సరోజ సుమతిని చూసి నివ్వెరపోయింది. తన అత్త మాతృప్రేమతో కుమార్ ని పెంచింది అని విన్నది కాని, ఇంతగా కన్నకొడుకు కన్న ఎక్కువగా ప్రేమిస్తుందని ఇన్నాళ్ళుగా తెలుసుకోలేకపోయింది. కుమార్ స్థితి చూసి సరోజకూ గుండె చెదరింది.... "బావా!" అంటూ ఏడ్చింది. కానీ ధైర్యం తెచ్చుకుంది. ఏ పరిస్థితుల్లోనైనా నిబ్బరంగా ప్రవర్తించగలిగే గుండె దిటవు ఆ పిల్ల అలవరచుకుంది. ఒక వంక చంద్రశేఖర్ చైతన్యం నశించినవాడిలా అయిపోయాడు. సుమతి దుఃఖం తప్ప మరొకటి తెలియని శోకదేవత లాగ తయారయింది. మంజు అన్న కోసం ఏడుస్తూ అమాయకంగా బెంబేలు పడిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబానికి సరోజ ఒక్కర్తే ఆధారమయింది. మంజుకి ధైర్యం చెప్పటం - ఇంటి సంగతి చూసుకోవటం - ఇంటినుంచి కాఫీ, భోజనం వగైరాలు హాస్పిటల్ కి తీసుకురావటం - డాక్టర్లను కుమార్ గురించి కనుక్కోవటం.... ఇవన్నీ సరోజ తనే నిర్వహించుకునేది. అనారోగ్యంతో, ఇంటి పనులతో రక్తం లేక తెల్లగా పాలిపోయిన సుమతి "నా రక్తం తీసుకుని కుమార్ ని బ్రతికించండి!...." అని ఏడుస్తోంటే చూడలేక సరోజకు కడుపులో చెయ్యిపెట్టి కలచినట్లయ్యేది. కుమార్ ని అలా చూడవలసి రావటం అందరికంటె సరోజకే ఎక్కువ కష్టంగా ఉంది. అయితే మిగిలిన వాళ్ళలా ఆ అమ్మాయి ఏడుస్తూ మూల కూచోలేదు. ఎలాగైనా తన బావను బ్రతికించుకోవాలని పాటుపడ సాగింది.
కుమార్ కి దెబ్బలు తగిలి ప్రాణాపాయ దశలో ఉన్నాడని తెలియగానే తెరవెనుక దేవతలు తెర వెనుకనే తిరోహితులయ్యారు. ఒక ఉన్మాదంలో ఉద్రేకంతో ప్రవర్తించిన విద్యార్ధులు తమ సాటి విద్యార్ధి తమ కళ్ళ ముందే ప్రాణాపాయ దశలో ఉండటం చూసి తల్లడిల్లి పోయారు. ఆ మాటలూ, ఈ మాటలూ విని రెచ్చిపోయి కుమార్ ని కొట్టిన విద్యార్ధులు, పోలీసులు, కేసు, గొడవ__ఇవన్నీ వచ్చేసరికి తమ నాదుకునే తెరవెనుక దేవత లెవరూ ఉండరని గ్రహించి నిర్ఘాంత పోయారు. ఒక ప్రక్క సాటి విద్యార్ధి తమ వల్లనే ప్రాణం పోగొట్టు కుంటున్నాడనే బాధ - మరొక వంక తమకేం మూడుతుందోననే భయం - ఈ రెండింటితోనూ కుమార్ ని కొట్టిన వాళ్ళు తల్లడిల్లి పోయారు.
పోలీసులు విచారణకు వచ్చారు....
"మీ అబ్బాయిని కొట్టినది ఎవరని మీ అనుమానం? షెడ్యూల్డ్ కేస్ట్ విద్యార్ధులా?.... ఉన్నత కులాల విద్యార్ధులా?" అని అడిగారు. అంత దుఃఖంలోనూ చంద్రశేఖర్ ఆ ప్రశ్నకు నవ్వుకున్నాడు.
"మా కుమార్ జన్మతః షెడ్యూల్ కులాలకు చెందినవాడు. కానీ, చిన్నతనం నుండీ నా దగ్గిర పెరిగాడు. అంచేత అన్ని కులాల వాళ్ళకీ అతడు కావలసిన వాడే! కులం కారణంగా ఎవరైనా అతని మీద స్పర్ధ పెంచుకోవలసిన అవసరం లేదు. అదీగాక మా కాలేజీలో ఏనాడూ కుల తత్త్వాలు లేవు. ఏవో కారణాలవల్ల ఏర్పడిన పార్టీలకు కులం రంగు కల్పిస్తున్నారు" అన్నాడు.
చంద్రశేఖర్ కి ఎవరిమీద అనుమానం లేదని వ్రాసుకుని వెళ్ళిపోయారు పోలీసులు.
రెండు రోజుల తరువాత కుమార్ వళ్ళు తెరిచి "అమ్మా!" అని పిలిచాక, పిచ్చిదానిలా అయిపోయిన సుమతి కొంచెం కోలుకుని "నాయనా! కుమార్! మళ్ళీ 'అమ్మా!' అన్న నీ పిలుపు విన్నానురా! ముక్కోటి దేవతలు నన్ను కరుణించారురా!" అని ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంది.
అక్కడే ఉన్న సరోజ చూపులతో కుమార్ చూపులు కలుసుకున్నాయి. పొంగి వచ్చే కన్నీళ్ళను బలవంతాన నిగ్రహించుకుంది సరోజ. నీరసంగా నవ్వాడు కుమార్.
కుమార్ కి దెబ్బలు తగలగానే సరోజ అలా తమ ఆడబిడ్డ కుటుంబంలో ఉండిపోవటం ఏమాత్రం సహించలేక పోయింది అనూరాధ. కానీ, అటు కుమార్ ప్రాణాపాయ దశలో ఉండగా గొడవ పెట్టలేక ఊరుకుంది, మనసులో చిరాకు పడుతూ.
ఇంగ్లీషు లెక్చరర్ పక్షాన ఆందోళన జరిగిన విద్యార్ధులు ఒక గుంపుగా చంద్రశేఖర్ ఇంటికి వచ్చారు.
"సారీ సార్! ఆ దుర్మార్గులు ఇంతకు తెగిస్తారని అనుకోలేదు...." అన్నారు.
చంద్రశేఖర్ మాట్లాడలేదు. తన మనసులో మాటలన్నీ చెపితే అర్ధం చేసుకోగలిగే విచక్షణ లేదు వాళ్ళకి.
"పాపం మీరు కుమార్ ని క్షమార్పణ చెప్పుకోమన్నారు.... కుమార్ క్షమార్పణ చెప్పుకున్నాడు. ఎంతైనా మనం-మనం ఒకటి సార్!"
అదిరిపడ్డాడు చంద్రశేఖర్! ఏదో ఒక విధంగా గొడవలు లేకుండా సర్దుబాటు చెయ్యాలని తను చేసిన ప్రయత్నాన్ని ఎలా వ్యాఖ్యానిస్తున్నారు వీళ్ళు!