Previous Page Next Page 
పెళ్ళి చేసి చూడు పేజి 28


    రాజమండ్రి నుంచి ఫోటో గ్రాఫర్ వచ్చాడు- ఆ రాత్రి తొమ్మిది గంటలకు. అతను వస్తాడో రాడోనని కంగారు పడుతున్న మోహనరావు నిట్టూర్చి అతనికి భోజనం ఏర్పాట్లు చేయించాడు.
    ఉదయం విడిదింట్లో జరిగిన స్నాతకం తంతు గురించి ముచ్చటించుకున్నారు రాజారావు, వసుంధర, విరజ, మోహనరావు. వాళ్ళు తనకు పెట్టిన బట్టలు చూసుకుంటూ మోహనరావు "ఫరవాలేదు - ఇంత పెళ్ళి ఖర్చు పెట్టినందుకు నాకూ ఏదో కాస్త కిట్టింది...." అన్నాడు.
    స్నాతకంలో వరుడు ఒక చిన్న మూట కట్టుకుని, తాటాకు గొడుగు వేసుకుని - జీవితం మీద విరక్తి చెందినవాడై కాశీకి ప్రయాణమవుతాడు. అప్పుడు పెళ్ళి కూతురు అన్నగారితని గెడ్డం కింద బెల్లం ముక్క పెట్టి --తన చెల్లెల్నిచ్చి పెళ్ళి చేస్తానని ఆశ పెట్టి కాశీ ప్రయాణం ఆపుతాడు. బావమరుదు లిద్దరూ పరస్పరం బట్టలు పెట్టుకుంటారు.
    "ఇంటికి పెద్ద కొడుకువి ---ఖర్చు పెట్టడం లోనే నీతో నాకు వాటా కానీ నీ లాభాల్లో నాకు వాటా వుండదు" అన్నాడు రాజారావు.
    "ఈ బట్టల్ని చేరి సగం చేసుకుందుకు నాకేం అభ్యంతరం లేదు- చెరో కాలు, చెరో చెయ్యి కుట్టించుకోవచ్చు...." అన్నాడు మోహనరావు.
    "బావగారూ చాలా తెలివైనవారు. పోనీ ఒకరు ప్యాంటూ, ఒకరు షర్టూ కుట్టించుకోవచ్చు కదా" అంది వసుంధర.
    "మొత్తం రెండూ మీరు తీసుకోండి - కాదన్నామా ?" అంది విరజ.
    ముహూర్తం తెల్లవారుఝామున వుంది. అంటే హడావుడి రెండు గంటలనిం'చీ ప్రారంభమవుతుంది. వధూవరులకు మంగళ స్నానాలు చేయించాలి. వధూవరుల తల్లిదండ్రులు కూడా తల స్నానాలు చేయాలి. అందుకు నీళ్ళు అవీ కాచి సిద్దంగా ఉంచాలి.
    ఎవరికీ సరిగ్గా నిద్రలు లేవు.
    సుమారు రెండు గంటల ప్రాంతంలో నిద్ర లేచాడు రాజారావు. అతనంత సేపూ కటిక నేల మీద పడుకుని వున్నాడు. అప్పటికే విరజ లేచి వ్యవహారాలూ చూస్తోంది.
    అప్పుడు లేచి ముఖం కడుక్కున్నాక రాజారావు కానీ విరజకు గానీ మోహనరావుగానీ ఆ ఇంట్లోని ఏ ఇతర ముఖ్యులకు గానీ టయమెలా గడిచిందో తెలియదు.
    తెల్లవారుఝామున వర్షం వచ్చే లక్షణాలు కనిపించగా వెంకట్రామయ్య గారన్న ప్రకారం వివాహ వేదిక ఇంటి మండువా లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు వెంకట్రామయ్యగారి ముఖంలో వెలుగు కనిపించింది. అన్నీ నాన్నగారనుకున్నట్లగానే జరుగుతున్నాయనుకున్నాడు రాజారావు.
    మంగళ స్నానాలు , పానకం బిందెలు వగైరా వ్యవహారాలూ ముగిసి --తంతు పీటల మీద కూర్చోవడం వరకూ వచ్చేసరికి రాజారావు, విరజ పెట్టె దగ్గరుంచుకుని పురోహితునికి దగ్గర్లో కూర్చున్నారు.
    ఏమిటేమిటో తంతులు జరుగుతున్నాయి. పురోహితులు ఏవేవో అడుగుతున్నారు. రాజారావు, విరజ అందిస్తున్నారు. అన్నీ సక్రమంగా అయిపోతున్నాయి. రాజారావిప్పుడు ఏకాగ్రతతో వున్నాడు. అతని దృష్టి పూర్తిగా పెళ్ళి తంతు మీదనే వుంది.
    ఏ ముహూర్తం కోసం ఇన్ని రోజులూ కష్టపడ్డారో ----కొన్ని ఏళ్ళుగా ఎదురు చూశారో ఆ క్షణం రానే వచ్చింది. జీలకర్ర , బెల్లం వగైరాలు కలిపిన ,ముద్దను వధువు తల మీద వరుడూ, వరుని తల మీద వదువూ ఉంచారు. మంగళ వాద్యాలు మ్రోగాయి. వెంకట్రామయ్య గారి కూతురు లక్ష్మీ ----భీమరాజు గారి కోడలయింది. రాజారావు చెల్లెలు లక్ష్మీ ---బాబురావు భార్య అయింది. ఆమె ఇంటి పేరు మారిపోయింది. హోదా మారిపోయింది. కొత్త సంసారంలో అడుగు పెట్టింది. కొత్త వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటోంది.
    ఈనాడు జరిగిన ఈ పెళ్ళి ------ఒక కొత్త జీవితానికి నాంది!
    పెళ్ళి తంతులు జరుగుతున్నాయి. మంగళ సూత్రధారణ అయింది. తలంబ్రాలు పోసుకున్నారు. ముఖ్య సందర్భాలలో ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీశాడు.
    ఆరోజు పెండ్లి కుమారుడు అందరితో భోజనాలకు కూర్చున్నాడు. వధూవరులిద్దరూ పక్కపక్కన కూర్చుని ఒకే కంచంలో భోజనాలు చేశారు. ఎంతోమంది నదృశ్యం గతంలోకి పంపింది.
    సంప్రదాయానికి ప్రాధాన్యతను ఇచ్చే భీమరాజు కోరిక ప్రకారం - వధూవరులు ఊరిలో మేళతాళాలతో పల్లకిలో ఊరేగారు.
    ఆరోజు రాత్రి శోభనం.
    పూల గురించి రాజమండ్రి వేళ్ళనవసరం లేకుండానే - ఎవరో ఆసామీ తీసుకుని వచ్చాడు. ఖరీదుకే అయినప్పటికీ శ్రమ తగ్గినందుకు మోహనరావు సంతోషించాడు. విరజ ప్రత్యెక శ్రద్ధ తీసుకుని గది అలంకరించింది.
    ఆ ఊళ్ళోని సోడా షాపు అతన్ని రిక్వస్ట్ చేసి - ఆరోజుకు అయిస్ సంపాదించి - పెళ్ళి వారందరికీ అయిస్ వాటరూ, అయిస్ మజ్జిగా సప్లయి చేయగలిగాడు మోహనరావు. కిళ్ళీలు కట్టడంలో పేరెన్నిక గన్న హుస్సేన్ చేత కిళ్ళీలు కట్టించి పెళ్ళి వారికీ కంద జేసి అందరి మన్ననలు పొందగలిగాడతను. వీటికి అయన ఖర్చు పెద్ద లెక్కలోది కాదు కానీ అందరికీ ఒక విధమైన ఇంప్రెషన్ కలుగజేసింది!
    వెంకట్రామయ్య కాట్టే ఇష్టం లేకపోయినప్పటికీ -వధూవరుల నిద్దర్నీ ఊళ్ళోకి షికారు వెళ్ళ నిచ్చెడు మోహనరావు. శోభనానికి ముందుగా వారికి కాస్త చనువూ, అవగాహన అవసరమని అతనికి తోచింది. ఈ విషయమై బంధు వర్గంలో కొన్ని గుసగుసలు జరిగాయి. కొంత మంది అసంతృప్తి వ్యక్త పరిచారు. అందుకు తగ్గట్లే - సాయంత్రం నాలుగున్నరకు బయటకు వెళ్ళిన బాబూరావు, లక్ష్మీ - రాత్రి ఏడుం పావు ప్రాంతాలకి కానీ తిరిగి రాలేదు.
    అమాయకురాలిగా తాము భావిస్తున్న లక్ష్మీ- భర్తే అయినప్పటికీ ఒక అపరిచితుడితో - అంతసేపు బయట కాలక్షేపం చేసి రాగలగడం మోహనరావుకూ, రాజారావు కూ ఒకరకమైన తృప్తి నిచ్చింది.
    అప్పగింతల అనంతరం శోభనం ముహూర్తం ఏర్పాటైంది.
    వధూవరులు గదిలోకి వెళ్ళాక భీమరాజు. రాజారావు కూర్చుని లెక్కలు సెటిల్ చేసుకున్నారు. ఎవరు ఎవరికి ఎంత భాకీయో తేల్చుకుని ఋణ విముక్తులయ్యారు.
    మర్నాడు శుక్రవారం కారణంగా ప్రయాణం చేయకూడదట. అందుకని కొద్దిమంది ముఖ్య బంధువులు మాత్రం ఉండి - మిగతా అంతా వెళ్ళి పోతారని భీమరాజు అన్నాడు.  శనివారం ఉదయమే లేచి మిగతా అందరూ వెళ్ళిపోతారట. వాళ్లతో పాటు లక్ష్మీ కూడా హైదరాబాద్ వెళ్ళిపోతుంది.
    భీమరాజు వెళ్ళిపోయాక - రాజారావు తన కుటుంబ సభ్యులతో తర్వాత కార్యక్రమాలను గురించి చర్చించాడు. మనుగుడుపులకు ఎవరైనా లక్ష్మీతో పాటు వెళ్ళవలసి ఉంది. పెళ్ళయ్యాక ఆరోజు కాక మరి రెండు రోజులున్నారు కాబట్టి - ఇక్కడ మనుగుడుపులు ముగిసి నట్లే అని భీమరాజు గారన్నారు.
    కాసేపు చర్చల మీద మోహనరావు, విరజ - మనుగుడుపులకు వెళ్ళాలని తీర్మానమైంది.
    
                                                    19
    "భీమరాజుగారు చాలా మంచివాడు. తరచు మాకు భయం లేదని దైర్యం చెబుతుండేవాడు. పెళ్ళిలో కాస్తో కూస్తో అల్లరి చెయ్యాలని చూసేవాళ్ళను అరికడుతూ వచ్చాడు. తన కూతుళ్ళే ఆడపడుచు అలకను ప్రదర్శించబోతే --మందలించి వారించాడు ---అలాంటి వాళ్ళు అరుదు" - అన్నాడు రాజారావు.
    'అది నిజమే కాని - మనం చేసిన లోటు మాత్రమెముందిరా. ఎలాగున్నా మేం గడుపుకు పోతామని అయన పదేపదే అనడం నాకు నచ్చలేడురా- ఎందుకంటె మనమేం తక్కువ చేయలేదు గదా!" అన్నాడు వెంకట్రామయ్య.

 Previous Page Next Page