Previous Page Next Page 
కాంక్రీట్ జంగిల్ పేజి 25


    "అయ్యో....అలా కూడా జరుగుతుందండీ...."

    శ్రీప్రియకు అతని పట్ల జాలివేసింది.

    "అవును...."

    "పోనీ ఒక పని చెయ్యండి...."

    "ఏమిటో చెప్పు...."

    "ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది....మీకు మహా అయితే నలభై ఏళ్ళుంటాయేమో....ఈ కాలంలో అరవై ఏళ్ళ వాళ్ళు కూడా రెండవ పెళ్ళి చేసుకుంటున్నారు. మీ ఇంట్లో లేని సుఖాన్ని మరొకరిని కట్టుకుని ఆమె ద్వారా మీ కోరికలు తీర్చుకోండి...."

    జగపతి కళ్ళలో మెరుపు....

    "నేను సరిగ్గా అదే విషయాన్ని గూర్చి ఆలోచిస్తున్నాను....కానీ...."

    "ఏమిటో మీ సందేహం?"

    "నేను రెండవ పెళ్ళివాడినికదా....అందమయినా అమ్మాయి దొరుకుతుందంటావా?"

    ఆమె ముఖంలో మారుతున్న ఫీలింగ్స్ ను జాగ్రత్తగా గమనిస్తూ అన్నాడతను.

    శ్రీప్రియ కావాలనే అతనితో అలా మాట్లాడుతుందన్న విషయం జగపతికి తెలియదు....పాపం!

    "భలేవారే....మీకేం తక్కువ....ఆస్తి, అంతస్తులతో పాటు మంచి హృదయం కూడా వుంది. 'కో' అంటే కోటి మంది వచ్చి మీ ముందు వాలతారు...."

    శ్రీప్రియ కవ్వింపజేసిందతడిని.

    అతను నిజమేనన్నట్టు రెచ్చిపోయాడు.

    "నిజమా....శ్రీప్రియా....నువ్వు చెప్పేది నిజమా!"

    "అవును....మీరు ఊ అనండి....మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటామంటూ ఆడపిల్లలు రేపు మన ఆఫీసుముందు క్యూకట్టేలా ఏర్పాటు చేస్తాను...."

    శ్రీప్రియ మాటలకు జగపతి ఒళ్ళు గగుర్పొడుస్తున్నది....

    ఎక్కడలేని చైతన్యం పుంజుకొచ్చింది.

    ఇంతలో పావుగంట క్రితం టీకోసం వెళ్ళిన వాచ్ మెన్ ప్లాస్కు పట్టుకుని వచ్చాడు.

    ప్లాస్క్ నుతెచ్చి టీపాయ్ మీద పెట్టివెళ్ళిపోయాడతను.

    టీ కప్పులో వంపుతున్న జగపతికి వర్మ చెప్పిన ప్లాన్ అమలు జరపబోతున్న టెన్షన్ లో చేతులు వణుకుతున్నాయి.

    అసలే ధైర్యం తక్కువ మనిషి....

    చాకులాంటిపిల్ల ఏమంటుదోననే భయం!

    టీ వంపుతున్న జగపతి వంకే పరిశీలనగా చూస్తున్నది శ్రీప్రియ.

    జరగబోయేదేమిటో ఆమెకు తెలుసు....

    కాకపోతే తనకు తెలుసు అన్నదే అతనికి తెలియదు....

    టీ రెండు కప్పులలోకి వంపడం పూర్తి అయింది.

    అతి కష్టంమీద ఉద్వేగాన్ని ఆపుకుంటూ ఒక కప్పుని ఎదురుగా కూర్చుని వున్నా శ్రీప్రియకు అందించడానికి తన చేతిని ముందుకు చాచాడు జగపతి.

    ఆమెకు అతన్ని చూస్తుంటే వినోదంగా వున్నది.

    అతనికి తన బట్టలపై టీ పడేలా కప్పును ఒంపడానికి కూడా ధైర్యం చాలడంలేదని ఆమెకు అర్ధం అయింది.

    ఆ సంఘటన జరగడానికి అతన్ని కష్టపడనీయకుండా తనే సహకరిద్దామనుకున్నది.

    "అయ్యో....నీకెందుకండీ శ్రమ...." అంటూ చటుక్కున కూర్చున్నచోటునుంచి ఆమె పైకిలేస్తూ కావాలనే తనచేతిని టీ కప్పును వేగంగా తాకించింది.

    ఫలితం ఆమె తెల్లని చీరపై టీ ఒలికింది.... 

    "అరెరె....సారీ ప్రియా...."

    జగపతిలో ప్లాన్ సక్సెస్ అవుతున్నందుకు ఉత్సాహం ప్రవేశించింది.

    "అయ్యో....మీరెందుకండీ సారీ చెప్పడం....నా చేయి తగిలి ఒలికింది టీ....అంతేగా" హాండ్ కర్చీఫ్ తో చీరపై పడిన టీ మరకలను అద్దుకుంటూ అన్నది శ్రీప్రియ.

    "మరకలు పడతాయేమో...."

    "అవునండీ....బాత్ రూమ్ ఎక్కడుందో చూపిస్తారా...."

    "ఇలారా...." సంతోషంగా పొంగిపోతూ లేచాడు జగపతి.

    బాత్ రూమ్ బయటే ఆగిపోయాడతను.

    "మీరు కూడా రండి...."

    ఊహించని ఆహ్వానానికి ఉబ్బితబ్బిబ్బై పోయాడు జగపతి.

    తను ఆమెకు హెల్ప్ చేసే నెపంతో టాప్ ను కావాలనే వేగంగా తిప్పాడతను.

    ప్రవాహంలా వస్తున్న నీళ్ళక్రింద ఆమె చీరను భుజంపై నుంచి తీసి తడపడంలో మునిగిపోయింది.

    జగపతి కళ్ళు ఆమె ఒంటిమీదకు మళ్లాయి....

    చీరను తడుపుకోవడంలో అతని చూపులను పట్టించుకోవడం లేదామె.

    ఆమె అందాలను చూస్తూ జగపతి తనను తను మైమరచిపోయాడు.

    చీరను భుజంపై కప్పుకుంటూ అప్పుడు గమనించిందతని అవస్థను....

    జగపతి వేడి నిట్టూర్పులు వదులుతున్నాడు.

    ఇద్దరూ నడిచివచ్చి అంతకు ముందు కూర్చున్న సోఫాసెట్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఇద్దరి మధ్యా నిశ్శబ్దం....  
 

 Previous Page Next Page