Previous Page Next Page 
సంపూర్ణ ప్రేమాయణం పేజి 30


    ప్రసాదరావు అంతగా సంతృప్తి చెందనట్టు, "మన గూండాలయితే కారు కదలటానికి వీలు లేకుండా పాడుచేసి వుండేవారు. ఆ అర్దరాత్రి నగరానికి తిరిగి నడిచివెళ్ళే సాహసం చేయలేక మీరు రోడ్డు పక్కనే వున్న ఆ "మొటెల్" లో గది తీసుకుని వుండేవారు. కేవలం ఒకే గది ఖాళీ వుండేటట్టు మిగతావన్నీ అందుకే నేను బుక్ చేసి వుంచేసేను.... ఒంటరి గది.... జరిగిన సంఘటన కలిగించిన భయం....పక్కనే ధైర్యం చూపించిన అబ్బాయి.... ఇంతకన్నా ఇంకేం కావాలి? అంతా అయిపోయేది" అన్నాడు దిగులుగా.

    వేణు నవ్వాడు. "ఇప్పుడు మాత్రం అవలేదని మీరెందుకు అనుకుంటున్నారు?"

    ప్రసాదరావు మొహం వెయ్యి కాండిల్ బల్బులా వెలిగింది. "ఏమిటి?" అన్నాడు కుర్చీలోంచి ఒక్కసారిగా లేస్తూ.

    "కంగారుపడకండి. మీరనుకున్నంత ఏమీ జరుగలేదు కానీ, మరీ బొత్తిగా నిరాశపడ నవసరం కూడా లేదు" అంటూ ఆ రోజు జరిగింది చెప్పాడు.


                                                       *    *    *    *


    కారు దిగిన తరువాత, హోటల్ లోపలి వరకూ వెళ్ళటానికి కూడా అతడు చాలా కష్టపడవలసి వచ్చింది. ఇద్దరూ చెరోవైపూ సాయపడగా అతడు అతి కష్టంమీద రూమ్ చేరుకోగలిగాడు. ఆ లోపులోనే ప్రేమ డాక్టర్ కి ఫోన్ చేసింది_

    డాక్టర్ వచ్చి, మొబైల్ ఎక్స్ రేతో ఎముక విరిగిందని నిర్దారణ చేసి కట్టుకట్టి వెళ్ళిపోయాడు.

    ఇదంతా జరిగేసరికి ఒంటిగంట అయింది. అప్పటివరకూ ఆమె మౌనంగా, నిశ్శబ్దంగా వుండటాన్ని అతను గమనించాడు.

    "ఏం అలా వున్నావ్?" అని అడిగాడు.

    ఆమె తెప్పరిల్లి, "ఇదంతా అసలు కలో నిజమో నాకు అర్ధం కావటంలేదు. నువ్వు వాళ్ళనలా అడ్డుకోకపోతే ఏం జరిగివుండేదా అని తల్చుకుంటూంటే నా వళ్ళు గగుర్పొడుస్తూంది" అంది.

    అప్పటికి అర్దరాత్రి దాటింది.

    ఆమె సోఫాలో కూర్చోవడం గమనించి, "ఫర్లేదులే ప్రేమా ఇక నేను పడుకుంటాను. నువ్వు నీ గదికి వెళ్ళు" అన్నాడు. "ఉహూ- నేను ఇక్కడే పడుకుంటాను."

    ఆ సమాధానానికి అతడు ఒక్క ఉదుటున లేచి కూర్చోబోయి, కాలు నొప్పి పెట్టడంతో ఆ ప్రయత్నం విరమించుకుని, "మీ నాన్నగారికి తెలిసిందంటే నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు" అన్నాడు.

    "ఎందుకు?" అందామె అమాయకంగా.

    అతడా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా, "నీ గదిలోకి వెళ్ళి పడుకోవటానికి భయమా?" అన్నాడు.

    "భయమా! భయం ఎందుకు?" అని దగ్గిరగా వస్తూ- "ఏ అర్ధరాత్రో నీకు నొప్పివస్తే ఎవరు చూస్తారు?" అంది.

    ఆమె మామూలుగానే అన్నా- ఎందుకో తెలీదుకానీ, అతడి కంటిలో సన్నటి నీటిపొర ఏర్పడింది. అతడి పాతికేళ్ళ జీవితంలో అతడిపట్ల ఆ మాత్రం ఆప్యాయత చూపించిన వాళ్ళు ఎవరూ లేరు. చెల్లి అతడికెప్పుడూ చిన్నపిల్లే. తన మనసులో సంచలనాన్ని కప్పి పుచ్చుకుంటూ, "అదేమిటి ప్రేమా? ప్రక్కనే ఫోన్ వుంది.... రిసెప్షన్ వుంది. పిలిస్తే క్షణాలమీద వస్తారు" అన్నాడు.

    ఆమె అతడి దగ్గిరగా వచ్చి, "వాళ్ళు రావటమూ- నేను వుండటమూ ఒకటేనా! ఇదేనా స్నేహం అంటే...." అంది.

    ఆమె అంత సూటిగా అడిగేసరికి అతడు తడబడి, "కానీ...." అన్నాడు.

    ఆమె అతడి చేతిమీద చెయ్యివేసి, "నిజమైన స్నేహితుల మధ్య ఇలాంటి మొహమాటాలు వుండకూడదు" అంది.

    అతడు ఆ చేతిని చప్పున దగ్గిరకు లాక్కున్నాడు. ఆ హఠాత్ చర్యకి ఆమె అతడి పక్కలో కూర్చోవలసి వచ్చింది. ఆమె లేచే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు.

    "ప్రేమా....నేనెలా చెప్పను?" నేను....నేను....నిన్ను" అతడికి ఆపైన మాట రాలేదు.

    ఆమె అతడి నుదుటిపైన పడిన జుట్టుని వెనక్కితోస్తూ "కామ్ గా పడుకో" అంది.

    "ప్రేమా__ఐ__ఐ__ఐలవ్యూ ప్రేమా!"

    ఆమె వంగి, అతడి నుదుటిమీద సుతారంగా ముద్దు పెట్టుకుంటూ, "ఎగ్జయిట్ అవకు. నిద్రపో" అంది.


                      *    *    *    *


    "య్యాయ్యా!" అని అరిచాడు ప్రసాదరావు.

    అంత వయసున్నవాడు చిన్నపిల్లాడిలా చేతులు గాలిలో విసుర్తూ అల్లరి చెయ్యటం గమ్మత్తుగా వుంది. అతడంత ఆనందంగా వుండటం వేణు ఎప్పుడూ చూడలేదు. 
   
    "కంగ్రాచ్యులేషన్సోయ్! మూడు నెలలపాటు టైము వృధా అయిందని కంగారుపడ్డాను__ చాలా సాధించావ్. అయినా, ఇంత సాధించానని నాతో చెప్పలేదేం?"

    "ఏదీ ప్రేమ వదిలిపెడ్తేగా? అవుట్ హవుస్ నుంచి ఇంటిలోకి మార్పించింది. ఒక నర్సుని నియమించింది. వూల్లో కెళ్ళా పెద్ద డాక్టరుని రోజుకి రెండుసార్లు వచ్చి చూసేలా ఏర్పాటుచేసింది. నాకు అర్ధం కానిది ఒకటే.... ఆమెకు నా మీద ఎందుకు అంత శ్రద్ధ?"

    "అదేనోయ్ ప్రేమంటే...." అన్నాడు ప్రసాదరావు.

    "చిన్న కాలు విరుగుడికి ఇంత ఆర్భాటమా?"

    "ఇటీజ్ లవ్."

    "నాలో ఏముందనీ అంత ప్రత్యేకత?"

    "ప్రేమకి కావల్సింది ఏ ప్రత్యేకత లేకపోవటమేనయ్యా! ఏదో ఒక ప్రత్యేకత వుంటే అది ప్రేమ అవదు. ఆకర్షణ అవుతుంది. అయినా ఈ ప్రపంచంలో ప్రేమకు కూడా ఏదో ఒక ప్రత్యేకత అర్హత అయితే ఇంతమంది ప్రేమించేవారు కాదు- ప్రేమింపబడేవారు కాదు. ఇంతకీ ఆ ముసలోడు ఏమంటున్నాడు?"

    "ఎవరు? జగపతిరావా! అతడు పెద్దగా పట్టించుకొనటం లేదు. నేను గోవానుంచి సంతకం చేయించి తీసుకొచ్చిన కాంట్రాక్టుతో లక్షలు ఆర్జించబోతున్నాడు. అతడా హడావుడిలో వున్నాడు."

    "అతడికి నీ మీదనుంచి అభిప్రాయం ఏర్పడటం కూడా ఒకందుకు మనకి లాభమేలే. అతడి ఇంటిలోనే మన పథకం పూర్తి చెయ్యవచ్చు."

    "ఇంకెంతకాలం అతడింట్లో వుండను? లేచి తిరగటం ప్రారంభించి అప్పుడే వారంరోజులు కావొస్తూంది. ఈ రోజు వెళ్ళిపోతున్నాను."

    "వాళ్ళు నీ పట్ల 'ఇంకా నీ ఇంటికి వెళ్ళవేం?' అన్నట్టు ప్రవర్తిస్తున్నారా?"

    "అబ్బెబ్బె! అటువంటిదేమీ లేదు. బహుశా ఆయనకూడా కూతురి మనసు తెలుసుకున్నట్టున్నాడు."

    "థాంక్ గాడ్! అయినా నీ పట్ల వ్యతిరేకత ఏమీ కనబడలేదా?"

    "లేదు. కానీ మనం అప్పుడే ఒక నిర్ణయానికి రావటంకూడా కరెక్టు కాదు. బహుశా కూతురు చెప్పందే తను బయటపడటం ఎందుకు అని కూడా అనుకుని వుండొచ్చు. లేదా కూతురు ఇటువంటివాడిని ఎందుకు ప్రేమిస్తుందిలే అన్న ధీమా అయినా అయివుండొచ్చు."

    "ప్రేమ అంటే గుర్తొచ్చింది. మీ ప్రేమలో ఈ మూణ్నెల్లల్లో నీ ప్రేమ నీకెంత దగ్గిరగా వచ్చింది?"

    వేణు నవ్వాడు. "అటువంటి రహస్యాలు అడక్కూడదు."

    "బిజినెస్ లో పార్ట్నర్స్ దగ్గిర రహస్యాలు వుండకూడదు."

    "చాలా దగ్గిరగా వచ్చేసినట్టే, ఇక నాదే ఆలస్యం" అన్నాడు వేణు. అతడి కళ్ళముందు ఈ మూడు నెలల్లో జరిగిన సంఘటనలు గిర్రున తిరిగినయ్.

    "మరి ఆలస్యం దేనికి?" అని అడిగాడు ప్రసాదరావు.

    "మీ కసలు ఈ విషయాల గురించి ఏమీ తెలిసినట్టు లేదు. సంస్కారం వున్న ఏ ఆడపిల్లా అంత తొందరపడదు. మీ రెంత కృత్రిమమైన పరిస్థితులు కల్పించినా సరే! ఒక వైపునుంచి నెమ్మదిగా నరుక్కుంటూ రావాలి. అందుకే యింతకాలం ఆగాను" వేణు చెప్పుకుపోతున్నాడేగాని, జాగ్రత్తగా గమనిస్తే అతడి మొహంలో మరో భావం కనపడేది. ఆ భావమేదో రెండురోజుల తరువాతకానీ ప్రసాదరావుకి అర్ధంకాలేదు.

    "గుడ్_గుడ్_గుడ్. ఇక నేను తొందరపెట్టను. నీ ఇష్టం వచ్చినంత టైమ్ తీసుకో...."

    "ఇంకెంతో టైమ్ కూడా ఆఖ్కర్లేదు. రెండు మూడు రోజులు. అంతే."

    "ఆ ముహూర్తం ఏమిటి?"

    "మొదటి కారణం రేపు రాత్రి నుంచీ జగపతిరావు వూళ్ళో వుండడు."

    "అతడీ రోజే వెళ్ళిపోతున్నాడుగా?"

    "కానీ బంగాళాఖాతంలో వాయుగుండం రేపటికిగానీ ఉధృతమవదుగా?"

    ప్రసాదరావు సన్నని విజిల్ వేసి,

    "ఓ.కే. మై బోయ్! బెస్ట్ ఆఫ్ లక్" అన్నాడు.


                                                                   6


    బంగాళాఖాతంలో వాయుగుండం ఉధృతమై అప్పటికి ఇరవై నాలుగు గంటలు దాటింది. వర్షం ఏనుగు తొండాల్తో పోసినట్లు కురుస్తూంది. కొద్దిసేపు వర్షం ఆగితే చలిగాలి భవనాన్ని లేపేసేటంత వేగంగా వీస్తూంది. సాయంత్రం ఆరయ్యేసరికి అర్ధరాత్రి అనిపించేటంతగా చీకట్లు అలుముకున్నాయి. నగరం అప్పుడే నిద్రకి ఉపక్రమించిందా అన్నట్టు రోడ్లు నిర్మానుష్యమయ్యాయి.

    కిటికీ తలుపులన్నీ వేసుకున్నా చలి లోపలికి ప్రవేశిస్తూనే వుంది. బయట ఈదురుగాలి చప్పుడు, వెదురుబొంగుల మధ్యనుంచి వెళుతున్నట్టు వినపడుతూంది.

    ఆ చప్పుడుని వింటూ మౌనంగా భోంచేస్తున్నారు వాళ్ళిద్దరూ. వంటవాడు వాళ్ళకి కావల్సినవి వడ్డిస్తున్నాడు.

    "నాన్నగారు కంగారుపడుతూ వుంటారు" అంది ప్రేమ నిశ్శబ్దాన్ని చీలుస్తూ.

    "ఎందుకు? కూతురు ఒక్కతే ఇంట్లో ఎలా వుందో ఏమో అనా?"

    ప్రేమ నవ్వింది. " ఆ భయం లేదులే. నువ్వున్నావుగా ఆయన కంగారుపడేది ఈ తుఫానుకి ఫ్యాక్టరీ ఏమవుతుందా_అని."

    "ఆయన మరీ అంత డబ్బుమనిషి అని నేను అనుకోను"

    "మొన్న మనం గోవాలో పూర్తి చేసుకొచ్చిన కాంట్రాక్టు విషయంలో ఆయన నిన్ను చాలా మెచ్చుకుంటున్నారు తెలుసా? చాలా తెలివిగా అవతలి పార్టీని బుట్టలో పడేసి సంపాదించావట! ఆ సలహా ఇవ్వటంలో నా భాగంకూడా వుందని కొంచెం క్రెడిట్ నేను కూడా కొట్టేసాను అనుకో. అది వేరే సంగతి. ఈసారి నుంచీ ఏ కాంట్రాక్టు వ్రాయవలసి వచ్చినా నిన్నే పంపిస్తారేమో!"

    "సలహా ఇవ్వటానికి నువ్వూ వస్తానంటే నాకు అభ్యంతరంలేదు."

    "ఆహాఁ_అలాగేం?" అంటూ నవ్వింది. వేణు ఆమెవైపు కన్నార్పకుండా ఓ క్షణం చూసేడు. ఆ అమ్మాయిలో ఉండే గొప్పతనం ఏమిటంటే- అందరితూనూ రిజర్వ్ డ్ గానూ, గంభీరంగానూ వుండి, పరిచయం పెరిగేకొద్దీ ఆ బిడియాన్ని సడలించుకుంటుంది. అందరి దగ్గిరా మౌనంగా వుండే అమ్మాయి మన దగ్గరొక్క దగ్గిరే తృళ్ళుతూ నవ్వుతూ వుండే ఆ కొత్తదనం మన ఒక్కరికే దక్కిందన్న భావం ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది. అది ప్రేమే కానక్కరలేదు, స్నేహమైనా చాలు.

    అతడికి ఆమెని కలిసిన మొదటి క్షణం గుర్తొచ్చింది. కార్మికులూ.... లాఠీఛార్జీ.... ఆమె గదిలోకి పరిగెత్తుకు రావటం- ఇద్దరూ ఒకే చీకటి గదిలో పావుగంటసేపు వుండవలసి రావటం- ఒక ఎలుక తన కాలి మీద నుంచి గెంతటం_ అన్నీ వరుసగా జ్ఞాపకం వచ్చాయి.

 Previous Page Next Page