Previous Page Next Page 
దశావతారాలు పేజి 28


    "డాడీ ఉంటే మమ్మీని ఇలా పడిపోనియ్యరు"
    గతుక్కుమన్నాడు కరుణ్ - అమాయకంగా పసివాడి నోట వచ్చిన ఆ మాట సార్వజనీన జీవిత సత్యమా? సమకాలీన సాంఘిక సత్యమా? లేక ఈ రెంటినీ అనుసంధించే అద్భుత సమన్వయమా?
    ఎప్పటికో కళ్ళు తెరిచింది రాధ. ఎదురుగా శేఖర్...ఒక్కసారిగా రాధ ముఖం వికసించింది. శేఖర్ భుజంమీద ఉన్న బాబు ముఖమూ వికసించింది.
    ఆ లోకంలో మంచి చెడ్డలు లేవు. పాపపుణ్యాలు లేవు. కానీ ఏనాటికీ ఎవరూ కాదనలేని అంతరాత్మమాత్రం ఉంది. అపరాధ భావనతో నలిపే అంతరాత్మను పెట్టుకొని జీవించావలసి రావటం నరకాలన్నింటిలో నరకం...
    "నువ్వు శేఖర్ ను చంపావు. ఒక ప్రాణం పొట్టనపెట్టుకున్నావు. ఒక నిండు జీవితాన్ని బలితీసుకున్నావు..." అని అంతరాత్మ ఘోష పెడుతోంటే...ఆ ఘోషకు మనసు మొద్దుబారిపోయి సమస్త చైతన్యమూ నశించిపోతోంటే ఎన్నాళ్ళు తనలా పడిఉందో? అబ్బ! ఎంత రిలీఫ్!
    శేఖర్ చిరునవ్వుతో ఉల్లాసంగా మాట్లాడుతున్నాడు.
    "స్పృహ లేకుండా నువ్వు ఎన్నాళ్ళు హాస్పిటల్ లో ఉన్నావో తెలుసా? వారంరోజులు! నా చావు అబద్ధం__ నీ చావు నిజం అనుకున్నాను నేను చచ్చిపోయానని విని__అది తట్టుకోలేక నువ్వు చచ్చిపోతే__నేనెలా తట్టుకోగలనురా భగవంతుడా!__అనుకున్నాను!"
    పకాలున నవ్వింది రాధ __
    మనసు చికాకుగా ఉన్నమీదట ఇలాంటి వార్త వినేసరికి మెంటల్ షాక్ వచ్చిందన్నాడు డాక్టర్ _-క్షమించు రాధా! కల్పించుకోవాలని కల్పించుకోలేదు. నీ పరిస్థితి చూసాక....ఆ పరిస్థితికి పరోక్షంగా కారణం లేనని తెలిసాక నిన్నిలా వదిలెయ్యలేకపోయాను." మధ్యలో ఆగిపోయి అదొక రకంగా చూసాడు శేఖర్. ఆ చూపులలో అడగలేని అనేక ప్రశ్నలు!   
    నీ మనసు చికాగ్గా ఉందా? ఎందుకుంది? అంత చికాగ్గా ఉన్నప్పుడు అక్కడెందుకున్నావు? లాంటి ప్రశ్నలు, తన మనసు చికాకు పడిందా? తనకు తెలీదు! తను తపించిపోయిన కరుణ్ సాన్నిధ్యం దొరికింది. నిజమే? కానీ వడిలిపోయిన బాబు ముఖం! అది చూడలేకపోయేది. కరుణ్ దగ్గిరకు తీయబోయినా బాబు వెళ్ళేవాడు కాదు. కోపంగా చూసేవాడు. ఆ కోపం పోగొట్టి లాలించి బుజ్జగించి ఆడించే ఓపిక కరుణ్ కి లేదు. పై పెచ్చు బాబు తిరస్కారం అతని మనసును గాయపరిచేది. ఆ తిరస్కారం ప్రకటిస్తున్నది ఆరేళ్ళ అమాయక ప్రాణి అనే విషయం గుర్తుకురాలేదు...
    తరుచుగా బాల ఫొటోముందు నిలబడి నిట్టూర్పు విడిచేవాడు కరుణ్ .రాధను చూడగానే ఏదో తప్పు చేసిన వాడిలా వెళ్ళిపోయేవాడు. అపరాధిలా ముడుచుకుపోయేది రాధ...
    రాధ హాస్పిటల్ లో ఉండగా కరుణ్ కూడా వచ్చేవాడు. శేఖర్ ఏమీ మాట్లాడేవాడు కాడు. కాని అతడు రాగానే లేచి వెళ్ళిపోయేవాడు. రాధ ఎవరితోనూ ఏమీ మాట్లాడేదికాదు. నీరసంగా ఉన్నట్లు కళ్ళుమూసుకుని పడుకునేది.
    రాధ పూర్తిగా కోలుకుంది. ఆ మరునాడు వెళ్ళిపోవచ్చునని డాక్టర్ చెప్పాడు...
    "రాధా!"
    దీనంగా పిలిచాడు శేఖర్__
    ఏమిటన్నట్లు చూసింది రాధ.
    "మన కంపెనీ హెడ్డాఫీస్ బెజవాడకు మార్చి దీనిని బ్రాంచ్ గా చేసాను. బెజవాడకు వెళ్ళిపోవాలనుకుంటున్నాను."
    రాధ మాట్లాడలేదు.
    "నువ్వూ వస్తావా రాధా!"
    ఉలికి పడింది రాధ. అభిమానానికీ, పౌరుషానికీ మారు పేరయిన శేఖర్ ఇలా దీనాతి దీనంగా ప్రాధేయపడుతున్నాడు.
    "ప్లీజ్ రాధా! బాబుకోసం !"
    కళకళ లాడుతూ కేరింతలు కొడుతూ తండ్రిమెడచుట్టూ చేతులు వేసిన బాబును చూసింది రాధ. అలా వాడి ముఖం చూసి ఎన్నాళ్ళయిందో?
    దిండులో ముఖం దాచుకుంది. దిండులోంచే అంది. "వస్తాను"
    రాధ మనసు ఏ క్షణంలో ఎలా మారుతుందో అన్నట్లు చక చక ప్రయాణపు ఏర్పాట్లు పూర్తి చేసాడు శేఖర్.
    బయలుదేరే రోజు వచ్చింది.
    "నన్నొక్కసారి స్వర్ణ దగ్గిరకి తీసికెళ్తారా?" అడిగింది రాధ.
    ఉలికిపడ్డాడు శేఖర్.
    "స్వర్ణ దగ్గరకా"
    "అవును."
    "అలాగే!"
    "ఒక మంచి పట్టుచీర, దానిమీదికి జాకెట్ కూడా తీసుకురండి!"
    "అలాగే!"
    అన్నింటికీ 'అలాగే' అంటోన్న శేఖర్ ని చూస్తే జాలేసింది రాధకి. భరించలేనట్లు తల తిప్పుకుంది.
    కారులో దిగిన శేఖర్ దంపతులను చూసి తెల్లబోయారు స్వర్ణ తల్లిదండ్రులు. సంభ్రమంతో సగౌరవంగానే ఆహ్వానించారు.
    స్వర్ణ వచ్చింది. కొయ్యబొమ్మలా నిలబడింది. తల ఎత్తి స్వర్ణను చూడటానికీ మాట్లాడటానికి శక్తినంతా కూడదీసుకుంది రాధ.
    "స్వర్ణా నేను వెళ్ళిపోతున్నాను__ఇది...నీకు బొట్టిపెట్టి ఇయ్యాలిని వచ్చాను."
    రాధ లేచింది. స్వర్ణకు బొట్టుపెట్టి పట్టుచీర చేతిలో పెట్టింది.
    "వెళ్ళొస్తానమ్మా" అంది.
    అకస్మాత్తుగా స్వర్ణ రాధను కౌగిలించుకుని బావురుమంది.
    చెమ్మగిల్లిన కళ్ళతో స్వర్ణ భుజం తట్టింది రాధ.
    ఎప్పటినుండో కరుణ్ రోడ్డుమీద పడిగాపులు పడుతూ నిల్చున్నాడని తెలుసు. అయినా అటు తలతిప్పలేదు. అతని నొక్కసారికూడా చూడలేదు.
    బాబు చెయ్యిపట్టుకుంది. కారులోవచ్చి కూచుంది. కారు కదిలింది.
    ఈ దరి నుండి పొంగుతున్నది.
    స్వరాలకు లొంగని__శ్రుతులకందని __మోహనగానం__
    ఆ దరినుండి వినవస్తున్నది.
    అద్భుత స్వర్గసమ్మేళనంలో...శ్రుతిబద్ధమైన ప్రణవనాద మాధురి.
    ఆ అద్యంతాల నడుమ ఉయ్యాలలూగుతున్నది చైతన్యం, ప్రాణుల ప్రణయ లాస్యాలతో ప్రణయ హాస్యాలతో... ఇదే నిరంతర మధుర విషాదగీతి__విశ్వగీతి.
 

                               * * *

 Previous Page Next Page