"తెలుసుకోవాలని ప్రయత్నించలేదా?"
"లేదు."
"ఏం?"
"ఆ ప్రయత్నం లాభం లేదని తెలుసు గనుక!"
నామాలయ్య గుండె రేసుగుర్రంలా కదను తొక్కింది భయంతో. ఇన్ స్పెక్టర్ ఏ కళనున్నాడో "లాభం ఎందుకు లేదు?" అని అడగలేదు.
"అయితే చిచ్చు పంపించాడన్నమాట విదుషిని..." సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు. ఓరగా అదొక మాదిరిగా ఇళని చూశాడు. ఆ చూపులు చీదరించుకుంది ఇళ. ఆ చీదర ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. మనసులో ఒక భావాన్ని దాచుకుని, ముఖంలో మరొక భావం చూపించటం ఇళకి తెలీదు.
ఇళ ముఖంలో చీదర చూసి చటుక్కున సర్దుకున్నాడు ఇన్ స్పెక్టర్.
"ఇంతకూ విదుషి వచ్చింది నీ దగ్గరకే?"
అతడు నవ్వుతూనే అంటున్నాడు ఇళని. చిచ్చు విషయం తెలిసాక మన్నింటి మాట్లాడాలనిపించలేదు.
"అవును. నా దగ్గిరకే!"
"నీ ఇంట్లోనే దించి."
"అది నా ఇల్లు అనుకుంటే...అవును. కానీ, నాకసలు ఇల్లనేది లేదు."
ఘొల్లున నవ్వాడు ఇన్ స్పెక్టర్...
"భలే వేదాంతం! అద్సర్లేకాని, నీ ఇంట్లోంచి విదుషి ఎక్కడికి వెళ్ళింది?"
"జ్యోతి విషయం తెలుసుకుంటానని వెళ్ళింది."
"జ్యోతి విషయం తెలుసుకోవాలని వెళ్ళిన వాళ్ళెవరూ తిరిగిరాలేదు కదూ."
"అవును."
"ఏమయ్యారు వాళ్ళందరూ?"
"తెలీదు. వాళ్ళెవరో కూడా తెలీదు."
"విదుషి కూడా అలాగే మాయమయింది అవునా?"
ఇళ సమాధానం చెప్పలేదు. ఆమె కళ్ళలో ఆవేదన... ఇన్ స్పెక్టర్ కి చాలా విచిత్రంగా ఉంది.
"దుర్గామాత చంపి ఉంటుందా విదుషిని?"
ఉలిక్కిపడింది ఇళ....
"తనను నమ్మనంత మాత్రాన ఎంతో మంచిదైన విదుషిని దుర్గ చంపుతుందా?"
విదుషి మాయమైన మరుక్షణం నుంచి తన మనసులో సుడులు తిరుగుతోన్న ప్రశ్న లోకం ముందు బయటపెట్టింది ఇళ. తెల్లబోయాడు ఇన్ స్పెక్టర్. ఇళ నోట అతడా సమాధానం ఆశించలేదు. ఆమె ముఖంలో స్వచ్చమైన అమాయకత్వం అతడికి ఆశ్చర్యం కలిగిస్తోంది. పోలీసు వృత్తిలో చాలా రోజులుగా ఉన్నాడతడు. ఆ అమాయకత్వం నటన కాదని గ్రహించగలడు.
"మీరు ఆశ్రమంలోనే ఉండాలి. మా ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యేవరకూ ఎటూ కదలకూడదు." ఆజ్ఞాపిస్తున్నట్లు అన్నాడు. విచిత్రంగా నవ్వింది ఇళ.
ఇన్ స్పెక్టర్ కి అర్థం కాలేదు. ఇళ నవ్వులో కాక మాటల్లో అసలు విషయం చెప్పనందుకు కొండ దేవతకి దణ్ణం పెట్టుకున్నాడు నామాలయ్య.
* * * *
ఇళకి భక్తురాలిగా ప్రఖ్యాతి పెరిగిన తర్వాత ప్రజలలో ఆమె సాక్షాత్తూ, దుర్గాదేవి అవతారమని నమ్మకం ప్రబలిన తర్వాత ప్రమధపురిలో రెండు మూడు హోటల్స్ వెలిశాయి. పోలీసులు వచ్చిన దగ్గిరనుంచి ఇళ గుడికి భక్తులు రావటం లేదు. తమ రక్షక భటులంటే, ప్రజలకు అంత హడల్! "దేవి దర్శనం మాట దేవుడెరుగు, తమని ఏ నేరంలోనైనా ఇరికిస్తారేమో?"నని భక్తులంతా దర్శనాలు మానుకున్నారు. హోటళ్ళకి రాబడి బాగా తగ్గిపోయింది. భక్తుల రాకలు లేకపోగా పోలీసులు జబర్దస్తీగా పడి తింటున్నారు. హోటల్ ప్రొప్రైటర్లు లబలబ లాడిపోతూ నామాలయ్యని కలుసుకుని తమ గోడు చెప్పుకున్నారు. పోలీసులు ప్రమధపురిలో తిష్ట వెయ్యటం నామాలయ్యకే బాగోలేదు. నలుగురూ కాసేపు మంతనాలాడుకున్నారు.
పోలీస్ కానిస్టేబుల్స్ లో ఒకరికి విరేచనాలు పట్టుకున్నాయి. మరొకరికి వాంతులు. ఇన్ స్పెక్టర్ భార్యకి ఎవరో ఆకాశరామన్న ఉత్తరం రాశారు.
"దేవి గురించి పరిశోధనలు మొదలుపెట్టిన వాళ్ళెవరూ బతికి బట్టకట్టలేదు. నీ పసుపు కుంకుమలు చల్లగా వుండాలి అనుకుంటే, నీ భర్తని వెన్నె వెనక్కి పిలిపించుకో?"
ఇన్ స్పెక్టర్ కి టెలిగ్రాం వచ్చింది.
"సుమతి సీరియస్. స్టార్ట్ ఇమిడియెట్లీ."
పోలీస్ కానిస్టేబుల్స్ ఇద్దరూ మనసులో కొండదేవతకి చెరొక డజను కొబ్బరికాయలు మొక్కుకున్నారు. "ఈ గండం గడిచి బయటపడితే, మరోసారి దేవి జోలికిరామని" మనసులో లెంపలేసుకున్నారు. హోటల్ ప్రొప్రైటర్లు హోటల్స్ మూసేసి ఒక రాత్రివేళ సిటీకి వెళ్ళిపోయారు. కొండజాతి వాళ్ళెవరూ అడవి దాటి గ్రామం సరిహద్దులకైనా రావటం లేదు. గ్రామస్థులెవరూ తలుపులు తెరవటంలేదు. నామాలయ్య ఏపూటకాపూట భోజనం పంపుతున్నాడు. కాని దానిలో రుచీపచీ ఉండటంలేదు. ఇంకా ప్రమధపురిలో ఉండటంలో ఛార్మ్ కనపడలేదు. పోలీసులకి తన భార్య అనారోగ్యం గురించి చాలా బెంగగా ఉంది ఇన్ స్పెక్టర్ కి! అయినా వొట్టి చేతుల్తో ఎలా వెళ్ళటం? అతడికి ఒక ఆలోచన స్ఫురించింది. అందుకు నామాలయ్య ఏమంటాడో?
"నామాలయ్యగారూ! మేం వట్టి చేతుల్తో వెళ్ళటానికి వీల్లేదు. ఈసారి మాయమయిన విదుషి ఎ.పి. చైదరిగారి అమ్మాయి పాప పుణ్యాలు పైనున్న వాడికి తెలియాలి. ఇళని అరెస్ట్ చేసి తీసుకుపోవటం తప్ప మాకు మరో మార్గం లేదు."
మనసులో పొంగిన సంతోషాన్ని కష్టంమీద అణచుకున్నాడు నామాలయ్య. ఇన్ స్పెక్టర్ తో ఇళ మాట్లాడిన తీరు గమనించిన తర్వాత నామాలయ్యకి ఇళ మీద చాలా కోపంగా ఉంది. ఆ అమ్మాయి ఎక్కడ కొంప ముంచుతుందో అని భయంగానూ ఉంది. అంచేత ఇళ కొన్నాళ్ళు జైల్లో ఉంటేనే మంచిదనుకున్నాడు. తన తడాఖా తెలిసొస్తుంది.
మొసలి కన్నీళ్ళు కారుస్తూ "పాపం, ఆ పిల్ల దేవతా స్వరూపమండీ! అయినా మీ విధి నిర్వహణకి అడ్డుపడను. నిజానిజాలు నిలకడమీద తేల్తాయి" అన్నాడు నామాలయ్య. ఇంత తొందరగా ఒప్పుకున్నందుకు తేలిగ్గా నిట్టూర్చాడు ఇన్ స్పెక్టర్.
* * * *
ఇళ పూజలోంచి వచ్చేవరకూ ఆగి "నిన్ను అరెస్టు చేస్తున్నాం!" అన్నాడు ఇన్ స్పెక్టర్. చిరునవ్వుతో చేతులు ముందుకు జాపింది ఇళ. అచ్యుతమ్మ ఘోల్లుమంటూ, "ఇదెక్కడి అన్యాయమండీ! అభం శుభం తెలియని పసిదాన్ని జైలుకి తీసుకువెళ్తున్నారా? ధ్యానంలో కూచోవటం తప్ప ఈ లోకంలో దానికే సంబంధమూ లేదు" అంది. ఇళ ప్రశాంతంగా చిరునవ్వుతో "ఎందుకమ్మా ఏడుస్తావు? ఒకరకం జైలులోంచి, మరోరకం జైలులోకి వెళ్తున్నాను అంతే గదా!" అంది. ఆ మాటలు పూర్తి అర్థం తెలియని ఇన్ స్పెక్టర్ తెల్లబోయాడు. తెలిసిన నామాలయ్య లోలోపల పళ్ళు నూరుకున్నాడు.