Previous Page Next Page 
కాంక్రీట్ జంగిల్ పేజి 26


    జగపతి ఆమెవైపు ఓరచూపులు చూస్తూ ఆమె తనను గమనించగానే తడబాటుతో తలక్రిందకు దించుకున్నాడు.

    "నేనొక విషయం అడుగుతాను....నిజం చెబుతారా?"

    "తప్పకుండా...."

    "మీకు నేనంటే ఇష్టం కదూ...."

    జగపతి ఆనందానికి అంతులేకుండా పోయింది.

    "నీ....కు....నీకెలా తెలుసు?"

    "మీరు నన్ను మొదటిసారి చూసినప్పుడే మీ కళ్ళల్లో మెరుపుని గమనించాను....నేను ఎప్పుడు కనిపించినా మీ కళ్ళు నన్ను అణువణువునూ ప్రేమతో వీక్షిస్తూనే వున్నాయని కూడా నేను గమనించాను...."

    జగపతికి వింతగా వుంది.

    గాలంవేసి పట్టాలనుకున్న చేప కోరి తనంతటతనే చేతిలోకి వచ్చి పడ్డట్టుంది....

    "మరి, నేనంటే...."

    "నాకూ ఇష్టమే....అందుకేగా మీరు నన్ను ఏం చేసినా నేను అభ్యంతరం చెప్పకపోవడానికి కారణం....కానీ మీరే నామౌనాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయారు...." కవ్వించే చూపులతో అన్నదామె.

    జగపతికి ఏమాత్రం ఓపికవున్నా ఒక్కసారిగా ఎగిరి "యహ్హు" అని అరిచేవాడు.

    కానీ, చిన్నసైజు మేరు పర్వతంలా వుండే అతని బొజ్జ అతనికి ఎగరడానికి సహకరించలేదు....

    "నిజమా...." అన్నాడతను కళ్ళు టపటపలాడిస్తూ.

    "ఎస్....మీరంటే నాకెంతో ఇష్టం...." మరొకసారి చెప్పింది శ్రీప్రియ.

    జగపతికి ఆమె నిర్ణయం వినడంతో మాటలు రావడంలేదు.

    "ఇలా దగ్గరకు వచ్చి కూర్చోండి...."

    సిగ్గుపడుతూనే జగపతి ఆమె దగ్గరకు వచ్చాడు.

    "నా ప్రక్కనే కూర్చోండి...."

    "ఏదీ....ఒక్కసారి మీ నోటితో ఐ లవ్ యూ అనండి."

    "ఐ లవ్ యూ శ్రీప్రియా...."

    జగపతి అతికష్టంమీద అనగలిగాడు.

    "అబ్బ....ఎంత తియ్యటి స్వరం అండీ మీది....మీ పిలుపులో ఎంత సమ్మోహనశక్తో...."

    జగపతి మరికొంచెం పరవశంలో మునిగిపోయాడు.

    శ్రీప్రియ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏడుపులంకిచుకున్నది.

    "అదేమిటి శ్రీప్రియా....ఏడుస్తావెందుకు....ఇప్పుడేమయిందని"

    "నాకు భయం వేస్తుందండీ...."

    "భయమా....ఎందుకు?"

    "మీ....రు....మీరు"

    "ఆ....నే....నే....ఏమిటో చెప్పు...."

    "పెళ్ళి చేసుకుంటానని ప్రేమించినట్టు నటించి....కొన్నాళ్ళ తరువాత నన్ను మోసం చేస్తారేమోనని భయంగా వుంది...." అమాయకంగా చెప్పింది శ్రీప్రియ.

    "ఓ....అదా నీ భయం....నేను అలాంటివాణ్ణి కాదులే....భయపడకు...."

    "సరే, మీరు చెయ్యరు....కానీ మీ ఆవిడ చేయిస్తేనో...."

    "అదా నీ అనుమానం. అయితే ఒక పనిచేద్దాం."

    "ఏమిటి?"

    "మా ఆవిడను ఒక గదిలో పెట్టి తాళం వేద్దాం. అది బతకడానికి కొంచెం అన్నం, నీళ్ళు దాని గదిలో పడేద్దాం. అది ఎటూ బయటకు రాదు కాబట్టి దానివల్ల నీకు వచ్చే ఇబ్బందేమీ వుండదు" లాజిక్ గా ఆలోచించి చెప్పినట్టు చెప్పాడు జగపతి.

    "అంటే, నా కంటే మీకు మీ భార్యంటేనే ఇష్టమన్నమాట."

    "ఇష్టమా పాడా....అతకంటే మరొక మార్గం లేదు కాబట్టి."
   
    "అలా గదిలో వుంచడం ఎప్పటికయినా ప్రమాదమేకదా."

    "మరయితే ఏం చేద్దామంటావు?"

    "నేను చెప్పినట్టు చేస్తారా?"

    చేస్తానన్నట్టు తలవూపాడు జగపతి.

    "తప్పకుండా చేస్తానంటేనే చెబుతాను" రెట్టించింది శ్రీప్రియ.

    "చేస్తానని హామీ కూడా ఇస్తున్నాను....సరేనా"

    "ఒట్టు...."

    "నీ మీద ఒట్టు...."

    "ఓకే....ఆమెను శాశ్వతంగా అడ్డుతొలగించుకుందాం."
   
    "అంటే...."

    "ఆ మాత్రం అర్ధం చేసుకోలేరా?"

    "అంటే....చం....పే....ద్దా....మం....టా....వా?"

    జగపతిలో విస్మయం....

    "ఆ మాట మీ నోటితోనే అన్నారు కనుక చెపుతున్నాను. అలాగే చేద్దాం...."

    "అమ్మో....చంపేయడమే....నావల్లకాదు."   

    "అంటే, నేనంటే ఇష్టం లేదనుకోవాలి...." మూతి ముడుచుకుంటూ మరోవైపు తిరుగుతూ అన్నది శ్రీప్రియ.

    జగపతి కళ్ళద్దాలు తీసి ప్రక్కన పడేసాడు.

    "అదిగో శ్రీప్రియా....మాటి మాటికీ నువ్వు అలిగితే ఎలా చెప్పు...."

    "అలగడం కాదు....నేను మిమ్మల్ని నమ్మి పెళ్ళాడి మీకు చేరువైతే మీ భార్య నాకే కాదు....మీకు క్షణక్షణం అడ్డుగా వుంటుంది. నేను మీకు ఉంపుడుగత్తెగానే వుండిపోతాను తప్ప భార్యగా స్థానాన్ని పొందలేను. ఆ అవమానాలు పడుతూ బ్రతికేకంటే ఇలా హాయిగా ఒంటరిగా వుండడమే బెటర్...." నిష్కర్షగా చెప్పింది శ్రీప్రియ.

    "నువ్వు అలా అంటే ఎలా చెప్పు....ధైర్యం చెప్పాల్సింది పోయి బిగదీసుకు కూర్చుంటే నాకెలా ధైర్యం వస్తుంది....నువ్వు అన్నట్టు నా భార్య అడ్డుగా వుండకూడదంటే చపండమొక్కటే మార్గమని నేనూ ఒప్పుకుంటాను....కానీ ఎలా చేయాలనేదే నాకు తెలియడంలేదు...."
 

 Previous Page Next Page