Previous Page Next Page 
అతడే ఆమె సైన్యం పేజి 26


    వాల్మీకి వేషదారిని గార్డులు ప్రశ్నిస్తున్నారు. ఇస్మాయిల్ వారి వెనుకనుంచి నీడగా పాక్కుంటూ ముందుకు వెళుతున్నాడు. ప్రనూష స్టేజ్ ప్రాపర్టీస్ లో రహస్యంగా దాచిన అమ్యునేషన్ బయటకు తీస్తోంది.

    ఒక్కసారి ఆ ప్రదేశమంతా చప్పట్లతో మారుమ్రోగింది. తెర క్రిందకి జారుతోంది.

    గార్డుల్లో ఒకడు స్టేజి బయటకు పరుగెత్తబోయాడు. సరిగ్గా అదే సమయానికి లోపలికి రాబోతున్న చైతన్య అతడి గడ్డం కింద బలంగా కొట్టాడు. అది చూసి రెండో గార్డు గన్ ఎత్తాడు. ఇస్మాయిల్ అతడిమీదకు లంఘించాడు. ఈ హడావుడికి లక్ష్మి అక్కడకు పరుగెత్తుకుంటూ వచ్చింది.

    లోపల ఏదో గొడవ జరుగుతూందని అజ్మరాలీ గ్రహించాడు. ఒక్క ఉదుటున కుర్చీలోంచి పైకి రాబోయాడు. సరిగ్గా అదే సమయానికి ప్రనూష స్మోక్ బాంబ్ విసిరింది.

    క్షణాల్లో అక్కడ వాతావరణం మారిపోయింది. దట్టంగా పొగలల్లుకొనడంతో షార్ట్ సర్క్యూట్ అనుకున్నారు. ఈ లోపులో లక్ష్మిని చూపిస్తూ "టేక్ హర్ టు ది వాన్" అని డాక్టర్ పాల్ కి సూచన్లు యిచ్చి చైతన్య మెయిన్ ట్రాన్స్ ఫార్మర్ ని షూట్ చేశాడు. లక్ష్మిని డాక్టర్ పాల్ దాదాపు వ్యానులోకి విసిరేసి తనూ వెళ్ళి కూర్చున్నాడు. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి.... ఆ చీకట్లో రైఫిల్స్ చప్పుళ్ళు మొదలయ్యాయి. "యూ బాస్టర్డ్స్... షూట్! కిల్ దెమ్" అరుస్తున్నాడు అజ్మరాలీ.

    ప్రనూష వేసిన మరో బాంబ్ కి స్టేజి అంటుకుంది. "థాంక్స్ టు ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ పీపుల్" అనుకుంది. అక్కడ స్మగ్లర్స్ నుంచి కొన్న బాంబులు చాలా బాగా పనిచేస్తున్నాయి.

    చైతన్య పరుగెత్తుకువెళ్ళి డ్రైవర్ సీటులో కూర్చున్నాడు. బుల్లెట్ ప్రూఫ్ వ్యాన్ అది. స్టేజీ మంట తాలుకు వెలుగు తప్ప అక్కడంతా చీకటిగా వుంది. నాటకం చూడటం కోసం వచ్చిన సైనికాధికారులు ఈ అనూహ్య పరిణామాన్ని ఊహించకపోవడంతో కంగారుపడుతున్నారు. సైనికులు వెనుక వరుసలో వున్నారు. వాళ్ళు అక్కడినుండి పేలిస్తే ముందువున్న అధికారులకు ప్రమాదం. ఈ లోపులో ఇస్మాయిల్ ఇంకో జీప్ ఎక్కి స్టార్ట్ చేశాడు. హెడ్ లైట్స్ వెలిగించి ముందుకి దూకించాడు.
   
    పొగ మధ్యలోంచి జీప్ దూసుకుపోయింది. తుపాకి ప్రేలుళ్ళ మధ్యనుంచి బుల్లెట్ లా సాగిపోయింది.

    "ఫైర్" అన్నాడు అజ్మరాలీ.... "ఫాలో దట్ జీప్.... స్మాష్ దట్" అని అరిచాడు.

    చైతన్య తన వ్యానులోనే కూర్చుని వున్నాడు. వ్యాను కదిలించే ప్రయత్నం చేయలేదు. పాకిస్తానీ సైనికులు స్టేజి వెనక్కు పరుగెత్తుకు రావటం కనిపించింది. ఆ ఆపరేషన్ లో అతి కీలకమైన ఘట్టం అది! చైతన్య ఊపిరి బిగపట్టాడు.

    సైనికులు వ్యాను వెనక్కి పరుగెత్తుతున్నారు. వ్యానులో వున్న వాళ్ళందరూ వెంట్రుకవాసి కూడా కదలకుండా వంగి కూర్చుని వున్నారు. సైనికులకి తమకి కావల్సిన వ్యక్తులు ఆ "వ్యాను"లోనే వున్నారన్న అనుమానం రాలేదు.

    మిలటరీ వ్యానులన్నీ స్టేజి వెనుక దూరంగా పార్క్ చేయబడి వున్నాయి. అక్కడికి పరుగెత్తుతున్నారు వాళ్ళు. రెండు క్షణాల్లో అవి స్టార్ట్ అయ్యాయి. వరుసగా ఒకదాని తరువాత ఒకటి బయల్దేరాయి.

    వ్యాన్స్ కీ, సైనికాధికులకీ మధ్య మండుతున్న స్టేజివుంది. సైనికాధికారుల దృష్టి అంతా వెళ్ళిపోయిన జీపుమీదే వుంది.

    సైనికుల మోటార్ సైకిల్సూ, వ్యాన్సూ బాణాల్లా ముందుకు దూకాయి. చైతన్య మరో రెండు నిమిషాలు ఆగాడు. ఆఖరి వ్యాను తనని దాటగానే, తనదీ ముందుకు పోనిచ్చాడు.

    శత్రు సైన్యపు వ్యాన్స్ చివర అతడి వ్యానుకూడా సాగిపోయింది. అద్భుతమైన ఆలోచన అది. చరిత్రలో ఏ కమాండో ఇంతవరకూ సాధించలేని 'ప్లాన్' అది. ఏ మెర్సనీర్ ఇంతవరకూ వూహించని వ్యూహం అది. ముందొక చిన్న ఎరని పంపి, శత్రువులు దాన్ని వేటాడుతూ వుండగా వాళ్ళలో కలిసిపోయి అక్కడనుంచి బయటపడటం!

    అయిదు నిమిషాల ప్రయాణం సాగింది.

    ఇస్మాయిల్ నడుపుతున్న జీపు దగ్గర పడింది. దాన్ని వెంటాడే వ్యానులనుంచి మెషిన్ గన్స్ మ్రోగసాగాయి.   

     ఇక్కడే చైతన్య జ్ఞాపకశక్తికి అసలైన పరీక్ష! సంవత్సరాల తరబడి ప్రనూష సేకరించిన ప్లాన్స్ అన్నీ అత్యంత ఏకాగ్రతతో అతను స్టడీ చేశాడు. ఏయే దారి ఎటు వెళుతుందో అతడికి కంఠతా వచ్చేసింది. ముందు వాళ్ళకి అనుమానం రాకుండా తన వ్యానుని నెమ్మది చేసి, కుడివైపుకి తిప్పాడు.

    చీకట్లో అది కొండ పక్కకి తిరిగి ఆగింది. అక్కడ ఆపుచేసి అతడు వేచి వున్నాడు.

    ఈ లోపులో జీపుని మరింత వేగంగా పోనిచ్చి, ఆక్సిలేటర్ మీద బరువుపెట్టి ఇస్మాయిల్ క్రిందకు దూకేశాడు. వెనకాల వ్యానులు అక్కడికి చేరుకునే లోపులో తుప్పల చాటుకి వెళ్ళిపోయాడు. జీపు వేగంగా వెళ్ళి రాయికి కొట్టుకుని, ఆ వేగానికి పక్కకి తిరిగి క్రింది లోయలోకి జారిపోయింది. ఆ తర్వాత కొన్ని క్షణాలకి బ్రహ్మాండమైన వెలుగుతో అది విస్పోటనం చెందింది.

    అప్పటికే వెనుకనుంచి వస్తూన్న వ్యాన్ లన్నీ అక్కడికొచ్చి ఆగాయి. లోయలోకి దొర్లిపోవటం అధికారులు ప్రత్యక్షంగా చూశారు. వాళ్ళ ఉద్దేశ్యంలో చైతన్య తాలూకు సభ్యులందరూ ఆ జీప్ లోనే వున్నారు. అంత వేగంగా జారిపోయిన జీప్ లోంచి అంతమందీ బయటపడటం అసాధ్యం.

    అత్యంత శక్తివంతమైన లైట్లు లోయలోకి ఫోకస్ చేయబడ్డాయి. సైన్యం లోయలోకి దిగటం ప్రారంభించింది. జీప్ ని చేరుకుని లోపల ఎంతమంది మరణించారో చూడటానికి కనీసం పావుగంట పడుతుంది. అందులో ఎవరూ లేరని అది ఖాళీ అని తెలుసుకోవటానికి మరో అయిదు నిమిషాలు. అది చాలు.

    ఇస్మాయిల్ వచ్చి ఎక్కగానే చైతన్య వ్యాన్ ని అడ్డదారిలోకి తిప్పాడు. దాదాపు రెండు గంటల ప్రయాణం చేశాక వ్యాను ఆపుచేశాడు. ఇస్మాయిల్ వైపు చూసి నవ్వాడు. "ఇక్కడి వరకూ సక్సెస్..." అన్నాడు రిలాక్స్ డ్ గా!

    ముందుసీట్లో వాళ్ళిద్దరే కూర్చుని వున్నారు. మిగతా వాళ్ళంతా వెనుక వున్నారు. మధ్యలో ఇనుప పార్టీషన్ వుంది.

    "నేను చెప్పిన ప్లాను చాలా కరెక్ట్ గా అమలు జరిపావు. థాంక్స్ అండ్... కంగ్రాచ్యులేషన్స్" అన్నాడు చైతన్య. "పద వెనుకవాళ్ళని పలుకరించి వద్దాం. అసలేం జరుగుతుందో తెలియక వాళ్ళు కంగారు పడుతూ వుంటారు."

    "ఈ ప్లాను సంగతి వాళ్ళకి తెలీదా?"

    "నీకూ, నాకూ, ప్రనూషకి తప్ప ఇంకెవరికీ తెలీదు."

    "ఏం?" ఆశ్చర్యంగా అడిగాడు ఇస్మాయిల్.

    "మన ప్రతీ విషయమూ అజ్మరాలీకి తెలిసిపోయింది. మన మొదటి డాన్స్ ప్రోగ్రామ్స్ కి అతడు ప్రత్యేక అతిథిగా వచ్చాడు! ప్రనూష హోటల్ గది మీద నిఘా ఏర్పాటు చేశాడు. సరే- అదంతా అలా వుంచు. ప్రనూష నన్ను మెంటల్ హాస్పిటల్లో పరీక్షించిన విధానం కూడా అతడికి తెలిసిపోయింది. అంటే- మొట్టమొదటినుంచీ ఆమెమీద ఎలాగో నిఘావేసి వుంచాడన్నమాట. చాలా అదృష్టకరమైన విషయం ఏమిటంటే- నా తండ్రి జగదీష్ ప్రసాద్ అని అతనికి తెలియకపోవటం! కేవలం ప్రనూష కోసమే నేను వచ్చాననుకున్నాడు. నేనెందుకు వచ్చానో తెలుసుకునే లోపులోనే ప్లాను పూర్తి చేయాలనుకున్నాం. అందుకే అంతా హర్రీ చేశాం. విషయం ఎక్కడనుంచి 'లీక్' అవుతుందో తెలీదు. కాబట్టి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఒక్క నీకు తప్ప!"

    ఇస్మాయిల్ కళ్ళు చెమర్చాయి. "నన్ను యింత నమ్మకంలోకి తీసుకున్నందుకు-" అంటూ ఏదో చెప్పబోయాడు కృతజ్ఞతతో అతడి కంఠం బొంగురుపోయింది.

    "ఇందులో నమ్మకం ప్రసక్తేమీ లేదు ఇస్మాయిల్. చాలా చిన్న తర్కం అంతే! నా తండ్రి గురించీ నీ ఒక్కడికి తెలుసు. అజ్మరాలీకి ఈ విషయం ఇప్పటివరకూ తెలియలేదంటే- నువ్వు మా మనిషివన్నమాట."

    ఇస్మాయిల్ ఆప్యాయంగా చైతన్య భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని- "నాకు మీ రామాయణం గురించి బాగా తెలీదు సాబ్! కొద్దిగా తెలుగు వచ్చు. ఇందాక స్టేజీమీద చెపుతూంటే అర్ధమైంది. నీలాంటి సమర్ధవంతమైన కొడుకున్నందుకు నా దోస్త్ సైంటిస్టు జగదీష్ ప్రసాద్ అదృష్టవంతుడు. తెలివితేటలు అతని దగ్గిర్నుంచి పుణికి పుచ్చుకున్నావు నువ్వు" అన్నాడు.

    చైతన్య మొహమాటంగా భుజం మీద నుంచి అతని చెయ్యి తీసేస్తూ "పద వెనక్కి వెళ్ళి మన వాళ్ళతో మాట్లాడదాం" అన్నాడు టాపిక్ మార్చి. ఇద్దరూ వెనక్కి వచ్చి వ్యాను వెనుక తలుపు తట్టారు. లక్ష్మి తీసింది.

    మొట్టమొదట దిగింది జగదీష్ ప్రసాద్! తండ్రికి చెయ్యి అందిస్తూంటే చైతన్య అప్రయత్నంగా వణికాడు. తరువాత తల్లిని దింపాడు. ఒక్కొక్కరు దిగారు.

    "ఇక్కడినుంచి వ్యాను ముందుకు తీసుకువెళ్ళటం ప్రమాదకరం. ఈ పాటికి వాళ్ళకి అసలు విషయం తెలిసిపోయి వుంటుంది. పాకిస్తానీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి మెసేజ్ వచ్చేసి వుంటుంది. ఇక్కడ నుంచి మనదేశపు సరిహద్దు మరో పది కిలోమీటర్లు వుంటుంది. తెల్లవారేసరికల్లా మనం అక్కడికి చేరుకోవాలి" అన్నాడు చైతన్య.

    "అవును తెల్లవారగానే హెలికాప్టర్లు సెర్చి ప్రారంభం కావొచ్చు. ముందు మనం ఈ వ్యానును నామరూపాల్లేకుండా చేయాలి" ఇస్మాయిల్ అన్నాడు. చైతన్య చుట్టూ చూశాడు. అంతా అడవి! చీకటి నల్లగా, కాటుకలా అడవిమీద పరుచుకుని వుంది. తన మెదడులో నిక్షిప్తమై వున్న మ్యాపుని గుర్తు తెచ్చుకుంటున్నాడు అతడు. ఆ అడవిలో నిశ్శబ్దం కూడా శబ్దంతో మిళితమై వుంది. కీచురాళ్ళ శబ్దం..... దూరంగా ఆగి ఆగి వినిపించే గుడ్లగూబ వికృతమైన అరుపు... దాదాపు వంద అడుగుల ఎత్తున చెట్లు- దూరంగా మంచుకొండల మీద నుంచి వచ్చే చల్లటి గాలికో, తెలియని భయానికో సన్నగా వణికే శరీరం...

    ఆ దట్టమైన అడవిమీద కాటుకలా పరుచుకున్న చీకటి. భయంతో కదిలిపోయేలా, నిశ్శబ్దం కూడా జలదరిస్తూ పగిలి పోయేలా- డాక్టర్ పాల్ అడిగాడు. "అన్నట్టు ప్రనూష ఏది? మనతో రాలేదా?"

           (తరువాయి భాగం "నిప్పుకోళ్ళు" నవలిక తరువాత పేజీల్లో చదవండి.)

 Previous Page Next Page