Previous Page Next Page 
అర్ధరాత్రి సూర్యోదయం పేజి 24


    వాళ్ళకి మనసులో గుర్రుగా ఉంది. నామాలయ్య తమని కనీసం అరుగుమీదైనా కూచోమని అననందుకు.
    నామాలయ్య లెక్కపెట్టి, ముప్పయి మూడు తెల్ల కాగితాలు తీసి, "ఈటిమీద యేలిముద్రలెయ్యండిరా!" అన్నాడు. పాలేరు కాగితాలు, ఇంక్ పేడ్, కోయవాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు. పెద్దవాళ్ళు వేలిముద్రలెయ్యబోతోంటే, యువకులు అడ్డుపడ్డారు. "తెల్ల కాగితాల మీద వేలిముద్రలు దేనికి? ఏం వ్రాయదల్చుకున్నారో వ్రాయండి. అది చదివి సంతకాలు చేస్తాం, వేలిముద్రలూ వేయిస్తాం!" అన్నారు. తెల్లబోయాడు నామాలయ్య. అతడు బుద్దెరిగాక, ఇలాంటి సమాధానం కోయల నుంచి ఏనాడూ వినలేదు.
    "ఏంటిరా ఆ పొగరు? నా మీద నమ్మకం లేదా? మీ సొమ్ములు నేనేం దోచుకుపోతానా? ఏముంది మీ దగ్గర దోచుకుపోవడానికి, గోచీ పాతలు తప్ప?"
    తమని ఇంత చులకన చేసి మాట్లాడుతున్నందుకు యువకులకి ఒళ్ళు మండింది.
    "కక్కుర్తి మనుషులకి ఆ గోచ పాతలే చాలు!" అనేశారు.
    "ఒరేయ్?" గర్జిస్తూ వాలు కుర్చీలోంచి పైకిలేచాడు నామాలయ్య. పాలేరు బాణా కర్ర చేత్తో పట్టుకున్నాడు.
    పెద్దవాళ్ళు వణికిపోతూ "దండాలు దొరా! శాంతించండి. కుర్రనాయాళ్ళకేదీ తెలిసి చావదు" అన్నారు. నామాలయ్య మళ్ళీ కుర్చీలో కూచున్నాడు. పని జరగడం కావాలి ముందు. తర్వాత వీళ్ళకి బుద్ధి చెప్పడం ఎంతసేపూ?
    "ఊ? సంతకాలు పెట్టండి!" అన్నాడు గంభీరంగా.
    "అదేదో రాయించండి దొరగారూ! యేలిముద్రలెట్టేస్తాం!" అన్నారు పెద్దవాళ్ళు వినయంగా.
    ఉసూరుమన్నాడు నామాలయ్య.
    "నామీద నమ్మకం లేదన్నమాట?" అన్నాడు మరోసారి.
    "అయ్యయ్య! అంతమాటనబోకండి. మీ పాదాల కాడ బతికేటోళ్ళం! మంచయినా. సెడ్డయినా, కుర్రసన్నాసులు ఓపాలి సదూతా మంటున్నారు. ఆల్ల ముచ్చట ఆల్లది!"
    "అయితే రేపు రండి. కరణం చేత కాగితాలు వ్రాయించి ఉంచుతా!"
    గుర్రుమంటూనే ఒప్పుకున్నాడు విధిలేక.
    మర్నాడు యథాప్రకారం అందరూ సమావేశమయ్యారు. ఈసారి యువకులు తమతో కంబళ్ళు తెచ్చుకున్నారు. పెద్దవాళ్ళని గొంతుక్కూచోనియ్యలేదు. అందరూ కంబళ్ళు మీద కూచున్నారు. కరణం చేత పకడ్బందీగా వ్రాయించిన కాగితాలు వాళ్ళ చేతికిచ్చాడు నామాలయ్య. యువకులు చదువుకున్నారు. కొంతసేపు వాళ్ళలో వాళ్ళు సంప్రదించుకున్నారు. యువకులలో ఒకడు మాట్లాడటం మొదలుపెట్టాడు.
    "బావి తవ్వాక, మా పొలాలన్నీ మీరే కౌలుకి తీసుకున్నారుగా! ఇప్పుడు విత్తనాలకీ, ఎరువులకీ, మోటరుకీ, షెడ్ కీ మేం లోన్ కోసం అప్లై చెయ్యడం దేనికి? మీరు మోటారు పెట్టుకున్నారుగా! ఇంకో మోటారు దేనికి!"
    నామాలయ్య చిరాకుపడ్డాడు.
    "ఆ వెధవ ప్రశ్నలన్నీ దేనికిరా! నా ఇబ్బందులు నాకున్నాయి. అంతగా అయితే ఈ సంవత్సరం కౌలు డబ్బు మరికాస్త ఎక్కువిస్తాలెండి. సంతకాలు పెట్టండి."
    "మేము మళ్ళీ వస్తాం! ఆలోచించుకుని చెప్తాం!"
    యువకులు లేచారు. పెద్దవాళ్ళు వంగి వంగి దణ్ణాలు పెడుతూ లేచారు. లోలోపల పళ్ళు నూరుకున్నాడు నామాలయ్య. కోయ యువకులు అప్లికేషన్ జ్ఞానదేవ్ కి చూపించారు. ఆయన చదివి ఇలా చెప్పాడు. "దీనిమీద మీరు సంతకాలు పెడితే, మీ పేరు మీద నామాలయ్య అప్పు తెచ్చుకుంటాడు. కానీ ఒకవేళ ఆయన అప్పు తీర్చకపోతే, అది మీరు కట్టుకోవలసి వస్తుంది."
    "అయితే మాకు ప్రమాదమే కదా!"
    "చెప్పలేం? అంతా నామాలయ్య దయ."
    "తిని కూచుని, ఆయన దయమీద ఆధారపడే దశకి ఎందుకెళ్ళాలి? ఇప్పటికే ఆయన దయతో తలమునకలవుతున్నాం!"
    "అదంతా మీరు ఆలోచించుకోవాలి. అంతేకాదు మీ పొలాలు నామాలయ్యకి కౌలుకియ్యకుంటే మీరే సాగుచేసుకుంటే విత్తనాలకీ, ఎరువులకీ, ట్రాక్టర్ అద్దెకీ, మీకే లోన్ దొరుకుతుంది. మొదట్లో ఇబ్బంది పడినా, తర్వాత మీకే లాభాలొస్తాయి."
    యువకులకి జ్ఞానదేవ్ ఆలోచన నచ్చింది. ఈసారి వాళ్ళంతా వెళ్ళలేదు నామాలయ్య ఇంటికి. ఒక్క యువకుడే వెళ్ళి "క్షమించండి. మేము సంతకాలు పెట్టం! వచ్చే సంవత్సరం నుంచి మా పొలాలు మేమే చేసుకుంటాం. లోన్స్ కోసం మేమే అప్లై చేసుకుంటాం!" అని చెప్పేశాడు. నామాలయ్యకి చాచి లెంపకాయ కొట్టినట్లయింది. ఇంతటి అవమానం ఆ గ్రామ ప్రజలలో ఎవరి నుంచీ అతడు ఏనాడూ అనుభవించలేదు.


                                                 *    *    *    *


    చిరునవ్వుతో చెయ్యెత్తి ఆశీర్వదించబోయిన ఇళ టక్కున ఆగిపోయింది. నిలువునా వణికింది. ఎన్నడూ లేనిది నుదుటినిండా చెమట బిందువులు జల ఊరినట్లుగా ప్రవహిస్తున్నాయి. ఎదుట నిలబడింది మామూలు భక్తుడు కాడు. చిచ్చు భక్తుల క్యూలో నిలబడి ఇళ ముందుకు వచ్చాడు. చేతిలో వున్న పళ్ళు ఇళ పాదాల ముందుంచి "దేవీ! ఇంతకంటే ఇచ్చుకోలేను. నా పెద్ద కోర్కె ఒకటి మీరు తీర్చాలి!" అన్నాడు. ఇళ మాట్లాడలేదు. ఎవరితోనూ మాట్లాడదు. ఇప్పుడు పెదవులు మాత్రం కదిలాయి.
    "కోర్కె ఏమిటో విన్నవించుకో!" పక్కనే నిలబడ్డ రాణీ అంది. ఒట్టి పళ్ళు తేవడం రాణీకి నచ్చలేదు. కానీ, చిచ్చు చూడడానికి బాగున్నాడు.
    అతడు రావడం అచ్యుతమ్మకి లోలోపల చికాకు కలిగించింది. తొందరగా వెళ్ళిపోతే బాగుండునని కోరుకుంటోంది.
    చిరునవ్వులేని పాలిపోయిన ఇళ ముఖంలోకే చూస్తూ చిచ్చు అన్నాడు.
    "దేవీ! నిజంగా దేవి అంటూ ఉంటే నేను కోరేది ఒకే ఒక కోరిక. అది నీ ఆరోగ్యం. ఈ ఒక్క వరం ప్రసాదించు."
    పక్కన బాంబు పడ్డట్లు ఉలిక్కిపడింది రాణి.
    బెదురుగా చుట్టూ చూసింది. నామాలయ్య చాలా పకడ్బందీగా పూజా మందిరం ఏర్పాటు చెయ్యబట్టి భక్తులు ఒక్కొక్కరే వచ్చి, తమ సమస్యలు చెప్పుకునే పద్ధతిలో అమలులో వుండబట్టి, చిచ్చు మాటలు ఎవరూ వినలేదు. చిచ్చు మాటలతో అతడి అందమైన ముఖంలో ఆకర్షణ ఎగిరిపోయింది రాణిలో. లో గొంతులోనే కర్కశంగా "నోరు మూసుకో! దేవికి అనారోగ్యమేమిటి? వెంటనే అవతలకి నడు" అంది. చిచ్చు రాణీ మాటలు లక్ష్యపెట్టలేదు.
    "ఇళా! నువ్వు చేస్తున్నది త్యాగం అనుకుంటున్నావేమో! ఎంతమాత్రం కాదు. మోసం! ఇతరులనీ మోసం చేస్తున్నావు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ముందు డాక్టర్ని కన్సల్ట్ చేసి..."

 Previous Page Next Page