చెళ్ళున కొరడాతో కొట్టినట్లయింది ఇళకి!
దేవి త్రైలోక్యరాణి... అనంత అద్భుత మహిమాన్విత...దుష్ట రాక్షస భంజని... ఏ...మీ చెయ్యదా?
11
చిచ్చు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా పిచ్చిది కనిపించింది. ఆమె వళ్ళో వుంది అతని తల. లేవబోయాడు. తల దిమ్మెక్కినట్టనిపించి "అబ్బా!" అనుకుంటూ వెనక్కి వాలిపోయాడు. కదలకు బాబూ. చాలా సౌమ్యంగా అంది పిచ్చిది. ఆ మాటలు పిచ్చిదాని మాటల్లాగా లేవు. చాలా సౌమ్యంగా వున్నాయి. పిచ్చిది ఆపద్భాంధవిలాగ తనకు అవసరమైనప్పుడల్లా తన దగ్గరికి రావటం ఆశ్చర్యంగా తోచింది. చిచ్చుకి వంటినిండా ఏవేవో ఆకు పసరులు పూసి వున్నాయి. పిచ్చిదే పూసి వుంటుంది. కొండజాతి వాళ్ళ ఆకు పసరుల విలువ చిచ్చుకి బాగా తెలుసు. ఎలాంటి గాయాలనైనా అతి త్వరగా నయం చేస్తాయి అవి. అనునిత్యమూ అడవుల మధ్య తిరిగే వాళ్ళకి ఇలాంటి పసరులు బాగా తెలుస్తాయి.
"వేగుచుక్క పొడిచే వరకూ పడుకో బాబూ! తర్వాత ఊళ్ళోకి వెళ్దువుగాని..." లాలనగా అంది పిచ్చిది. దాని మాటలు లెక్కచెయ్యకుండా లేవబోయాడు. నరనరమూ శూలంతో పొడిచినట్లయింది. "అబ్బా!" అని మూలిగి వెనక్కి వాలిపోయాడు.
"నేను ఊరికే చెప్తానా బాబు! కాసేపు కళ్ళు మూసుకు పడుకో! వేగుచుక్క పొడవగానే నేనే నిన్ను తీసుకెళ్తాను. సాహసాలు చెయ్యబోకు. ఈ దారి మంచిది కాదు." మెత్తగా మందలిస్తున్నట్లు అని అతడి జట్టులోకి వేళ్ళు పోనిచ్చి గమ్మత్తుగా నిమరసాగింది. ఆ వేళ్ళలో ఏదైనా గమ్మత్తు ఉందో, లేక ఆ నిమరటంలో ఏమైనా చాతుర్యం ఉందో కాని పిచ్చిది తల నిమురుతుండగానే నిద్రలోకి జారిపోయాడు చిచ్చు. తాత్కాలికంగా బాధ మరిచిపోయాడు.
"బాబూ! ఇంకలే!" అన్న మాటలు చెవి దగ్గర గుసగుసగా వినిపించి లేచాడు. పిచ్చిదాని కళ్ళు రాత్రంతా నిద్రలేనట్లు ఎర్రగా ఉన్నాయి.
"నువ్వు నిద్రపోలేదా?" ఆదరంగా అడిగాడు.
"వంట్లో ఎట్లా ఉంది?"
లేచి నిలబడ్డాడు. అంతక్రితం రాత్రి దెబ్బలు తగిలినట్లే లేదు. కొద్దిగా బడలికగా ఉన్నట్లు అనిపించింది. అంతే!
"థాంక్యూ."
"ఆ! ఆ! అప్పుడే పరుగులు తియ్యమాకు. నేను నీవెంట వస్తున్నా!"
"నువ్వెందుకు?"
సమాధానం చెప్పకుండా అతడివెంట నడవసాగింది పిచ్చిది. తనతో రావద్దని చెప్పాలనుకున్నాడు చిచ్చు. రాత్రంతా మేలుకుని తనకంత సహాయం చేసిన పిచ్చిదాని మనసు నొప్పించలేకపోయాడు. ఊరి పొలిమేరల్లోకి వస్తుండగా నామాలయ్య గూండాలు కర్రలతో మళ్ళీ మీదికి రాబోయారు. భద్రకాళిలా వాళ్ళముందు కురికింది పిచ్చిది.
"చచ్చినోళ్ళల్లారా! ఈ బాబు వంటి మీద కర్ర పడిందా! మీరు పేనాలతో బయటపడరు జాగ్రత్త" హుంకరించింది. గూండాలు ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. పైకెత్తిన కర్రలు కిందికి దిగిపోయాయి. పక్కకి తప్పుకున్నారు గూండాలు. చిచ్చు చెయ్యి పట్టుకుని ముందుకు సాగింది పిచ్చిది.
"ఇదొక్కత్తీ, మధ్యన!"
గూండాలలో ఒకడు సణుక్కోవటం విన్నాడు చిచ్చు. "పిచ్చీ! వీళ్ళు నీకెందుకు భయపడుతున్నారు?" అడిగాడు. పిచ్చిది సమాధానం చెప్పలేదు. చిచ్చు చెయ్యిపట్టుకుని బరబర ఈడ్చుకుపోతున్నట్లు అడుగులు వెయ్యసాగింది. ఆమెతో సమంగా నడవలేక వగరుస్తున్నాడు చిచ్చు. అదేమీ పట్టించుకోవటం లేదు పిచ్చిది. బావి దగ్గరకీ వచ్చారు ఇద్దరూ.
"ఇంక నువ్వు పోగలవుగా!" అడిగింది పిచ్చిది. చిచ్చు ఏదో సమాధానం చెప్పేలోగా, అడవిలోకి మాయమయిపోయింది.
చిచ్చు ఇంటికి చేరుకునేసరికి, జ్ఞానదేవ్ ఇంటి వాకిట్లో ఉన్నాడు. కోయ యువకులతో "చిచ్చు రాత్రి యింటికి రాలేదు. ఏమయిపోయాడో వెతుకుదాం రండి!" అంటున్నాడు. చిచ్చుని చూడగానే చిన్నపిల్లాణ్ణి కౌగిలించుకున్నట్టు గట్టిగా కౌగిలించుకుని రెండు బుగ్గలమీద ముద్దుపెట్టుకున్నాడు. చిచ్చుని హృదయానికి హత్తుకున్నాడు. కన్నీళ్లు ఆగకుండా కురుష్టున్నాయి. "చిచ్చూ! చిచ్చూ!" అవే మాటలు తప్ప రావటం లేదు అతని నోట!
చిచ్చుకి జ్ఞానం వచ్చిన దగ్గిరనుంచీ ఏనాడూ తండ్రి అలా బాహాటంగా తన ప్రేమ ప్రకటించలేదు. ఆ మనసు ఎంత క్షోభించిందో అర్థమయింది. తన చేతులతో కన్నీళ్లు తుడిచి కాళ్ళమీద పడ్డాడు. తన తప్పు ఒప్పుకుంటున్నట్లు జ్ఞానదేవ్ కొడుకుని లేవనెత్తి అన్నాడు.
"చిచ్చూ! ఆ పిశాచాల గుహలోకి నువ్వెందుకు వెళ్ళావు తండ్రీ! అక్కడుండేది మనుష్యులు కాదు. అక్కడికి వెళ్ళేవారు మనుష్యులు కాదు. ఉండేది పిశాచాలు. వెళ్ళేది గొర్రెలు."
"మరి ఇళ...?" గొణిగినట్టు అన్నాడు చిచ్చు.
"ఆ పిల్ల పిశాచాల గుహల్లో బంధించబడ్డ దేవకన్య" అని అంతలో ఉలిక్కిపడి "నాకర్థమయింది. ఇళ కోసం నువ్వెంతటి అఘాయిత్యమయినా చేసేలా ఉన్నావు. ఇంక మనం ఇక్కడుండొద్దు. ఈ రోజే అందరం హైద్రాబాద్ వెళ్దాం! పద!" అన్నాడు.
తండ్రి చేతులు కట్టుకుని ప్రాధేయ పూర్వకంగా "ఈ ఒక్కసారికీ క్షమించండి నాన్నగారూ! ఇంకెప్పుడూ అక్కడికి వెళ్ళను" అన్నాడు.
"ప్రామిస్!"
"ప్రామిస్!"
"ఇళనే నా దగ్గరకి రప్పించుకుంటాను ఈసారి" మనసులో అనుకున్నాడు పట్టుదలగా.
నీకెందుకు బాబూ! ఈ గొడవ! ప్రభుత్వం పట్టించుకోదు. పోలీసులు పట్టించుకోరు! మేథావులకి పట్టదు నువ్వొక్కడివి ఏం చెయ్యగలవూ?"
ఆవేదనగా అన్నాడు జ్ఞానదేవ్. చిచ్చుకి కొంత ధైర్యం వచ్చింది. తను చేసినది తప్పని తండ్రి అనుకోవటం లేదు. కేవలం తమ క్షేమం కోరి భయపడుతున్నాడు. చిచ్చు లోపలికి వచ్చేసరికి తల్లి మంచంలో ఉంది. "చిచ్చూ!" అని కలవరిస్తోంది. తల్లి పక్కలో కూర్చుని అమ్మా అన్నాడు. కళ్ళు తెరిచింది వర్ధనమ్మ. చిచ్చు నడుంచుట్టూ చేతులు వేసి వళ్ళో తలపెట్టుకుని బావురుమంది చిచ్చూ! "నన్ను చంపెయ్యరా! ఈ క్షోభ పడలేనురా!" అంది చెమ్మగిల్లిన కళ్ళతో. "బాధపడకమ్మా! ఇంకెప్పుడూ నిన్ను ఏడిపించను" అన్నాడు.
"నిజంగానా? అయితే ఇళ మీద ఒట్టు పెట్టు!"
నిర్ఘాంతపోయాడు చిచ్చు. ఇన్నాళ్ళూ తల్లి అమాయకురాలని అనుకున్నాడు.
* * * *
వయ్యారాలు పోతూ జ్ఞానదేవ్ కి, చిచ్చుకి కాఫీ ఫలహారాలు అందించింది రాణి. నామాలయ్య తండ్రి కొడుకులని తన ఇంటికి ఆహ్వానించాడు. కాదనలేక కాదనటానికి కారణం కనపడక ఒప్పుకున్నాడు జ్ఞానదేవ్. కుతూహలంతో ఒప్పుకున్నాడు చిచ్చు.