కాషాయ వస్త్రాలలో అక్కడే వున్న ఇద్దరు గూండాలకి సైగ చేసింది రాణీ. వాళ్ళు చిచ్చుని చెరోవైపూ గట్టిగా పట్టుకుని, చేత్తో నోరు నొక్కి బయటకు ఈడ్చుకుపోసాగారు. అప్పటివరకూ ప్రతిమలా కూర్చున్న ఇళ ఆ దృశ్యం చూడగానే, శిలలో చైతన్యం వచ్చినట్లు కదిలి గభాలున నిలబడి "అతడినేమీ చెయ్యకండి, వదలండి" అంది కాషాయ వస్త్రాలలో ఉన్న గూండాలు ఇళ మాటలు లక్ష్యపెట్టలేదు. చిచ్చుని బయటికి ఈడ్చుకుపోసాగారు. చిచ్చు విడిపించుకోడానికి ప్రయత్నిస్తూ ఒకడి చెయ్యి గట్టిగా కొరికాడు. "అబ్బా!" అని అతడు పట్టు సడలించేలోగానే మరొకడి చెయ్యి చిచ్చు మెడమీద బలంగా పడింది నోరు నొక్కి ఉండడం వల్ల అవ్యక్తంగా ఆర్తనాదాలు చేశాడు చిచ్చు. ఇళ అతడి దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. రాణి ఇళని వెనక్కి లాగినట్టుంది. "అమ్మా" అని అరిచింది ఇళ. అచ్యుతమ్మ భరించలేక చటుక్కున ఇళని పట్టుకుంది. "దీని జోలికి రాకు!" అంది రాణీతో కోపంగా. రాణి అంతకంటే తీక్షణంగా "ముందు ఇళని ఇక్కడినుంచి తీసుకెళ్ళండి" అంది ఆజ్ఞాపిస్తున్నట్లు. అచ్యుతమ్మకి మండిపోయింది. అయినా ఆ పరిస్థితుల్లో రాణీ చెప్పినట్లు చెయ్యడంకంటే మరో మార్గం తోచలేదు. అప్పటికే కాషాయగూండాలు చిచ్చుని బయటికి ఈడ్చుకుపోయారు. ప్రాణంలేని దానిలా తల్లి చేతుల్లో వాలింది ఇళ. భక్తులు రావడానికి ఒక మార్గమూ, పోవడానికి మరో మార్గమూ ఏర్పాటు చేయడం వల్ల, లోపల ఏం జరిగిందో బయటి భక్తులకి తెలీలేదు. "దేవి విశ్రాంతి కోరుతున్నారు. గనుక, ఈ రోజుకి దర్శనాలు లేవు" అని అనౌన్స్ చేశారు.
* * * *
తెలిసీ తెలియని మానవుల జ్ఞానంలా మినుకుమినుకుమంటోంది బెడ్ బల్బ్ కాంతి. ఎవరితోనూ దేనితోనూ ప్రమేయంలేని వాటిలా "టక్! టక్!" మనుకుంటూ ముందుకు సాగుతున్నాయి గడియారం ముళ్ళు. కళ్ళు తెరిచింది ఇళ. శరీరంలో కీలుకీలునా, ఎవరో సూదులతో పొడుస్తున్నంత బాధగా ఉంది. అంత బాధ ఏనాడూ అనుభవించలేదు. ఇదంతా నాగమణి గట్టిగా పట్టుకున్నందుకేనా? ఏదీ తెలియడంలేదు. మగత నిద్ర. బహుశా తల్లి ఇచ్చిన టాబ్లెట్స్ లో నిద్ర కలిగించే గుణం కూడా ఉండి ఉంటుంది. మొదటిసారిగా కళ్ళు మూసుకోగానే, దుర్గ తేజోరూపం బదులు, దెబ్బలతో బాధపడుతున్న చిచ్చు రూపం కనిపించింది. మళ్ళీ మళ్ళీ అదే కనిపిస్తోంది. మనసు వెళ్ళగ్రక్కుకోలేని ఆవేదనతో సుడులు తిరుగుతోంది. శరీరం నరకయాతన అనుభవిస్తోంది. గడియారం చూసింది. పదికి దగ్గరలో ఉంది చిన్న ముల్లు. రాత్రి పది! చిచ్చుని ఆ దుర్మార్గులు కొట్టింది పగలు పదిగంటలకి, పన్నెండు గంటలయింది. చిచ్చు ఎలా ఉన్నాడో? ఇంటికి చేరుకున్నాడో లేదో? నోరు నొక్కటం వల్ల చిచ్చు చేసిన అవ్యక్త ఆర్తనాదాలు చెవుల్లో గింగురుమన్నాయి. లేవడానికి ప్రయత్నించింది. శరీరాన్ని రోకళ్ళతో పొడిచినట్లు బాధ. కూలబడింది. చెవిలో చిచ్చు ఆర్తనాదాలు, జాలిగా దీనంగా తూలుతూ లేచింది అడుగుతీసి అడుగువేస్తే, కీళ్ళలో దబ్బనాలతో పొడుస్తున్నట్లు బాధ. పక్కనే అచ్యుతమ్మ పడుకుంది మరో పక్కమీద. రాణి గది తలుపులు ఎప్పుడూ మూసే ఉంటాయి, లోపల ఒక్కర్తీ ఏం చేస్తుందో, ఆ భగవంతుడికే తెలియాలి. చప్పుడు కాకుండా తలుపు తీసింది. నరకయాతన భరిస్తూ ముందుకు అడుగులు వేసింది. ఇంటి ఆవరణలో తులసికోట దాటి వచ్చేసరికి కాషాయ గూండాలు అడ్డు తగిలారు.
"ఎక్కడికి?" కర్కశంగా అడిగాడు ఒకడు.
"నేను వెళ్ళాలి!"
"ఎక్కడికని అడుగుతున్నాను."
"నీకు చెప్పను."
"చెప్పకపోయినా ఫర్వాలేదు. నువ్వు ఈ ఆవరణ దాటి వెళ్ళడానికి అసలు వీల్లేదు."
"మీరెవరు నన్ను వెళ్ళొద్దనడానికి?"
"మేం ఎవరో చెప్పాలా? చెప్తాం ఉండు." ఒకడు ఇళని అమాంతం చేతుల్లో ఎత్తుకుని అచ్యుతమ్మ ముందుకు తీసుకుపోయి దబుక్కున కూలేశాడు.
"ఇదిగో అమ్మోయ్! నీ కూతుర్ని జాగ్రత్తలో పెట్టుకో. రాత్రివేళ అటిటు తిరిగితే బాగోదు" అని హెచ్చరించి వెళ్ళిపోయాడు.
తన శారీరక బాధని కూడా మరిచిపోయే దిగ్ర్భాంతిలో మునిగింది ఇళ. ఇదేమిటి? తనిక్కడ బందీయా? ఎక్కడికైనా వెళ్ళే స్వాతంత్ర్యం తనకి లేదా?
కళ్ళముందు ముద్దలా వున్న కూతుర్ని చూసి అచ్యుతమ్మ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
"ఎక్కడికెళ్ళావు తల్లీ!" అని రెక్క పట్టుకుని లేవదీయబోయింది. బాదహ్తో కెవ్వుమంది ఇళ.
"నన్ను ముట్టుకోకమ్మా! ముట్టుకుంటే కూడా భరించలేనంత నొప్పిగా వుంది."
"అయ్యయ్యో! ఇంత బాధగా వుండి ఎందుకు వెళ్ళావమ్మా!"
"చిచ్చు ఏమయిపోయాడో చూద్దామని...."
స్థాణువయిపోయింది అచ్యుతమ్మ.
"ఇంత రాత్రివేళా?"
"మరి, పగలు మీరెవరూ నన్ను వెళ్ళనివ్వరుగా! ఇప్పుడూ వెళ్ళనీయలేదు. నేను దేవిని కాను. బంధీని. పంజరంలో చిలకని. నేనిక్కడ వుండను. వెళ్ళిపోతాను."
గుండె గుభేలుమంది అచ్యుతమ్మకి.
"అలా మాట్లాడకమ్మా! వెళ్ళి పడుకో!"
ముద్దలా కింద కూలబడిన ఇళ లేవలేకపోయింది. ఆర్తనాదాలు చేసింది. అచ్యుతమ్మ ముట్టుకోబోతే మరింత విలవిలలాడుతూ అరిచింది. ఇంత జరుగుతున్నా రాణి అక్కడికి రాలేదు. ఎలాగో లేచింది ఇళ. అడుగు తీసి అడుగువేస్తోంటే ప్రాణం పోతున్నట్లుగా వుంది. అలాగే నడిచి పక్కమీద వాలింది. మరోసారి బాధతో కెవ్వుమంది. ఏం చెయ్యాలో తోచలేదు అచ్యుతమ్మకి. "జండూబాం" లాంటిది ఏదైనా రాద్దామంటే, వంటిమీద చెయ్యి వేస్తేనే భరించలేకపోతోంది.
"ఇళా! విదుషి ఇచ్చిన మాత్రలు వేసుకుంటావా?"
"వేసుకోను! ఇలాగే బాధపడతాను. నాకిలాగే కావాలి శాస్తి. అబ్బా!"
అచ్యుతమ్మ భరించలేకపోయింది.
ఎందుకు ఈ భోగభాగ్యాలూ కన్నబిడ్డని డాక్టర్ కి చూపించి వైద్యం చేయించుకోలేకపోయాక! అప్పటికప్పుడు ఇళని తీసుకుని విదుషి దగ్గరికి పారిపోవాలనిపించింది.
"అచ్యుతమ్మా!"
గది గుమ్మం ముందు నామాలయ్య నిలబడి వున్నాడు. అతడి పక్కనే రాణి. అప్పటివరకూ రాణి కనపడకపోవడానికి కారణం నామాలయ్యని పిలవడానికి వెళ్ళిందన్నమాట!
"కూచోండి నామాలయ్యగారూ!" కుర్చీ చూపించింది అచ్యుతమ్మ విధిలేక.
"ఇంత రాత్రివేళ కూచోటానికి రాలేదులే! నీ కూతుర్ని అటూ ఇటూ తిరగొద్దని చెప్పు. ఎవరికీ మంచిది కాదు." హెచ్చరింపుగా అన్నాడు.
ఒక పక్క ఇళ నరకయాతన అనుభవిస్తోంటే నామాలయ్య అలా బెదిరిస్తున్నట్లు మాట్లాడడం అచ్యుతమ్మకీ నచ్చలేదు. కానీ, నామాలయ్యని ఎదిరించడం ఎలాగో అచ్యుతమ్మకి తెలీదు. అప్పుడు ఒక అనుకోని సంఘటన జరిగింది. లేవలేకుండా ఉన్న ఇళ లేచి ఊగిపోతూ నామాలయ్య ఎదుట నిలబడి "దుర్మార్గుడా! నాకర్థమయింది. నువ్వే చిచ్చుని కొట్టించావు. నువ్వే నన్ను చిచ్చు దగ్గరికి వెళ్ళకుండా చేశావు. దేవి నిన్ను సర్వనాశనం చేస్తుంది" అంది.
ఇళ మాటలకి నామాలయ్య బెదరలేదు సరికదా, వెటకారంగా నవ్వాడు.
"నువ్వూ, నీ దేవీ...! ఆహ్హహ్హ! నీ దేవి నన్నేమీ చెయ్యదుకాని, మరోసారి పిచ్చివేషాలెయ్యకు. ఇన్ని వేలు ఖర్చుపెట్టింది నలుగుర్తో నవ్వులపాలవడానికి కాదు."