ఆ రోజుల్లో పెళ్ళిళ్ళయితే ఎంత సరదాగా వుండేవి! ఒక్క పెళ్ళి కనీసం మూడురోజులకు తక్కువ కాకుండా జరిగేది. ఆ మర్యాదలూ, అలగటాలూ, భోజనాలకు ముందు ఆహ్వానించటాలూ, మొగపెళ్ళివాళ్ళు ఆ అంటేగాని ఆడపెళ్ళివాళ్ళు అలకపోవటాలూ, వడ్డనలో ఓ అయిటమ్ అయిపోయేదాకా ఏడిపించటాలూ, పెళ్ళి తర్వాత కొన్నాళ్ళకు శోభనం దాన్ని అక్కడ తీర్చమనేవారు. అదెంత శోభగా జరిగేది! చుట్టుప్రక్కలంతా వచ్చేవారు. పురోహితుడు, తతంగం, గదిలో పూలు, స్వీట్సు, వగైరాలన్నీ వుండేవి. ఇప్పుడు? పెళ్ళంటే ఒక రెండు పూటలు. కొంతమందిలో ఒక పూట...పెళ్ళికి వెళితే లోపలకు ఆహ్వానించే వారుండరు. అసలు కూచోమనే వారుండరు. పోనీ తమంతట తాము కూర్చుందామనుకున్న ఒక్క కుర్చీ ఖాళీగా వుండదు. ఏర్పాట్లు రెండుమూడు వందల మందికి చేస్తారు. పిలవటం మాత్రం రెండు మూడువేల మందిని పిలుస్తారు. వచ్చిన జనాన్ని చూసి వీడియో తీసి, ఎంతమంది వచ్చారో అని చూసుకుని మురిసిపోతారు కాని వచ్చిన వారికి ఎంతవరకూ అతిథి సత్కారం జరిగిందో అని ఆలోచించే వారుండరు. భోజనాల దగ్గర దృశ్యం మరో భయంకరంగా వుంటుంది. ఎవరి మట్టుకువారు ముందుకు త్రోసుకుంటూ ఎగబడి తింటూ వుంటారు. ఎగబడి తినని వారికి భోజనం దక్కదు. పెళ్ళి బాగా చేద్దామనుకుని బుజాలెగరేసేవారికి ఎంతమంది భోజనాలు చెయ్యకుండా కాలే కడుపులతో వెర్రి మొహాలేసుకుని ఇళ్ళకు వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళకి జవాబు చెప్పలేక ఎలా యిబ్బంది పడతారో తెలీదు.
క్రమంగా వెల్తురు జారిపోయి ఆ స్థానంలో చీకటి ఆక్రమించుకుంది. చలిగాలి కూడా సాగింది.
"తాతయ్యా!" అంటూ ఎనిమిదేళ్ళ పిల్లవాడు పైకి వచ్చాడు.
"ఏమిట్రా"
"అమ్మమ్మ క్రిందకు రమ్మంటోంది."
నరసింహంగారు లేచి నిలబడ్డారు. మనవడు దగ్గరకొచ్చి చెయ్యి పట్టుకున్నాడు.
"నడవగలను లేరా"
"చీకటి తాతయ్యా. కాలికేదయినా తగిల్తే..."
"నరసింహంగారు నవ్వాడు." ఇంకా చూపు పూర్తిగా తగ్గిపోలేదు లేరా.
అన్నాడేగాని చీకట్లో తడుముకుంటూనే నడుస్తున్నాడు. దారిలో అడ్డంగా పడవేసి వున్న కర్ర ఒకటి కాలుకు తగిలి పడబోయాడు. మనవడొచ్చి ఆదుకున్నాడు.
"థ్యాంక్స్ రా" అన్నాడు నరసింహంగారు.
* * * *
నరసింహంగారు క్రిందకు వెళ్ళేసరికి ఆయన భార్య పార్వతమ్మ ప్లేట్ లో రెండు దోసెలు పెట్టి ప్రక్కన చిన్న కటోరీలో టొమాటో పప్పువేసి సిద్ధంగా వుంచింది. చిన్న డైనింగ్ టేబిల్ మీద.
నరసింహంగారు చేతులు కడుక్కు వచ్చి టేబిల్ ముందు కూచున్నాడు. ప్లేట్ లోని దోసెలు చూడగానే నీరుకారిపోయినట్లయిపోయాడు.
"ఈ పూట అన్నం తిందామనుకున్నాను" అన్నాడు ఆశ పడుతున్నట్లుగా.
పార్వతమ్మ నవ్వింది. ఆవిడకు అరవయి అయిదేళ్ళుంటాయి. జుట్టు అక్కడక్కడా నెరిసింది గాని, చాలా భాగం నల్లగానే వుంది. వార్థక్యంవల్ల ముఖంలో కళ తగ్గి వుండవచ్చుగాని, వయసులో వున్నప్పుడు చాలా అందమైన మనిషే అన్న లక్షణాలు కనబడుతున్నాయి.
"మీకు అన్నం తినాలన్న కోరిక అప్పుడప్పుడూ కలుగుతూ వుంటుందని తెలుసు. కాని మీ బి.పి. షుగరు వీటి విషయం నేను మరిచిపోను"
"ఒకపూట తింటే ఏమయింది?"
"పగటిపూట తింటూనే వున్నారుగా"
"అవీ చప్పటి మెతుకులేగా"
"వయసు మళ్ళి రోగాలు చుట్టిముట్టినప్పుడేం చేస్తాం?"
"రోగాలా? నాకా?" అంటూ నరసింహంగారు మూడ్ చెదిరిపోయినట్లు మొహం పెట్టాడు.
ఆయనకు డబ్భైయ్యేళ్ళు నిండుతున్నా తానింకా ముసలివాడినన్న భావన ఏర్పడలేదు. అలా అంటే ఒప్పుకోడు కూడా. ఇప్పటికీ ఆయనకు జిహ్వచాపల్యం పోలేదు. చిన్నప్పట్నుంచీ కూడా ఆయన భోజన ప్రియుడు. ఎర్ర కారం తినేవాడు. ఆయన తినే కారం చూస్తే ప్రక్కవారికి కళ్ళవెంట నీళ్ళు తిరిగేవి. ఆశ్చర్యమేమంటే అంత కారం కలుపుకుని కూడా అందులో నెయ్యి వేసుకునేవాడు కాదు. అన్నంలో పెరుగుగానీ మజ్జిగగానీ వేసుకునేవాడు కాదు. ఆవకాయ అన్నంలో ఎండు మిరపకాయ నంజుకుని తినేవాడు. ఆయనకింకో చిత్రమైన అలవాటుండేది. ఇడ్లీ పిండిలో పచ్చిమిరపకాయలు తరిగించి కలిపించుకుని యిడ్లీలు చేయించేవాడు.