ఇంత దారుణం కళ్ళారా చూస్తూ సహించలేకపోయాడు చంద్రశేఖర్.
"కుమార్! ఇంత అల్లకల్లోలానికి నువ్వే కారకుడవు కావటం నాకు చాలా సిగ్గుగానూ, బాధగానూ ఉంది. వెళ్ళి నువ్వే ఇంగ్లీష్ లెక్చరర్ గారిని క్షమాపణ కోరుకుని ఏ గొడవా లేకుండా చేసెయ్యి" అన్నాడు కుమార్ తో.
కుమార్ సిగ్గుపడుతూ తల దించుకుని "ఆరోజు సార్ నన్ను అన్యాయంగా కొట్టారన్న కోపంలో ఉద్రేకం అణచుకోలేక ప్రిన్సిపాల్ గారికి రిపోర్ట్ చేశాను. అంతేకాని ఇది ఇంత గొడవలకు దారితీస్తుందనుకోలేదు. ఇప్పుడు విద్యార్ధులు బాగా రెచ్చిపోయారు.... ఒకవేళ నేనే క్షమార్పణ కోరుకున్నా, ప్రయోజనం ఉంటుందనుకోను" అన్నాడు.
"ఫరవాలేదు -ముందు బహిరంగంగా క్షమాపణ కోరుకో! ఈ గొడవలు తగ్గిపోతే, తరువాత చూసుకోవచ్చును. నిన్ను కారణంగా చూపించి కదా, ఇంత అల్లరి లేవదీశారు! నువ్వే తప్పు ఒప్పుకుంటే, ఇక వాళ్ళ అల్లరికి ఆధారమెక్కడ దొరుకుతుందీ?"
తండ్రి మాట కాదనలేకపోయాడు కుమార్. విద్యార్థులలో ఉన్న ఒక విచిత్రమైన కట్టు కుమార్ కి బాగా తెలుసు! కొందరు ఒక గ్రూప్ గా ఏర్పడి అల్లరి ప్రారంభించాక ఆ గ్రూప్ లోంచి ఒకడు చీలిపోయి వేరుగా ఉంటానంటే ఆ గ్రూప్ ఒక్కనాటికీ క్షమించదు.... తను క్షమాపణ కోరుకుంటే షెడ్యూల్డ్ కేస్ట్ విద్యార్థులకు బాగా కోపం వస్తుందని కుమార్ కి తెలుసు. "కానియ్యి - మరి కాస్త ఏడిపిస్తారంతేగా!" అనుకున్నాడు.
"ఇంగ్లీష్ సార్ మీద నేనే నమస్కార బాణం వేశాను.... సార్ నన్ను కొట్టడంలో తప్పేమీ లేదు. నేనే ఇంగ్లీష్ సార్ ని క్షమాపణ కోరుకుంటున్నాను!" అని బహిరంగంగా ఒప్పుకున్నాడు కుమార్.
ఈ పరిణామానికి ఉభయ పక్షాలూ నిర్ఘాంత పోయాయి.... ఇంగ్లీష్ లెక్చరర్ పక్షం వాళ్ళు జయ జయ ధ్వానాలు చేశారు.... షెడ్యూల్డ్ కేస్ట్ పేరుతో యాజమాన్యం మెంబరు పక్షాన ఆందోళన చేస్తున్న విద్యార్ధులు బిక్కచచ్చి పోయారు.
"ఈ కుమార్ గాడు బాపనోడురా! వాడి కోసం మనం ఇంత అవస్థ పడుతోంటే వాడు పోయి వాళ్ళలో చేరిపోయాడు. ఈ బాపనోళ్ళని నమ్మకూడదు!" అని పళ్ళు నూరుకున్నారు.
ఆ సాయంత్రమే బజారునుంచి కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తోన్న కుమార్ ని ఒక గుంపు మీదపడి చావబాదింది. షెడ్యూల్డ్ కేస్ట్ విద్యార్థిని ఒక లెక్చరర్ కొట్టినందుకు నిరసనగా సమ్మె ప్రారంభించిన విద్యార్థి బృందం. ఆ షెడ్యూల్డ్ కేస్ట్ విద్యార్థిపై తమ సానుభూతిని ఈ రకంగా నిరూపించుకుంది....
13
వంటి నిండా దెబ్బలతో, తెలివి లేకుండా హాస్పిటల్ బెడ్ మీద ఉన్న కుమార్ ని చూసి తెలివితప్పి పడిపోయింది సుమతి. డాక్టర్ల ప్రయత్నం మీద రెండు మూడు గంటలకు కళ్ళు తెరిచిన సుమతి కుమార్ ని ఆ స్థితిలో చూసి సహించలేక పోయింది.
"కుమార్! నిన్ను ఏ దశలో చూస్తున్నానురా! పాపిష్టిదాన్ని- ఏం చెయ్యగలిగానురా నీకు? ఆ గుడిసెల్లోంచి నిన్ను నా వళ్ళోకి తెచ్చుకున్నాను. నిన్ను చదివించి, వృద్ధిలోకి తెచ్చి అందరికీ ఆదర్శ ప్రాయుడిగా నిలపాలనుకున్నాను. ఏం చదువులురా ఇవి? మనిషిని పశువుగా-రాక్షసుడిగా మార్చే ఈ చదువులెందుకురా? అంతకంటె నువ్వు ఆ గుడిసెలలోనే ఉండి గొడ్లను కాచుకుంటూ ఉన్నా మనిషిలా బ్రతికే వాడివేమో! ఆ రకంగానే, నీవాళ్ళకీ, నీ జాతికీ ఏమైనా చెయ్యగలిగే వాడివేమో!.... కుమార్! ఒక్కసారి నన్ను చూడరా! అమ్మా! 'నీ తప్పు ఏం లేద'ని చెప్పరా! నా గుండెలు పగిలి పోతున్నాయిరా! నిన్నిలా చూడలేనురా!"
వెక్కి వెక్కి ఏడుస్తున్న సుమతిని ఓదార్చే ప్రయత్నం చెయ్యలేదు చంద్రశేఖర్. ఆ మాతృమూర్తిని ఓదార్చగలిగే భాష తెలుగు పండితుడయిన తనకు తెలియదు.
అతని కళ్ళ ముందు తను క్షమార్పణ కోరుకోమనగానే 'అలాగే నాన్నగారూ!....' అంటూ వినయంగా తల వంచుకుని వెళ్ళిపోయిన కుమార్ రూపమే నిలిచి సంజాయిషీ అడుగుతోంది అంతరాత్మను. కేసబియాంకా లాగ తన ఆజ్ఞకు ఆహుతయి పోయాడు కుమార్. ఈ ప్రమాదం నుంచి కుమార్ బయట పడతాడా? ఒకవేళ జరగరానిది జరుగుతే సుమతిని ఓదార్చగలడా? తను తట్టుకోగలడా? తనను తాను క్షమించుకోగలడా?
కుమార్ తల తన వళ్ళో పెట్టుకుని అతని పక్క మీదనే కూచుండి పోయింది సుమతి. స్నానం చెయ్యలేదు. తల దువ్వుకోలేదు. చివరకు ముఖాన బొట్టు కూడా ఉందో లేదో చూసుకోలేదు. భోజనం మాట దేవుడెరుగు! కొంచెం కాఫీ కూడా సుమతి చేత ఎవరూ త్రాగించలేక పోయారు.
"కుమార్ కి రక్తం కావాలంటే నేనిస్తాను. కుమార్ ని రక్షించటానికి ఏం కావాలన్నా నా శరీరంలోంచి తీసుకోండి. నా కుమార్ ని బ్రతికించండి!" అని ఏడుస్తూ కుమార్ దగ్గిరే కూచుంది.