Previous Page Next Page 
త్రీ- ఇన్- వన్ పేజి 3

                                 

                                                

     చంచల్రావు భయం భయంగా నా వెనుక నిలబడ్డాడు ముక్కు తడుముకుంటూ.

    తలుపు తెరుచుకుంది.

    లావుగా తెల్లగా పొట్టిగా ఉందావిడ. కళ్ళు చింతగింజల్లా చిన్నవిగా, నల్లగా మెరుస్తూ ఉన్నాయి. వయసు నలభై  - నలభై అయిదు మధ్యన ఉండొచ్చు.

    ఏమిటన్నట్లు కళ్ళు ఎగరేసింది నావంక చూస్తూ.

    "టు లెట్ బోర్డు చూసి వచ్చాం" అన్నాను.

    "బ్రహ్మచార్లా?" అడిగింది.

    "పెళ్ళయింది - కాలేదు. మాంసం తింటే తింటాం. లేకపోతే లేదు... ఒక్కోనెల జులపాల జుట్టుంటే మరోనెల డిప్ప కటింగు ఉంటుంది. వయసులో వున్న అమ్మాయిలంటే పడదు.

    వెనుక నుండి చంచల్రావు గబగబా అన్నాడు. ఆవిడ బిత్తరపోయి చూసింది.

    "అబ్బే మరేం లేదండీ... మూడు గంటల నుండీ ఎండలో తిరగడం వల్ల కాస్త బుర్రతిరిగి అలా మాట్లాడుతున్నాడంతే!" ఆవిడకి నచ్చ జెప్పాను.

                                            

  "లోపలికి రండి" అంది ఆవిడ ప్రక్కకి తొలిగుతూ.

    "పాపం మర్యాదస్తులే" చంచల్రావు నా చెవిలో గొణిగాడు.

    "ఇలా రండి"

    ఆవిడ వెనకాలే బయలుదేరాం.

    "ఇదే నాయనా గది"

    గది బాగానే ఉంది. గదిలోకి గాలీ వెలుతురూ బాగానే వస్తున్నాయ్. కిటికీ దగ్గరున్న మల్లెపందిరి మీదనుండి విరిసిన మల్లెల వాసన గదంతా వ్యాపిస్తుంది.

    "మాకు నచ్చింది" ఇద్దరం కోరస్ గా అన్నం ఆవిడతో.

    "మీకు నచ్చగానే సరిపోయిందా? మీరు మాకు నచ్చొద్దూ"

    దీర్ఘాలు తీస్తూ ముందు హాలువైపు కదిలింది ఆవిడ.

    "అయ్యిందీ, - అందరూ గుమ్మం లోంచి పంపిస్తే ఈవిడ లోపలికి పిలిచి పంపేస్తుంది" చంచల్రావు గొణిగాడు నా చెవిలో.

    ముగ్గురం హల్లోకి వచ్చాం.

    "కూర్చోండి"

    సోఫాలో కూర్చున్నాం.

    పాపం. చాలాసేపట్నుండి తిరుగు తున్నట్టున్నారు ఎండలో, కాస్త మజ్జిగ తాగుతారా?"

                                        

 

       "తాం... తాం..." అన్నాడు చంచల్రావు.

    ఆవిడ తెల్లబోయి చూసింది.

    "ఎండలో తిరగడం వల్ల నీరసం వచ్చి వాడికి మాటలు పూర్తిగా రావడంలేదు. తాగుతాం అంటున్నాడు."

    ఆ మాటలు వినగానే అక్కడే ఓ మూల నిలబడి ఉన్న ఒకతను లోపలికి వెళ్ళి రెండు గ్లాసులతో మజ్జిగ తెచ్చి యిచ్చాడు.

    "నమ్రతగా, నమ్మకంగా వుండే పనివాళ్ళు దొరకడం ఈరోజుల్లో కష్టమే!" అన్నాను అతనింక మెచ్చుకోలుగా చూస్తూ.

    "అబ్బే... ఆయన మావారే అంది ఆవిడ.

    "ఇంతసేపూ తోటపని చేశారు. అందుకే ఒళ్ళంతా మట్టిపట్టి అలా ఉన్నారు"

    మజ్జిగ పొలమారి నాకు దగ్గు వచ్చేసింది.

 Previous Page Next Page