Previous Page Next Page 
అతడే ఆమె సైన్యం పేజి 25


    ఆమె చీకటిలో నెమ్మదిగా నడిచి వెళ్ళిపోయింది.

    అతడలాగే శిలాప్రతిమలా వుండిపోయాడు.


                                                14


    ఆ మరుసటిరోజు ప్రోగ్రాం సైనికాధికారుల కోసం!

    మధ్యాహ్నం మూడింటికి అజ్మరాలీ వచ్చి చైతన్యని స్టేజి దగ్గరకి తీసుకువెళ్ళాడు. లైట్స్ అరేంజ్ మెంట్స్ జరుగుతున్నాయి. సైనికులు ఖైదీలతో ఏర్పాటు చేయిస్తున్నారు. కొందరు యుద్ధ ఖైదీలు తెరలు కడుతున్నారు. మరికొందరు స్టేజీమీదకు దూలాలు మోసుకు వెళుతున్నారు. పూర్వకాలం రోమన్ రాజులు బానిసలతో పనులు చేయించినట్లు సైనికులు ఆ ఖైదీతో పనులు చేయిస్తున్నారు. అజ్మరాలీ నవ్వేడు.... "మీ దేశపు సైనికులే... పాపం యుద్ధంలో దొరికిపోయి ఇలా బానిసల్లా బ్రతుకుతున్నారు."

    "మీ వాళ్ళూ మాకు దొరికి వుంటారు. ఇలా బానిసల్లా బ్రతుకుతూ వుండి వుండరు. ఖైదీల్లా బ్రతుకుతూ వుండివుంటారు" అన్నాడు చైతన్య, అజ్మరాలీ మొహం వాడిపోయింది. చైతన్యే మళ్ళీ అన్నాడు- "అంతర్జాతీయ సైనిక నిబంధనల ప్రకారం యుద్ధఖైదీల మార్పిడి వుంటుందనుకుంటాను."

    "అవును! ఖైదీల్ని మార్పిడి చేసుకోవాలి. అప్పుడప్పుడు చేసుకుంటాం. మీ ట్రూపుతోపాటు వచ్చిన ఇస్మాయిల్ మా దగ్గర్నుంచి వెళ్ళినవాడే...."

    తన దగ్గర భారతదేశపు యుద్ధఖైదీలు ఎందరున్నారో చూపించటం కోసమే అజ్మరాలీ ఇలా ప్రవర్తిస్తున్నాడని చైతన్య గ్రహించాడు. అంతలో ఎవరో ట్రూప్ మెంబర్ వచ్చి చైతన్యతో రహస్యంగా మాట్లాడాడు. చైతన్య మొహం వాడిపోయింది.

    "ఏం జరిగింది?" అన్నాడు అజ్మరాలీ.

    "మా ట్రూప్ లో వేషం వేసే ఒక నటుడు అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యాడు. ఇప్పుడెలా?"

    "చాలా ముఖ్యమైన నటుడా?"

    "అవును! వాల్మీకి అని- మునివేషం. పెద్దగా డైలాగులుండవు. కానీ - క్యారెక్టరు మాత్రం నాటకానికి చాలా అవసరం."

    "డైలాగులు ఎక్కువ లేకపోతే మా వాళ్ళలోనే ఎవరో ఒకళ్ళతో వేయించండి."

    "మీ సైనికుల్తోనా-"

    "అవును."

    "లేదు. చాలా సన్నగా, పొడుగ్గా వుండే వృద్ధుడు కావాలి."

    "అయితే మీ ఖైదీల్లో చూడండి."

    "అది మంచి ఆలోచన" అంటూ చైతన్య మళ్ళీ సంశయంగా "ఆ ఖైదీలు ఒప్పుకుంటారో లేదో" అన్నాడు.

    అజ్మరాలీ బిగ్గరగా నవ్వి, "వాళ్ళు ఒప్పుకునేది ఏమిటి? మనమే ఒప్పిద్దాం" అన్నాడు. చైతన్య చుట్టూ చూసి "అదిగో ఆయన పనికి వస్తాడు" అన్నాడు. దూరంగా స్టేజీమీదకు విగ్రహాన్ని మోసుకువెళుతున్న ఒక వృద్ధుడు. ఏళ్ళ తరబడి జైల్లో వుండటంవలన శరీరం శుష్కించి పోయి వుంది. అయినా కళ్ళల్లో తేజస్సు ఉట్టిపడుతూంది. అతడే జగదీష్ ప్రసాద్.

    "పదండి మనం వెళదాం. వాడిని మా వాళ్ళు తీసుకొస్తారు" విడిదివైపు నడుస్తూ అన్నాడు అజ్మరాలీ. ఇద్దరూ నడుస్తుండగా అజ్మరాలీ చెప్పాడు. "వచ్చే సంవత్సరం మళ్ళీ రావాలి మీరు. కొత్త 'బాలే' తో ..."

    "తప్పకుండా."

    "ఈ సారి నేను కథ చెపుతాను. నాటకంగా మీరు తయారు చేస్తారా?"

    చైతన్య నవ్వి "కథ బావుంటే తప్పకుండా చేస్తాను" అన్నాడు.

    "చాలా బావుంటుంది. ష్యూర్ సక్సెస్."

    "కథ చెప్పండి. మీరే సక్సెస్ అనుకుంటే ఎలా?" నవ్వుతూనే అన్నాడు.

    "ఒకమ్మాయి ఒక వ్యక్తిని చంపాలనుకుంటుంది. ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంది. అతడు వేరే దేశంలో వుంటాడు. కుదరదు. అప్పుడొక యువకుడిని అద్దెకు తీసుకుని అతడు తనకి సరిపోతాడా లేదా అని రకరకాల పరీక్షలు పెడుతుంది. అన్నిటిలోనూ అతడు నెగ్గుతాడు. అతడిని తీసుకుని తన శత్రువుని చంపటానికి బయల్దేరుతుంది. అతనొక్కడినే అన్నమాట. టైటిల్ గురించి కూడా ఆలోచించే వుంచాను.... అతడే ఆమె సైన్యం."

    అజ్మరాలీ మొదటివాక్యం చెపుతుండగానే చైతన్య మొహంలో నవ్వు మాయమైంది. అయితే అది భయంవలన కాదు... అతడికి భయం వేయలేదు. ప్రనూషని అజ్మరాలీ గుర్తుపట్టాడని తెలిసినప్పుడే భయం వేసే స్టేజి దాటిపోయాడు. ఇప్పుడు ఆశ్చర్యం... అసలిదంతా ఎలా తెలిసింది అన్న ఆశ్చర్యం...

    అజ్మరాలీ ప్రనూషని గుర్తుపట్టి వుండొచ్చుగాక! కానీ ఇదంతా తెలిసే అవకాశం లేదు. ముఖ్యంగా మెంటల్ హాస్పిటల్ లో తనకి పరీక్ష పెట్టిన విధానం!

    అంతలోనే అతడికి మరో సందేహం. వణికిపోయాడు!

    తన తల్లితండ్రుల విషయంకూడా ఇతడికి తెలిసిపోయిందా?

    ప్రనూష సంగతి తెలిసిన తరువాత కూడా ఎలా తెలియనట్లు నాటకమాడాడో అలాగే తన తండ్రి సంగతి తెలిసికూడా నాటకం ఆడుతున్నాడా? చైతన్య మనసులో రకరకాల ఆలోచనలు ఈ విధంగా కదలాడుతూంటే- "ఏం మిస్టర్ చైతన్యా! నేను చెప్పిన కథ బాగోలేదా? మాట్లాడటం లేదేమిటి?" అని అడిగాడు అజ్మరాలీ.

    తాడు తెగేవరకూ లాగటం మంచిది కాదంటారు. ఎలాగూ తెగుతుందని తెలిసినప్పుడు లాగటమే మంచిది. వస్తువు చేతికి దొరికే ఛాన్సు కాస్తయినా వుంటుంది.

    "కథ బాగానే వుంది. కానీ ఆ సైనికుడు ఆవిడతో కలిసి ఎందుకు వెళతాడు? తన ప్రాణాల్ని ఎందుకు రిస్కులో పెట్టుకుంటాడు?" చైతన్య అడిగాడు.

    అజ్మరాలీ బిగ్గరగా నవ్వి "అంత పెద్ద మనిషి యాక్టర్ వి- ఇంత చిన్న విషయం తెలీదా?'... హీరోయిన్ అందంగా వుంటుంది కాబట్టి" అన్నాడు.

    చైతన్య గాఢంగా ఊపిరి వదిలాడు. కనీసం తన తండ్రి విషయం ఇతడికి తెలీదు. అది నయం...

    "ఏమిటి ఆలోచిస్తున్నావు?"

    "ముగింపు చెప్పలేదు మీరు."

    "నాటకానికి ముగింపు ఏముంటుంది? సుఖాంతమే" అంటూ ఉండగా అజ్మరాలీ మొహం కౄరంగా మారింది. "వాస్తవానికీ, నాటకానికీ తేడా వుంటుంది కదా. చాలామందికి నాటకం సుఖాంతం కావాలి. నాలాటి వాడికి వాస్తవం విషాదాంతం కావాలి.


                   *    *    *    * 


    "మా దేశం విభిన్న సంస్కృతుల నిలయం! రకరకాల జాతులు, మతాలు, దేవుళ్ళు విశ్వాసాలతో విలసిల్లే ఏకైక విశాల ప్రజాస్వామిక దేశం!" చైతన్య తన డాన్స్ బాలే తాలూకు ముఖ్యాంశాన్ని ఇంగ్లీషులో వివరిస్తున్నాడు. "ఇప్పుడు మీరు చూడబోయేది మా దేవుడైన శ్రీరాముడి కథ."

    జనవాక్య పాలన కోసం తన భార్యని అడవులకు పంపుతాడు శ్రీరాముడు. కొన్ని సంవత్సరాల ఎడబాటు తరువాత వారిని తిరిగి కలుపుతారు కుశలవులు. బుర్రకథ, హరికథ, కూచిపూడి, జవాలకుల కథ, తోలుబొమ్మలాట లాంటి వివిధ ప్రక్రియల్లో ఈ రామాయణం రచింపబడింది. మీరు చూడబోయే ఈ "బాలే" - ఆధునిక యక్షగానంలో ఉత్తర రామాయణం..." చప్పట్లు.

    ఓపెన్ ఎయిర్ థియేటర్ అది. దాదాపు వెయ్యిమంది సైనికాధికారులు వున్నారు. తెర లేచింది.

    సూత్రకారుడు పాట ప్రారంభించాడు. వాల్మీకి తపస్సు చేస్తూండగా సీత ప్రవేశం! గార్డులు కాపలా కాస్తున్నారు. చైతన్య తాలూకు ట్రూపు స్టేజిమీద ప్రవేశం! గార్డులు కాపలా కాస్తున్నారు. చితన్య తాలూకు ట్రూపు స్టేజిమీద ప్రదర్శన రక్తి కట్టిస్తున్నారు. స్టేజి మీద జగదీష్ ప్రసాద్ తన పని చేసుకుపోతున్నాడు.

    సూత్రధారుడు కుశలవుల జననాన్ని వర్ణిస్తున్నాడు.

    జగదీష్ వింగులోకి వచ్చాడు. అక్కడ తనలాంటి మేకప్ లోనే ఉన్న మరో వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. గార్డులకి అనుమానం రాకుండా రెండో వాల్మీకి స్టేజీమీదకు ప్రవేశించాడు. గార్డులు అతడినే కాపలా కాస్తున్నారు. జగదీష్ కి జరుగుతున్న దేమిటో అర్ధంకావటంలేదు. క్షణాల్లో మేకప్ మాన్ అతడి ఆహార్యం మార్చేశాడు. ఇప్పుడు అజ్మరాలీయే అతడిని గుర్తుపట్టలేడు.

    సూత్రధారుడు వాల్మీకి పాత్రలో రాముడికి చెప్పిస్తున్నాడు- "రామా! ఇదంతా కర్మ. కర్మకి మించినదీ, కర్మని ఎదుర్కొన గలిగేదీ వేరొకటి లేదు. ఇన్నాళ్ళు నీ భార్య ఎడబాటు కూడా కర్మఫలమే. ఏ దురదృష్టకరమైన క్షణమో నీ జీవితంలోకి విషాదాన్ని తీసుకొచ్చింది. దానిగురించి మర్చిపో. నీ భార్య ఇక్కడే వుంది, వీళ్ళు నీ పుత్రులు, ఆనాడు గర్భవతి అయిన నీ భార్యని వదిలేశావు. గుర్తుందా? ఇదిగో- నీ పిల్లలు పెద్దవాళ్ళయి, సమర్ధవంతులై నీ ముందు నిల్చున్నారు చూడు. సకల గుణాభిరాముడి వైన నీకు జన్మించిన నీ పిల్లలు నీ అందాన్ని పుణికిపుచ్చుకున్నారు. తెలివితేటల్తో, ధనుర్విద్యతో నీకు వారసులయ్యారు. భార్యావియోగంతో కలతబారిన నీ మనసు సేద తీర్చటానికి, కేవలం తమ తల్లితండ్రులిద్దర్నీ కలపటానికి, వారిద్దరే ఒక సైన్యంగా మారి యుద్ధం చేస్తారు. ఇదే కర్మఫలమంటే... ఫలాన్ని అనుభవించు. ఇంతకాలం నీకు ఉన్న సంశయాలు తీరిపోయాయనుకుంటున్నాను." వింగులోంచి రంగనాయకి బ్యాక్ కర్టెన్ వెనక్కు వచ్చింది.

    గార్డులు ప్రదర్శన చూడటంలో మునిగిపోయి వున్నారు.

    స్టేజీమీద పడుతున్న డిన్నర్ వెలుగులోంచి ఒక కిరణం చీలి బ్యాక్ స్టేజీమీదకు రిఫ్లెక్ట్ అవుతూంది.

    సూత్రధారుడు మంగళవాక్యం పలుకుతున్నాడు.

    అప్పుడు పడింది జగదీష్ దృష్టి రంగనాయకి మీద!!

    ఆ వృద్ధుడి కళ్ళల్లో - ఇది కలా? నిజమా అన్న అనుమానం ... మొదటి క్షణం సంశయమై- రెండో క్షణం సంభ్రమమై మూడవ క్షణానికి సంతోషానికి సుప్రభాతమైంది.

    చైతన్య ఇద్దర్నీ చూస్తున్నాడు. కళ్ళకి అడ్డుపడిన తడి నీటి పొరలో తల్లి దండ్రులిద్దరూ అతడికి మసగ్గా కనపడుతున్నారు. ఎర్ర దీపపుకాంతి తల్లి నుదుటిమీద సూర్యుడిలా మెరుస్తూంది. తీరిన తల్లి నుదుటి వెలితి- సేదతీరిన హృదికి మందారమల్లీ హారతి! ఒకదానికొకటి సంబంధం లేని ఆలోచనలు. గోదావరి పుష్కరానికి తండ్రికి తర్పణం వదలబోతుంటే వారించిన ఇస్మాయిల్!! సాటి సైనికుడి ప్రాణాల్ని కాపాడటం కోసం ప్రాణాలకు తెగించి తమతో వచ్చిన ఆ ఇస్మాయిల్ వైపు కృతజ్ఞతగా చూశాడు చైతన్య. ఇస్మాయిల్ కూడా నీళ్ళునిండిన కళ్ళతో ఆ దంపతుల వైపే చూస్తున్నాడు.

    జగదీష్ భార్య చేతులు పట్టుకున్నాడు.

    పరాయి సైనికులు పంచలో పాతిక సంవత్సరాలు ప్రాణంలేని బొమ్మలా బ్రతికిన ఆ రాడార్ టెక్నీషియన్ కి- ఇన్నాళ్ళకి అందిన తొలి శుభవార్త. తరంగాలు తరంగాలుగా పెదవులమీద నవ్వుగా వెలిసింది. ఆమె భుజాలమీదుగా చైతన్యని చూశాడు. స్వంత రక్తాన్నీ, పేగు తెంచుకు పుట్టిన బిడ్డనీ గుర్తించడానికి ఏ రాడారూ అవసరంలేదు.

    రంగస్థలం మీద ఆఖరి అంశం జరుగుతుంది. వాల్మీకి వేషధారి వింగులోకి వచ్చాడు. అతడిని గార్డులు అప్పుడు గుర్తు పట్టారు. అప్పటివరకూ తాము గార్డ్ చేసింది వేరే వ్యక్తినని తెలుసుకున్నారు. ఈ లోపులో చైతన్య తన తల్లిదండ్రుల్ని స్టేజి వెనక్కి తీసుకెళ్ళాడు. అక్కడంతా చీకటిగా వుంది. రంగస్థలానికి కావల్సిన వస్తువులు తీసుకురావటం కోసం ఏర్పాటు చేసిన మిలటరీ వ్యాన్ అక్కడవుంది. డ్రైవర్ మెడమీద వెనుకనుంచి బలంగా కొట్టి, క్రిందకి లాగేసి, వాళ్ళని ఆ వ్యాన్ లో ఎక్కించాడు.

 Previous Page Next Page