Previous Page Next Page 
కాంతి కిరణాలు పేజి 25

 

    మరుక్షణం ఇద్దరి శరీరాలూ ఆవేశంతో పెనవేసుకపోయినాయ్.
    "రేపు మా యింటి కెళదాం. వస్తావా?" సరస్వతి అడిగింది శాంతిని.
    పాలిటెక్నిక్ లో చేరిన కొద్ది రోజులకే అదే క్లాసులో ఉన్న సరస్వతి తో పరిచయమైంది శాంతికి. ఆ పరిచయం రాను రాను ప్రాణ స్నేహంగా మారిపోయింది. తన రహస్యాలన్నీ శాంతికి చెప్పేసింది సరస్వతి. తనూ తన ఇంటేదురుగ్గా ఉండే యువకుడూ ప్రేమించుకోవడం -- ఇంట్లో వాళ్ళకు తెలీకుండా ఎక్కడ కలుసుకొంటోంది - అతని ప్రణయ కలాపాలేలా వుంటాయి - మొదలైనవన్నీ .
    శాంతి కూడా ఆమెకు తన గురించి చెప్పింది కాని - శ్రీపతి విషయం మాత్రం చెప్పలేకపోయింది. స్కూల్లో ఉన్నంత సేపూ ఇద్దరూ కలసే వుండేవారు . తను ఇంటికి ఓ సారి రమ్మని ఎప్పట్నుంచో వేధిస్తోంది సరస్వతి.
    "ఏమిటి రేపు విశేషం ?" అడిగింది శాంతి నవ్వుతూ.
    "మా అక్క మా అన్న అందరూ నిన్ను చూస్తారట ....."
    "ఎందుకు ?"
    "నీ గురించి ఎప్పుడూ చెప్తూ వుంటాను కదా . అందుకని చూడాలని వుంది వాళ్ళకు "
    "నువ్వెందుకలా చెప్పటం ?" నవ్వాపుకుంటూ అడిగింది శాంతి.
    "ఫ్రెండ్స్ గురించి చెప్పరేమిటి మరి!" తనూ నవ్వేస్తూ అంది సరస్వతి.
    "సరేలే!" వప్పుకొంటూ అంది శాంతి.
    అనుకున్నట్లే మర్నాడు ఇద్దరూ బస్ లో వాళ్ళింటికి వెళ్ళారు. చిన్న యిల్లది. అందులోనే నాలుగు గదులు ఇరుగ్గా ఉన్నాయ్.
    శాంతిని ఓ గదిలోకి తీసుకెళ్ళింది సరస్వతి. అక్కడ ఆమె అక్క కాబోలు కూర్చుని మిషన్ మీద బట్టలు కుడుతోంది.
    "రామ్మా . ఇలా కూర్చో" అంటూ శాంతిని సాదరంగా ఆహ్వానించింది.
    శాంతి కుర్చీలో కూర్చుంది.
    "రోజూ సరస్వతితో చెప్తూనే ఉన్నాం ------ నిన్నోసారి తీసుకురమ్మని" అందామె ఆప్యాయంగా.
    "ఇప్పుడే మా అన్నయ్యను పిలుచుకొస్తానుండు" లోపలకు వెళుతూ అంది సరస్వతి.
    "వద్దు......" వారించ బోయింది శాంతి. అప్పటికే సరస్వతి వెళ్ళిపోయింది.
    "వాడి మాటలకేం భయపడకమ్మా" ఆడపిల్లలంటే -- అందులోనూ చదువుకొనే ఆడవాళ్ళంటే విపరీతమయిన కోపం...."
    గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయ్ శాంతికి.
    మరుక్షణంలో పైజమా లాల్చీతో ఓ యువకుడు ఆ గదిలో కొచ్చేశాడు . శాంతిని చూస్తూనే -----
    "నమస్తే !" అన్నాడు చిరునవ్వుతో.
    ప్రతి నమస్కారం చేసింది శాంతి.
    "మీరు కూడా సరస్వతి క్లాసేనట కదా. సరస్వతి చెప్పింది " అన్నాడు.
    "అవునండీ !" భయం భయంగా మాట్లాడింది శాంతి.
    "మీరూ నుంచున్నారెందుకు ? కూర్చోండి " అన్నాడతను - తనూ ఓ కుర్చీలో కూర్చుంటూ.
    శాంతి మళ్ళీ కూర్చుని తలొంచుకుని కిందకు చూడసాగింది.
    "మీరు ఉద్యోగం కోసమే చదువుతున్నారా?" అడిగాడతను.
    "అవునండీ!"
    "ఎందుకు? ఉద్యోగం చేయకపోతే మీకు గడవదా?"
    "గడుస్తుంది . కాని ఒకరి మీద అధారపడకూడదని -" అంది శాంతి.
    "మీరే - ఉద్యోగం చేయాలనుకొంటున్నారు కదూ?" వెంటనే అందుకొంటూ అన్నాడతను.
    అవునన్నట్లు తలూపింది శాంతి.
    "మన దేశంలో నిరుద్యోగసమస్యకీ కారణం - స్త్రీలకి ఉద్యోగాలివ్వటమే !" గట్టిగా అన్నాడతను.
    "ఎందుకని ?" అడిగింది శాంతి ఆశ్చర్యంగా.
    "అవును ! స్త్రీకి ఉద్యోగం ఎందుకు? ఎలాగూ ఆమెని భర్త పోషిస్తాడు . ఇంకా ఆమె ఉద్యోగం ఎందుకు చెయ్యాలి? భార్యా భర్తలిద్దరూ ఉద్యోగస్తులయితే భార్య జీతం ఏమవుతుంది? ఖరీదయిన చీరాలకి -- ముఖాలంకరణలకూ సరిపోతుంది. అదే ఉద్యోగం ఒక మొగాడికిస్తే ఓ కుటుంబం యావత్తూ పోషింపబడుతుంది. మన దేశంలో కుటుంబ సభ్యులంతా ఇంటి మొగాడి మీద ఆధారపడటం ఆనవాయితీ! నూటికి తొంబయ్ తొమ్మిది కుటుంబాల పరిస్థితి ఇంతవరకూ అలాగే ఉంది. ఎవరి బ్రతుకు వాళ్ళు గడపడానికి మనదేశం అమెరికా, ఇంగ్లాండు దేశం కాదు" ఉద్రేకంగా అన్నాడతను.
    శాంతి ఏమీ మాట్లాడలేకపోయింది. అతని మాటలు సబబుగానే ఉన్నట్లనిపించిందామెకి. కాని స్త్రీలకి ఆర్ధిక స్వాతంత్ర్యం లేకపోతే ఆమె పరిస్థితి మరింత దుర్భరమయిపోతుందే . పురుషుడి నిరంకుశత్వం పెరిగిపోతుందే.
    "అన్నాయ్! నీ ఉపన్యాసం వీధుల్లో ఇస్తే కొంత ఆదరణ లభిస్తుంది . కాని శాంతి ముందిస్తే ఏం లాభం?" నవ్వుతూ అంది సరస్వతి.
    "నువ్వేమయినా చెప్పు . స్త్రీలకి అనవసరంగా ప్రాముఖ్యత యిస్తున్నారు మనవాళ్ళు. సంస్కరణ అంటూ ఆమెని పాడుచేస్తున్నారు.
    శాంతికి నవ్వు వచ్చింది. "స్త్రీ శత్రువు" లాగున్నాడితను అనుకొంది లోలోపల.

 Previous Page Next Page