Previous Page Next Page 
రక్త సింధూరం పేజి 26


    "పోలీసులు ఊరుకున్నా, ఆ పక్కనున్న మనుష్యులు ఊరుకోరు. నీ నోటినుంచి మాట బయటికి రాకముందే కాల్చేస్తారు. చావు మాత్రం పోలీసుల దాడిలో...."
    "ఎవరా మనుష్యులు?"
    "నీకు తెలీదా?"
    "తెలీదు."
    అతడు ఆశ్చర్యంగా చూస్తూ "నిజంగా తెలీదా?" అని అడిగాడు.
    "ఉహూఁ"
    "ధర్మారావు మనుష్యులు."
    సో- చిదానందం గాడ్ ఫాదర్ ధర్మారావన్న మాట. మొత్తం సర్కిల్ అర్ధమయింది. ధర్మారావు దగ్గిరకి వెళ్ళి చిదానందం జరిగినదంతా చెప్పుకుని వుంటాడు. ఇలా ఒకసారిగా భయపడి కుర్రవాడిని వదిలేస్తే, రేపు అందరికీ లోకువయిపోతాననే భయంతో ధర్మారావు దీన్ని ఇక్కడే అంతం చేయటానికి తన జనాల్ని పంపాడు. అధికారంలో వున్నాడు కాబట్టి పోలీసు బలగం సహాయం తీసుకుని వచ్చి వుంటాడు. ఇప్పుడు నేను వెళ్లి చెప్పినా లాభం లేదు. లక్ష్మణ్ అన్నట్టు వాళ్ళు నేను దగ్గిరకి వెళ్ళే లోపులోనే కాల్చి చంపెయ్యవచ్చు. లేదా ఈ విషయం అంతా బయటపడ్డా, ఒక జైలర్ నై వుండి ఇలా మారు పేర్లతో వచ్చి బెదిరించినందుకు నా ఉద్యోగానికి ముప్పు రావొచ్చు. నా మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు.
    ఏం చెయ్యాలో పాలుపోలేదు.
    నా సందిగ్ధానికి సమాధానమా అన్నట్టు మైకులో వినిపించింది.
    "మీరు రావిచెట్టు సమీపంలో ఉన్నారని మాకు తెలుసు. మర్యాదగా లొంగి పోండి. మీ ప్రాణాలకి భయంలేదు."
    సమాధానంగా లక్ష్మణ్ నా చెవిలో రహస్యంగా "నీ దగ్గర తుపాకీ ఉన్నదా" అని అడిగాడు. లేదన్నాను. అతడో నిశ్చయానికి వచ్చినట్టు "నా వెనుకే రా. నేను కౌంటర్ చేస్తాను. ఆ సందులోంచి వెళ్లిపో" అన్నాడు జేబులోంచి చిన్న బంతి ఆకారంలో ఉన్న బాంబు తీస్తూ.
    "ఎలా? వాళ్ళ మీదికి విసురుతావా?"
    "విసురుతాను. ఆ హడావుడిలో నువ్వు తప్పించుకు పోవచ్చు"
    "కానీ నీవు ఎక్కడున్నదీ తెలుస్తుంది. ఇరవైకి తక్కువ కాకుండా నీ శరీరం లోంచి గుళ్ళు దూసుకుపోతాయి."
    "ఇప్పుడు అంతకన్నా తక్కువ ప్రమాదంలో లేము. ఇంత జరుగుతున్నా నీకింకా పరిస్థితి అర్ధంకావటం లేదల్లే వుంది. ఇంకో ఒకటి రెండు నిముషాల్లో వాళ్ళు మనల్ని చుట్టుముడతారు. రెండు శరీరాల్లో నలభై గుళ్ళు దూరటం కన్నా మొదటిదే మంచిది."
    నేను అయోమయంగా అతడికేసి చూశాను.
    మృత్యువు అంచున నిలబడి మాట్లాడుతున్నా అతడు మామూలుగానే వున్నాడు. బహుశా చావుధైర్యం అనుకుంటాను.
    "అలా దొరికిపోవటమే కావల్సింది అనుకుంటే, ఇంత దూరం పరుగెత్తుకు రావటం దేనికి? ఆ సత్రం దగ్గిరే అంతా అయిపోయేది కదా!"
    "అడవిలో తప్పించుకోగలం అనుకున్నాను. వాళ్ళు నాలుగు వైపుల్నించీ చుట్టుముడతారనుకోలేదు. నాకు అటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు" వప్పుకుంటున్నట్టు అన్నాడు.
    అప్పుడు చూశాను అతనివైపు. ఇంకా పాతిక దాటి ఉండదు వయసు. అతడి ధైర్యం తెగువ చూస్తే ముచ్చటేసింది. చిన్నపిల్లాడిలా కనబడ్డాడు నా కంటికి.
    "నేనెవరో తెలియకపోయినా నన్ను రక్షించటానికి వచ్చి ప్రమాదంలో ఇరుక్కున్నావు. నా మూలంగా నువ్వు మరణించటానికి ఎలా వప్పుకుంటా ననుకున్నావు?"
    "మరేం చేద్దాం?"
    "ఇద్దరం తప్పించుకుందాం."
    అతడి కళ్ళల్లో నమ్మలేని విస్మయం కనబడింది. "ఎలా?" అని అడిగాడు.
    "చీకటిలో అవతలి వాళ్ళకి భ్రమ కలిగించటం ద్వారా-" ట్రెయినింగ్ లో మాకు నేర్పిన ఒక టెక్నిక్. ఈ చిన్న గ్రామపు పోలీసులకి ఆ ట్రిక్ తెలిసి ఉంటుందని, దీన్ని గ్రహించగలరనీ నేను అనుకోను. కేవలం చేతిలో తుపాకీ, పక్కన తోడుగా నలుగురూ ఉంటే జులుం చెలాయించగలరు. అంతే. అంతకన్నా ఎక్కువ తెలివితేటలుండవు.
    చెయ్యవలసింది చెప్పాను.
    అది విని "నువ్వెవరు?" అని అడిగాడు.
    "అదంతా చెప్పటానికి టైమ్ లేదు. క్విక్" అంటూ వంగి, బంతి పరిమాణంలో ఉండే రాళ్ళని ఓ అయిదారు ఏరి, గబగబా చెట్టు ఎక్కాను. లక్ష్మణ్ కూడా అదే పని చేశాడు.
    మైకులో మరోసారి అనౌన్స్ మెంట్ వినిపించింది. టార్చిలైట్లు బాగా దగ్గిరగా వచ్చి చెట్టుని చుట్టుముడుతున్నాయి. వలయాకారంలో ముందుకు వస్తున్నారు పోలీసులు. ఊపిరి బిగపట్టి చూస్తున్నాం. మేమున్న చెట్టుకి కొంతదూరం వరకూ దాక్కోవటానికి చిన్న చిన్న పొదలు తప్ప మరేమీ లేవు. అందువల్ల వాళ్ళు మరింత జాగ్రత్తగా వస్తున్నారు. కానీ దగ్గిర చెట్లు లేకపోవటం వాళ్ళకి ఒక విధంగా లాభసాటిగా కూడా ఉంటుంది మేము కనబడటానికి...
    ఉన్నట్టుండి లైటు ఆరిపోయినయ్. అకస్మాత్తుగా చీకటి ఆవరించింది.
    బాగా నవ్వు వచ్చింది నాకు. మొదటి ప్రపంచయుద్ధం కాలంనాటి టెక్నిక్స్ ఇవి. వాళ్ళు ఎక్కడున్నారో దొరక్కుండా దీపం ఆర్పెయ్యడం.
    చీకట్లో ఆకారాలు నెమ్మదిగా కదలటం కనిపిస్తూంది.
    చెట్టుకి పదిగజాల దూరంలోకి వచ్చారని భావించగానే లక్ష్మణ్ వైపు చూసి తలూపాను.
    సరీగ్గా రెండు సెకన్ల వ్యవధిలో ఒక్కొక్క రాయీ ఒకరి తరువాత ఒకరం వరుసగా విసిరాము. అలా విసరటంలో మొదటి రాయి పడిన చోటుకి రెండోరాయి కొంత అవతల పడేట్టు చూడమని ముందే లక్ష్మణ్ కి చెప్పాను.
    ఒకదాని కన్నా మరొకటి అలా క్రమక్రమంగా దూరంగా వెళ్ళి పడుతూ ఉండటంతో, మనిషి పారిపోతున్న భ్రమ కలుగుతుంది.
    సరీగ్గా మేము అనుకున్నట్టే జరిగింది.
    అప్పటివరకూ ఎంతో నమ్మకంగా, మేము చెట్టు దగ్గరే ఉన్నామన్న భావంతో చుట్టుముడుతూన్న పోలీసులు, ఒక్కసారిగా వాళ్ళ కళ్ళముందే వలయాన్ని ఛేదించుకుని మేము వెళ్ళిపోతున్న భ్రమ కలగగానే అటూ ఇటూగా విడిపోయారు. "అటు-ఇటు" అని ఎవరో అరుస్తున్నారు. దాదాపు పది దాకా బ్యాటరీలైట్లు వెలిగినయ్. మాకు అవతలివైపున ఉన్న పోలీసులు కూడా చెట్టుని దాటుకుంటూ ఇటు వచ్చేశారు. అంతా హడావుడిగా వుంది. అందరూ గుంపుగా అటు వెళ్ళిపోయారు.
    లక్ష్మణ్ కళ్ళలో వెలుగు కనబడింది. చెయ్యి పట్టుకుని వూపేశాడు. కానీ అభినందనలకి ఇది సమయంకాదు.
    ఇద్దరం నిశ్శబ్దంగా చెట్టు దిగాము. పోలీసులు ఎంతో దూరం లేరు. జాగ్రత్తగా రెండోవైపుకి ప్రయాణం చేశాము. మళ్ళీ చెట్లు మొదలయ్యాయి. చీకటి దట్టమైంది.
    దాదాపు అయిదు నిముషాలు అలా నడిచాక వెనుదిరిగి చూశాను. లక్ష్మణ్ బాగా వెనుకబడ్డాడు. అటూ ఇటూ చూసుకుంటూ వస్తున్నాడు.
    "ఇటు.... ఇటు..." అన్నాను-చెట్ల మధ్యనుంచి పడే వెలుగులోకి వస్తూ.
    ఇటే వస్తున్న ఆకారం నా మాటలకి అదిరిపడింది. అప్పుడు గమనించాను. నేను చేసిన తప్పు. లక్ష్మణ్ ఎత్తులో వున్న పోలీసు అతడు. నన్ను చూడగానే జేబు దగ్గిరున్న విజిల్ తీసి గట్టిగా వూదాడు. అలా వూదుతూనే వున్నాడు.
    నన్ను నేను తిట్టుకోని తిట్టులేదు. ఆ సమయంలో అంత అజాగ్రత్తగా ఎందుకు ప్రవర్తించానో నాకే అర్ధం కాలేదు. నా ఎడమవైపునుంచి పరుగెత్తుకు వెళ్ళిపోతూన్న ఆకారం కనిపించింది. చూస్తే లక్ష్మణ్! కాస్త తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. నేను ఏమైనా కనీసం అతడు తప్పించుకువెళ్లి బ్రతుకుతాడు. అది చాలు.
    పోలీసు ఇంకా సర్వాంగాలు స్థంభించిన వాడిలా అక్కడే నిలబడి వూదుతూనే ఉన్నాడు విజిల్. బహుశా ప్రాణ భయంతో శిలాప్రతిమ అయిపోయి వుంటాడు. గాలిలా వేగంగా వెళ్ళి వాడి మొహంమీద చరిచాను. ఆ దెబ్బకి ఈ లోకంలోకి వచ్చి ఆయుధం కోసం తడుముకోబోయాడు. అరచేతిని చాకులా మార్చి మెడమీద ఒకటి కొట్టేసరికి నేలకూలిపోయాడు. కానీ అప్పటికే మిగతావారు అక్కడికి చేరుకున్నారు.
    పరుగెత్తటం ప్రారంభించాను. నా వెనుకే వాళ్ళూ వస్తున్నారని అడుగుల చప్పుడు బట్టి తెలుస్తూంది. అంతలో వెనుకనుంచి తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. గుండు చెవిని రాసుకుంటూ వెళ్లిపోయింది.
    వేగం హెచ్చించాను. వెనుక వాళ్ళకి నేను స్పష్టంగా కనబడుతున్నాననీ, కేవలం రేంజికి దొరక్క పేల్చటంలేదని నాకు తెలుసు. కొద్దిగా వేగం తగ్గించగానే గుళ్ళు వర్షంలా కురుస్తాయని కూడా తెలుసు. శరీరంలో ప్రతి అణువునుంచీ శక్తిని కాళ్ళల్లోకి లాక్కొని పరుగెత్తసాగాను. కేవలం కొద్ది అడుగుల దూరంలో మృత్యువు వెంటాడుతుంటే, మరణానికీ జీవనానికీ మధ్య నిర్ణయించే క్షణాలని. ఊపిరి అందడంలేదు. అయినా వేగం తగ్గించలేదు. అయినా వేగం తగ్గించలేదు. ముళ్ళపొదల్లో చిక్కుకొని పాంటు పీలికలవుతూంది. చర్మం అక్కడక్కడా గీసుకుపోయింది. రక్తపు తడి తెలుస్తూంది. ఎటు వెళుతున్నానో తెలియకుండా పరుగెడుతున్నాను.
    అకస్మాత్తుగా నాకెందుకో బిగ్గరగా నవ్వాలనిపించింది.
    జైల్లో ఖైదీల్ని పారిపోకుండా చూసుకుంటూ, రాత్రి వెచ్చగా నా గదిలో పడుకోవలసిన వాడిని, ఈ క్షణం ఇలా ప్రాణం అరచేతిలో పెట్టుకుని పరుగెత్తవలసి రావటం... అంతా చేజేతులా చేసుకున్నట్టు ఉంది. ఒక చిన్నమాట కోసం కోరి కష్టాల్ని కొనితెచ్చుకున్నట్టు ఉంది. నాకు మా జైల్లో ఖైదీలు గుర్తొచ్చారు.... అందులో చాలామంది మర్డర్లుచేసి, రేప్ లుచేసి న్యాయానికి అందకుండా ఇలా ఒకప్పుడు పరుగెత్తినవాళ్ళే. కానీ నేను? ఏ అన్యాయమూ చేయకుండా కేవలం న్యాయాన్ని పరిరక్షించటం కోసం ప్రయత్నం చేసి, చట్టానికి భయపడి పారిపోవలసి వస్తూంది. నా స్థితి తల్చుకుంటే నాకే చిత్రమనిపించింది.
    దూరంగా చిన్న గుట్టలా వుంది. అవతలివైపు ఏముందో తెలీదు. నాకూ పోలీసులకీ మధ్య దూరం కాస్త ఎక్కువైంది. వేగంగా గుట్ట ఎక్కి అవతలివైపు చూశాను.
    మినుక్కు మినుక్కుమంటూ దీపాల కాంతిలో చిన్న గ్రామం కనబడుతూంది.
    ఒక క్షణం తటపటాయించాను. గ్రామంలోకి వెళ్ళటమా- పక్క నుంచి అడవిలోకి ప్రవేశించడమా అని. గ్రామంలోకి ప్రవేశించటమే మంచిదనిపించింది. ఎంత ఎన్ కౌంటరయినా, దొరికినవాడిని జనం మధ్య చంపటానికి సాహసించరు. అలా అనుకుని వేగంగా గ్రామంవైపు పరుగెత్తాను.
    బహుశా అదే నేను చేసిన తప్పు!
    అర్ధరాత్రి దాటటంవల్ల గ్రామం అంతా గాఢ సుషుప్తిలో ఉంది. అలికిడికి కుక్కలు లేచి మొరగటం మొదలు పెట్టినయ్. ఆచూకీ తెలిసిన పోలీసులు అటే రాసాగారు. గడ్డివాము పక్కనుంచి చూశాను. పోలీసులనయితే ఏమార్చగలను గానీ కుక్కల బారినుంచి తప్పించుకోలేను అనిపించింది. తప్పించుకోవాలంటే ఏదైనా ఇంటి లోపలికి వెళ్ళాలి.
    ఇంత అర్ధరాత్రి నాకెవరు ఆశ్రయమిస్తారు?
    నేనిలా ఆలోచిస్తున్నంతలో దూరంగా జీపు శబ్దం వినిపించింది. ఉత్సుకతతో రోమాలు నిక్కబొడుచుకున్నాయి. వస్తున్నది ఎవరు? అదృష్టవశాత్తూ ఎవరన్నా టాప్ రాంకింగ్ ఆఫీసరయితే బ్రతికి బయటపడ్డట్టే. వెళ్ళి కలుసుకొని (పోలీసులకన్నా ముందే) నేనెవరో చెప్తే, మరింకేమీ ప్రమాదం జరక్కపోవచ్చు. పోతే తరువాత డిపార్ట్ మెంటల్ ఎంక్వయిరీ జరగవచ్చు. అదంత ప్రమాదకరమైనది కాదు.

 Previous Page Next Page