"వెళ్ళొస్తాను చిదంబరం. సారీ! చిదానందం. ఈ రహస్యం మనిద్దరి మధ్యే వుండాలి. ఓ.కే!"
తలుపు దగ్గిరగా జారేసి బయట కొచ్చేశాను.
* * *
బస్సు రెడీగా వుంది. ఈ డబ్బు ఇచ్చేస్తే ఇక నా పని అయిపోయినట్టే... వెళ్ళిపోవచ్చు.
ఘనాపురం వెళ్ళేసరికి రాత్రి తొమ్మిదయింది. నారాయణ వాళ్ళు సత్రం వాళ్ళస్థితి చూస్తే జాలేసింది.
"ఇక మీ కష్టాలు తీరిపోయినట్టే. చిదానందం మీ జోలికి రాడు" అన్నాను. "ఇదిగో పదివేలు! అయిదువేలు ఇల్లు తిరిగి కట్టుకోవటానికి- మరో అయిదువేలు నీ కొడుకుని తెచ్చుకోవటానికి-" అన్నాను చేయి సాచి. కానీ నారాయణ ఆ డబ్బును అందుకోలేదు.
"ఎక్కడికి బాబూ ఇంత డబ్బు" అని అడిగాడు.
"వెళ్ళిపోతూ కలెక్టర్ గా రిచ్చారు."
"ఎందుకు దొరా?"
"తన రాజ్యంలో ఇంత అరాచకం జరుగుతూ వుందని ఆయనకి ఇంతకాలం తెలీదట. వెళ్లిపోతూ, వెళ్ళిపోతూ జరిగినదానికి బాధపడి- ప్రభుత్వం ఖజానాలో నుంచి తీసి ఇచ్చారు. ఇంక దీని గురించి ఆలోచించకు. తీసుకో" అన్నాను. నారాయణ వచ్చి డబ్బు అందుకుంటూ "దొరా! అందరూ ఇంత దయగల పెభువులే వుంటే ఎంత బాగుండేది" అన్నాడు.
"అవును. చాలా బావుండేది. కానీ వుండరు" నిర్లిప్తంగా అన్నాను. అంతలో వూహించని సంఘటన జరిగింది. లక్ష్మి దగ్గిరగా వచ్చి "మా కొడుకు తిరిగి వస్తాడా దొరా" అని అడిగింది వొస్తాడన్నాను. ఆమె కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. ఆనందమూ, దుఃఖమూ ఒక్కసారిగా పెనవేసుకొనగా ఆమె వంగి నా కాళ్లు పట్టుకుంది. కంగారుపడి వెనక్కి జరగబోయాను. కానీ వదల్లేదు. "దేవుడిలా వచ్చినావు. మా సెర్మంతో చెప్పులు కుట్టించుతాం బాబూ! నా కొడుకు కోసం కళ్ళు కాయలు గాసినాయి. ఆడిమీద మేం ఆశలొదిలేసుకున్నాం. గా సమయంలో నీ వొచ్చినావు. నీరుణ మెట్ట దీర్చుకొనేది?" ఏడుస్తూ అంది.
నాకా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా వుండి, "ఛాఛా.. ఇదేమిటి లక్ష్మి" అంటూ ఆమెని లేవనెత్తాను. నారాయణతో "రేపా డబ్బు చిదానందానికి ఇచ్చెయ్. కలెక్టర్ భయంతో వాడు మిమ్మల్నింకేమీ కష్టపెట్టడ్లే" అన్నాను. నారాయణ తలూపాడు.
"మరి నేనింక వెళ్ళిరానా"
భార్యాభర్తలిద్దరూ మొహ మొహాలు చూసుకున్నారు. "ఇంత రాతిరి ఎట్టగెళ్తావ్ దొరా" అన్నాడు నారాయణ.
"అవునన్నా. ఇయ్యాల రాత్రి కీడ్నే వుండి మాతో కల్సి భోం సెయ్యి" అంది లక్ష్మి.
నేను కంగారుపడి "లేదు, లేదు. నే వెళ్ళాలి" అన్నాను.
నారాయణ భార్యవైపు తిరిగి "ఏడుండమంటున్నావే దొరని పిచ్చి మొగవాఁ! ఇదేమన్నా నీ ఇల్లనుకున్నావు? నువ్వుండేదే సత్రమాయె" అన్నాడు.
నొచ్చుకుంటూ "నా ఉద్దేశ్యం అదికాదు. పోనీ వుంటాను" అన్నాను. లక్ష్మి మొహం విచ్చుకుంది. అంత బాధా మర్చిపోయి, "రెండు నిముషాల్లో వస్తానన్నా" అంటూ పచారీకొట్టుకి బయల్దేరింది. "ఇప్పుడు నా కోసం ఏమీ చెయ్యొద్దు" అన్నాను.
"మళ్ళీ మా ఇంటికి వస్తావా అన్నా. ఇయ్యాలంటే వచ్చినవ్. ఎంత - సిటికెలో సేసెయ్యనూ" అంటూ పరుగెత్తింది. ఇంటిలో నేనూ, అమ్మా ఇద్దరమే. ఆమె ఉత్సాహం చూస్తుంటే ఆడపిల్లలు లేని లోటు తెలిసింది.
పడి పదిహేను నిముషాల్లో వంట తయారయింది. రొట్టెలు... పచ్చడి వరన్నం. నేనూ నారాయణా తింటూంటే పక్కన లక్ష్మి కూర్చుంది. నేను తింటూన్న కంచాన్ని చూసి నారాయణ లక్ష్మివైపు తిరిగాడు. లక్ష్మికూడా నా కంచాన్నే చూడటం గమనించి ప్రశ్నార్ధకంగా తలెత్తాను. లక్ష్మి అన్నది.
"నా కొడుకు కంచమన్నా అది. నా కొడుకుని ఆడు గిర్వి పట్టుకు పోయిన కాడ్నుంచీ గీ కంచాన్ని లోపల పెట్టేసిన. ఆడు నీ అంతోడు కావాల, అందుకే నువ్వు తిన్న కంచంలో ఆడు తింటాడని...."
నా గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అయింది. అది దుఃఖం కాదు. చెమర్చిన కళ్ళు దుఃఖాన్నే సూచించవు. ఒక ఆనందపు కెరటం తాలూకు మానసిక సంచలనం అది. మనిషి మరణిస్తే, అతడి తాలూకు వస్తువుల్ని దాచేస్తారు, కనబడితే గుర్తొస్తాడని... కానీ వీళ్ళు?- బ్రతికుండగానే కొడుకు వస్తువులు దాచుకున్నారు, అమితమైన దుఃఖానికీ, అపరిమితమైన ఆనందానికీ వీళ్ళ జీవితాల్లో తేడా కేవలం అయిదొందల రూపాయలు.
సత్రం అరుగుమీద పడుకున్నాం నారాయణ నేనూ! వెన్నెల జల్లెడలోంచి పడినట్టు పడుతూంది. క్రింద చాపకూడా లేదు. అయినా ఆ రాత్రి నా జీవితంలో ఒక మరపురాని రోజుగా మిగిలిపోతూంది. నారాయణేదో చెపుతున్నాడు. అన్యమనస్కంగా ఊఁ కొడుతున్నాను. బాగా అలిసి పోయి ఉన్నానేమో బాగా నిద్ర పట్టేసింది.
చుట్టూ ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని వూహించలేదు.
........
ఎవరో కదుపుతూంటే మెలకువ వచ్చేసింది. కళ్ళు విప్పాను. చుట్టూ చీకటి. ముందు కనబడింది లక్ష్మి. భయంతో వణికిపోతూ నన్నే చూస్తోంది. నారాయణ పరిస్థితి కూడా అలాగే వుంది. నన్ను లేపింది లక్ష్మణ్. (పేరు తరువాత తెలిసింది.)
"వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చేస్తున్నారు. లే, పరుగెత్తు" అన్నాడు. నా కర్ధం కాలేదు. "ఎవరు?" అన్నాను.
"అవన్నీ తరువాత. తొందరగా" అన్నాడు. పక్కనుంచి నారాయణ మాత్రం "పోలీసులు" అన్నాడు. క్షణాల్లో నాకు పరిస్థితి అర్ధమైంది. అంతకుముందు చిదానందాన్ని కొట్టినందుకు బహుశా కంప్లైంట్ ఇచ్చి వుంటాడు. సాయంత్రం తిరిగి వెళ్లి బెదిరించటంతో మళ్ళీ పోలీసుల మీద వత్తిడి తీసుకువచ్చి వుంటాడు. దీని వెనుక ఎలాగు ధర్మారావు ఉండి వుంటాడు.
నేనింకా ఆలోచనల్లో వుండగానే లక్ష్మణ్ నా భుజాన్ని పట్టుకుని దాదాపు తోస్తూ "పరుగెత్తు" అన్నాడు.
అంత భయపడవలసిన పరిస్థితి ఉందా అని ఆలోచించాను. కానీ ఆ ఆలోచన్లకి తావివ్వలేదు. దాదాపు నన్ను తోసుకుంటూ సత్రం మెట్లు దిగాడు. చీకటిలోకి పరుగెత్తబోతూ ఆగి లక్ష్మి వాళ్ళవైపు చూశాను. లక్ష్మి భర్త భుజాన్ని పట్టుకుని ఏడుస్తూంది. "డబ్బు జాగ్రత్త. దీనికీ దానికీ సంబంధం లేదు. రేప్రొద్దున్నే వాడి కిచ్చేసి మీ కొడుకుని తెచ్చేసుకోండి" అంటూండగానే లక్ష్మణ్ నన్ను లాక్కుపోయాడు. మేమలా పది అడుగులు తుప్పల్లోకి వేశామో లేదో, పోలీసు వ్యాను తాలూకు లైట్లు సత్రం మీద పడటం, వ్యాను ఆగటం పోలీసులు బిలబిల మంటూ దిగటం ఒకేసారి జరిగినయ్.
ఒక్కణ్ణి అరెస్టు చేయటానికి అంత ఆర్భాటం ఎందుకో తేలీలేదు. లక్ష్మణ్ పరుగెడుతున్నాడు. రొప్పుతూ ఆయాసపడుతున్నా పరుగు ఆపలేదు. అతడిని అనుసరించాను, ఆ పొదలూ, తుప్పలూ అతడికి అలవాటులా వున్నాయి.
దాదాపు పది నిముషాలు ఆగకుండా పరుగెత్తి ఒక రావిచెట్టు మొదటిలో ఆగాము. రెండు నిముషాల తరువాత ఆయాసం తగ్గి మాట్లాడగలిగాను.
"ఎవరు నువ్వు?"
"నీలాటి వాడినే. పేరు లక్ష్మణ్"
'నీలాటి వాడినే' అంటే అర్ధం కాలేదు. అయినా ఆ విషయం తర్కించకుండా "మనం మరీ అంత భయపడి పారిపోవలసినంత అవసరం లేదనుకుంటాను. బహుశా వాళ్ళు నా గురించి ఎంక్వయిరీ చేయటానికి వచ్చి వుంటారు. కానీ కేసు నిలవదు" అన్నాను.
ఒక క్షణం అతడి మొహంలో అదోలాంటి భావం కనబడింది. నన్ను అనుమానంగా చూస్తూ "వాళ్ళు నీతో తీరిగ్గా మాట్లాడతనికీ, వాకబు చేయటానికీ వచ్చారనుకున్నావా?" అని అడిగాడు.
"రాలేదా?"
"లేదు."
"మరి?"
"ఎన్ కౌంటర్ పేరుతో చంపెయ్యటానికి"
ఒక శీతల పవనం వెన్నులోంచి పాకినట్టు నా శరీరం వణికింది. నమ్మలేనట్టు అతడిని చూశాను. అతడు నావైపు చూడటంలేదు. మేమున్న స్థలంలో రక్షణ ఉందా లేదా అన్నట్టు చుట్టూ చూస్తున్నాడు. అలా పరికిస్తూనే నాతో అన్నాడు.
"పోలీస్ స్టేషన్ లో మాకో ఇన్ ఫార్మర్ వున్నాడు. అతడు కబురు పంపాడు. కృష్ణమూర్తి అనే ఒకతనిని చుట్టుముట్టటానికి యీ రాత్రి ప్రయత్నం జరుగుతూ ఉందని. అన్నట్టు నీ పేరు కృష్ణమూర్తేగా"
అవునన్నట్టు తలూపాను.
"మాకు తెలియదు నువ్వెవరో, ఎక్కడుంటావో కూడా తెలియదు. ఎందుకొచ్చావు అని ఎంక్వయిరీ చేస్తే చిదానందానికి వ్యతిరేకంగా నారాయణా వాళ్ళని కూడాగట్టావని తెలిసింది. దాంతో విషయం అంతా అర్ధమైది. నీ ధైర్యానికి మెచ్చుకోవచ్చుగానీ, అంత ముఖాముఖి చిదానందం ఇంటికి వెళ్ళి బెదిరించటమే తొందరపాటు పని. చిదానందం వెనుక పెద్ద దన్ను, పోలీసు బలగం వుంది."
నేనెవర్నో చెప్పెయ్యాలన్న కోర్కెని బలవంతానా ఆపుకున్నాను. ఇది దానికి సరియైన సమయం కాదు.
"ఈ ఎన్ కౌంటర్ల గురించి నీకు తెలుసో. తెలియదో. ముందు చంపేస్తారు. ఆ తరువాతే విచారణలూ, ఎంక్వయిరీలూ! అన్నట్టు నువ్వు ఎక్కణ్ణుంచి వచ్చావు?"
నేనా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా "మనం ఇలా చీకట్లో పడి వెళ్ళిపోవచ్చుగా. నన్ను ఎదో ఒక వూరు చేరుస్తే, అక్కణ్ణుంచి ఎలాగో ఒకలా నేను తప్పించుకోగలననుకుంటున్నాను" అన్నాను- నా గురించి మీరింత శ్రమపడటం అనవసరం అన్న అర్ధం ధ్వనిస్తున్నట్టు.
అతడు నా వైపు చిత్రంగా చూసి "ఏమనుకుంటున్నావు నువ్వు? మనకి కొన్ని గజాల దూరంలోనే పోలీసులూ, మిగతా మనుష్యులూ ప్రతీపుట్టా గుట్టా వెతుక్కుంటూ వస్తున్నారు" అన్నాను- నా గురించి మీరింత శ్రమపడటం అనవసరం అన్న అర్ధం ధ్వనిస్తున్నట్టు.
నెమ్మదిగా చెట్టెక్కాను. అక్కణ్ణుంచి కనబడిన దృశ్యం చూసి నా వళ్ళు జలదరించింది. గమ్యంవైపు ఎర్రచీమలు పాక్కుంటూ వస్తున్నట్టు టార్చిలైట్లు గుంపులుగా వస్తున్నాయి నలుమూలల్నుంచి....
మొదటిసారి భయం వేసింది. అది భయం కూడా కాదు. నిస్సహాయ స్థితిపట్ల కలిగిన ఉక్రోషం. కొద్ది గంటల క్రితం వున్న విజయం తాలూకు ఆనందం చూస్తూ వుండగానే కరిగిపోతున్నందుకు కసి! వెళ్ళి వాళ్ళని కలవాలి. ఈ విషయాన్ని కోర్టుకి లాగాలి. ఇళ్ళు కాల్చివేత, ప్రామిసరీ నోట్ల మోసాలు అంతా బయటకు వచ్చేలా చేయాలి. కలెక్టర్ పురుషోత్తమ్ తో సాక్ష్యం చెప్పించాలి. లక్ష్మణ్ వైపు తిరిగి "సర్రెండరయిపోతున్నట్టుగా నేను వాళ్ళ దగ్గిరకి వెళతాను. ఒకసారి వాళ్ళ దగ్గిరకి వెళితే చాలు. ఆ చిదంబరం అంతు తేలిపోయినట్టే" అన్నాను.