నిప్పుకోళ్ళు
ఆ దృశ్యం నాకింకా గుర్తుంది. గుర్తొస్తేనే కడుపులో తిప్పినట్టు వుంది.
పొద్దున్నే ఎనిమిదింటికి నాకు ఆ విషయం తెలిసి ఆదరాబాదరా ఆఫీసుకి వెళ్ళాను.
జనం బాగా గుమికూడి వున్నారు. నేను ఆ ఆఫీసుకి అధికారి నవటంతో కొందరు పక్కకి తప్పుకుని, నాకు దారిచ్చారు. మా ఇంటికి కొద్ది దూరంలోనే వుంది ఆఫీసు. చాలా పెద్ద బిల్డింగు.
విశాలమైన మెట్లు. మెట్లమీద పడివుంది ఆ వృద్ధురాలు.
అర్ధరాత్రి చలికి మరణించిందో, అంతకుముందే ఆకలికి మరణించిందో తెలీదుగానీ తనలో తనే కుదించుకు పోయినట్టు వుంది. చర్మం లోపలి పీక్కుపోయి, బాగా ముడతలుపడి వుంది' ఒంటిమీద పాత చీరె అక్కడక్కడా చిరిగిపోయింది.
మరణం సహజమే అయినా, ఇలా మెట్లమీద మరణించిన ఆ ముసలావిడవైపు ఏమి వింత వుందోగానీ జనం గుంపులు గుంపులుగా చూస్తున్నారు. ఇంతలో విశ్వేశ్వర్ నా దగ్గిరకొచ్చాడు. అతడు నా క్రింద పనిచేసేవాడు.
"ఈవిడ పది సంవత్సరాల్నుంచీ నాకు తెలుసు సార్! మన ఆఫీసుకి వస్తుంది" అన్నాడు.
తలూపాను
అతడు స్వరం తగ్గించి, "పెన్షన్ కోసం శర్మగారు నాల్రోజుల్నుంచీ తిప్పుతున్నారు. మొన్న బాగా ఏడ్చింది. రాత్రిళ్ళు మన ఆఫీసు బయట అరుగుమీదే పడుకుంటోంది" అన్నాడు.
అంతలో మున్సిపాలిటీ వ్యానొచ్చింది. శవాన్ని వ్యాన్ లో ఎక్కించి తీసుకెళ్ళేవరకూ జనం అదేదో సర్కస్ లా చూశారు. ఒక జర్నలిస్టు ఫోటోలు తీసుకుంటున్నారు. అతడు చాలా సంతోషంగా వున్నాడు. వుండడూ మరి? ఎంత మంచి వార్త....
"పెన్షన్ ఆఫీసు అరుగుమీద వృద్ధ స్త్రీ మరణం....." చాలా సంచలనం కలిగించే వార్త.
అన్నట్టు నేనెక్కడ పనిచేస్తున్నానో చెప్పలేదు కదూ. అయినా ఈ పాటికి మీకు తెలిసే వుంటుంది.
ట్రెజరీ ఆఫీసులో సూపర్నెండెంట్ ని.
* * * *
నేను తిరుపతి వచ్చి అప్పటికి రెండు రోజులైంది. ఆ రాత్రి నాకొక కల వచ్చింది. సూర్యగమనానికి చిహ్నంగా తూరుపు దిక్కు ఎరుపుదనం దిద్దుకోవడం మొదలు పెట్టిన సమయం...
పూలసజ్జ పట్టుకుని తోటలోకి అడుగుపెట్టాను. చిన్ని చిన్ని పాదాలతో నన్ను అనుసరించింది నా కూతురు నాలుగేళ్ళ దీపిక. కొన్ని పూలకింకా మెలకువ రాలేదు. బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ ఒక్కొక్క రెక్కనూ విప్పుతున్నాయి. రాత్రంతా వెన్నెల చల్లదనాన్ని ఆస్వాదించి వడి నింపుకున్న నందివర్ధనాలు చీకట్లో నీలాకాశంలో నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. జీవితకాలం కొద్దిసేపే అయినా ప్రకృతికే అందాన్నిచ్చామన్న తృప్తితో నేలవాలి కూడా మెరుస్తున్నాయి పారిజాతాలు.
మర్నాటికి గాని పూర్తిగా విచ్చుకోదనుకున్న ఎర్రగులాబీ మొగ్గ అరచేతి సైజులో అందంగా, నిండుగా విచ్చుకుంది. జేబులోంచి కత్తెర తీసి నీట్ గా కట్ చేశాను.
"భలే బావుంది గదూ నాన్నా! దీన్ని కూడా ఆ దేవుడే పుట్టించాడు కదూ" అడిగింది దీపిక.
"అవునమ్మా మనందరం ... ఈ చెట్లు, పువ్వులు... అన్నీ దేవుడి సృష్టే మరి" అన్నాను.
"మరి వీటినిలా తుంపేస్తే దేవుడికి కోపం రాదా నాన్నా?" అడిగింది అమాయకంగా.
"రాదమ్మా! వీటిని కోస్తున్నది ఆ దేవుడి సేవకేగా. ఎంతో పుణ్యం చేసుకుంటేగాని భగవంతుడి పాదాలను చేరే అదృష్టం కలగదమ్మా. తోటలో ఎన్ని పూలున్నాయని కాని దేవుడి పూజకు నోచుకున్నవి ఆ కొద్ది పూలే."
"అయితే నాన్నా అందరూ నన్ను పువ్వులా అందంగా వున్నవంటారు గదా నన్ను కూడా దేవుడికి అర్పిస్తే సంతోషిస్తాడు కదా" అంది.
అదిరిపోయాను. చేతిలో ఎర్రగులాబీ స్థానంలో ఎర్రటి రక్తం కారుతోంది.
"పాపా" గట్టిగా అరిచాను.
చటుక్కున మెలకువ వచ్చింది. అదే కల! నన్ను దాదాపు ఇరవై ఏళ్ళుగా వెంటాడుతున్న కల!! రక్తంతో తడిసిన దేవత... ఆ విగ్రహం కాళ్ళ దగ్గర ఒక నాలుగేళ్ళ పాప.... మెడ సగానికి తెగి, నిర్జీవమైన పాప.... పక్కనే పాపని బలి యిచ్చిన కత్తి.
* * * *
...గడియారంవైపు చూశాను. టైం మూడు దాటింది.
తిరుపతి కొండకి వచ్చినా కూడా ఆ కల నన్ను వదలక పోవటం భరించలేని విషాదాన్ని కలిగిస్తోంది.
ఆ దుఃఖాన్ని మర్చిపోవటం కోసం, నేనున్న కాటేజీనుంచి తోటవైపు నడిచాను. ఏడుకొండలమీద, తెల్లవారుజాము మూడింటికి... చలీ, నిశ్శబ్ధమూ చెట్టాపట్టా వేసుకున్నట్టున్నాయి. తోట చేరుకోవటానికి పది నిముషాలు పట్టింది. తోట మధ్యగా చిరుసవ్వడి వినిపించటంతో తలతిప్పి చూశాను. నాలాంటి నిశాచరుడెవడో మెల్లగా వచ్చాడు. కట్టుకున్న ధోవతి పైన అంగవస్త్రం మాత్రం కప్పుకున్నాడు. అంతకుమించి వెచ్చదనం కలిగించే ఆచ్ఛాదన ఒంటిమీద లేదు. నా ఉనికిని గమనించాడో లేదో తెలియదుగాని ఒక పక్కగా నిలబడి ధ్యానంలో మునిగిపోయాడు.
మళ్ళీ మరో సుప్రభాతం మొదలయింది. వెలుగురేఖలు పూర్తిగా విచ్చుకున్నాక షాల్ తీసేసి నునువెచ్చటి సూర్యకిరణాల స్పర్శలో ఆనందాన్ని అనుభవిస్తూ వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టాను. తోటలో యాత్రికుల సందడి మొదలయింది. అంత సందడిలోనూ ధ్యానముద్రలో మునిగిపోయిన ఆ వ్యక్తిని చూసి కొందరు వెటకారంగా నవ్వుకుంటూ వెళ్ళడం చూస్తే చిరాకేసింది.
కాటేజీల్లో, రోడ్లమీద అంతా సందడి. త్వరగా వెళితే దర్శనం బాగా జరుగుతుందని అంతటి చలిలోనూ లేచి స్నానాలు చేసి పిల్లలూ పెద్దలూ హడావుడిగా వైకుంఠం సాగిపోతున్నారు. అందరి కళ్ళలోను ఏదో ఆరాటం, ఉద్వేగం. అవి భగవంతుడిని ప్రత్యక్షంగా చూడబోతున్నామన్న సంతోషమేనా? వాళ్ళ మనసుల్లో ఎలాంటి ఆలోచనలు కదలాడుతుంటాయి? ఎలాంటి కోరికలు మెదలుతున్నాయి? దేవుడి సమక్షంలోనైనా మనిషిలోని అంతరాత్మ ఆత్మవంచన చేసుకోకుండా నగ్నంగా బయటపడటానికి ప్రయత్నిస్తుందా? వాళ్ళ మెదడుల్లోకి చొచ్చుకుపోయి, ఆలోచనా గ్రంధుల్ని వశపర్చుకుని స్వచ్చంగా హిపోక్రసీ లేని మనోభావాలను గ్రహించగలిగితే? ఇరవై ఏళ్ళుగా నా ఆలోచనలకు, నాలో రగులుతున్న ప్రశ్నలకూ జవాబులు దొరకవచ్చేమో... మళ్ళీ అదే దృశ్యం కాదు కాదు, రెండు దృశ్యాలు. రక్తంతో తడిసిన విగ్రహం, మెడ తెగిన పాప, పెన్షన్ ఆఫీసు మెట్లమీద వృద్ధురాలి శవం.
ఆలోచనలతోటే హోటలు దగ్గరకు చేరుకున్నాను. మెట్లెక్కుతుంటే దూరంగా కారు దిగి నడిచి వస్తున్న వ్యక్తిమీద పడింది దృష్టి. అతడు కూడా నడక ఆపి నిలబడి నావైపు చూస్తున్నాడు. అతడి ముఖంలోనూ ఆనందం, ఆశ్చర్యం.
"రామం" నేనే మొదట పిలిచాను.
"ఒరేయ్, వెంకట్! ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి" దగ్గరగా వచ్చి దాదాపు కౌగిలించుకున్నంత పని చేశాడు.
"పాతికేళ్ళు. కాలేజీ వదిలాక ఇదే కలవడం" అన్నాను. నాలాగే అతడిలోనూ ఆనాటి కాలేజీ రోజుల జ్ఞాపకాలు కదులుతున్నాయనుకుంటాను. కల్మషం నిండిన అనుభవాలతో పండిన వయస్సులో మనిషి నవ్వు కూడా కలుషితమై, కృత్రిమత్వం సంతరించుకున్నప్పుడు, బాల్యపు స్మృతుల విరులే స్వచ్చంగా విచ్చుకోగలవు. ఆ నవ్వు క్షణికమైనదే కావచ్చు. కాని ఎంత చరిత్రహీనుడి కయినా కల్మష రహితమైన బాల్యపు ఛాయ అది.
'ఏరా, ఏం చేస్తున్నావ్? ఎక్కడా వుండడం? పిల్లలెంత మంది?" ప్రశ్నల వర్షం కురిపించాడు.
"ప్రస్తుతం హైద్రాబాద్ లోనే ట్రెజరీ ఆఫీసులో సూపర్నెండెంట్ ని. ఇకపోతే ఒంటరివాడినే" అన్నాను.
"అదేమిటి సుజాతని పెళ్ళి చేసుకున్నావని విన్నానే. చేసుకోలేదన్నమాట" అన్నాడు ఆశ్చర్యంగా. నేను నవ్వి వూరుకున్నాను. మౌనం అర్ధాంగీకారం కదా. నేను ఆశించినట్లుగానే అతడు తన జవాబునే అంగీకారంగా తీసుకున్నాడు.
"ఆ పెళ్ళి జరగలేదని త్యాగం చేసి బ్రహ్మచారిగా మిగిలి పోయావా? భలే వాడివే" అన్నాడు రామం. అతడి ధోరణి ఆపే ప్రయత్నం చేయలేదు. స్నేహితుడిని చూసిన ఆనందంలో క్షణకాలం మెరిసిన కళ్ళల్లోని ఉత్సాహం నీలినీడగా మారిపోయింది. నా భావాన్ని పైకి కనపడనివ్వకుండా నవ్వగలగడం ఇరవై ఏళ్ళుగా అలవాటయిపోయింది.
సినిమాల్లోనూ, నాటకాల్లోనూ నటించేవాళ్ళే నటులుకారు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషీ నటుడే. ఆ నటుల్లా ఇతర పాత్రల్లో నటించడు. తన పాత్రలో తనే నటించి రావల్సిన దౌర్భాగ్యం.
"నాదేముందిలేరా. పసలేని జీవితం. నీ విషయం చెప్పు" అన్నాను. ఇది మరొక నటన. వాడి గురించి నాకంతా తెలిసుండీ తెలియనట్లు అడగటం.
"నేను కొన్నేళ్ళు గవర్నమెంటు సర్వీస్ చేశాను కాని అది బోర్ కొట్టి వదిలేసి అన్నయ్యతో కల్సి కాంట్రాక్ట్స్ లో పడ్డాను. బాగానే పైకి వచ్చాను. ఇప్పటి మన హెల్త్ మినిష్టరుగారు నాకు చాలాకాలంగా స్నేహితుడు. ఎన్నికల్లో ఆయనకు బాగా సాయం చేశానులే. ప్రస్తుతం పార్టీలో కూడా నాకు మంచి స్థానం వుంది. పేపర్లో నా పేరు వస్తుంటుంది చూడలేదా?" అడిగాడు కించిత్ గర్వంగా.
నవ్వి వూరుకున్నాను.
"అప్పుడప్పుడు ఫోటోలు కూడా పడతాయి. చూసుండవు. ఏమైనా ఇప్పుడు నా జీవితం సుఖంగా గడిచిపోతోందిరా. ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి పెళ్ళి అయిపోయింది. రెండో అమ్మాయి పెళ్ళి కుదిరింది. బాబు ఇంకా చదువుకుంటున్నాడు" అన్నాడు.
వాడి సుఖమాయి జీవితం గురించి నాకు తెలియందికాదు. ట్రైలర్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ లో మామూలు గుమాస్తాగా చేరినవాడు, ఎంత టేకు స్మగ్లింగ్ చేశాడో! గవర్నమెంట్ సొమ్ము స్వాహాచేసి చివరకు పట్టుబడి వూస్ట్ అవడం గురించి కూడా విన్నాను. చివరకు ఆ కాంట్రాక్టులోనే పడి రాజకీయాల్లో కూడా చేరి ఎంతగా ఎదిగిపోయాడో కూడా నాకు తెలుసు. వాడి పెద్దమ్మాయి పెళ్ళి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగింది. దానికి చాలామంది మంత్రులు హాజరయ్యారు. లక్షలు ఖర్చుపెట్టాడు. వచ్చిన అతిధులందరికీ ఖరీదయిన బహుమతులు యివ్వబడ్డాయి.
రాజకీయ గూండాలస్థాయి, అంతస్థు ఎంతగా పెరిగిపోయాయో తెలుసుకోవడానికి ఆ పెళ్ళి ఒక ఉదాహరణ.
"పదరా వెళ్ళి టిఫిన్ చేద్దాం. తిరుపతివస్తే ఈ హోటల్లో ఫలహారం చేయకపోతే నాకెలాగో వుంటుంది" అన్నాడు.
"మీ వాళ్ళను తీసుకురాలేదా?" అడిగాను.