"మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యటానికి వచ్చాం సార్! ఇది తీసుకోండి!"
ఒక కవరు అందించాడు ఒక విద్యార్ధి....ఏమిటా అని ఆ కవరు విప్పి చూశాడు చంద్రశేఖర్. ఎవరో కుమార్ ని కొడుతుండగా తీసిన ఫోటో.... తెల్లబోయి చూశాడు చంద్రశేఖర్.
"వాడు మీ కుమార్ ని కొడుతుండగా ఫోటో లాగేశాను సార్, ఎందుకైనా పనికొస్తుందని....వీడిని వదలకండి సార్! అంతకు అంతా అనుభవించేలాగ చెయ్యండి...."
చాలా సేపటివరకూ ఏం మాట్లాడలేకపోయాడు చంద్రశేఖర్. చివరకు తేరుకుని "మీదగ్గిర నెగిటివ్ కూడా ఉందా?" అన్నాడు.
"ఉంది సార్!" అన్నాడు ఉత్సాహంగా ఆ విద్యార్ధి.
"ఇలా ఇవ్వండి."
వాళ్ళు నెగిటివ్ కూడా ఇచ్చేశారు.
"ఇంక మీరు వెళ్ళండి."
వాళ్ళు విజయోత్సాహంతో బయటికి వచ్చేశారు. తమ ఉత్సాహం పట్టలేక అందరితో "కుమార్ ని కొడుతుండగా తీసిన ఫోటో నెగిటివ్ తో సహా చంద్రశేఖర్ సారి కిచ్చేశాం. ఆయన ఊరుకోరు. కేస్ పెడతారు. తీగ కదిలిస్తే డొంకంతా కదులుతుంది. అందరి బండారాలూ బయట పడతాయి!" అని గప్పాలు కొట్టేశారు.
ఆ మరునాడు ఎవరో కూలి నాలి చేసుకునే వ్యక్తి పంచె ఎగకట్టి చంద్రశేఖర్ దగ్గిరకొచ్చి దండాలు పెడుతూ "నన్ను కాపాడండి దొరా!" అని ఏడవటం మొదలుపెట్టాడు.
"ఎవరు నువ్వు? ఏం కావాలి?" అని అడిగాడు చంద్రశేఖర్.
"కడుపు కట్టుకుని బుడతణ్ణి సదవిస్తన్న దొరా! ఆడు సదివి తవ్వి తలకెత్తుతాడనుకుంటున్న_ తవురి అబ్బాయిగార్నే కొట్టారంట. ఆ ఫోటోగ్రాపు తమ కాడుందట. ఈ తప్పు కాయండి దొరా!....మీ కాల్మొక్త__ నాబిడ్దని బ్రతుక నీయండి...."
చంద్రశేఖరం కాళ్ళమీదపడి ఏడవటం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి....తన ఎదురుగా ఏడుస్తున్న వ్యక్తి కన్నీళ్ళతో ఎందరో తండ్రుల కన్నీళ్ళు కనిపించాయి చంద్రశేఖర్ కి-ఎందరెందరో గుమాస్తాలు-కండక్టర్లు-కాంపోండర్లు-ఇంకా చిన్నచిన్న ఉద్యోగస్థులు-తన ఎదురుగా ఉన్న వ్యక్తిలాంటి కూలివాళ్ళు....ఎందరో-ఎందరో.... ఎన్నో ఆశలతో అతి కష్టం మీద తమ పిల్లల్ని కాలేజీలకి పంపి చదివిస్తున్నారు. ఆ చదువుల పర్యావసానమిలా ఉన్నప్పుడు ఆ అభాగ్యపు తలిదండ్రుల ఆశాభంగానికి బాధ్యులెవరు? కుమిలిపోతూ క్షోభతో కురిపించే ఆ కన్నీటిని తుడవగలిగే వారెవరు?
"లే! ఏడవకు! నీ కొడుకుని బుద్ధిగా చదువుకోమని చెప్పు."
"సెప్తన్న దొర! ఆడు సదువుతడు-ఎవడో పొరగాడొస్తుడు-ఆడు రమ్మంటడు-ఈడు వురుకుతడు-నా మాట యిననే యినడు. దొరా ఆడిపైన కేసు పెట్టకు-నీబిడ్డసుమంటోడనుకో! సచ్చి నీ కడుపున పుడత!"
కన్నీళ్ళతో ప్రాదేయపడుతున్నాడు అజ్ఞానం మూర్తీభవించిన ఆ తండ్రి.
"లేదు కేసు పెట్టను-ఇదిగో చూడు" అని తండ్రిముందే తన చేతిలో ఫోటోను నెగిటివ్ తో సహా చింపి ముక్కలు చేసేశాడు చంద్రశేఖర్. ఆ తండ్రి పదే పదే చంద్రశేఖర్ కి నమస్కారాలు చేస్తూ తనకు చేతనైన భాషలో చంద్రశేఖర్ ని ఆశీర్వదిస్తూ వెళ్ళిపోయాడు. క్షణాలలో ఈ వార్త విద్యార్ధిలోకమంతా వ్యాపించింది. ఏ గొడవా లేకుండా అంతా సర్దుకుపోయినందుకు యాజమాన్యం తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఇంగ్లీష్ సార్ పార్టీ విద్యార్ధులకు మాత్రం ఈ వార్త ఆశాభంగం కలిగించింది. తాము ఎంతో కష్టపడి ఫోటో కూడా తీసి ఇస్తే తమ ప్రయాస అంతా వృధా చేశాడని చంద్రశేఖర్ మీద కోపం కూడా వచ్చింది.
ఆ కుమార్ ని ఈయన ఎక్కడినుంచో తెచ్చి ఏదో పెంచాడు. అందుకే అంత జరిగినా ఏమీ చర్య తీసుకోకుండా వదిలిపెట్టేశాడు. ఇదే తన సొంత కొడుకయితే, అలా ఊరుకోగలడా?" అన్నారు.
ఆ మాటలు విని ఎంతో బాధపడ్డాడు చంద్రశేఖర్. తను చేసే ప్రతి మంచిపనికీ ఇలా వ్యాఖ్యానం చేస్తారెందుకు? మానవస్వభావమే అలాంటిదా?