Previous Page Next Page 
పెళ్ళి చేసి చూడు పేజి 27


    వెంకట్రామయ్య నభినందించే బంధువులా యింటి పరిస్థితుల నాశ్చర్యంగా గమనిస్తూ మధ్యాహ్నం నిద్ర పోలేదు. అభిమానించని బంధువులకు బాధతో నిద్ర పట్టలేదు. మిగతా వాళ్ళకు హడావుడిలో నిద్ర పట్టలేదు. ఆరోజు మధ్యాహ్నం నిశ్చింతగా నిద్ర పోగలిగినది వెంకట్రామయ్య , పార్వతమ్మ మాత్రమే!

                                              18
    పెళ్ళి వారొచ్చారు. హడావుడి ప్రారంభమై పోయింది. రాజమండ్రి వరకూ ట్రయిన్ లో వచ్చి అక్కడ్నించి బస్సు ఏర్పాటు చేసుకుని వచ్చారు పెళ్ళి వారు. వాళ్లోచ్చే సమయానికి భజంత్రీలు రెడీగా ఉన్నారు. మేళ తాళాలతో పెళ్ళివారు విడిదింట ప్రవేశించారు.
    విడిదింట్లో ఇద్దరు మనుషుల్ని పెట్టాడు రాజారావు నీళ్ళు సరఫరా చేయడానికి. ఆ ఇంట్లో ఒక పైపు వుంది. దాన్ని కొట్టడానికి చేతుల్లో కాస్త శక్తి ఉండాలి. మగపెళ్ళి వారి అవసరాన్ని చూడ్డానికి శ్రీకాంత్ నక్కడుంచాడు రాజారావు.
    పూరీ కూర టిఫిన్ చేశారు బ్రాహ్మలు. జనం అంచనాకు మించి వచ్చేరనడానికి సాక్ష్యంగా అది పూర్తిగా చెల్లిపోయింది. రెండపదపా ఉప్మా చేశారు. మగపెళ్ళి వారిలో కొంతమంది పూరీ కూర యిచ్చి మరికొంత మందికి ఉప్మా రావడం చిన్నతనంగా తోచింది. అయితే భీమరాజు వారిని శాంత పరిచాడు. "పెళ్ళిలో రుచిలేమిటి --కడుపులో కేదో ఒకటి ఇంత పడటం ప్రధానం కానీ ."'    మగ పెళ్ళి వారిలో చాలామందికి ఉదయం పూట నాలుగయిదు సార్లు కాఫీలు తాగటం అలవాటుంది. అటువంటి అలవాటును తాత్కాలికంగా పెళ్ళి సమయంలో మానుకుందుకు వారు మగ పెళ్ళి వారు కదా.
    పాలు అంచనాకు మించి ఖర్చయ్యేలా వున్నాయి. రాజారావు మేనత్త కొడుకు నోకడ్ని పిలిచి "ఒరేయ్ రేపటికి పాలు యింకా ఎక్కువ కావల్సొచ్చేలాగుంది. బొబ్బర్లంక వెళ్ళి పాల సైకిల్ వాళ్ళని కాసి పట్టుకుని రేపటికి మరో రెండు పదులు ఇరవై లీటర్ల పాలు కావాలని చెప్పు. అన్నీ ఈ ఊరతనే ఇవ్వలేడు" అన్నాడు. అతను క్షణాల మీద సైకిల్ వేసుకుని బొబ్బర్లంక వెళ్ళిపోయాడు. అతను రాజారావు మాటల్నేలా అర్ధం చేసుకున్నాడో తెలియదు కానీ ఇరవై లీటర్ల పాలతో విజయగర్వంతో తిరిగి వచ్చాడు.
    "నేనడిగినదీ ఈరోజు కాదు రేపటికి" అన్నాడు రాజారావు. అతనూ చిన్న బుచ్చుకున్నాడు. అయితే మరో అరగంటలోనే అతను చేసిన పొరపాటు పనికి వచ్చింది. "పాలన్నీ అయిపోయాయి -- ఇంకా కాఫీలకు కబుర్లోస్తూనే వున్నాయి. నా అనుభవంలో ఇంతలా కాఫీలు తాగిన పెళ్ళి వారిని చూడలేదు.' అంటున్నాడు వంటాయన రావుగారు. రాజారావు మేనత్త కొడుకుని కౌగలించుకున్నంత పని చేసి, "చేసింది పొరపాటే కాని పరువు కాపాదావురా " అన్నాడు.
    విడిదింటి దగ్గర్నుంచి కబురు వస్తే రాజారావు వెళ్ళాడు. రాజారావును చూస్తూనే --- ఒకాయన ----- "నువ్వేనా పెళ్ళి కూతురు అన్నవి ---' అన్నాడు.
    రాజారావు వినయంగా ----"అవునండి --"అన్నాడు.
    'చంటి పిల్లల్తో వచ్చిన వాళ్లిక్కడ చచ్చి పోవాలనుకున్నా రెంటయ్యా - పాలకోసం పిల్లలేడ్చేస్తున్నారు - గంట నించీ కబురు మీద కబుర్లు పంపుతున్నాం - పాలు రావడం లేదు......' అన్నాడాయన.
    రాజారావు పౌరుషం , ఉక్రోషం రాగా --అసహాయత వాటిని దుఃఖంగా మార్చింది. పెళ్ళయ్యే లోగా ఇంకా ఇలా ఎన్ని మాటలు పడాల్సుందో అనుకుని- అతను పైకి మాత్రం శాంతంగా -- 'అలాగే ఇప్పుడే పంపిస్తానండి-----' అన్నాడు.
    "ఈ కబుర్లే ఇందాకట్నుంచి వింటున్నాం -----' అన్నాడాయన దురుసుగా.
    ఆ సమయంలో అక్కడకు భీమరాజు వచ్చి ----"ఏమిటండి --' అని రాజారావుని పలకరించాడు.
    రాజారావు మాట్లాడే లోగానే ఆ బంధువు "ఇందాకట్నుంచి పిల్లలు పాల కేడుస్తుంటే పంపిస్తాను పంపిస్తాను అనేవాడే గానీ ---గుక్కెడు పాలిచ్చిన పెద్ద మనిషి లేడు, పిలిచి కాస్త గడ్డేడుతున్నాను." అన్నాడు.
    భీమరాజాయన వంక తీవ్రంగా చూసి "ఈయనేవరను కుంటున్నావు. సెంట్రల్ గవర్నమెంట్లో వెయ్యి రూపాయల జీతగాడు. ఏం చదివాడను కుంటున్నావ్. యూనివర్సీటీలో డాక్టరేట్ చేశాడు. రేపెదయినా అవసరపడితే నువ్వే ఈయన దగ్గర కెళ్ళి చేతులు నలుపుతూ నిలబడతావు. మగపెళ్ళి వారం కదా అని మర్యాద మరచి మాట్లాడకూడదు. వాళ్ళనేదయినా అన్నావంటే నేనే సహించను. ఇప్పటికి విడిదింటికి మూడు బిందెల కాఫీ, రెండు బిందెల పాలూ వచ్చాయి. అడిగిన మేరకూ వాళ్ళు పంపిస్తూనే వున్నారు. మనకు కాస్త ఓర్పు అవసరం. నీకేం కావల్సినా నన్నడుగు. వాళ్ళతో నీకేం సంబంధం లేదు. నువ్వు నా అతిధివి. నీ అవసరాలు నేను చూస్తాను. అని "మీరు వెళ్ళి పనులు చూసుకోండి" అన్నాడు భీమరాజు రాజారావుతో.
    ఆయనకు భీమరాజంటే వున్న భయభక్తుల కారణంగా కాబోలు మరేం మాట్లాడలేదు. రాజారావు కేం మాట్లాడాలో తెలియలేదు. అతను కృతజ్ఞత తో భీమరాజు కు నమస్కారం చేసి ఆక్కడ్నించి బయటపడ్డాడు.
    మగపెళ్ళి వారు కాగానే వ్యక్తులు తమ అంతస్తులు మరచిపోయి సాటి సంసారిని పీడించాలను కుంటారు. ఇదెక్కడి సంస్కృతో. ఇదేం సంస్కారమో అర్ధం కాదు. కాని బీమరాజు లాంటి మనుషులు ఇలాంటి వాళ్ళకు సమాధానం చెప్పడానికి మగపెళ్ళి వారిలోనే వుండడం అరుదయిన అదృష్టం.
    "లక్ష్మీ అదృష్టవంతురాలు " అన్నాడు రాజారావు.
    ఆరోజు సాయంత్రానికి పాల ఖర్చు గురించి సరయిన అంచనా వేసియి యిచ్చింది విరజ. రాజారావు పలసరఫరా మనిషికి కబురు పంపించాడు. అతనంతా విని మొత్తం పాలు తనే సరఫరా చేయగలనని హామీ యిచ్చాడు. "పాలు మాత్రం బాగుండాలి సుమా....' అని రాజారావు హెచ్చరించాడు.
    ఇల్లంతా ఏమిటో చాలా  హడావుడిగా వుంది. ఎవ్వరూ కాళీగా కనబడడం లేదు. అందరి ముఖాల్లోనూ కంగారు. ఉత్సాహం కనిపిస్తున్నాయి. తన బంధువుల కుర్రాళ్ళు చాలామంది నడుం కట్టి వడ్డనలో దిగారు. వంట బ్రాహ్మలు చాలా సరదాగా వున్నారు. వాళ్ళ వంటలు చాలా బాగున్నాయి, ముఖ్యంగా వాళ్ళు కాచిన చారు అమృత ప్రాయమై పోయింది.
    చెప్పుకోదగ్గ గొడవలేమీ లేకుండానే ఆరోజు రాత్రి భోజనాలు కూడా అయిపోయాయి. మనుషులెంత మంది వున్నప్పటికీ ....సమయానికేవరూ అందుబాటులో లేకపోవడం కారణంగా విరజతో కలసి బాలెంత రాలయిన వసుంధర పెళ్ళి కొడుక్కి భోజనం తీసుకు వెళ్ళింది. అతను తన్ను తాను వారికీ పరిచయం చేసుకుని చాలా మర్యాదగా వారితో మాట్లాడాడు.
    భీమరాజు గారు రాజారావునీ, మోహనరావునీ ఆరోజు అధమ పక్షం అయిదారు సార్లయినా కలిసి "ఇది మాయింట్లో పెళ్ళి, అన్ని కనుగలిసినట్లు జరిగిపోవాలి. ఏ గొడవా రాకుండా నేను చూసుకుంటాను. మీకే ఇబ్బందులున్నా నాతొ చెప్పండి ." అన్నాడు.
    ఆహామీ అన్నాదమ్ములిద్దరికీ విపరీతమైన ధైర్యాన్నిచ్చింది.
    ఇప్పటికీ తన బంధువుల ధోరణి అన్నదమ్ములిద్దరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎక్కడా అరమరికలులేకుండా ప్రతి ఒక్కరూ సహాయపడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మగ పెళ్ళి వారికెంతో అంతసేవలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే రాత్రి పడుకున్నప్పుడు మాత్రం తన మీద బాగా నేరాలు చెప్పుకున్నట్లు గూడచారుల ద్వారా మోహన్రావు తెలుసుకోగలిగాడు.
    పెళ్ళి ఎక్కడ చేయాలన్న విషయాన్నింకా వెంకట్రామయ్య స్థిర పరచలేదు. ఇంక తెల్లవారు జామునే పెళ్ళి కాబట్టి నిర్ణయం తీసుకోక తప్పలేదు. వీధి పందిట్లో అయితే కన్వినియంటుగా వుంటుందని యువతరం అభిప్రాయ పడింది. అనాదిగా ఈ ఇంట పెళ్ళిళ్ళన్నీ మండువా లోనే జరుగుతూ వచ్చాయని వెంకట్రామయ్య అన్నాడు. మండువా కాస్త ఇరుకుగా వుంటుంది. పెళ్ళికి చాలామంది జనం కాబట్టి వీధిలోనే అయితే బాగుంటుందని మరోసారి మోహన్రావు అన్నాడు. వెంకట్రామయ్య మాట్లాడలేదు. తపప్నిసరై అంగీకరించినట్లూరుకున్నాడు.

 Previous Page Next Page