Previous Page Next Page 
అర్ధరాత్రి సూర్యోదయం పేజి 28


    "మీ అందరి భోజనాలు ఈ పూట మా ఇంట్లోనే!" చేతులు నలుపుకుంటూ అన్నాడు ముసలయ్య. "ఈ పూట మాత్రమే కాదు. ఇక్కడ నాలుగైదు రోజులుంటాం. అన్ని పూటలు మీ ఇంట్లోనే భోజనం!" గుండె గుభేలుమంది నామాలయ్యకి.
    "మహాప్రసాదం. తమరు మా ఇంటి ఎంత కాలం విందారగిస్తే మాకంత సంతోషం కానీ, తమరికెందుకంత శ్రమ? విషయం చెప్పండి! దోషిని పట్టి, మీ పాదాల ముందు పడేసే పూచీ నాది!" వినయంగా అన్నాడు నామాలయ్య. అతడి దగ్గర అన్ని కాలాల్లోనూ 'దోషులు' సిద్ధంగా ఉంటారనేది ఇన్ స్పెక్టర్ కీ తెలిసిన విషయమే!
    "అదేం కుదర్దులేవయ్యా! ఇన్వెస్టిగేషన్ జరపాల్సిందే! నీ దేవత లాకాయి, లూకాయిగాళ్ళని మాయం చేస్తే ఎవడికి ఏం పట్టేది కాదు. దేవత ఈసారి 'విదుషి' అనే అమ్మాయిని మాయం చేసిందట! ఆ అమ్మాయి ఏ.పి. చౌదరిగారి అమ్మాయి. ఇన్వెస్టిగేషన్ జరిపించి పూర్తి వివరాలు తెమ్మని ఐ.జి. లెవెల్లోంచి వచ్చాయి ఆర్డర్లు. అయినా, నీకు బుద్ధి లేదయ్యా! చౌదరి గారి అమ్మాయినా మాయం చేసేది!!!"
    నామాలయ్యకి ముచ్చెమటలు పట్టాయి. మొగవాళ్ళ విషయంలో అతడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. చిచ్చులాంటి వాళ్ళు ఇళ దరిదాపులకి కూడా చేరలేదు. కానీ, ఆడవాళ్ళ విషయం అతడంతగా పట్టించుకోలేదు. ఈ విదుషి ఎవరో అతడికిమీ తెలీదు.
    ప్రమధపురిలో పోలీస్ డేరాలు లేచాయి. వాళ్ళకి అన్నిరకాల సప్లైలూ సరఫరా చేసే బాధ్యత నామాలయ్య మీద పడింది. పోలీస్ జవాన్లు నామాలయ్య ఇంటికి వచ్చారు, తమ కోరికలతో! నామాలయ్య గూండాలు గ్రామం మీద పడ్డారు, ఆ కోరికలన్నీ సమకూర్చటానికి. అటు తిరిగీ యిటు తిరిగీ ఎప్పటిలాగే ఘొల్లుమంటున్నారు గ్రామ ప్రజలు.
    విదుషి జ్యోతిని అనుసరిస్తూ వెళ్ళగానే, ఇళ దుర్గ ముందు ధ్యానంలో కూచుంది. విదుషి దేవిని పరీక్షిస్తూ వెళ్ళటం ఇష్టం లేదు ఇళకి! దేవతా శక్తులను పరీక్షించకూడదనేదే ఇళ నమ్మకం. ఆ మాటే విదుషితో చెప్తే, విదుషి నవ్వేసి వెళ్ళిపోయింది. ఆ క్షణం నుంచీ ధ్యానంలో కూచుంది. దుర్గ విదుషిని కాపాడమని దుర్గాదేవిని ప్రార్థించటం కాదు, ఇళ ధ్యానం! కళ్ళు మూసుకోగానే, దుర్గ తేజోమూర్తి మనసును ఆక్రమించుకుంటుంది. ఆమె పంచేంద్రియాలూ, ఆ మూర్తిలో లయమవుతాయి. ఏ ఆశలూ, కోరికలూ, భయాలూ, దుఃఖాలు వుండవు. శరీరంగా భౌతిక జగత్తుకు అతీతంగా ఉండగలిగే తన్మయావస్థ. ధ్యానంలోంచి కళ్ళు తెరవగానే, అచ్యుతమ్మ తీర్థ ప్రసాదాలిచ్చింది. ప్రసాదంలో విదుషి ఇచ్చిన మాత్రలున్నాయి ప్రసాదం తీసుకున్నాక ఇళ అడిగింది.
    "విదుషి అక్క వచ్చిందా,అమ్మా?"
    అచ్యుతమ్మ ముఖం వెలవెల పోయింది.
    "ఇంతవరకూ రాలేదు." నీరసించిన స్వరంతో అంది.
    "రాలేదా? తెల్లవారక ముందే వస్తానంది. కొంపదీసి విదుషి అక్క కూడా..."
    "ఛ! ఛ! అలాంటిదేం జరగదు. ఒకవేళ ఆవిడ అట్నుంచి ఆటే, వాళ్ళ ఊరికే వెళ్ళిందేమో?"
    "అలా వెళ్ళదు."
    ఇళ దుర్గ వైపు తిరిగి రెండు చేతులూ జోడించి ప్రార్థించింది.
    తల్లీ! దుర్గామాతా! మా విదుషి అక్కను కాపాడు. జ్యోతి విషయం తెలుసుకోవాలనుకుంది. అంతే! కానీ, చాలా మంచిది. ఎంతో మంచిది. విదుషి అక్కని కాపాడితే, నేను సమర్పించుకుంటాను నీకు పట్టుచీర."
    ఇళ కనుకొలకుల్లో నుంచి నీటిబొట్లు జారుతున్నాయి. అప్పుడొచ్చారు పోలీసులు ఇంటరాగేషన్ కి! నామాలయ్య కూడా ఉన్నాడు. ఇక అతడు ఏ విషయంలోనూ ఏమాత్రం అజాగ్రత్తగా ఉండదలచుకోలేదు.
    "ఇళ అంటే మీరేనా?" అడిగాడు ఇన్ స్పెక్టర్.
    "అవును. ఏం?" అడిగింది ఇళ. అచ్యుతమ్మ ముఖం పోలీసుల్ని చూడగానే పాలిపోయింది. ఆమె మనసు ఏదో కీడుని శంకిస్తోంది.
    "విదుషిగారు మాయమయిన విషయం పరిశోధించటానికి వచ్చాం! ఈ విషయంలో మిమ్మల్ని ప్రశ్నలడగాలి."
    "విదుషి అక్క మాయమయిందా?"
    "వరసలు కలిపి అమాయకత్వం నటిస్తే దోషులు నిర్దోషులుగా మారిపోరు. అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి."
    "అడగండి!"
    "విదుషి గారు మీకెలా తెలుసు?"
    "...."
    "ఆవిడ మీ భక్తురాలా?"
    "కాదు. నా భక్తులెవరూ లేరు. అందరూ దుర్గామాత భక్తులు."
    "విదుషి గారు దుర్గామాత భక్తురాలా?"
    "కాదు. విదుషి అక్కకి దేవుళ్ళలో, పూజలలో నమ్మకం లేదు. నాతో చాలాసార్లు ఈ విషయంలో వాదించేది. "దేవుడు మనిషి చేసుకున్న రూపకల్పన. అలా రూపకల్పన చేసుకుని మనుష్యులు రోషాలూ, ఆవేశాలూ, ఈర్ష్యలూ, ద్వేషాలూ, పగలూ ఇవన్నీ దేవుళ్ళు కాపాదించి కథలల్లేసుకున్నారు. వాటినే పురాణాలన్నారు. బహుశా ఆ రోజుల్లో రాజుల దుర్నీతిని ఎదిరించలేని ప్రజలు, ఈ దేవుళ్ళ కథలలో దాక్కుని వాళ్ళని విమర్శించి ఉండవచ్చు. అందుకే దేవతలకు రాజైన ఇంద్రుడి మీద అన్ని వింత కథలు..." ఈ ధోరణిలో మాట్లాడేది."
    ఇన్ స్పెక్టర్ లో కుతూహలం పెరిగింది.
    "మరి, అలాంటి నాస్తికురాలు మీ దగ్గిరకి ఎందుకొచ్చినట్టు?"
    "నాకు తెలీదు. ఇక్కడి విషయాలు తెలుసుకోవటానికి కావచ్చు. లేదా చిచ్చు పంపి ఉండొచ్చు."
    "చిచ్చు? అతనెవరు? పరమానందంగా అడిగాడు ఇన్ స్పెక్టర్. కథ పాకాన పడుతోంది."
    "చైతన్యదేవ్! అతడి అల్లరి చూసి చిన్నతనంలో "చిచ్చు" అనేవారు. అదే స్థిరపడిపోయింది. జ్ఞానదేవ్ మాస్టారిగారి అబ్బాయి."
    "మీకెలా తెలుసు?"
    "మేము చిన్నతనంలో స్నేహితులం"
    "అంటే, పూర్వాశ్రమంలో అన్నమాట! మీరు చిన్నతనంలో స్నేహితులా? చిన్నప్పటి నుండీ స్నేహితులా?"
    "ఇప్పుడూ స్నేహితులమే! ఆ మధ్య నాకోసం వచ్చి చావుదెబ్బలు తిన్నాడు."
    ఇళ సమాధానాలు వింటోన్న నామాలయ్య కాళ్ళు వణుకుతున్నాయి. ఇళ పూజాపుష్పంలా స్వచ్చమైనదని నామాలయ్యకి తెలుసు. కానీ ఆమె అమాయకంగా నిజాయితీతో చెప్పే సమాధానాలు ఇన్ స్పెక్టర్ కి మరొకలా అర్థమవుతాయి. అతడికి ఇళ ఏం తెలుసు? లోక సామాన్యంగా ఆలోచిస్తాడు. నామాలయ్య భయపడినట్లే సన్నగా ఈల వేశాడు ఇన్ స్పెక్టర్.
    "ఇప్పుడెక్కడున్నాడూ?"
    "నాకు తెలీదు"
    ఇళ కళ్ళు చెమ్మగిల్లాయి. నామాలయ్యకి రగిలిపోతోంది.

 Previous Page Next Page