ఆ కుక్కపిల్ల తిమ్మడిదేనని నమ్మిన కొట్టు ఓనర్ డబ్బులు కట్టమని నిలదీశాడు.
చేతిలో చిల్లిగవ్వలేదు. మొండిగా కొట్లాటకు దిగుదామంటే అక్కడ పదిమందికి పైనే వున్నారు. పైగా ఆ కొట్టువాడు ఆ పేటకు పెద్ద రౌడీ అని పేరు. వాడ్ని, ఆ పదిమందిని కొట్టడం ఒక లెక్కలోది కాదు. కాని ఈ గొడవ కాస్తా అమ్మ చెవిన పడితే ఏడుస్తుంది. అమ్మ ఏడిస్తే తను చూడలేడు. ఎలా...?
ఇది నాకుక్క కాదంటే ఒప్పుకోకపోవచ్చు. తన చేతిలోంచి దూకి బన్ తో తిరిగి తన దగ్గరకు వచ్చింది. అది కుదరదు. అయినా ఈ కుక్క తనది కాదని చెప్పగలనా? తన ప్రాణానికి అంత విలువ లేకపోవచ్చు. అయినా అది కాపాడింది ఒక ప్రాణాన్నే. ఎలా?
"న్యాయంగా నాకు రావలసింది నాకు పడేయ్" కొట్టువాడు లుంగీ పైకి బిగించి కట్టి ఒకడుగు ముందుకు వేశాడు.
తిమ్మడు అటు, ఇటు ఓసారి పరిశీలనగా చూశాడు.
"రోడ్డుమీద ఇతరుల వస్తువేదైనా దొరికితే దాన్ని పోలీస్ స్టేషన్ లో అప్పగించాలి. ఆ విషయం మనిషికి తెలుస్తుంది. కుక్కకు ఎలా తెలుస్తుంది?" తిమ్మడు గట్టిగా అన్నాడు- ఓ పక్క ఆ పదిమందితో అవసరమొస్తే కొట్లాటకు దిగవలసి వస్తుందని మానసికంగా సిద్ధపడుతూ.
కొట్టువాడు ఆశ్చర్యపోయాడు.
"రోడ్డు ఏమిటి? రోడ్డు మీద వస్తువేమిటి? అయినా నువ్వు చెప్పేది రోడ్డుమీద వున్న వాటికి వర్తిస్తుంది. అది నా కొట్టులోది" ఆగ్రహంగా అన్నాడు కొట్టువాడు.
"కొట్టునీదే. అయితే నీ కొట్టు రోడ్డుమీదుంది..."
తిమ్మడు రూల్స్ మాట్లాడేసరికి అది నిజమే కాబట్టి కొద్దిగా జంకినా అది పైకి కనిపించనీయకుండా "పిచ్చి పిచ్చిగా వుందా? నా కొట్టు వున్న స్థలం నాదే" అన్నాడు రంకెలు వేస్తూ.
"ఆహా... అలాగా పాపం? అన్ని కొట్లూ రోడ్డుకు రెండు గజాల వెనుకకు వెళ్ళిపోతే నీ ఒక్క కొట్టే ముందుకు ఎలా వుంది?"
ఈ సంభాషణ అంతా ఆ కొట్లో ఓ మూలగా కూర్చున్న ఓ యువతి దృష్టిలో పడింది. ఆమె కాస్త ఆసక్తిగా తిమ్మడివేపే చూస్తోంది.
"ఏంటిరా రూల్స్ మాట్లాడుతున్నావ్? రోడ్డు మధ్య కొట్టు పెట్టుకుంటాను. అడిగేవాడెవడు? బికారి నా కొడకా..." కొట్టువాడు రెచ్చిపోతున్నాడు.
తిమ్మడు సాధారణంగా ఏమీ అనడు. ఎవరన్నా అంటే పడడు. అతనిలో కోపం క్రమక్రమంగా పెరిగిపోతోంది.
"న్యాయంగా అయితే నా కుక్కది తప్పే. అర్ధరూపాయి ఇవ్వాల్సిందే. అయితే నా దగ్గర డబ్బులు లేవు. ఏదైనా పనిచేయమంటే చేస్తాను. రంకెలెందుకు వేస్తావు? అయ్యేపని చూడాలిగాని, కాదంటే చేయగలిగింది లేదు. నేనూ రూల్స్ ప్రకారం మాట్లాడతా. నువ్వు గవర్నమెంటోళ్ళ స్థలాన్ని ఆక్రమించుకున్నావ్. ఇది రూలా? రోడ్డుమీద వున్న దానిమీద నీకు హక్కు ఏమిటి? కాదంటే చెప్పు మున్సిపలోడి దగ్గరకో, పోలీసోడి దగ్గరకోపోదాం."
కొట్టువాడు 'షాక్' అయ్యాడు. కొట్టువాడేమిటి, అక్కడున్న అందరూ షాక్ అయ్యారు.
ఆ యువతి ఉలిక్కిపడింది.
సంస్కారం లేని ఒళ్ళు- చిరిగిపోయి మాసికలు వేసిన చొక్కా పాంటు, పెరిగిన గడ్డం, చెప్పుల్లేని కాళ్ళు, బికారిలా ప్లాట్ ఫాంమీద జులాయిలా కనిపించే ఇతనిలో న్యాయాన్ని, చట్టాన్ని, తన అవసరానికి విడగొట్టగల నేర్పు.
చేసిన తప్పు ఒప్పుకుంటూనే దానికి పరిష్కారం చూపిస్తున్నాడు.
పేదరికం, ఆకలి, అతనిలో అణువణువునా కనిపిస్తున్నాయి. అయినా వాటి తాలూకు డిప్రెషన్ ఎక్కడా ఆనవాలు దొరకటం లేదు. అతనిలో ఏదో ప్రత్యేకత కనిపిస్తోంది.
ఆ యువతి లేచింది.
కొట్టువాడి దగ్గరకు వెళ్ళి అర్ధరూపాయి తీసి ఇచ్చి "అతని బదులు నేనిస్తున్నాను. రభస ఎందుకు?" అంది.
కొట్టువాడు ఆ నాణాన్ని గల్లా పెట్టెలో వేసుకుంటుండగా తిమ్మడు వేగంగా వచ్చి అతని చేయి పట్టుకుని ఆపాడు.
"న్యాయం అన్నావుగా! మరి ఆ పిల్ల ఇచ్చేది తీసుకుంటావేం? ఇచ్చేయ్! నేను ఇక్కడ పని చేస్తాను" అన్నాడు స్థిరంగా.
తిమ్మడి జబ్బ పుష్టి చూసి కొట్టువాడు ఆగిపోయాడు.
"పనిచేస్తావా?"
"ఆ! చేస్తాను."
"అయితే రాత్రంతా చేయాలి."
"చేస్తాను" అని గంగిరెద్దులా తలూపుతూనే అక్కడున్న బల్లల మీద ప్లేట్లను తీసేయటంలో నిమగ్నమయ్యాడు.
స్ట్రేంజ్ ఫెలో... చిత్రమైన మనస్తత్వం...
ఎందుకో హిందూకి అతనంటే ప్రత్యేక అభిమానం ఏర్పడింది.
మనుష్యులలో ఇంత ప్రాక్టికల్ గా వుండేవాళ్ళు కూడా వున్నారా?
అతను అన్ని బల్లలు చకచకా తుడుచుకుంటూ హిందూ కూర్చున్న బల్ల దగ్గరకు వచ్చాడు.
దానికోసమే ఆమె ఎదురుచూస్తోంది. బల్లమీద నీళ్ళు చిలకరించి తలొంచుకుని గుడ్డతో తుడుస్తున్నాడు. ఒక్కసారన్నా తలెత్తి చూడలేదు.
"మిస్టర్... వాటీజ్ యువర్ నేమ్? వాటీజ్ యువర్ జాబ్...?" అంది హిందూ ఆసక్తిగా.
తిమ్మడు తన పనిలోనే నిమగ్నమయి వున్నాడు. సమాధానం ఇవ్వలేదు.
మరలా అవే ప్రశ్నలు అడిగింది.
తిమ్మడు ఓసారి తలెత్తి "ఐ నో ఇంగ్లీష్, నో స్కూల్ నో మనీ- నో ఫుడ్- ఐ వాంట్ వర్క్... యూగివ్?" అని గలగలా రేగుచెట్టుని దులిపినట్లు నవ్వాడు నిండుగా.
"నాకు ఇంగ్లీషు రాదు. బడికి వెళ్ళలేదు. డబ్బులు లేవు. డబ్బుల్లేవు గనుక అన్నం లేదు. పనిస్తావా నీతో మాట్లాడతా?" ఇది తిమ్మడి ఉద్దేశం.
"మరి ఎలా బ్రతుకుతున్నావ్?" తిరిగి అడిగింది హిందూ.
"యస్టర్ డే ఐ ఫోర్ రూపీస్- డే కూలీ, రూపీ సినిమా. రూపీ బీడీ- టూ రూపీస్ ఫుడ్..." వాక్య నిర్మాణంలో ఏ గ్రామర్ కూ లొంగని ఈ భాషలో కింగ్స్ ఇంగ్లీషులోని ప్రమాణికత లేకపోవచ్చు. కాని చెప్పలేని అందం వుంది. క్లిష్టమైన జీవితానుభవాల నుండి కొట్టి వడపోసిన గుండె అతనికుంది. ఇవి నిగ్గు తేలిన జీవిత సత్యాలు. రేపటి తరానికి కావలసిన ఆదేశిక సూత్రాలు.
హిందూ తిమ్మడివైపే చూస్తూ వెళ్ళిపోయింది. ఆమె ఆలోచనలు తిమ్మడి చుట్టూనే తిరుగుతున్నాయి.
హోటల్ ఓనర్ తన అనుచరులతో యుద్ధానికి దిగితే కాచుకోవటానికి సిద్ధంగా వున్న అతని డేగచూపులు- పాదరసంలాంటి అతని వేగవంతమైన కదలికలు, దేనికీ సిగ్గుపడని అతని మనస్తత్వం, తనకు లేనిదాని గురించి నిస్సంకోచంగా చెప్పగల స్ట్రెయిట్ నెస్.
* * * *
ఆ టీ కొట్టులో తెల్లవారుజాము వరకు పనిచేసిన తిమ్మడు అక్కడే ఓ బల్ల క్రింద నిదరబోతున్న కుక్కపిల్లను లేపి చేతుల్లోకి తీసుకొని ఇంటి దారి పట్టాడు.
తిరిగి ఆకలి విజృంభించింది. ఆ టీ కొట్టువాడు ఇచ్చిన మరో బన్ ని కూడా కుక్కపిల్లకే పెట్టాడు.
భయపడుతూనే ఇంటి దగ్గరకు వచ్చాడు. తల్లి గడప దగ్గర కూర్చునే కునికిపాట్లు పడుతోంది. తిమ్మడి అడుగుల చప్పుడికి ఉలిక్కిపడి లేచింది. ఆరడుగుల ఎత్తులో, చీకట్లో తుమ్మమొద్దులా నిలబడ్డ కొడుకు వైపు చూసి నిట్టూర్చింది వాసమ్మ.
"ఇంతసేపూ ఎక్కడ చచ్చావ్?" అడుగుతూ కొడుకు చేతుల్లో కనబడ్డ కుక్కపిల్లను చూసింది.
తిమ్మడు మాట్లాడలేదు.
ఆకలన్నట్లు పొట్ట చూపించాడు.
రాబోతున్న కోపాన్ని దిగమ్రింగుకొని లోపలకెళ్ళి సత్తుప్లేట్ లో అన్నం పెట్టి దూరంగా వెళ్ళి కూర్చుంది.
తల్లికి కోపం వచ్చినట్లు తిమ్మడు గ్రహించాడు.
ఆమె కోపం ఎలా పోగొట్టాలో తిమ్మడికి తెలుసు.
కుక్కపిల్లను క్రిందకు దింపి తల్లి దగ్గరకు వెళ్ళాడు.
ఆమె ఉన్నట్టుండి అంగలో కుక్కపిల్లను సమీపించి కర్రపుల్లతో దాని నడుంమీద ఒక్కటేసింది.
అది కుయ్ మంటూ రాగం అందుకుంది. "దాన్ని కొట్టకే" అన్నాడు మెల్లగా.
"నీకే పెట్టలేక చస్తున్నాను. మరలా ఇదొకటా మన దరిద్రానికి?... బండ చచ్చినోడా. పనిలోకి వెళ్ళకుండా కుక్కల్ని, కోళ్ళని వెంటేసుకు తిరుగుతున్నావా...?" నిప్పులు చెరిగింది వాసమ్మ.
ఆమె తిట్టినంతసేపు తిట్టనిచ్చి అప్పుడు చెప్పాడు జరిగిందంతా.
అది విని కాస్త చల్లబడింది వాసమ్మ.
"ఎలా బతుకుతావురా? అర్ధరూపాయి బన్ కోసం అర్దరాత్రి దాటే వరకు పనిచేస్తావా? పిచ్చి చచ్చినోడా." జాలిగా కొడుకువేపు చూస్తూ అంది.
తిమ్మడు ఓసారి తలెత్తాడు.
"మరి మన బుజ్జిముండదే తప్పుగదా? డబ్బుల కోసం పనిచేస్తే రాత్రంతా పనిచేసినందుకు రెండు రూపాయలు తీసుకోవాలనుకో. కాని దాని తప్పుకు పని చేశాను. అప్పుడు డబ్బుల లెక్కడిగితే వూరుకుంటాడా?" అమాయకంగా అడుగుతున్న కొడుకును చూసి వాసమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. కొడుకులో వున్న నీతి, నిజాయితీకి ఓపక్క సంతోషపడింది.
పిచ్చి వెధవలా కనిపిస్తున్నా, ప్రతి విషయంపట్ల వీడి ఆలోచనలు వీడికున్నాయి. తనకు ఓపిక వుండి వీణ్ణి చదివించి వుంటే ఎంత పెద్దవాడు అయ్యేవాడో?
* * * *
లక్షరూపాయిల ఖర్చుతో పాతిక లక్షల రూపాయిల ఖర్చు తగ్గించగల మేధావికి గొప్ప బహుమానం. మా సమస్య ఎంత చిన్నగా కనిపిస్తుందో అంత పెద్దది. ఎంత పెద్దదిగా కనిపిస్తుందో అంత చిన్నదికూడా. తెలివితేటలతో పైకి రావాలనుకొనే విజ్ఞులకిదో ఛాలెంజ్.
ఈ ప్రకటన పత్రికల్లో పడిన రోజునుంచి నెలరోజులలోపు పరిష్కారం చూపించాలి.
సమస్య
హైదరాబాద్ కి మకుటం లాంటి ఆబిడ్స్ సెంటర్ లో మా కంపెనీ పదిహేను అంతస్థులతో కాంప్లెక్స్ ఒకటి నిర్మించింది. ఈ కాంప్లెక్స్ లో స్త్రీలకు దొరకని వస్తువంటూ వుండదు. ఒక్కో ఫ్లోర్ లో ఒక్కో ఐటమ్ దొరుకుతుంది. కాంప్లెక్స్ లో మేం ప్రారంభించిన వ్యాపార మేమిటో తెలియజెప్పాం.
ఇకపోతే మేమీ కాంప్లెక్స్ నిర్మించటానికి మాకు దొరికిన స్థలం చాలా తక్కువ. కేవలం ఐదువందల చదరపు అడుగుల్లో మేం కాంప్లెక్స్ నిర్మించాం. మా అంచనాలకు మించి కస్టమర్స్ రావటం ప్రారంభించారు. రోరింగ్ బిజినెస్ కేవలం ప్రారంభించిన వారంలోనే మేమీ విజయం సాధించాం వ్యాపార పరంగా.
కానీ రెండవ వారంలోనే మా కాంప్లెక్స్ మూసేసుకోవాల్సిన ప్రమాదం వచ్చి పడింది.
మా ఆర్కిటెక్ట్స్, మా మార్కెటింగ్ డైరెక్టర్ తొందరపాటు వల్లనే ఈ ప్రమాదం జరిగింది.
మా కాంప్లెక్స్ సర్కిల్ ఆకారంలో గుండ్రంగా నిర్మించాం. మధ్యలో లిఫ్ట్ పెట్టాం. ఆ లిఫ్ట్ లో ఒకసారి ఎనిమిదిమంది మాత్రమే పైకి వెళ్ళగలరు. ఆ లిఫ్ట్ క్రింద నుంచి పైవరకు ఓ పెద్ద సైజు ట్యూబ్ లా వుంటుంది.
ప్రతి ఫ్లోర్ లో మధ్యనున్న లిఫ్ట్ ఆక్రమించుకున్న స్థలం పోగా మిగతా స్థలంలో, ఫుల్ సర్కిల్ సేల్స్ కౌంటర్స్ పర్మినెంట్ గా నిర్మించాం.