Previous Page Next Page 
త్రీ- ఇన్- వన్ పేజి 2

                                 

    "కాదు... గుమ్మంలో మనుషులుండ గానే తలుపులు వేసెయ్యడం" చితికిన ముక్కును రుద్దుకుంటూ కోపంగా అన్నాడు చంచల్రావు

    ఇద్దరం కలిసి మరికొన్ని వీధులు తిరిగాం.

    "మీరు మాంసం తింటారా?" అయితే గది అద్దెకివ్వం" అందొకావిడ.

    ఆవిడ అలా అంది అని మరోచోట "నేను శాఖాహారిని మాంసం తినను" అన్నాను.

    "అబ్బే! మాంసం తిననివాళ్ళకి మేం అద్దెకివ్వం. మా ఇంట్లో మాంసం వండుకుంటే అద్దెకి ఉండేవాళ్ళు మొఖం చిట్లించుకుని ముక్కులు మూసుకోవడం మాకిష్టం ఉండదు" అందావిడ.

    మేము సమాధానం చెప్పేలోగా ఆవిడ ధబేల్ మని తలుపు మూసేసింది.

    మరోసారి చంచల్రావు ముక్కు చితికింది.

    "కొందరికి ఓ దురలవాటు ఉంటుందోయ్"అన్నాడు ముక్కు రుద్దుకుంటూ.

    "అవునవును ఇందాక చెప్పావ్"అన్నాను నేను వాడి చేయి పట్టుకుని రోడ్డు మీదికి లాగుతూ.

    "నీ జులపాలజుట్టు అంటకత్తిరిస్తేనే తప్ప నేన్నీకు అద్దెకివ్వనని" అన్నాడు ఓ బట్టతల ఆసామి.

    "ఈర్ష్య...ఈర్ష్య" నా చెవిలో గొణిగాడు చంచల్రావు.

    ప్రాణాలు పోగొట్టుకోడానికయినా సిద్దపడ్తానుగాని, నా అందమైన క్రాపుని పబ్లిక్ గార్డెన్ లోని గడ్డిలా లెవెల్ గా కత్తిరించుకుని నాశనం చేసుకోవడం నాకిష్టంలేదు. అదే చెప్పాను బట్టతలాయన్తో .

    చంచల్రావు ముక్కు మరోసారి చితికింది.

    "ఇహ నీతో రాలేను బుచ్చీ! ఇంటికెళ్ళేసరికి నా ముక్కు మిగిలేలా లేదు. చంచల్రావు ముక్కు రుద్దుకుంటూ కోపంగా అన్నాడు.

    "మరీ అంట ముందుకెళ్ళి గుమ్మంలో ఎవరు నిలబడమన్నారు?"

    చంచల్రావు మారాం చేస్తే గడ్డం పట్టుకుని బ్రతిమలాడి నా వెంట తీసుకెళ్ళాను.

                                                                                       

                                                 

    మరో 'టు లెట్' బోర్డు కనబడింది.

    ఆ యింటాయన అన్నాడు-

    "మా యింట్లో వయసులో ఉన్న ఆడ పిల్లలు ఉన్నారు... మీకివ్వం"

    "అబ్బే... వాళ్ళు మాకెందుకండీ... గదిస్తేచాలు"అన్నాను నేను ఆయన మాటకు తెల్లబోతూ.

    ఇంటాయన పెద్ద పెట్టున రంకె వేశాడు.

    చంచల్రావు ఈసారి ప్రమాదాన్ని తప్పించుకుంటూ, ముక్కుపట్టుకుని తలుపుకు దూరంగా లాంగ్ జంప్ చేశాడు.

    మరుక్షణం ధన్ మని చెక్కలూడే శబ్దం చేస్తూ మూసుకుంది.

    "నిజమే... నువ్వన్నట్టు కొందరిలో దురలవాటు ఉంటుంది. ఆన్నాను నేను ముక్కు రుద్దుకుంటూ.

 

   చంచల్రావు కిసకిస నవ్వాడు.

 

    అప్పటికి గది వెతకడానికి మేము బయలుదేరి మూడుగంటలు అయ్యింది. కాళ్ళు నెప్పులు పుడుతున్నాయి. చంచల్రావుని ఇక లాగడం నావల్లకాదు. అసలు నేనే నడిచే స్థితిలో లేను. ఆకలి దంచేస్తోంది.

    "ఇదొక్క వీధీ చూసిపోదాం" అన్నాను చంచల్రావుని ఊరడిస్తూ.

    ఆ యింటిముందు వ్రేలాడగట్టిన టు లెట్ బోర్డుచూసి ఇద్దరం ఠక్కున ఆగి పోయాం.

    కొత్తగా కట్టిన ఇల్లులా ఉంది. లైట్ గ్రీన్ కలర్ చుట్టూ కాంపౌండ్ వాల్ టో అందమైన పూలమొక్కలతో చక్కగా ఉంది.

    "ఇల్లు బావుందోయ్...ఇక్కడ గది అద్దెకు దొరికితే బావుణ్ణు అన్నాను.

    కాలింగ్ బెల్ నొక్కాను.

 Previous Page Next Page