Previous Page Next Page 
కాంతి కిరణాలు పేజి 24

 

    "కాసేపు బీచ్ కెళ్ళి కుర్చుందామా ?" అడిగాడతను.
    "ఊ...." ఏదో ఆలోచిస్తూ అందామె.
    ఆటోలో ఇద్దరూ బీచ్ చేరుకున్నారు.
    చాలాదూరం నడిచి ఎవ్వరూ లేనిచోట కూర్చున్నారిద్దరూ. చాలాసేపు ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయారు.
    "మిమ్మల్ని అలా చేయి పట్టుకు లాగినందుకు కోపం రాలేదు కదా" అడిగాడతను.
    ఆమె నవ్వేసింది. "కోపమేమీ లేదులెండి........" అని కొద్ది క్షణాలాగి మళ్ళీ అంది "అయినా మీకు ఆమాత్రం చనువుంది కదా"
    సురేంద్ర ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు."
    తను ఎదురుచూస్తూన్న క్షణాలు దగ్గరికొస్తున్నాయ్.
    "మీరు అంత ఖరీదు పెట్టి ఇప్పుడా చీర కొనకపోతేనేం?" నిష్టూరంగా అందామె.
    "నాలాంటి స్నేహితులు చీర కొనిచ్చే సందర్భం ఇంకోటేముంటుంది మరి?"
    ఆమె ఏమీ మాట్లాడలేదు.
    కొద్దిసేపు ఏవేవో ఆఫీసు విషయాలు మాట్లాడాడు సురేంద్ర.
    "ఇంక వెళదాం తొమ్మిదవుతోంది....." అంది మాధురి. తను లేచి ఆమెకు చేయి అందించాడు సురేంద్ర.
    అతని చేయి అందుకొని లేచి నిలబడిందామె.
    ఆమె చేయి వదలకుండా అలాగే పట్టుకొని నడువసాగాడతను. ఆమె వదిలించుకోడానికి ప్రయత్నించి అతను గట్టిగ పట్టుకోవడంతో ఊరుకుండిపోయింది.
    "ఎప్పుడూ మీ చేయి ఇలాగే నా చేతిలో ఉండిపొతే ఎంత బావుంటుంది ?" అన్నాడు సురేంద్ర.
    "ఊహూ! మీకు శృంగార కవిత్వం కూడా వచ్చునన్న మాట ."
    "మీతో పరిచయమయాకే వస్తోంది ."
    నవ్వేసిందామే.
    సినిమాహాలు ముందు నుంచీ నడుస్తున్నారిద్దరూ.
    "మాధురి గారూ" నెమ్మదిగా పిలిచాడతను.
    "ఏమిటి?"
    "ఓ చిన్న కోరిక!"
    "ఏమిటో ?"
    "ఈ సినిమా కెళదాం పదండి సినిమా అయాక మిమ్మల్ని మీ ఇంటివరకూ చేర్చే పూచి నాది."
    కొద్ది క్షణాలు యోచించి "సరే - పదండి " అంది హాలు వేపు నడుస్తూ .
    తనే టిక్కెట్లు తీసుకొచ్చాడు సురేంద్ర.
    ఇద్దరూ రిజర్వ్ డ్ లో పక్కపక్కనే కూర్చున్నారు.
    సినిమాలోని ప్రణయ సన్నివేశాలు మరీ ఘోరంగా ఉన్నాయ్ ! హీరో హీరోయిన్ ఒకరి మీద ఒకరు పడుకొని దొర్లుతున్నారు.
    ఆ ప్రయత్నంగా ఆమె చేతిని తన చేతులోకి తీసుకొని గట్టిగా నొక్కాడతను. ఆమె ఏమీ అభ్యంతరం చెప్పలేదు. అతనికి దగ్గిరగా జరిగి అతని భుజాల్ని తాకుతూ కూర్చుంది.
    "ఇంక ఇంటికెళ్ళిపోదాం పదండి" అంది యింటర్వల్ లో.
    "సినిమా బావుండలేదా?" ఒకవేళ తన ప్రవర్తనకి అలా అంటుందేమోనన్న భయంతో అన్నాడతను.
    ఆమె మాట్లాడలేదు. ఇద్దరూ ఆటోలో ఆమె ఇంటికి చేరుకున్నారు.
    "లోపలికి రండి . భోజనం చేసి వెళు దురు గాని" అనేసి అతని మాట వినిపించుకోకుండా లోపలకు నడిచింది.
    సురేంద్ర కుర్చీలో కూలబడ్డాడు.
    "నువ్వు నిద్రపో అమ్మా. నేను వడ్డించుకుంటానులే" లోపల ముసలామెతో కాబోలు అంటోంది మాధురి.
    మరికొద్ది నిముషాల్లో ఇద్దరికీ వంటింటిలోని చిన్న టేబుల్ మీద భోజనం వడ్డించింది. వంటింటిలోనే ఓ మూల మంచం మీద ముసలామె పడుకొంది.
    త్వరత్వరగా భోజనం ముగించాడు సురేంద్ర. ముందు గదిలో కొచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
    చల్లనిగాలి వీస్తోంది బయటినుంచి. బయట ఉరుములు మెరుపులు మొదలయినాయ్.
    "వర్షం వచ్చేట్లుంది వెళతాను....." అన్నాడు సురేంద్ర ..... వంటింట్లోంచి మాధురి బయటకు రాగానే . అప్పటికే వర్షపు చినుకులు మొదలయినాయ్.
    "కొంచెం సేపు ఆగండి వర్షం పెద్దదయేట్లుంది ....." అతన్ని వారిస్తూ అందామె. ఆమె కళ్ళల్లోకి చూశాడతను. ఏదో భావం అందిస్తున్నట్లున్నాయ్ అవి.
    తామిద్దరి మనస్సుల్లోనూ ఒకటే భావం ఉందా ? సినిమాలో అలా చేసినందుకు తనకే సిగ్గుగా వుంది. ఆమె తనని గురించి ఏమనుకొంటుందో ఏమో!
    వర్షం బాగా ఎక్కువయిపోయింది.
    వంటింట్లోకి వెళ్ళి చీర మార్చుకొచ్చిందామే.
    ఉండుండీ వర్షపు తుంపర ఇంట్లోకి విసురుతోంది.
    తలుపులన్నీ మూసివేసిందామే. అతని ఎదురుగ్గా నుంచుని వళ్ళు విరుచుకొంటూ "ఇంతలో తగ్గదనుకొంటాను ....." అంది నవ్వుతూ.
    ఆమె వంకే రెప్ప వాల్చకుండా చూడసాగాడు సురేంద్ర. ఆ వాతావరణం ఆమె రూపం అతనికి ఉన్మాదం కలిగిస్తున్నాయ్. ఆమెకు దగ్గరగా వెళ్ళడానికి ధైర్యం చాలటం లేదు. నెమ్మదిగా లేచి ఆమె పక్క నుంచీ వెళ్ళి కిటికీ తలుపు తీసి బయటకు చూశాడు. వర్షం జల్లు విసిరి కొట్టింది లోపలకు. వెంటనే తలుపు మూసివేశాడు.
    పెద్ద మెరుపు దాని వెనుకే దగ్గర్లోనే పిడుగు పడిన శబ్దమూ వినిపించినాయ్ . మరుక్షణంలో ఆ ప్రాంతమంతటికీ కరెంట్ పోయింది. గోడకు దగ్గరగా నుంచున్న మాధురి "అక్కడే నుంచోండి . ఇప్పుడే .....అగ్గిపెట్టె తెస్తాను ...." అంటూ ముందుకి నడువబోయింది అప్పటికే ఆమెకు చేరువగా వచ్చేశాడతను.

 Previous Page Next Page