"గజల్స్ విందామా? తింటే గారెలు తినాలి_వింటే భారతం వినాలీ అన్నారుగానీ, వర్షం రాత్రి తింటే పకోడీలు తినాలి. వింటే గులామ్ ఆలీ గజల్స్ వినాలి__"
"విందాం. కానీ కాస్త టీ తాగితే బావుంటుందేమో!"
"ష్యూర్."
"నౌఖరొద్దు మనమే పెట్టుకుందాం-"
ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిచేసి, అంతలో నవ్వేస్తూ, "సరే" అంది. టీ కలుపుతూంటే అతడు గుమ్మానికి ఆనుకుని నిలబడ్డాడు. నడుమువరకు వేలాడే జడ, మెడని వెనుకనుంచి పూర్తిగా కప్పేసిన జుట్టు, ఒకవైపు నుంచి పడుతున్న వెలుతురులో అందమయిన ప్రొఫైలు....
"ఏమిటి అలా చూస్తున్నావు?" టీ అందిస్తూ అడిగింది.
"ఏమీలేదు. ఇప్పుడు మీ నాన్నగారు అకస్మాత్తుగా వచ్చి ఇలా మనల్ని చూస్తే ఎలా వుంటుందా- అని ఆలోచిస్తున్నాను."
"ఏం? ఎలా వుంటుంది? నాకెప్పుడయినా నిద్ర పట్టకపోతే ఇలా అర్దరాత్రిపూట నాన్నని లేపి వేధించడం అలవాటే. ఏమీ అనుకోరు."
అతడు ఏదో అనబోయి వూరుకున్నాడు.
"పద పద! టీ చల్లారిపోతుంది."
ఇద్దరూ బెడ్ రూమ్ లోకి వెళ్ళటంకోసం మెట్లు ఎక్కసాగారు. మేడ మెట్ల వంపులో నిలువటద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని వేణు ఉలిక్కిపడ్డాడు. అద్దంలో వేణు లేడు. ఇంకెవరో వున్నారు.
ఇద్దరూ గదిలో ప్రవేశించారు. కప్పు పట్టుకుని కూర్చుంటూ టేప్ నొక్కింది ప్రేమ.
కిటికీ తెరల్ని కదుపుతూ ఒక పిల్ల తెమ్మెర లోపలికి వచ్చి వాళ్ళని పరామర్శించింది. తెమ్మెరతోపాటే తరంగాలు తరంగాలుగా గులామ్ ఆలీ పాట కూడా.
बहारें चमन थाद आजया है
मुझे वो गुल बदन याद आगया है
అతడు టీ పూర్తిచేసి కప్పు బల్లమీద పెడుతూండగా కరెంటు పోయింది. ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు. ప్రసాదరావు తన పని తాను చేసుకుంటూ పోతున్నాడన్నమాట.
"కొవ్వొత్తి వెలిగించనా?"
"ఉహుఁ ఇలాగే బావుంది."
"టేప్ లో పాట ఇంకా వస్తూనే వుంది."
అతడు లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాడు. క్రింది నించి పెరిగిన చెట్టు తాలూకు కొబ్బరాకు నీడ గోడమీద కదుల్తూంది.
ఆమె వెనుక నుంచి దగ్గిరగా రావటం తెలుస్తూంది. నిద్రలో మంద్రమైన సెంటు పరిమళం, చీకటిలో స్పష్టమయిన అస్పష్టం.
అతడు వెనుదిరిగాడు. అలా తిరగటంలో ఆమె మరింత దగ్గరగా వచ్చింది. అతడు అప్రయత్నంగా ఆమె భుజంచుట్టూ చేయి వేశాడు. ఆమె కదల్లేదు. భుజంమీద నుంచి అతడి చెయ్యి కదిలి జుట్టు వెనగ్గా మెడ మీదకు పాకి, ఆమెని దగ్గిరకి తీసుకుంది. ఆమె కాదనలేదు.
అతడు తల వంచి ఆమె పెదవుల మధ్య రహస్యాన్ని శోధించబోయాడు. ఘనీభవించిన హిమకణం కొండ అంచున కదిలి శిఖరాల చివర్నుంచి లోయలోకి జారబోయిన క్షణం....
ఆకాశం అంటుకున్నట్టూ- రెండు మేఘాలు ఢీకొని మెరిసిన మెరుపు విశ్వమంతా వ్యాపించి కిటికీలోంచి ఆమె మొహం మీద ప్రతిబింబించింది. ఆ వెలుగులో ఏ భావమూ ప్రస్పుటించమని ఆ మొహంకేసి చూసి అతడు విస్మయంతో, "ఏమిటి ఆలోచిస్తున్నావ్ ప్రేమా?" అని అడిగాడు.
ఆమె కన్నులు విప్పకుండా అంది. "స్నేహానికి పరమార్ధం ఏమిటా అని."
ఒక శీతల పవనం ఆ గదిని ఒక్కసారిగా చల్లబర్చినట్టూ- ఒక కవోష్ణ రుధిరం శరీరంలో ఎగజిమ్మినట్టూ అయి ఆమెని వదిలేసాడు.
టేప్ లో చివరి పాట వస్తూ ఆగిపోయింది.
किसको सुनाये हाले दिल
दिल आखिर दिल है
(మనసు....ఎంతైనా మనస్సుకదా)
7
"నేను చెయ్యలేను. ఉహు....నేను పాడు చెయ్యలేను" అన్నాడు వేణు తల విదిలిస్తూ. అతడు స్టూల్ మీద కూర్చొని, చేతుల్లో మొహం దాచుకుని వున్నాడు.
ఎదురుగా వున్న ప్రసాదరావు ఏమీ మాట్లాడలేదు. చాలా సేపట్నుంచి అతడలాగే మౌనంగా వేణు చెప్పేది వింటున్నాడు.
వేణూయే మాట్లాడుతున్నాడు. అతడి కంఠం నూతిలోంచి వస్తున్నట్టూ వుంది. ఏదో మైకంలో వున్నట్టు- పశ్చాత్తాపం చెందుతున్నట్టూ ఓటమి వొప్పుకుంటున్నట్టూ అన్నాడు. "మనిద్దరం మొదటిసారి కలిసినప్పుడు, మీరు నాకీపని వప్పజెప్పినప్పుడు, ఇదంతా చాలా సులభం అనుకున్నాను. అనుకున్నట్టే పరిచయం పెంచుకోవడం కష్టంకాలేదు కూడా. కలలో కూడా ఎవరూ వూహించలేనంత గొప్పగా ప్లాన్ మీద ప్లాన్ వేస్తూ మా ఇద్దర్నీ దగ్గిర చేర్చారు. మీరు కష్టం అనుకున్నవన్నీ సులభం అయ్యాయి. కానీ ఎంతో సులభం అనుకున్నది చివరికి కష్టమైంది. ఇంతవరకూ వచ్చాక ఇంకేముందీ- అనుకున్నాను. అసలు కష్టం ఇక్కడే ప్రారంభమయింది. ఆమెతో పరిచయం పెరిగేకొద్దీ నాలోనూ ఘర్షణ ఎక్కువ అవసాగింది. యీ ఘర్షణ విషయం మీకు చెప్పలేక నాలో నేనే ఇంతకాలం మధనపడుతూ వచ్చాను. అనుకున్నట్టు కన్నుమూసి తెరిచేలోగా అయిపోతే ఎలా వుండేదో చెప్పలేను కానీ- ఆమె నెమ్మది నెమ్మదిగా కొద్ది కొద్దిగా దగ్గిరవుతూ రావటంతో యీ చిక్కు వచ్చి పడింది. ఈ దగ్గిరవటం భౌతికం కాదు- మానసికం. ఆమె ఇలా దగ్గిరగా వస్తుంటే దాన్ని నేను మన స్వార్ధం కోసం ఉపయోగించుకోలేకపోయాను. ఇది ఈ రోజునాటి సమస్య కాదు ప్రసాదరావుగారూ! ఈ అవకాశం నాకు యీ వర్షం కురిసిన రోజూ, కరెంటుపోయిన ఈ రాత్రే రాలేదు. ఇలాంటి అవకాశాలు మామధ్య ఎన్నో వచ్చినయ్. నాకు కాలు విరిగిన యీ మూడు నెలల్లో ఎన్నోసార్లు మన పథకం పూర్తిచేసి చివరి తెర వేయాలనుకుంటూ వచ్చాను. హఠాత్తుగా ఈ వార్త చెప్పి మిమ్మల్ని ఆనందంతో ముంచెత్తాలని వువ్విళ్ళూరేను. కానీ ప్రతీసారీ దీనికి వ్యతిరేకత నా మనసులోంచి ఒక కెరటంలా తోసుకొచ్చేది. ఇప్పుడింత జరిగాక నేనొక్కటే చెప్పగలను ప్రసాదరావుగారూ! మీరు నాలాటి చేతకానివాణ్ణి ఈ పనికి ఎన్నుకుని చాలా తప్పుచేసారు. నేనా అమ్మాయిని పాడు చెయ్యలేను. చెడుకి కూడా ధైర్యం కావాలి. నాలాటి పిరికివాడు ఆ పనిచేయలేడు. మూడునెలల నా మనసులో ఘర్షణపడి, ఓడిపోయి మీకీ వార్త చెపుతున్నాను. మీకీ వార్త విద్యుద్ఘాతం అవుతుందని నాకు తెలుసు. నన్ను క్షమించండి! కానీ ఒక్కటి మాత్రం నా చెల్లెలిమీద ఒట్టేసి చెపుతున్నాను. నమ్మండి. ఈ కార్యం ఎలాగైనా పూర్తి చెయ్యాలి అని నా శాయశక్తులా ప్రయత్నించాను. చివరికి నన్న రాత్రి ఆఖరి రోజు అనుకున్నాను. ఈ పరీక్షలో ఎలాగైనా సరే నెగ్గాలీ- అన్న దృడ నిశ్చయంతో వెళ్ళాను. ఆమె దీన్ని స్నేహమే అనుకుంటుందో- ప్రేమే అనుకుంటూందో- పెళ్ళే అనుకుంటూందో- నాకైతే తెలీదు కానీ ఆమె ఎదురు చెప్పలేదు. కానీ అక్కడ కూడా నాకు ఓటమే ఎదురైంది. మనసు ఎదురుతిరిగింది. నా చేతుల మధ్యనున్న ఆ మొహంలో అమాయకత్వమే నన్ను నిలదీసి ప్రశ్నిస్తున్నట్టు తోచింది. ఇక నేను గెలవనేనన్నది రూఢీ అయిపోయింది. మీరు నా మీద వుంచిన నమ్మకానికి నేను న్యాయం చేకూర్చలేకపోయాను. నన్ను క్షమించండి ప్రసాదరావుగారూ! మీరు నా మీద పెట్టిన పెట్టుబడి అంతా వృధా అయింది. దీనికి మీరు ఏ శిక్ష విధించినా సిద్ధంగా వున్నాను. నాకూ, నా చెల్లికీ మీరు చేసిన సాయానికి యావజ్జీవం మీకు ఊడిగం చెయ్యమన్నా చేస్తాను.... చెప్పండి."
అతడు మాటలు పూర్తి చెయ్యగానే, ఆ గదిలో గాఢమైన నిశ్శబ్దం పేరుకుంది.
ఎంతసేపటికీ ప్రసాదరావు మాట్లాడకపోవటంతో అతడు తలెత్తాడు. ప్రసాదరావు మొహం నిర్మలంగా వుండటం చూసి ఆశ్చర్యపోయాడు. పేలుతుందనుకున్న అగ్నిపర్వతం మామూలుగా వుంది.
"నువ్వెళ్ళు వేణూ!" అన్నాడు తాపీగా.
వేణు ఆశ్చర్యం అధికమైంది. లేస్తూ- "....నేనూ" అన్నాడు.
"నేను వాదించటం వల్లా, నిన్ను బలవంతాన తిరిగి వప్పించటం వల్లా ఈ పని పూర్తవుతుందా?" అవదు. ఇది మనసుకు సంబంధించింది. నువ్విక ఈ పని చెయ్యలేవు. ఎందుకు వృధా వాదనలు- చర్చలు.... నువ్వెళ్ళు. గుడ్ బై" అన్నాడు.
వేణు ఇబ్బందిగా "మీరు నన్ను...." అనబోయాడు.
"నేను నిన్ను శిక్షించాలని- లేకపోతే క్షమించాలని అంటావ్. అంతేగా. దానివల్ల లాభం ఏముంది? నేనెంత ప్రాక్టికల్ మనిషినో తెలుసుగా. టైమ్ వేస్ట్ వద్దు. వెళ్ళు వేణూ! నన్ను ఒంటరిగా వదిలిపెట్టు...." తల తిప్పుకొని అన్నాడు. వేణు ఏదో అనబోయి, ఆ అభిప్రాయం మార్చుకుని అక్కడ్నుంచి కదిలాడు. ఇప్పుడిక ఏం చెప్పినా లాభంలేదు. కొంచెం స్థిమితపడ్డాక చెప్పాలి.
అతడు బైటకొచ్చాడేగానీ ఏదో గిల్టీకాన్షస్ నెస్ అతడిని వెంటాడసాగింది. ఇన్నాళ్ళుగా తన సహచరుడిగా, మిత్రుడిగా వుంటూ వచ్చిన ఆ వృద్ధుడితో పూర్తిగా తెగతెంపులు అయిపోయాయని నమ్మబుద్ధిగావటంలేదు. తను అతడిని నమ్మించి ద్రోహం చేసాడు.
అయినా అతడు యెందుకంత "కామ్"గా వున్నాడు?
తను యీ వార్త చెప్పినప్పుడు ఏమీ చెదర్లేదేం?
వేణు కళ్ళముందు అతడి మొహం కదలాడింది. నడుస్తూ ఆలోచించసాగాడు.
ప్రసాదరావు సంగతి అతడికి బాగా తెలుసు. ఏ నిర్ణయాన్నైనా అతడు క్షణాలమీద తీసుకుంటాడు. మొహంలో యెక్కడా దాన్ని బైట పడనివ్వడు.
అతడంత కామ్ గా వున్నాడంటే అంత దారుణమైన నిర్ణయం ఏదో తీసుకునే వుంటాడు?.... ఏమిటది?
చప్పున ఏదో స్పురించి ఉలిక్కిపడ్డాడు.
అప్పటికే అతడు చాలాదూరం వచ్చేసేడు.
వెనుదిరిగి పరుగెత్తడం మొదలుపెట్టాడు.
చెక్కమెట్లు అతడి కాళ్ళ క్రింద కిర్రుమని శబ్దం చేస్తున్నాయి. గాలికన్నా వేగంగా మేడ ఎక్కాడు.
అతడి వూహ నిజమైంది.
తలుపు సందుల్లోంచి ఆ దృశ్యం స్పష్టంగా కనబడుతూంది.
ప్రసాదరావు నుదుటికిపిస్టల్ ఆన్చుకొని కాల్చుకోబోతున్నాడు.
ఇంకొక్క క్షణం ఆలశ్యమై వుంటే అంతా అయిపోయేదే.
తలుపులు ధడాలున తెరుచుకుని వేణు లోపలికి ప్రవేశించి అతడి చేతుల్లోంచి పిస్తోలు లాక్కున్నాడు.
"ఇచ్చెయ్ వేణూ! ఇచ్చెయి" తిరిగి లాక్కుంటూ అన్నాడు ప్రసాదరావు.
"మీకేమైనా మతిపోయిందా?"
ఆ మాటలకి ప్రసాదరావు ఘర్షణ మానేసి, వేణు కళ్ళలోకి సూటిగా చూసేడు. తరువాత బిగ్గరగా నవ్వేడు.
"అవును. నాకు మతిపోయింది. ఈ పనికి ఒక వ్యక్తిని నియమించినప్పుడే నాకు మతిపోయింది. నేను విలన్ కదూ? చూసేవాళ్ళందరికీ నువ్వు హీరోవి. ఒక అమ్మాయి శీలం అపహరించటం అనే దారుణ కృత్యానికి నిన్ను నియమించిన నేను విలన్ని!! అలాటి పని చేయలేక మానసిక వ్యధతో కొట్టుమిట్టులాడుతున్న నువ్వు హీరోవి. ప్రతివాళ్ళకీ అదే కనపడుతుంది. ఎన్ని సంవత్సరాలు నేను యీ డబ్బు సంపాదించటానికి కష్టపడ్డానో ఎవరికీ తెలీదు. నా చెల్లెలికి జరిగిన అన్యాయానికి ఇన్నాళ్ళూ నేనెంత రగిలిపోయానో ఎవరికీ తెలీదు!! ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు ఇంత పగడ్భందీగా ప్లాన్ వేసి నిన్ను నియమిస్తే నేను చెమటోడ్చి కష్టపడిన డబ్బంతా ఖర్చయ్యాక, ఇప్పుడు నువ్వొచ్చి తాపీగా- "నేనీ పని చెయ్యలేను" అని చెప్పి వెళ్ళిపోతే దానికి నేను ఆత్మహత్య చేసుకోబోవటం కూడా నా తప్పే! నాకే మతిపోయింది, నువ్వు మాత్రం మంచోడివి. అయినా నేనేమీ నీ దగ్గర దాచలేదే? ఉన్నదున్నట్టు వివరించాను. కాంట్రాక్టు కుదుర్చుకున్నాను. నేనన్నమాట ప్రకారం నీ చెల్లెలికి ఆపరేషన్ చేయించాను. ఇప్పుడు సడెన్ గా నువ్వొచ్చి యీ మాట చెప్తే, ఇక నేనేం చెయ్యను! పోయిన డబ్బు అంతా తిరిగి కూడగట్టుకోనా? దానికి నువ్వూ, నీ చెల్లీ చెమటోడ్చి సాయం చేస్తారా?.... భలే అప్పుడు మళ్ళీ ఇంకొక కుర్రవాడిని పట్టుకుని దీనికి నియమించాలి అన్నమాట. ఆ అమ్మాయేమన్నా మిషనా? ఒకరి తరువాత మరొకరిని ప్రేమించటానికి? లాభం లేదు వేణూ! నేను సర్వనాశనమైపోయాను. ఇంకే విధంగానూ జగపతిరావుని దెబ్బతీయలేను. అతడు నాకూ, నా చెల్లెలికీ చేసిన అన్యాయానికి కుమిలి కుమిలి పోవటం తప్ప మరేమీ చేయలేను."