"ఈ అమ్మాయి మా బంధువులమ్మాయి. కన్న కూతురిలాగే చూసుకుంటున్నాం. మీ చైతన్యదేవ్ కి చేసుకోమని అడగటానికి పిలిపించాను" దర్పంగా అన్నాడు నామాలయ్య. అతడు 'చిచ్చు' అనకపోవటం తండ్రీ కొడుకులిద్దరూ గమనించారు. "మన కులాలు ఒకటి కావు" నసిగాడు జ్ఞానదేవ్. నామాలయ్య "అహ్హహ్హ" అని నవ్వాడు.
"ఇంకా మనకి మతాలూ, కులాలూ ఏంటయ్యా! కులాంతర వివాహం చేసినట్లు పేపర్లో వస్తది. మన ఫోటోలు కూడా వస్తయ్. యాభై వేలు కట్నం, రెండెకరాల మాగాణీ, పిల్ల సరే బంగారం. పది తులాల బంగారం కూడా పెడతాను" దర్పంగా అన్నాడు నామాలయ్య.
"నాదేముందీ! చిచ్చు యిష్టం!" తప్పుకున్నాడు.
"ఏమయ్యా! చిచ్చులయ్యా! ఏమంటావ్?" గోల్డెన్ ఛాన్స్."
ఒక్క క్షణం ఆగి "ఆలోచించుకుని చెప్తాను" అన్నాడు చిచ్చు. తెల్లబోయాడు జ్ఞానదేవ్.
* * * *
విదుషి వచ్చింది. విదుషి ఎప్పుడొచ్చినా, అచ్యుతమ్మకి పండుగలా ఉంటుంది. తన కూతురు ప్రాణాలు కాపాడటానికి వచ్చిన దేవదూతలా అనిపిస్తుంది. కుశల ప్రశ్నలూ, భోజనాలు. వగైరాలయ్యాక విదుషి, ఇళ కూర్చున్నారు కబుర్లకి.
"ఒంట్లో ఎలా ఉందీ?" అడిగింది విదుషి.
"ధ్యానంలో ఉంటున్నంతసేపూ ఏం అనిపించదు. కానీ, ఏదయినా పని చెయ్యబోతే కళ్ళన్నీ బాగా నొప్పి పెడుతున్నాయి. బాధ భరించలేకపోతున్నాను" చివ్వున నీళ్ళు తిరిగాయి విదుషికి. జనంచేత దేవతగా ఆరాధించబడే ఈ పిల్ల ఎలాంటి విచిత్ర నరకం అనుభవిస్తోంది!
"నేను కొన్ని మాత్రలిస్తాను వేసుకో. నొప్పి తగ్గిపోతుంది."
"వద్దు. నేను దేవి ప్రసాదం తప్ప ఏమీ తీసుకోను. ప్రసాదంతోనే నాకు నయమౌతుంది."
గుండె గుభేలుమంది విదుషికి. ఆ పరిసరాలలో తచ్చాడుతున్న అచ్యుతమ్మ సైగతో విదుషిని పక్కకి పిలిచింది.
"అమ్మా! ఆ మాత్రలేవో నాకియ్యి. ప్రసాదంలో కలిపి ఇస్తాను. ఇప్పుడిప్పుడు అది నా మాట బొత్తిగా వినిపించుకోవటం లేదు."
మాత్రలు అచ్యుతమ్మకిచ్చింది విదుషి.
"ఇలా ఎన్నాళ్ళూ?" అడిగింది.
"చూద్దాం!" నిట్టూర్చింది అచ్యుతమ్మ నీరసంగా. ఇళ దగ్గరకి వచ్చి కూర్చుంది విదుషి.
"అక్కా! చిచ్చుని రాణి పెళ్ళి చేసుకుంటున్నదా?" నెమ్మదిగా అడిగింది ఇళ.
"ఎవరు చెప్పారు?"
"రాణి చెప్పింది."
"యాభైవేలు కట్నం! పది తులాల బంగారం. నాలాంటి పిల్ల! చేదా?" గర్వంగా అడిగింది రాణి.
"నువ్వు దేవివి! ఈ లౌకిక విషయాలన్నీ నీకెందుకూ?" అడిగింది విదుషి వాలిపోయిన ఇళ ముఖం చూసి నవ్వు ఆపుకుంటూ.
"ఊరికే అడిగాను" తలవంచుకుని అంది ఇళ. ఎవరో పిలిస్తే బయటికి పరుగెత్తింది రాణి. అప్పుడు చెప్పింది ఇళ.
"ఏమోనక్కా! ఈ మధ్య నాకు ధ్యానం నిలవటం లేదు. కళ్ళు మూసుకుంటే నాకోసం దెబ్బలు తిన్న చిచ్చు ముఖమే కనిపిస్తోంది. వంట్లో భరించలేని బాధ."
విదుషికి జాలేసింది.
"దుర్గ కూడా పెళ్ళి చేసుకుంది చిచ్చరకంటి వాణ్ణి" భావగర్భితంగా అంది. ఆ ధ్వని అర్థమయినట్లు తీయగా నవ్వింది ఇళ. "ఎంత అమంగా ఉంది కల్లా కపటంలేని ఈ నవ్వు?" అనుకుంది విదుషి.
ఆ రాత్రి మళ్ళీ చీకట్లో జ్యోతి కనిపించింది. అందరూ కలిసే చూశారు.
"రేపు ఈ జ్యోతిని అనుసరిస్తాను!" అంది విదుషి. ఇళ కంగారుగా "వద్దక్కా! ఇప్పటివరకూ జ్యోతి రహస్యం కనిపెట్టాలని వెళ్ళినవాళ్ళు తిరిగి రాలేదు" అంది.
"దుర్గామాత తనను పరీక్షించాలనుకొనే వాళ్ళను క్షమించదు" రోషంగా అంది రాణి.
"సత్యాన్వేషణలో ఎందరో తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఫర్వాలేదు. నేను తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. కాని జ్యోతి రహస్యం మాత్రం బయటపడి తీరుతుంది" స్థిర నిశ్చయంతో అంది విదుషి.
మరునాడు రాత్రి చేతిలో టార్చ్ లైట్ తో బయలుదేరింది విదుషి. "నేనూ వస్తాను" అనాలనుకుంది ఇళ. అనలేదు. తనను ఆ ఆవరణ దాటనీయరని తెలుసు.
"మీరు లైట్ తో వెళ్తే జ్యోతి కనిపించదు."
విదుషి కొన్ని క్షణాలు ఆలోచించి, టార్చ్ లైట్ ఇళకిచ్చింది.
"నేనొకవేళ తిరిగి రాకపోతే నాకోసం వచ్చిన వాళ్ళకి ఈ టార్చ్ లైట్ ఇయ్యి."
ఇళకీ, అచ్యుతమ్మకీ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. జ్యోతి కనపడేవరకూ ఆగింది విదుషి. తర్వాత టార్చ్ కూడా లేకుండా, ఒంటరిగా జ్యోతిని అనుసరిస్తూ అడవిలోకి బయలుదేరింది.
12
ప్రమధపురిలో ఎక్కడచూసినా పోలీసులు. ఆ గ్రామంలో పోలీసులు ప్రవేశించి కొన్ని దశాబ్దాలయింది. అడవుల్లో కోయగూడేల ప్రజలు పొరపాటున కూడా పోలీసుల్ని ఆహ్వానించరు. వాళ్ళలో ఎన్ని వున్నా, అన్నీ వాళ్ళలో వాళ్ళు సర్దుకుంటారు. కుల పెద్ద తీర్పుకి కట్టుబడి ఉంటారు. ఇక గ్రామంలో నామాలయ్య లాంటి పెద్దలు, పోలీసుల్ని పొలిమేరల్లోకి కూడా రానివ్వరు. గొడవలు జరుగుతాయి. అక్కడికక్కడే "హుష్ కాకీ!" అయిపోతాయి. హత్యలు జరుగుతాయి. శవాలు నామరూపాలు లేకుండా మాయమైపోతాయి. ఊరంతా జరిగిన విషయం తెలిసినవాళ్ళు ఒక్కరూ వుండరు. అలాంటిది ప్రమధపురిలో పోలీసులు. కోయగూడెం మనుష్యులు అడవుల్లోకి పారిపోయారు. గ్రామవాసులు ఇళ్ళలో దూరి తలుపులేసుకున్నారు. నామాలయ్య ప్రభృతులకి మాత్రం వచ్చిన వారిని పలకరించక తప్పలేదు.
"మామీద దయ గలిగిందేమిటి?" అని పలకరించాడు ఇన్ స్పెక్టర్ని, ఇన్ స్పెక్టర్ ధుమ ధుమ లాడుతున్నాడు. "మా కర్మాన మమ్మల్ని వుండనియ్యరు గదయ్యా! ఏంటి, ఇక్కడ జరుగుతోన్న భాగోతం? మీరంతా కలిసి మనుషుల్ని మాయం చేస్తున్నారంట! ఆ గుడేంటి? దేవతేంటి? ఆ పిల్లెవరు? జ్యోతెట్టా వస్తాంది అడవిలోకి? ముఖ్యంగా మాయమైన మనుషులందరూ ఏమైపోతున్నారు!" గుండె గుభేలుమంది నామాలయ్యకి. విషయం ఇంత దూరం ఎలా వచ్చిందో అతనికర్థం కావటం లేదు.
"గుడి దేవుదండీ! మనదేశంలో పదేసి గజాలకొక గుడి! ఇక దేవతలంటారా? పూనకాలు, అమ్మవారు మీదకి వచ్చి సత్యాలు ఇవన్నీ ఎక్కడ లేవూ!"
"అన్నీ వున్నాయి. మనుష్యులు మాయమవటాలే లేవు."
నామాలయ్య మోకాళ్ళు వణికాయి. తన పక్కనేవున్న ముసలయ్యకి సైగచేసి, పోలీస్ బలగాని కంతకూ కాఫీ ఫలహారాలు తెప్పించాడు.