ఆయన చిన్నతనంలో విజయవాడలో అప్పట్లో బెజవాడే అనేవారు...పెద్ద పెద్ద కాఫీ హోటల్స్ వుండేవికావు. ఇప్పుడులా హోటల్ మనోరమా, మమతా, ఖాందారీ యిలాంటివేం వుండేవికావు. శంకం కేఫ్, కృష్ణా హోటలు_ యిలాంటి చిన్న చిన్నవి వుండేవి. నరసింహంగారు హోటలులోకెళ్ళి అరడజను యిడ్లీలు, రెండు మూడు అల్లం జీలకర్ర పెసరట్లు అవలీలగా తినేస్తూ వుండేవాడు.
పార్వతమ్మ ఆయన వంక సానుభూతిగా చూసింది. ఆ రోజుల్లోని ఆయన భోజన ప్రియత్వం, తిండిపుష్టి ఆమెకు బాగా తెలుసు.
పెళ్ళయిన కొత్తలో అదే అక్కరా అదీ తీరాక ఒకసారి నరసింహంగారు అత్తగారింటికి వచ్చాడు. తాను ఓ రోజు ప్రొద్దుటే ప్లేటులో రెండు దోసెలు పెట్టుకుని వెళ్ళింది.
"ఏమిటిది?" అన్నాడు.
"టిఫిను..." అంది.
"ఇదేమి టిఫిను నీ మొహం ఓ అరడజను దోసెలు పట్రా" అన్నాడు.
పార్వతమ్మ ఆశ్చర్యంగా చూసింది. "అమ్మో అన్ని తినేస్తారా?" అంది.
"ఆఁ తినేస్తాను"
"మీరు కొత్తల్లుడండీ. మా యింట్లోవాళ్ళేమయినా అనుకుంటారు."
"ఏమిటి అనుకునేది? పట్రా"
తమాషాకి అంటున్నాడేమో అనుకుంది. కాని అయిదు నిమిషాల్లో అరడజను దోసెలూ పూర్తిచెయ్యటం చూసి తెల్లబోయింది.
ఆ రోజుల్లో లోగీస్ తాతగారని తమ బంధువొకడు వుండేవాడు. అప్పట్లో ఆయనకు అరవై అరవై అయిదేళ్ళ వయసుండేది. ఆయనకు అపారమైన తిండి పుష్టి వుండేది.
ఒకరోజు ఆయన తమ యింటికి వచ్చాడు. అప్పుడు భర్తకూడా అత్తవారింట్లో వున్నాడు.
తెలిసిన రైతెవరో బాగా మగ్గిన పనసపండొకటి తెచ్చి యిచ్చాడు.
లోగీస్ తాతగారు, నరసింహంగారు! యిద్దరూ కలసి పనసపండులోని తొనలన్నీ చెరి సగం మొత్తం తినేశారు.
అల్లుడిగారి గొప్పతనానికి యింట్లో అందరూ తెల్లబోయారు.
నరసింహంగారు టిఫిన్ తినడం పూర్తిచేశాక తన గదిలోకి వెళ్ళి విష్ణుసహస్రనామం చదువుకుని మంచంమీద పడుకున్నాడు.
ఆ గది యిటీవల కాలంలో మిగతా వాటికి దూరంగా తనకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు.
రాత్రి పదిగంటల ప్రాంతంలో పార్వతమ్మ గదిలోకి వచ్చింది.
"పడుకున్నారా?" అనడిగింది.
""లేదు. నిద్రపట్టటం లేదు."
ఆమె అతనితో ఏదో చెబుదామనుకుంది కాని యిన్ని సంవత్సరాలు కాపరం చేసినా ఆయనంటే భయం. ఏ మాటా స్వతంత్రించి చెప్పే అలవాటు లేదు.
ఆయన కళ్ళెర్రచేస్తే చాలు గడగడలాడిపోయేది. నొళ్ళంతా ముచ్చెమటలు పట్టేవి.
తనను ఎన్నోసార్లూ దారుణంగా తిట్టాడు. అమానుషంగా కొట్టాడు.
అయినా ఏనాడూ ఎదురుతిరిగి ఎరగదు. ఎదురుతిరగాలన్న ఆలోచనకూడా వచ్చేదికాదు.
ఆయన మంచానికి కొంచం దూరంలో వున్న తన మంచంమీద పడుకుంది.
ఈ మధ్య వొంట్లో బొత్తిగా బావుండటం లేదు. ఏ పని చెయ్యబోయినా శరీరంలోని శక్తి చాలటం లేదు. నీరసం. అలాగే తోసేసుకుంటూ తిరుగుతోంది. తన అనారోగ్యం గురించి ప్రస్తావించటం ఆమెకెప్పుడూ అలవాటులేదు.