయాయి. ఆ విషయం నీకు చెప్పాలి- అని పిలవమన్నాను. గో ఎ హెడ్ మై బోయ్. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఇంట్లో అమ్మాయి వంటరిగా వుంది. బైట రాత్రి చలిగా వుంది. మళ్ళీ రేపు జగపతిరావు వచ్చేస్తాడు." 

    వేణు వినటంలేదు. ప్రసాదరావు కంఠం అట్నుంచి వినపడగానే అతడు విస్మయంతో తల మునకలయ్యాడు. అర్దరాత్రి ఈ వర్షంలో, ఈ చలిలో అతడి కిటికీ పక్కన అలా కదలకుండా కూర్చుని, జారే వర్షపు చినుకుల మధ్యనుంచి ఈ ఇంటివైపు చూస్తున్నాడన్న ఆలోచనే అతడి వళ్ళు జలదరించేలా చేసింది. కర్తవ్యం, పట్టుదల వున్న మనుషుల్ని చాలా మందిని అతడు చూసేడు కానీ ఇంతలా ఒక లక్ష్యం (అది పగేకానీ మరేదైనా కానీ) పెట్టుకుని, దాన్ని సాధించడం కోసం రాత్రింబవళ్ళు కష్టపడే వాళ్ళని అతడిప్పుడే చూస్తున్నాడు. అసలా ఫోన్ తీగల్లోంచి అతడికి అవతలివైపు నుంచి స్ఫూర్తి అందుతూ వున్నట్టుంది. అలాటివాడి క్రిందపని చెయ్యడం కూడా అపూర్వావకాశమే!

    "మీరేమీ కంగారుపడకండి. అంతా అనుకున్నట్లే జరుగుతుంది" అన్నాడు- వింటున్న ప్రేమకు అనుమానం రాకుండా.

    "ఇలా నేను ఫోన్ చెయ్యడం నీకు విసుగ్గానూ, కోపంగానూ లేదుగా?"

    "లేదు. మీరు చెయ్యడమే మంచిదయింది."

    "లోపలికి రావటానికి సాయపడిందన్నమాట.... చూసేవా! నేను ఆ ఇంటిలోనే వుండమంటే తొందరపడి అవుట్ హవుస్ కి వచ్చేసేవ్."

    "అవన్నీ రేప్రొద్దున్న మాట్లాడుకుంటే బావుంటుందేమో!" తన వైపే చూస్తున్న ప్రేమవైపు చూపు మరల్చి అన్నాడు.

    "అవున్లే.... నా కంగారు నాది? రేప్రొద్దున్నే ఎదురుచూస్తూంటాను మంచి వార్తతో రావాలి సుమా...." ఫోన్ కట్ అయింది. అతడివైపే ఆత్రంగా చూస్తున్న ప్రేమ- "ఎలా వుందట పరిస్థితి?" అని అడిగింది.

    "కొద్దిగా వుందంటే దాన్ని పెద్దది చేస్తారు. ఏమీ ఫర్లేదట.... రేప్రొద్దున్న మాట్లాడదామని అన్నాను."

    ప్రేమ మాట్లాడలేదు.

    "ఇంత చిన్న విషయానికి పని కట్టుకుని అర్దరాత్రి పూట ఎందుకు ఫోన్ చేశారో?" అన్నాడు.

    "ఇళ్ళు వర్షానికి కూలిపోయి, అర్దరాత్రి ఆ కుటుంబాలు వీధినపడితే అది చిన్న విషయమా? మన కార్మికుల సంగతి మనకి కాకపోతే ఇంకెవరికి ఫోన్ చేస్తారు?"

    వేణు గతుక్కుమని_ "నిజమే! అందుకే రేపు సెటిల్ చేస్తాను" అన్నాడు.

    "మనం వెళ్ళి చూద్దామా?"

    "ఇంత వర్షంలో అంత దూరమా? మధ్యలో కారు సెల్ నీళ్ళలో ఆగిపోతుంది."

    "పోనీ ఈ రాత్రికి వాళ్ళని మన గెస్ట్ హౌస్ లో వుండమనలేకపోయావా?"

    ఈ ముసలాడు ఎంత గొడవ తెచ్చి పెట్టాడ్రాబాబూ- అనుకున్నాడు "అదంతా వాళ్ళు చూసుకుంటారు. సూచనలు ఇచ్చానుగా" అన్నాడు సమాధానపరుస్తున్నట్టు.

    "సూచనలా.... నువ్వేం మాట్లాడలేదుగా ఫోనులో."

    "అదే....వాళ్ళు చెపుతుంటే 'ఊ' అన్నానుగా. "సరే- అలాగే చెయ్యండి" అని దాని అర్ధం_ అన్నమాట."

    ప్రేమ మాట్లాడలేదు.

    "అన్నట్టు నువ్వు నిద్రపోలేదా?" మాట మారుస్తూ అడిగాడు వేణు.

    "ఉహూ? వర్షం అంటే నాకెంతో ఇష్టం. కిటికీలోంచి అలా చూస్తూ కూర్చుంటాను. వర్షం కురిసిన రాత్రి ఎంతబావుంటుందో తెలుసా? మన మొక్కళ్ళమే మెలకువగా వుంటాము. టప్ టప్ మని శబ్దం.... దూరంనుంచే ఎవరో సంకేతం పంపుతున్నట్టు సన్నటి శబ్దంతో గాలి! దాగుడుమూతలు ఆడుకుంటున్నట్టూ కాసేపువచ్చి మళ్ళీ ఆగిపోయే చినుకులు...." ఏదో సుషుప్తావస్థలో వున్నట్టు ఆమె మాట్లాడుకుంటూ పోతూంది. కారణం తెలీదుకాని అతడికెందుకో భయం వేసింది. ఆమె మాట్లాడుతూనే వుంది.

    "అలా వర్షాన్ని చూస్తుంటే మనసెంత ఒంటరి అనిపిస్తుంది. మనసూ ప్రకృతీ మూగగా మాట్లాడుకుంటున్నాయా అనిపిస్తుంది! అప్పుడు నాకెవరు గుర్తొస్తారో తెలుసా?"

    "ఎవరు?"

    "నవ్వకూడదు సుమా!"

    "నవ్వను."

    "....గురుదత్."

    దూరంగా ఉరిమింది. ఆమెతో సామీప్యం పెరిగేకొద్దీ, ముడుచుకుని వున్న కమలం క్రమక్రమంగా విచ్చుకుంటూ కొత్త అందాల్ని సంతరించుకున్నట్టూ వుంది.

    గురుదత్ అంటే ఎవరో అతడికి తెలీదు. బాల్యమంతా కాళ్ళమీద నిలబడటంకోసం, ఆ తరువాత పెద్దయ్యాక చెల్లెలికోసం, పగలు మిషన్ల మధ్యా, రాత్రిళ్ళు హరికెన్ లాంతరు ముందూ గడిపినవాడు అతడు.

    చెల్లెలు గుర్తురాగానే కర్తవ్యం గుర్తొచ్చింది. మానసికంగా ప్రిపేర్ అవుతూవుంటే ఆమె అన్నది- "అన్నట్టూ నువ్వూ బైటే నిలబడి వున్నావు కదూ?"

    "అవును, నాకు నిద్రపట్టలేదు. నువ్వన్నట్టు మనసు ఒంటరి."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra